43 ఎకరాల జొన్నపంట

Reading Time: 4 minutes

100

నిన్న పొద్దున్న పాణ్యం చెంచుకాలనీలో, కాలం ఆ జాతిలోనూ, కుటుంబాల్లోనూ తెచ్చిన మార్పులేవైవుంటాయా అని ఆలోచిస్తూ, ఒక ఇంట్లో అడుగుపెట్టాను. ఆ ఇల్లు, ఒకే ఒక్క గది, అక్కడొక మూల నాలుగైదు మూటలు కనిపిస్తే అవేమిటని అడిగాను. నాతో పాటు దగ్గరుండి అన్నీ వివరిస్తున్న సర్పంచ్ మేకల సుబ్బరాయుడు అవి బియ్యం మూటలని చెప్పాడు.

ఎంతకు కొంటున్నారని అడిగాను.

‘కొన్నవి కాదు సార్, మేం పండించుకున్నవే, వడ్లు మిల్లుకేస్తే వచ్చిన మూటలు’ అన్నాడు.అంటూ,’కర్నూలు సోనా’ అని అక్కడ విప్పి ఉన్న ఒక మూటలోంచి గుప్పెడు బియ్యం తీసి నా చేతుల్లో పోసాడు. తెల్లగా, తళతళలాడుతున్న సన్నబియ్యం!

నాకు వళ్ళు జలదరించించింది.

అక్కణ్ణుంచి సుబ్బరాయుడి ఇంటికి రాగానే స్థానిక పత్రికావిలేకరులు చుట్టుముట్టారు. సాధారణంగా ఒక ప్రభుత్వాధికారి గ్రామాలకు వచ్చినప్పుడు చుట్టూ చేరినట్టే.

‘కాని నేను మీతో ఒక ప్రభుత్వాధికారిగా కాదు, ఒక స్నేహితుడిగా మాట్లాడాలనుకుంటున్నాను, నేనిందాకణ్ణుంచీ అనుభవిస్తున్న పులకింత పంచుకోవాలనుకుంటున్నాను’ అన్నాను.

‘మామూలుగా ప్రతి ఒక్కరూ ‘అభివృద్ధి అంటే ఏమిటి? ఎక్కడ జరిగింది? అని అడుగుతారు. సంఘాన్నీ, ప్రభుత్వాన్నీ విమర్శిస్తుంటారు. నిజమే,మన దేశం చాలా బీదది, మన సమాజాలు చాలా పేదవి. ఎంత సాధించినా, ఇంకా సాధించవలసినదానితో పోలిస్తే మనం సాధించింది చాలా చాలా కొంచెంగానూ, తక్కువగానే కనిపిస్తుంది. కాని ఇదిగో, ఇట్లాంటి సన్నివేశాల్లో, నాలాంటివాడు, ఈ జీవితాల్ని కొన్నేళ్ళుగా చూస్తూన్నవాడు అట్లాంటి మాటలు మాట్లాడలేడు, అట్లాంటి ప్రశ్నలు అడగలేడు. మీరిప్పుడు చూసారుకదా, ఆ ఇంట్లో కర్నూలు సోనా బియ్యం. అందులో మీకేమీ విశేషం కనిపించదు. నగరం నుంచి వచ్చిన ఒక అధికారి బియ్యం చూసి ఆశ్చర్యపోతున్నాడేమా అని మీరే ఆశ్చర్యపోయిఉండవచ్చు. కాని, నాకు అది కేవలం ఆశ్చర్యం మాత్రమే కాదు, అద్భుతం కూడా ‘అన్నాను.

ఆ విలేకరులు పాతిక, ముఫ్ఫై ఏళ్ళ వయసు యువకులు.

