ఇక్కడున్నది ఇస్సా

5

ప్రతి భాషలోనూ కవులకొక వంశావళి ఉంటుంది. అది రక్తసంబంధమ్మీద ఏర్పడే అనుబంధంకాదు, అక్షరసంబంధం. ప్రతి కవీ తనముందొక పూర్వకవిని ఆశయంగా పెట్టుకుంటాడు. అతడి స్థాయికి తనూ చేరాలని తపన పడతాడు, ‘మందః కవి యశః ప్రార్థీ’ అని కాళిదాసు అనుకున్నట్టు. తన పూర్వకవీశ్వరుడి స్థాయికి తాను చేరలేకపోతున్నానని నిస్పృహ పడతాడు. ‘ఆశయాలకేం అనంతం, అప్పారావంతటి వాణ్ణి’ అని శ్రీ శ్రీ అనుకున్నట్టు.

ఇస్సాకి బషొ అట్లాంటి కొండగుర్తు. బషొకి సైగ్యొ అట్లాంటి దిగంతరేఖ. సైగ్యొ ఒకప్పుడు సమురాయిగా రాజాస్థానాల్ని సేవించాడు. ఆ జీవితం పట్ల ఒక్కసారిగా విరక్తిచెంది శ్రమణుడిగా మారిపోయేడు. సమాజాన్ని వదులుకోగలిగేడుగాని, సౌందర్యాన్ని వదులుకోలేకపోయాడు. తాను తిరుగాడిన చోటల్లో వెన్నెల్ని, విల్లోకొమ్మల్ని, చెర్రీపువ్వుల్ని, చంద్రవంకల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. సైగ్యొ ఎక్కడెక్కడ తిరిగాడో, ఏ తావుల్లో కవిత్వం చెప్పాడో, ఆ దారుల్లో, అయిదువందల ఏళ్ళ తరువాత బషొ సంచరించాడు. రెండున్నరవేల మైళ్ళ తన కాలినడకను గ్రంథస్థం చేసాడు.(ఆ అనుభవాలు చదవాలనుకున్నవాళ్ళు నేను అనువదించిన ‘హైకూ యాత్ర’ (ఎమెస్కో, 2010) చూడవచ్చు.)

ఇప్పుడు ఇస్సా తిరిగి మళ్ళా బషొ అడుగుజాడల్లో దేశమంతా సంచరించాడు. తాను కూడా ఒక జెన్ సన్యాసి కావాలనుకున్నాడు. గృహం వదిలాడేగాని, గృహాన్ని వదిలిందెక్కడ? తన హృదయాన్ని తన స్వగ్రామం నుంచీ స్వగృహం నుంచీ మళ్ళించలేకపోయాడు.

నాకేమనిపిస్తుందంటే, ఒక మనిషిని కవిని చేసేవి రెండే: ఒకటి, అతడు పుట్టిన ఊరు, అది అతడు పోగొట్టుకున్న పరదైసు. రెండవది, ఏనాటికన్నా తనకి సాధ్యంకాగలదని అతడు నమ్మే మరోప్రపంచం. ఇస్సా మరోప్రపంచ కవి కాడు, తన పుట్టిన ఊరికే తన గుండెను వేలాడదీసుకున్న కవి. పూర్తిగా ఇక్కడి ప్రపంచపు కవి, సామాన్యమైన మనిషి, అత్యంత సాధారణమైన అస్తిత్వాల్ని ప్రేమించే కవి.

‘బాగా నలిగిన పెరడు, నడివేసవి, ఝుమ్మని ముసురుకునే ఈగలు, మిణుగురులు, కందిరీగలు, దోమలు, చిమ్మెటలు, సాలెగూళ్ళు, బఠానీపొదలూ, ఆవచేలూ’ వీటి మధ్యనే ఇస్సా బాగా అర్థమవుతాడు అంటున్నాడు లూసియాన్ స్ట్రీక్ తన The Dumpling Field: Haiku of Issa (1991) కు రాసుకున్న ముందుమాటలో. ఎందుకంటే ‘పిట్టలు, పిల్లులు, కుక్కలు, ఉడతలు, కుందేళ్ళ మధ్యనే’ ఆ కవి మరింత సహజంగానూ, సంతోషంగానూ ఉండగలుగుతాడు కాబట్టి ‘ అంటాడు.

కాని, ఇప్పుడు, ఈ తెల్లవారు జామున, వీథిలో నాలుగు వేపచెట్లూ తేనెలు కురిసేవేళ, ఆకాశంలో ఆఖరిపడవలాగా చంద్రుడు నెమ్మదిగా ఆవలివడ్డుకు చేరుతున్నవేళ కూడా ఇస్సాని చదువుకోవచ్చని నాకు అర్థమవుతున్నది.

లూసియన్ స్ట్రీక్ అనువదించిన 366 హైకూల్లోంచి కొన్ని ఇవాళ మన కోసం:

వసంతం

1

చెర్రీలు పూసాయా?
నేనున్న తావుల్లో
గడ్డికూడా పూసింది.

2

మనుషులున్నప్రతిచోటా
ఈగలూ ఉంటాయి,
బుద్ధుడూ ఉంటాడు.

3

పిల్లల్లారా,
ఆ ఈగని చంపకండి,
దానికీ పిల్లలున్నాయి.

4

సాయంకాలపు చెర్రీపూలు
నేడు అప్పుడే
నిన్నగా మారిపోయిందా?

5

మొదటి మిణుగురుపురుగా!
ముఖం చాటేస్తావెందుకు-
ఇక్కడున్నది ఇస్సా.

6

నలుదిశలా చెర్రీపూలు-
ఈ ప్రపంచానికే
యోగ్యత లేదు.

7

కప్పా నేనూ-
ఒకరి కనుపాపల్లో
మరొకరం.

వేసవి

8

వెన్నెలవెలుగులో
గొల్లభామ పాట-ఎవరో
వరదనుంచి బయటపడ్డారు.

9

నత్త-
ఎంతదూరం పయనించనీ
తన ఇల్లు వదలదు.

10

కప్పని
చూసి ఉలిక్కిపడింది
నా నీడ

11

ఎటువంటి రోజు-
పిట్టలు రెక్కలు చాపుతున్నాయి
మనుషులు గవ్వలేరుకుంటున్నారు.

హేమంతం

12

మొదటి చిమ్మెట-
జీవితం
క్రూరం, క్రూరం, క్రూరం.

13

ఈ లోకంలో
సీతాకోకచిలుకలు కూడా
పొట్టపోసుకోక తప్పదు.

14

పల్లెలో నా పాత ఇల్లు-
ఎక్కడ తాకిచూడు
ముళ్ళు.

శీతవేళ

15

అరవై ఏళ్ళొచ్చాయి-
ఒక్కరాత్రి కూడా
నాట్యమాడింది లేదు.

8-3-2018

Leave a Reply

%d bloggers like this: