అనువాదం చేసినప్పుడు కవిత్వంలో నష్టపోనివాటిల్లో మొదటిది మెటఫర్ అయితే, తక్కిన రెండూ, భావమూ, ఆవేశమూనూ. భావాన్ని మూడ్ అనవచ్చు. మనం భావకవిత్వంగా పిలుస్తున్నది మనకి విమర్శకులు చెప్పినట్టు రొమాంటిసిస్టు కవిత్వం ప్రభావం వల్ల రాసిన కవిత్వంకాదు. నిజానికి రొమాంటిసిస్టు కవిత్వానికీ, భావకవిత్వానికీ మధ్య సుమారు నూరూ నూటయాభయ్యేళ్ళ వ్యవధి ఉంది. భావకవుల్ని ప్రభావితం చేసిన యుగోద్వేగమంటూ ఏదన్నా ఉంటే అది ఇంప్రెషనిజం తప్ప రొమాంటిసిజం కాదు. భావకవులు కవిత్వం చెప్పడం మొదలుపెట్టేటప్పటికే యూరోప్ లో మాడర్నిజం మొదలైపోయింది. కాని ఆ ప్రభావానికి లోను కావడానికి తెలుగు కవిత్వం 30 ల దాకా ఆగవలసివచ్చింది. 20ల్లో వేంకటపార్వతీశ్వర కవులు, కృష్ణశాస్త్రి, తొలినాళ్ళ విశ్వనాథ అన్వేషించింది కేవల శబ్ద ప్రధాన, కేవల అర్థ ప్రధాన, అలంకార ప్రధాన కవిత్వాన్ని కాదు. వాళ్ళొక మూడ్ ని పట్టుకోవడానికి ప్రయత్నించారు.
ఇంగ్లీషు రొమాంటిసిస్టులనుంచి వాళ్ళు గ్రహించింది కేవలం స్వేచ్ఛాప్రియత్వం మాత్రమే. కాని కవితా నిర్మాణానికి వచ్చినప్పుడు కృష్ణశాస్త్రి బైరన్ మీద కన్నా పెద్దన మీదనే ఎక్కువ ఆధారపడ్డాడు. ముఖ్యంగా మూడ్ ని చిత్రించడమెలా అన్నదాని విషయంలో.
మనుచరిత్రలో ఈ పద్యం (3:16) చూడండి.
ఏ విహంగము గన్న ఎలుగిచ్చుచును, సారె
కును సైకతంబుల కూడ దారు
దారి కన్గొని యది తనజోడు కాకున్న
మెడ ఎత్తి కలయంగ మింట నరయు
అరసి కన్నీటితో మరలి తామర ఎక్కి
వదనమెండగ సరోవారినద్దు
అద్ది త్రావగ సైపకట్టిట్టు కన్గొని
ప్రతిబింబమీక్షించి బ్రమసి యురుకు
యురికి యెరకలు తడియ వేరొక్క తమ్మి
కరుగు, నరిగి రవంబుతో దిరుగుతేంట్ల
బొడుచు ముక్కున మరియును బోవు వెదుక
సంజబ్రియుబాసి వగనొక్క చక్రవాకి
(తన ప్రియుణ్ణి ఎడబాసిన ఒక చక్రవాకి సంజవేళ ఏ విహంగాన్ని చూసినా తన చక్రవాకమేమో అనే భ్రాంతితో ఎలుగెత్తి పిలుస్తుంది, దాని వెంట నడుస్తుంది. అది తనది కాదని గుర్తుపట్టి తలెత్తి ఆకాశమంతా కలయచూస్తుంది. చూసి ఎక్కడా ఏదీ కనబడక కళ్ళ నీళ్ళతో వెనక్కి తిరిగి తామరపువ్వు మీదవాలి, ఎండిపోతున్న తన నోరు చల్లబరుచుకోడానికి సరసునుపెదాలతో అద్దుతుంది. కాని తాగడానికి రుచించక అటుఇటు చూసి సరసులో తన ప్రతిబింబాన్ని చూసి అది తన సహచరుడని భ్రమపడి ముందుకురుకుతుంది.ఉరికి రెక్కలు తడిసి మరొక తామరపువ్వువైపుకు తరలిపోతుంది. అక్కడ పువ్వు మీద సంతోషంతో ఎగురుతున్న తుమ్మెదల్ని అసహనంతో ముక్కుతో పొడుస్తుంది. మళ్ళా అక్కణ్ణుంచి మరొక పువ్వుకు తరలిపోతుంది.)
ముఫ్ఫై ఏళ్ళకిందట రాజమండ్రిలో ‘ప్రబంధ పరిమళం’ పేరిట చేసిన ప్రసంగ పరంపరలో మాష్టారు ఈ పద్యం చదువుతున్నప్పుడు ఆయన గొంతు బొంగురుపోవడం, ఆయన కళ్ళల్లో పలచని నీటిపొర కమ్మడం నాకింకా గుర్తుంది.
ఆ ప్రసంగాలైన తరువాత నేనాయనకు రాసిన ‘సహృదయునికి ప్రేమలేఖ’ (1985) లో ఇట్లా రాసాను:
‘మనుచరిత్రలోని తాత్త్వికమైన గహనత, రహస్యాలు, లోతులు-ఇవేవీ లేకపోయినా-విరహనీరవరాగాలాపియైన చక్రవాకి గురించిన ఆ పద్యం చాలు. ఎంత కఠినులు మీరు. ఆ పద్యాన్ని అంతమందిలో ఎలా చదవగలిగారు? ఒంటరిగ్తా మి ఇంట్లో ఆ పద్యాన్ని వినివుంటే ఏడ్చి ఉండేవాణ్ణి’ అని.
ప్రేమ, ప్రేమ వల్ల భ్రమ, భ్రమవల్ల విరహం, విరహం వల్ల భ్రమ-ఈ నేపథ్యంమీంచే మనుచరిత్రకర్త ఒక నిర్వేదాన్నీ, నిర్లిప్తతనీ సందేశంగా చెప్పాడనుకుంటే, ఈ పద్యం ఆ కావ్యంలో ఎంత ఔచిత్యంతో ఇమిడిందో కూడా చూడవచ్చు. కాని ఆ కావ్యసందర్భం నుంచి పక్కకు తొలగించి చూసినా, ఒక మూడ్ ని ఇంత శక్తివంతంగా చిత్రించిన మరో కవిత ఏదీ ప్రపంచకవిత్వంలో నాకిప్పటిదాకా తారసపడలేదు.
ఇదే: భాషకీ, అలంకారానికీ అతీతమైన ఈ మూడ్ ని పట్టుకోవడంకోసమే భావకవులు, ముఖ్యంగా కృష్ణశాస్త్రి తీవ్రంగా తపించింది. ఈ భావానికి ఆవేశం జోడిస్తే ‘మహా ప్రస్థానం’ గా మారిందనుకుంటాను.
8-8-2013