‘నేను పాతికేళ్ళ కిందట ఈ జిల్లాలో జిల్లా గిరిజన సంక్షేమాధికారిగా పనిచేసాను. అప్పటికి మీరు పుట్టిఉండరు, పుట్టినా కళ్ళు తెరిచి ఉండరు. నేనీ జిల్లాకు రాగానే మా జిల్లా కలెక్టరు నాకోసం కొన్ని పనులు సిద్ధంగా ఉంచారు. అందులో ఒకటి, అన్నిటికన్నా ముఖ్యమైంది, ఈ పాణ్యం చెంచులకి వ్యవసాయం నేర్పించడం. అప్పటికి ఏడెమినిదేళ్ళ కిందట, అంటే 82, 83 కి ముందు ఈ చెంచుకుటుంబాలు చుట్టుపక్కల అడవుల్లో ఉండేవారు. నంద్యాల-కర్నూలు రోడ్డు మీద ఏ దొంగతనాలు జరిగినా పోలీసులు వాళ్ళనే పట్టుకుని హింసించేవాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో ఒక పోలీసు అధికారి, ఆయన పేరు కాశీనాథ్, నంద్యాల్లో డి.ఎస్.పి గా పనిచేసేవాడు, ఆయన ఆ పరిస్థితి చూడలేక వాళ్ళందరినీ పాణ్యంలో తీసుకొచ్చి ఒక కాలనీ కట్టి పునరావాసం చేయించాడు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుతో ఆ కాలనీ ప్రారంభం చేయించాడు. వాళ్ళ ఉపాధికోసం ఒక కోళ్ళఫారం పెట్టించాడు. కాని నేను అక్కడికి వెళ్ళేటప్పటికి పరిస్థితి మళ్ళా మొదటికి వచ్చింది. ఆ కోళ్ళ ఫారాన్ని సగం పోలీసులూ, మిగిలిన సగం దొంగలూ తినేసారు. చెంచువాళ్ళని ఊళ్ళొకి తెచ్చి తమకి భద్రత లేకుండా చేసారని ఊళ్ళోవాళ్ళు గొడవచేయడం మొదలుపెట్టారు.

అందుకని జిల్లాకలెక్టరు ఎమ్మార్వోతో మాట్లాడి వాళ్ళకొక నలభై ఎకరాల బంజరు పట్టా ఇప్పించాడు. నేను వెళ్ళగానే అక్కడ చెంచువాళ్ళతో ఒక ఉమ్మడి సేద్యం సహకార సంఘం ఏర్పాటు చెయ్యమనీ, వాళ్ళకి సాగుపనులు నేర్పమనీ, పంటలు పండించమనీ చెప్పాడు.’

‘పాణ్యంనుంచి లోపలకి బలపనూరు దగ్గరు ఉన్న ఆ మారుమూల భూమిని మేం బుల్ డోజర్లతో చదునుచేయించాం, రెండు గొట్టపు బావులు తవ్వించి సాగునీటి వసతి ఏర్పాటు చేసాం. చక్కటి మాగి రకం జొన్న వేద్దామన్నారు రైతులు. మొదటి పంట వేసాం. మాఘమాసం వచ్చేటప్పటికి, మేలిమి బంగారు వన్నె తిరిగిన జొన్న కంకుల్తో పంట బరువెక్కింది. అదంతా కూడా మైఖెల్ షొలొకోవ్ ‘బీళ్ళు దున్నేరు’ నవల్లోలానే ఉండింది.’

‘ఒక రోజు ఆ పంట ఎట్లా ఉందో చూద్దామని పొలం దగ్గరికి వెళ్ళేటప్పటికి సాయంకాలమైంది. అక్కడొక మనిషి కనబడ్డాడు. మీరెవరు, ఇక్కడెందుకున్నారు అని అడిగాను.

నేను నంద్యాల్లో లాయర్ని. ఈ రోజు మున్సిఫ్ కోర్టులో కొందరు షెడ్యూలు కులాల రైతులు ఈ పొలం మీద కేసు పెట్టారు. ఈ పంట తాము వేసుకున్నామనీ, చెంచువాళ్ళు కోసేసుకోబోతున్నారనీ, తమ పంట కాపాడమనీ కోర్టువారిని అడిగారు. అందుకని కోర్టువారు నన్ను కమిషనర్ గా అప్పాయింట్ చేసారు. రేపే ఈ పంట వేలం వెయ్యబోతున్నాం. అందుకని చూసుకుందామని వచ్చాను అన్నాడు.’

‘నేను వింటున్నదేమిటో నాకు అర్థం కాలేదు. మోకాళ్ళల్లో నిస్సత్తువ వచ్చేసింది. ఏమిటి నేను వింటున్నది? ఈ పంట వేసింది చెంచువాళ్ళు కదా, ఎస్.సి రైతులు ఎక్కణ్ణుంచి వచ్చారు? వాళ్ళు కోర్టుకెళ్ళడమేమిటి? కమిషనర్ని వెయ్యడమేమిటి? పంట వేలం వెయ్యడమేమిటి?’

‘నేను అతణ్ణి ఆపి మా కథంతా చెప్పాను. కోర్టు ముందుకొచ్చిన కేసు తప్పుడు కేసనీ, కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అన్యాయమనీ మొత్తుకున్నాను. కాని అతడు వినలేదు. ‘నాకేమీ తెలియదు, నేను నా పని చేసుకుపోక తప్పదు’ అన్నాడు.’

‘చివరికి, మేం కూడా ఆ వేలంపాటలో పాల్గొంటామనీ, కాబట్టి వేలం వెయ్యడం ఒక్క రోజు ఆపమనీ అడిగాను. అతడు అయిష్టంగానే ఒప్పుకున్నాడు.’

‘నేను పాణ్యంవచ్చి చెంచువాళ్ళతో మాట్లాడేను. నంద్యాల్లో గిరిజన కార్పొరేషన్ మేనేజరు కృష్ణారావుతో మాట్లాడేను. నాకు అర్థమయిందేమంటే, ఆ ప్రభుత్వ భూమి మీద స్థానికంగా ఉన్న ఒక రెడ్డి కన్నువేసాడు. అతడు ఆ భూమి చెంచువాళ్ళకి దక్కకూడదనే ఆ కేసు పెట్టించాడు. జరిగిందేమంటే కలెక్టరు చెంచు వాళ్ళకి భూమి ఇమ్మన్నప్పుడు అక్కడ ఎమార్వో కలెక్టర్ని సంతొషపరిచే హడావిడిలో అంతకుముందు ఎస్.సి లకు ఇచ్చిన భూమినే మళ్ళా చెంచువాళ్ళకి ఇచ్చేసాడు. కాని ఆ పట్టాలు కాన్సిల్ చెయ్యడం మర్చిపోయాడు. ఇప్పుడు ఆ పట్టాలు చూపించే ఆ రెడ్డి దళితులతో చెంచువాళ్ళమీద కోర్టుకేసుపెట్టించాడు.’

‘ఏమైతేనేం, సమయం లేదు. మిగిలింది ఒకే ఒక్క రోజు. పొద్దున్నే కలెక్టర్నిఇంటికిపోయి కలిసాను. ఆయన జిల్లాజడ్జితో మాట్లాడేరు. కాని ఆయన మాత్రం ఏం చెప్తాడు. ‘మీరేం చేస్తారో నాకు తెలీదు. ఒక్క గింజ కూడా మనం పోగొట్టుకోకూడదు’ అని లోపలకి వెళ్ళిపోయాడు. కాని అంత పొద్దున్నవేళా ఆయన నుదుటిమీద చెమట పట్టడం చూసాను.’

‘నేను నంద్యాల వెళ్ళి అసిస్టెంటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కలిసాను. ఆయనకి కూడా ఏమీ తోచలేదు. ‘మా సీనియర్ గురుమూర్తి అని ఒక రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నాడు, ఆయన్ని సలహా అడుగుదాం ‘ అన్నాడు. మేం ఆ గురుమూర్తిని కలుసుకునేటప్పటికి సాయంకాలమైంది. నేను జరిగిందంతా చెప్పాను. మేం భూమి చదునుచేసినప్పుడు, పొలందున్నినప్పుడు, పంట వేసినప్పుడు తీసిన ఫొటోలు చూపించాను. ఆయనకేమీ పాలుపోలేదు. అట్లానే మాట్లాడుతూ కూచున్నాడు.’

రాత్రి పదయ్యంది. అప్పుడు ఆయనకి హటాత్తుగా ఆలోచన వచ్చింది.

‘ఈ కేసులో దళితులు కలెక్టర్నీ,ఎమ్మార్వోనీ రెస్పాండెంట్లుగా పెట్టారు. చెంచు వాళ్ళ ఊసేలేదిందులో. నేను చెంచు వాళ్ళతో రేప్పొద్దున సబార్డినేట్ జడ్జికోర్టులో కేసు వేయిస్తాను, అయ్యా, మా పొలంలో మా పంట మేం పండించుకుంటే, ఈ దళితులు, ఎమ్మార్వో, కలెక్టరూ ఈ గొడవంతా ఏమిటి, మా పంట మాకు ఇప్పించండి అనడిగిస్తాను అన్నాడు. ‘ఇంకో మాట, ఆ ఫొటోలు చూపించారు చూడండి, అవే నాకు సాక్ష్యం. అయితే కోర్టు ఫొటోలు నమ్మదు, నెగిటివ్లు కావాలి’ అన్నాడాయన.’

ఒక్కసారి మళ్ళా మేం బలం పుంజుకున్నాం. ఆ రాత్రంతా కర్నూలు, పాణ్యం, నంద్యాల, పాణ్యం, నంద్యాల తిరుగుతూనే ఉన్నాం. నెగిటివ్లు సంపాందించాం. అఫిడవిట్ తయారు చేసాం. చెంచువాళ్ళ సంతకాలు పెట్టించాం.

తెల్లవారింది. పదింటికి కోర్టుకి బయలుదేరుతూ ఆ పెద్దాయన ‘చాలాకాలమైంది నేను నల్లకోటువేసుకుని’ అన్నాడు. అజాద్ హింద్ ఫౌజు కోసం నల్లకోటు వేసుకున్న జవహర్ లాల్ లాగా.

కాని ‘ఒక్కమాట. నేను నా వృత్తిలో ఎప్పుడూ అబద్ధాలాడలేదు. ఇప్పుడు కూడా సబ్ జడ్జిముందు అబద్ధమాడలేను. కిందకోర్టు పంట వేలంవెయ్యమందనీ, కమిషనర్ని నియమించిందనీ చెప్పకుండా ఉండలేను. తీరా అట్లా చెప్పాక, సబ్ జడ్జి స్టే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు మీరేమంటారు?’ అన్నాడు.

‘మీ ఇష్టం’ అన్నాన్నేను.

సబ్ జడ్జి మధ్యాహానికల్లా స్టే ఇచ్చాడు.

మా సంతోషానికి అంతం లేదు. కాని మళ్ళా సాయంకాలం గురుమూర్తిగారు మాకు కబురు పెట్టాడు. ‘ఈ స్టే మీద నాకు నమ్మకం లేదు. రేప్పొద్దున సబ్ జడ్జి ఈ స్టే వెకేట్ చేసినా ఆశ్చర్యం లేదు, మీ జాగ్రత్త మీరు పడండి’ అన్నాడు.

నన్నుమళ్ళా అపారమైన నీరసం ఆవహించింది.

ఒక్కరోజు, ఆ ఒక్కరోజులో పంట మొత్తం కోసెయ్యాలి. ఎట్లా?

43 ఎకరాల జొన్నపంట.

చెంచువాళ్ళు ఒక్కరోజులో కోతకొయ్యడం అసాధ్యం. నేనూ, మేనేజరు కృష్ణారావూ మళ్ళా పాణ్యం వెళ్ళాం. చుట్టు పక్కలగ్రామాల్లో మాట్లాడి కూలిమనుషుల్ని బెత్తాయించాం. కోసిన పంట కోసినట్టు తరలించడానికి గిరిజన కార్పొరేషన్ ట్రక్కులెలానూ ఉండనే ఉన్నాయి.

మర్నాడు పొద్దున్నే పంటకోతమొదలయ్యింది. పండగలాగా చేద్దామనుకున్నాం. కాని మా పొలంలో మేమే దొంగల్లాగా, ఆతృతతో, భయంతో పంట కోత మొదలుపెట్టాం. పొద్దువాటారే సమయానికి ఇంకా నాలుగైదు ఎకరాలు మిగిలే ఉండగా, నంద్యాలనుంచి లాయరు రొప్పుకుంటూ పరుగెత్తుకొచ్చాడు.

‘సబ్ జడ్జి కోర్టు స్టే వెకేటయ్యింది’ అన్నాడు.

‘ మీరు పంట కోతకొయ్యడం అన్యాయం’ అన్నాడు.

‘నీ దిక్కున్నచోట చెప్పుకో’ అన్నారు చెంచువాళ్ళు.

రాత్రంతా పంటకోత కొనసాగింది.

పుత్తడివన్నె జొన్నపొట్టలు. ఎన్నాళ్ళుగా ఆ భూమి చెంచువాళ్ళకి ఋణపడిఉందో అద్భుతమైన కరుణతో వర్షించిన సుభిక్షం.

ఆ పంట మొత్తం పాణ్యం చెంచుకాలనీకి తరలించేటప్పటికి అర్థరాత్రి దాటింది.

‘ఈ పంట ఇక్కడ ఇలా వదిలిపోతే వీళ్ళు దీన్ని కాపాడుకోలేరేమో’ అన్నాడు కృష్ణారావు.

ఆ రాత్రి అక్కడే ఆశ్రమపాఠశాల ఎదట ఆ కంకులమధ్య ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటూ గడిపేసేం.

‘ఇదిగో, ఇప్పుడు ఈ చెంచు వాళ్ళ ఇంట్లో ఆ పొలంలో పండిన కర్నూలు సోనా బియ్యం చూడగానే అదంతా గుర్తొచ్చింది’ అన్నాన్నేను ఆ విలేకరులతో.

23-6-2015

Leave a Reply

%d bloggers like this: