సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డిగారి గురించి విన్నానుగాని, ఒకటి రెండు కథలు మినహా, ఆయన రచనలేమీ నేను చదవలేదు. ఇప్పుడు తానా నవలలపోటీలో బహుమతి పొందిన ఆయన నవల ‘ఒంటరి’ చదువుదామనుకుంటూ ఉండగానే మిత్రులు గజేంద్రనాథ్ గారు హన్స్ ఇండియాలో తాను రాసిన వ్యాసం ఒకటి నాకు పంపించారు. అందులో వెంకటరామిరెడ్డిగారి మీద కాశిరెడ్డి నాయన ప్రభావం గురించి ప్రస్తావించడంతో నాకు మరింత ఆసక్తి పెరిగింది. గజేంద్రనాథ్ గారు అక్కడితో ఆగకుండా, ఆ నవల నాకు వెంటనే కొరియర్ చేసారు. ఆ పుస్తకం చేతికందిన మర్నాటికే పూర్తిచేసేసాను.
చదవడం పూర్తిచేసిన వెంటనే నాలుగు మాటలు రాయాలనే అనుకున్నాను గాని, ఇంకా ఆ కలివె చెట్ల మధ్య, ఆ బలుసు చెట్లు, సీకిరేణి చెట్లు, దిరుసెన చెట్లు, చింత చెట్లు, గురివెంద తీగలు, ఉసిరిక చెట్లు, భిల్లు చెట్లు, పరికచెట్లు, రేగు చెట్లు, తుమ్మ, బూర్జాల కంపలు మధ్యనే తిరుగుతున్నట్టే ఉంది. నా వంటికి ఆ భూతరాకాశులు, ఉత్తరేణి కాయలు అంటుకుని ఒక పట్టాన ఊడిరాకుండా ఉన్నాయి. ఇంకా ‘ఇంట్లో పాలు పేరబెట్టి మజ్జిగ జిలుకుతా’, ‘నెయ్యి కాచి తింటా వుండే’ ఆ రైతు కుటుంబం, ‘పురాణాలు సదూతా, తత్త్వాలు పాడుకుంటా వుండే’ ఆ ఇల్లు, ‘ఒక పూట సంగడి తింటా, ఇంకా రాగిపైరు పండిస్తుండే’ ఆ మనుషులు నన్ను వదల్లేదు.
ఇంకా
‘ఆరికె పైరుకూ బరక నేలకూ బో లంకెలే సారూ! పైరు పండేసరికి కుందేల్లు పిల్లల్జేసుకుంటాయి. జింకలు పొలేడతాయి. పైరు కోసేప్పుడైతే బో కుశాల గుంటాదిలే..నాలుగు కర్రల్ను పెనేసి ఏదో పిట్ట గూడు కట్టుకుని వుంటాది. గుడ్లు పెటుకోనుంటాది. .ఆ గుమి కొయ్యకుండా వదలెయ్యాల.ఆరికె పైరూ రేగ్గంపా కలిసిపోయి బాగా మరుగున్న చోట కుందేలు పిల్లల్జేసుకోనుంటాది. కండ్లు కూడా తెరవని చంటి పిల్లలు..ఆ పొదనంతా తగలకుండా విడిచిపెట్టాల. పాది జేసుకుని పూరేలి గుడ్లు పెట్టుకోనుంటాది. ఆ పాదినంతా సూడనట్టే వదిలెయ్యాల. విత్తనాలు ఇత్తినాంక కోతకే పోయేది..’
అన్న మాటలే నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి.
ఇంకా ‘మజ్జిగ చిలికే జుర్రుబర్రులూ, పొరకతో వూడ్చే గరగరల’ మధ్య ఆ రైతు ఇంట్లోంచి ఆడమనుషులు శ్రావ్యంగా-
‘వేగి లేచినది మొదలు సంసార సాగరంబున నీదుచు/
నీ గుణములొకవేళను తలపగదె మేలనుచు నారాయణా!’
అని పాడుతుంటే ‘పక్షుల అరుపుల సంగీతం దానికి తోడయి’ వినిపిస్తూనే ఉంది.
