అతిథిగృహం

17

రూమీ కవితని చూసి నాగేశ్వర్ కె.ఎన్.ఆర్ గారు బరంపురం నుంచి పరవశిస్తూ తనకి ఆ కవిత్వం ఇంకా ఇంకా కావాలనిపిస్తోందన్నారు. పులికొండ సుబ్బాచారిగారు గొప్ప సాహిత్యరసజ్ఞులు ‘రూమీ గానం చేసాడని రాసారు, కాని మీ అనువాదం వచనంగానే ఉందికదా’ అన్నారు.

ఇప్పుడు నేనొక్కణ్ణే కాదు, ప్రపంచమంతా రూమీ కవిత్వాస్వాదనలో మునిగితేలుతూ ఉంది. నేనొకసారి రాసాను కూడా, రాజకీయ అమెరికా రాజకీయ ఇరాక్ ని, జయిస్తే, సాంస్కృతిక ఇరాక్ సాంస్కృతిక అమెరికాని పూర్తిగా పాదాక్రాంతం చేసుకుందని. నేనొకసారి కౌలలాంపూర్ ఏర్ పోర్ట్ లో కొద్దిసేపు ఉండవలసివచ్చింది. అక్కడి పుస్తకాల దుకాణాల్లో సాహిత్యమేమన్నా దొరుకుండా అని వెతికితే, ఎటుచూసినా కంప్యూటర్లకీ, మానేజిమెంటుకీ సంబంధించిన రచనలే కనబడ్డాయిగాని, ఒక్క సాహిత్యగ్రంథం కూడా కనిపించలేదు. ఆ మాటే దుకాణదారుతో అంటే, రూమీ రచనలున్నాక వేరే సాహిత్యమెందుకంటూ, రూమీ రచనలున్న వైపు చూపించాడు.

రూమీని పారశీకంలో చదవలేకపోవడం నా దురదృష్టం. ఆయన రెండుపాదాల మస్నవీలో, నాలుగు పాదాల రుబాయీలో, ముఖ్యంగా గజళ్ళలో కవితలు చెప్పాడు. వాటిని ఇంగ్లీషులోకి అనువదించిన తొలితరం అనువాదకులు నికల్సన్ వంటివారి ఆ సంగీతాన్ని ఇంగ్లీషులోకి తేలేకా, అలాగని మూలానికి అవిధేయంగా ఉండలేకా చాలా నలుగులాట పడ్డారు. రెండవతరం అనువాదకులు ఎ.జె.అర్బెరీ వంటివారు రూమీని ఇంగ్లీషులోకి తేవడానికి కొత్త అభివ్యక్తికోసం వెతికారు. మూడవతరం అమెరికన్ అనువాదకులు, అమెరికన్ భావుకులు కబీర్ హెల్మ్సింకి, రాబర్ట్ బ్లై, ముఖ్యంగా కోల్ మన్ బార్క్స్ వంటివారు రూమీని ఇరవయ్యవ శతాబ్దపు అమెరికన్ కవిగా మార్చేసారు. అనువాదంలో నష్టపోకతప్పని సంగీతం స్థానంలో వారు కత్తివాదరలాంటి సూటితనాన్ని పట్టుకొచ్చారు.

దాన్ని ఆస్వాదించాలంటే కోల్మన్ బార్క్స్ ‘ద ఎసెన్షియల్ రూమీ’ (1995), ‘ద రూమీ కంపేనియన్’ (1998), పీటర్ వాషింగ్టన్ సంకలనం చేసిన ‘రూమీ’ (2006) చూడాలి.

నాగేశ్వర్ గారూ, ఈ రోజు మీకోసం రూమీ కవిత మరొకటి, The Guest House పేరిట కోల్మన్ బార్క్స్ చేసిన అనువాదం.

అతిథిగృహం

మనిషిగా ఉండటమంటేనే
ఒక అతిథిగృహం తెరవడం
ప్రతి ఉదయమూ ఒక కొత్త ఆగమనం

సంతోషం,దిగులు, లేకితనం
ఏదన్నాగానీ, ప్రతి భావావేశమూ
అనుకోని అతిథి.

ప్రతి ఒక్కర్నీ స్వాగతించు, ఆదరించు.
సహస్రదు:ఖాలు నీ ఇంటిని చుట్టబెట్టి
వస్తువులన్నీ తల్లకిందులు
చేసాయే అనుకో
అయినా కూడా, స్వాగతించు అతిథుల్ని,
ఎవరికి తెలుసు,
ఏ కొత్త వేడుక కోసమో
అవి నీ ఇల్లు ఊడుస్తూండవచ్చు.

ఒక కుటిలాలోచన, సిగ్గు, ఈసు-
అయితేనేం, చిరునవ్వుతో ఎదురేగు.

తలుపుతట్టిన ప్రతి
అతిథికీ కృతజ్ఞతలు చెప్పు
వాళ్ళల్లో ప్రతి ఒక్కరూ
నీకు దారిచూపడానికి
ఎక్కణ్ణుంచో వస్తున్నవాళ్ళే.

12-8-2013

Leave a Reply

%d bloggers like this: