ఈ రోజెందుకనో ఒక వేదసూక్తాన్ని తెలుగు చేయాలనిపించించింది.
వాల్మీకి నుంచి టాగోర్ దాకా భారతీయ కావ్యవాక్కుకి ప్రాణం పోసిన సరస్వతి వేదవాక్కు. అనుభవాన్ని అక్షరంగా మార్చే విద్య వేదఋషులకి తెలిసనట్టుగా మరెవరికీ తెలియదేమో. వేదాన్ని రహస్యవిద్యగానూ, బ్రహ్మవిద్యగానూ సాధారణ పాఠకుడికి అందకుండా చేసినందువల్ల మనం ఇప్పటికే సాంస్కృతికంగా ఎంతో నష్టపోయాం.
వేదసూక్తం ప్రతి ఒక్కటీ పరిపూర్ణ కావ్యం. ఉదాహరణకి ఋగ్వేదం (10-146) లో అరణ్యాలమీద పలికిన ఈ సూక్తం చూడండి. వేదకాలం నాటికే అడవి ఊరునుంచి దూరంగా తొలగిపోతున్న విషాదాన్ని కవి పసిగట్టాడు. చిన్ని చిన్ని మాటల్తో, ఆ కవి, ఇరమ్మద పుత్రుడు దేవముని, సృష్టించిన దృశ్యం, అందులో పొదిగిన నిశ్శబ్దం, ఆ పరిమళం ఇన్నాళ్ళైనా మనకి కొత్తగా కనిపిస్తాయి.
అందుకనే విభూతి భూషణ బందోపాధ్యాయ రాసిన ‘ఆరణ్యక’ (తెలుగులో వనవాసి) పుస్తకానికి ముందుమాట రాస్తూ ప్రసిద్ధ పండితుడు సునీతి కుమార్ ఛటర్జీ ఈ కవితను ఉదాహరించకుండా ఉండలేకపోయాడు.
ఈ అనుసరణకు సచ్చిదానందన్ వాత్స్యాయన్ ఇంగ్లీషు అనువాదం (ద ఇండియన్ పొయెటిక్ ట్రెడిషన్, 1983) నాకు చాలా ఉపకరించింది.
అరణ్యానీ, అరణ్యానీ
అరణ్యానీ, అరణ్యానీ, నెమ్మదిగా కనుమరుగైపోతున్నావు
గ్రామం వైపు కన్నెత్తిచూడటం లేదు, భయపడటం లేదుకద!
ఎక్కడో ఒక ఆవు అంబారవం, మరెక్కడో చిమ్మెట ప్రతిధ్వని
అప్పుడు చిరుగంటలమధ్య అరణ్యాని చిరునవ్వినట్టుంటుంది.
పచ్చికమేస్తున్న గోవుల్లానో, పర్ణశాలలానో పొడచూపుతూ
సూర్యాస్తమయవేళ అరణ్యాని ఒక శకటంలాగా కనిపిస్తుంది.
పశువుల్ని పిలుస్తున్న అరుపు, కట్టెలు కొడుతున్నచప్పుడు
చీకటిపడ్డాక అడవుల్లో తిరిగేవారికొక రోదనధ్వని వినిపిస్తుంది.
ఆమె ఎవరినీ బాధించదు, వాళ్ళు తనని బాధిస్తే తప్ప.
తియ్యటిపండ్లారగిస్తూ తనకి నచ్చినట్టు తిరుగుతుంది.
అంజనగంధి, సురభి, నేలదున్నకుండానే చేతికందే పంట
వన్యప్రాణుల తల్లి, అమ్మా,అరణ్యానీ, నీకిదే నా నమస్సు.
20-5-2013