గత పదేళ్ళ కాలంలో ఇంత స్ఫూర్తిదాయకమైన, ఇంత ఆరోగ్యవంతమైన, ఇంత ప్రాణశక్తిప్రసరితమైన రచన నేనేదీ తెలుగులో చదవలేదు. వెనక్కి తిరిగి చూస్తే, డా. కేశవరెడ్డిగారి ‘మునెమ్మ’, మరికొంచెం వెనక్కి వెళ్తే ‘మూగవాని పిల్లంగోవి ‘ -మరే రచనలూ నన్నింతగా స్పందింపచేసినవి కనిపించడం లేదు. ఇతివృత్తాల్లో పోలికలేకపోయినప్పటికీ, రచన కలిగించగల epiphany ని దృష్టిలో పెట్టుకు చూస్తే, హెర్మన్ హెస్ ‘సిద్ధార్థ’, శివరామకారంత ‘అళిదమేలె’ (మరణానంతరం) చదివినప్పటి నా అనుభూతి గుర్తొస్తూ ఉంది నాకు, ఈ పుస్తకం ముగించేటప్పటికి. ఇతివృత్తమూ, దాని వెనక ఉన్న తాత్త్వికతనీ దృష్టిలో పెట్టుకుంటే ‘గడ్డిపరకతో విప్లవం’ లాంటి రచన అనిపిస్తూ ఉంది. పుస్తకంలో ప్రతిపాదించిన జీవన తాత్త్వికత దృష్ట్యా చూసినప్పుడు, ఆధునిక తెలుగు సాహిత్యంలో ఇటువంటి రచన ఇంతదాకా రాలేదనే చెప్పాలి.
ఈ రచనలో రెండు భాగాలున్నాయనీ, ‘ఒకటి పేరు ప్రఖ్యాతులు గడించిన ఒక డాక్టర్ అంతరించిపోతున్న ధాన్యపు జాతికోసం ఆరునెలల అన్వేషణ, రెండవది తన ప్రాణవాయువుతో పొలాన్ని బుజ్జగించి, సమస్త జీవకోటితో అత్యంత సహజంగా మమేకమై పోయిన మరో అంతరిస్తున్న జాతి-రైతు జీవితం’ అని ప్రచురణ కర్తలు పేర్కొన్నారు. వారు ఈ మాటల్ని, ఈ పుస్తకానికి ముందుమాట రాసిన ప్రసిద్ధ పర్యావరణ చింతకుడు డా.పతంజలిశాస్త్రి నుంచి తీసుకున్నారని అర్థమవుతూనే ఉంది.
కాని, నిజానికి ఈ పుస్తకంలో ప్రధాన పాత్ర, ఆరికల కోసం అన్వేషణ సాగించిన డా.రాఘవా కాదు, ఆ పంట పండించిన రైతు నర్సయ్యా కాదు. ఇందులో రెండు భాగాల్లేనే లేవు. ఇది ఒకే కథ. ఇందులో ప్రధాన పాత్రధారి, శతాబ్దాలుగా ఈ నేలనీ, జాతినీ బతికించుకుంటూ వస్తున్న ఒక ప్రాపంచిక దృక్పథం. తను, తన చుట్టూ ఉన్న చరాచర జీవకోటీ వేరు వేరు కాదనీ, ఒకరి ప్రాణం, మరొకరి ప్రాణంతో ముడివడివున్నదేననీ, నిన్ను నువ్వు కాపాడుకోవడమంటే, నీ చుట్టూ పెనవేసుకున్న పశు పక్షి సస్య సామాజిక జీవితాన్నంతా కాపాడుకోడమనీ చెప్పే రచన ఇది.
ఇదొక నమ్మకం. ఇంకా చెప్పాలంటే ఒక కర్మ సిద్ధాంతం. నేను కూడా ఆ కర్మసిద్ధాంతాన్నే బలంగా నమ్ముతాను కాబట్టే నాకీ రచన చాలా సన్నిహితంగా తోచింది. కర్మ అంటే, మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మల ఫలితాల్ని ఈ జన్మలో అనుభవించవలసి ఉంటుందని నమ్మే కర్మసిద్ధాంతం కాదు, లేదా, మన చేతుల్లో ఏమీ లేదనీ, అంతా పైవాడి దయనే అని నమ్మే సిద్ధాంతం కాదు. ‘ఈ జన్మలో చేసుకునేది ఇక్కడే అనుభవించి పోవాల ..’ (పే.207) అనే బలమైన విశ్వాసం. నువ్వు కారణముండిగాని, కారణం లేకుండా గాని తోటి ప్రాణికి తలపెట్టే ప్రతి మేలుకీ, ప్రతి కీడుకీ, నువ్వు బతికుండగానే బాకీ తీర్చిపోవలసి ఉంటుందనే అత్యంత బాధ్యతాయుతమైన ఒక జీవనవైఖరి. ఆదిమసమాజాలు ఈ నమ్మకంతోటే కొన్ని సహస్రాబ్దాలపాటు మనుగడసాగించేయి. ఒకప్పుడు దాన్ని మాలినోవిస్కి లాంటి యాంత్రొపాలజిస్టు anthropology of gift గా వివరించేడు. అంటే నువ్వొకరికి మేలు చేస్తే, ఆ మేలట్లా నీ తెగమొత్తం ప్రయాణించి తిరిగి మళ్ళా నీకు అందుతుందనే ఒక పరిశీలన. నువ్వు చేసిన మేలు ప్రయాణించినట్టే నువ్వు చేసే గాయం కూడా ప్రయాణిస్తుంది. మహాభారతం మాట్లాడింది ఆ sociology of wound గురించే. నువ్వు ఎవరినైనా అకారణంగా అవమానించినా, బాధించినా, మనసు కష్టపెట్టినా, నువ్వొక గాయాన్ని నీ చుట్టూ ఉండే వాతావరణంలో ప్రవేశపెడుతున్నావు. తిరిగి ఆ గాయం మరింత నిష్ఠురంగా, మరింత తీవ్రంగా నువ్వు బతికి ఉండగానే నీ వెంటబడుతుంది.
