పొద్దున్నే పాత కాగితాలు సర్దుకుంటుంటే ఎప్పుడో అనువాదం చేసిన ఈ ప్రాకృత కవితలు కనబడ్డాయి. ఇవి వజ్జాలగ్గంలోవి. క్రీస్తు శకం ఏడెమినిది శతాబ్దాల కాలంలో జయవల్లభుడనే జైనసాధువు సంకలనం చేసిన ప్రాకృత కవితకవితాసంకలనమది.
దాన్ని తెలుగులో విదుషీమణి కప్పగంతుల కమలగారు అనువాదం చేసారు. ఇంగ్లీషులో ఆచార్య ఎం.వి.పట్వర్ధన్ చేసిన అనువాదం ప్రసిద్ధం. దాన్ని ప్రాకృత్ టెక్స్ట్ సొసైటి, పూనా వారు ప్రచురించారు (1969).
ఆ కవితలు చల్లిన సమ్మోహసుగంధంలో నేను కూడా అయిదారు కవితలు అనువాదం చెయ్యకుండా ఉండలేక పోయాను.
వాటిని ఈ రోజు మీకోసమిట్లా కానుకచేస్తున్నాను:
అమృతం ప్రాకృతకావ్యం
1
అమృతం ప్రాకృతకావ్యం.
ఆ కవిత విననివాళ్ళెట్లా
చెప్పుకోగలరు తాము కూడా
జీవితాన్ని ప్రేమిస్తున్నామని.
2
సగం గుగుసలు, చిరునవ్వులు
సగం రెప్పలు మూసిన చూపులు
అర్థమయేదెట్లా
ప్రాకృతకవిత పరిచయం కాకుండా.
3
ఇదొకటి నిశ్చయం
నీకొక సుకృతముండాలి,
వనితలమనసువెల్లడికావాలన్నా
ప్రాకృతకవిత మనసును దోచాలన్నా.
4
ఎవరి హృదయం దోచుకోబడదు?
ప్రాకృత కవితలతో, వనితలతో
కవీశ్వరులవాక్కులతో
పసిపాపల పలుకులతో.
5
అంతకన్నా శిక్ష లేదు వారికి
ప్రాకృతకవితామోహితులు కాలేనివారికి
గీతాన్ని, సంగీతాన్ని, ప్రౌఢమహిళల్ని
ప్రేమించలేనివారికి.
6
తనివితీరలేదు మాకిప్పటికీ
ప్రాకృతకవితాస్వాదనతో
విద్వాంసులగోష్టులతో
సుగంధశీతలజలాలతో.
8-7-2013