మన గ్రామాలు ఈ circulation ని కళ్ళారా చూసాయి, నమ్మాయి. అందుకనే, మన గ్రామాల్లో రైతులు చరాచరాల్తో ఎట్లాంటి జీవితాన్ని పెనవేసుకున్నారో నర్సయ్య ఇట్లా చెప్తున్నాడు:
‘పొద్దున్నే పొలంలో దిగి పనిలోకి వంగేటపుడు తలగుడ్డ చేతబట్టుకుని పొద్దుపొడుపు దిక్కు చూసి దండం పెట్టుకుంటాం. మామిడిచెట్టో, చింతచెట్టో ఏ చెట్టుకాయాలైనా దించాలనుకున్నప్పుడు పిడికెడు మట్టి తీసికొని చెట్టు మొదలుకు వారుబోసి దండం పెట్టి దాని అనుమతి తీసికొని చెట్టెక్కుతాం. చెట్టుకు నొప్పి తగలకుండా కాయలు దించి దిగి వచ్చినపుడు కృతజ్ఞతగా మల్లా దండం పెడ్తాము. బాగా పండిన వరికట్టల్ని రాలగొట్టి, కాళ్ళు తగలకుండా వడ్లు గోతానికెత్తి కాశినాయన అన్నసత్రానికి పంపిస్తాము. సద్దలు పండినప్పుడు కుడుములు వండి మొదటగా ఇంటి ఎద్దుకూ, ఇంటి కుక్కకూ తినిపించి తర్వాతే మేము తింటాం. జొన్నచేను పండినపుడు మంచి కంకుల్ని ఏరి కోసి మిద్దె కప్పుకు వేలాడగడ్తాము. ఏడాది పొడవునా పక్షులు తింటా వుంటాయి. ఇంటిముందు ముగ్గేసే ముగ్గుపిండిలో కూడా పిచ్చుకలకు ఆహారంగా బరగ్గా వుండే రాగిపిండిని కలుపుతాము. అంతెందుకూ-చింతపూత వేపపళ్ళ కాలంలొ చిన్నపిల్లలు చింతపూత దంచి దానికి వేపపళ్ళ గుజ్జు కలిపి బాగా అదిరేటట్లు అరచేతల కింద మెదిపి మొదటగా కాకులకూ గద్దలకూ పిచ్చుకలకూ ఆహారంగా వేసి తర్వాత వాళ్ళు తింటారు…'(పే.240)
ఇదొక ఆదాన ప్రదానం. ఒకరినుంచి మరొకరికి ప్రసరించే జీవశక్తి. తెలిసికాని, తెలియకకాని, ఒక ప్రాణికి హానిచేస్తే, దానికి పరిహారం నువ్వు జీవించిఉండగానే తీర్చకతప్పదు. అందుకనే, కథ చివరలో, నర్సయ్య చేతుల్లో అనుకోకుండా, ఒక ఉడత చనిపోయినప్పుడు, అతడు పదేపదే విలవిల్లాడుతుంటే, ఎందుకని కథకుడు అడిగితే, నర్సయ్య ఇట్లా చెప్తున్నాడు:
‘నీకేం తెలుసు సార్ ఆ జీవి గురించి?’ అన్నాడు. ‘అది సన్నజీవే అయినా బతికి పెద్దయ్యేసరికి ఎంత లావు అగసాట్లు పడింతాదనీ! యాన్నో తొర్రల్లొ తల్లి కడుపులోంచి బైటపడి, పాములకూ గద్దలకూ పిల్లులకూ దొరక్కుండా, కంపల్లో కట్టెల్లో ఇరుక్కోకుండా ఎన్ని బాధలు పడి పానాలు నిలబెట్టుకోనుండాదనీ!ఒకనాడు గద్ద తన్నకపోతా వుంటే నేనే రాతగొట్టి విడిపించినా. కొనపానాల్తో బతికి తొర్రలేకి దూరింది. దాని పానానికి మన పానం కంటే ఎక్కువ విలువుంది సారూ! మనం పెరగడానికీ, పెద్దోల్లం కావడానికీ మనకు ఏ ఆటంకాలూ లేవు సార్! దానికి అడుగడుగునా మృత్యువే. ఆ రవ్వంత పానం నిలబెట్టుకోడానికి ఎంత పెద్ద యుద్ధం చేసింటాదో కదా!.. ఎన్ని చావులో తప్పించుకుని అది పిడికడంత జీవిగా పెరిగి వుంటాది.మన పానం కంటే దాని పానం విలువైంది కాదా?’ అన్నాడు. (పే.250).
నేను చిన్నప్పణ్ణుంచీ గిరిజన గ్రామాల్లో పెరిగినవాణ్ణి. ఉద్యోగరీత్యా అత్యంత ఆదిమసమాజాల్తో కలిసి జీవించినవాణ్ణి. అదిలాబాదులో రవీంద్రకుమార శర్మగారి మాటలు విన్నవాణ్ణి. ఇప్పుడు జయతిలోహితాక్షన్ వంటి వారి అనుభవాలు చదువుతున్నవాణ్ణి. ఈ కథలో రచయిత వివరిస్తున్న జీవనతాత్వికత ఎంత లోతయినదో, ఎంత నిజమైనదో నాకు మరే సాక్ష్యమూ అవసరం లేదు.
చదవండి. కాశిరెడ్డి నాయన వంటి అవధూత ఆశీర్వచన బలం ఈ రచయితకు లభించినందువల్లనేమో, ఈ రచన ఒక ఉపనిషత్తులాగా మనకి ప్రాణశక్తి ప్రదానం చేస్తుంది. ద్వేషం కక్కడమే సాహిత్యంగా చలామణి అవుతున్న కాలంలో ఒక రైతు బిడ్డ దొప్పలో తెచ్చి ఇచ్చిన జుంటితేనె ఈ రచన.
రచనమీద ప్రశంసలు కురిపించడమేనా, విమర్శ లేదా అంటే, ఉంది. మొదటిది, దీన్ని నవల అనలేకపోతున్నాను, ఎందుకంటే, నవలా ప్రక్రియకు సంబంధించిన కొన్ని లక్ష్యాలను ఈ రచన అందుకోలేకపోయింది. చాలావరకూ, డాక్యుమెంటరీగా నడిచే ఈ రచనని శిల్ప రీత్యా పరిపూర్ణమైన నవలగా గుర్తించలేం. కాని, ఒక పుస్తకం మన మనసు మీద వదిలే ముద్ర ముఖ్యమని భావించినప్పుడు, అది డాక్యుమెంటరీనా, ట్రావెలోగ్ నా, లేక జర్నలా అన్నదేమంత ముఖ్యం కాదు. ఒక రచనగా ఈ పుస్తకం ఎంతో విశిష్ఠమైన రచన. రెండవది, ఈ రచనకు పెట్టిన పేరు.’ఒంటరి’ ఎంతమాత్రం తగని పేరు.అసలీ పుస్తకం విలువ మొత్తం మనిషి ఒంటరికాడని చెప్పడంలోనే ఉంది. మూడవది, రచయితకు సన్నివేశాలు నిర్మించగల శక్తి ఉందిగాని, ఆ వెంటనే వాటిని వ్యాఖ్యానించకుండా ఉండలేని బలహీనత కూడా ఉంది. ఇక తాత్త్వికత దృష్ట్యా చూసినా కూడా, ఇంత అమూల్యమైన జీవితదృక్పథం ఉన్నప్పటికీ, మన గ్రామాలూ, మన రైతులూ తోటి మనుషుల పట్ల ఎందుకంత అమానుషంగా ప్రవర్తిస్తూ వచ్చారు? కులవివక్ష వల్లా, భూస్వామ్యసంబంధాల వల్ల సన్నకారురైతులకీ, రైతుకూలీలకీ, చేతివృత్తులవాళ్ళకీ గ్రామాల్లో ఊపిరాడని మాట ? రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు?
తాను చూసిన ఈ ఆదర్శవంతమైన, స్వప్నతుల్యమైన ఈ లోకానికీ, మన గ్రామాలకీ మధ్య ఎక్కడో లంకె తెగింది. కథలో ‘నాలుగురోడ్ల కూడలీ, ఒంటికొట్టానికీ’ మధ్య ఉన్న దూరంలోనే ఒక కలకీ, వాస్తవానికీ మధ్య ఉన్న దూరమంతా ఉంది. ఈ కథలో ఆరికల కోసం అన్వేషించినట్టే, తన రాబోయే నవల్లో ఆ లంకె కోసం వెతకమని వెంకటరామిరెడ్డికి విన్నవించుకుంటున్నాను.
కడప జిల్లా బాలరాజు పల్లెలో ఒక శివరామకారంత రూపొందుతున్నాడని నమ్ముతున్నాను.
8-4-2018