హీరాలాల్ మాష్టారు

Reading Time: 5 minutes

48

నిన్న తెల్లవారు జాము నిద్రలో ఎందుకో ఫోన్ తడిమిచూసుకుంటే మెసేజి, విద్యారణ్య కామ్లేకర్ నుంచి, ఏ అర్థరాత్రి ఇచ్చాడో: ‘భద్రుడూ, నాన్నగారు ఇక లేరు’ అని. అది చూసినప్పటినుంచీ, నాలో ఒక పార్శ్వం చచ్చుబడిపోయినట్టే ఉంది.

నలభయ్యేళ్ళ అనుబంధం. ఆయన నాకు మాష్టారు మాత్రమే కాదు. అంతకన్నా చాలా, చాలా. తల్లి, తండ్రి, గురువు, మిత్రుడు, మార్గదర్శి-అన్నీను. ఆయన గురించి ఇట్లా కూచుని రాసుకుంటే, ఎంత రాస్తానో, ఎంత రాయవలసిఉందో నాకే తెలీదు. గడ్డకట్టిపోయిన మనసు కరుగుతూ, ఒకటీ, ఒకటీ, ఎన్నో జ్ఞాపకాలు..

1

తాడికొండలో మా స్కూలు ఎదురుగా కొండ. ఒక సారి మేమా కొండ ఎక్కినప్పుడు మా తో పాటు మా కొత్త హిందీ మాష్టారు కూడా ఉన్నారు. ‘నీ పేరేమిటోయ్’ అనడిగారు. ‘వీరభద్రుడు’. ‘ఓహ్! నా పేరూ అదే!’ . హరీబేల్ హీరాలాల్ కామ్లేకర్ కీ వీరభద్రుడీ మధ్య పేరులో పోలిక ఏమిటో, ఎన్నో ఏళ్ళ తరువాత, ఆయన ఉరుకుంద వీరన్న మీద రాసిన పుస్తకం చదివితేగాని తెలియలేదు.

2

స్కూల్లో రాత్రి సూపర్వైజ్డ్ స్టడీ. కుర్చీలో ఉపాధ్యాయుడు కూర్చుని ఉంటాడు. ఆ స్కూల్లో కఠిన క్రమశిక్షణ. మేం కూచుని చదువుకుంటూ ఉంటాం, ఇంతలో కరెంటు పోతుంది. పిల్లల్లో అణచిఉన్న అల్లరి కట్టలు తెంచుకుంటుంది. ఒక్కసారిగా అంతా అరవడం మొదలుపెడతారు. చీకట్లో ఎవరు అరుస్తున్నారో ఎవరూ గుర్తుపట్టలేరుకదా. కానీ కొత్త హిందీమాష్టారు కుర్చీలో కూచుని ఉండగా కరెంటు పోయినప్పుడు సీను మారిపోయింది. మధురమోహన స్వరంతో ‘సాధూ ఐసా చాహియే/జైసే సూప్ సుభాయ్’, ‘జాతి న పూఛో సాధు కీ/పూఛ్ లీజియే గ్యాన్’. మా కొత్తహిందీ మాష్టారు, ఉత్తరభారతదేశంలో గృహిణులు, శ్రామికులు, రైతులు పాడుకునే కబీర్ దోహాలు ప్రశాంత రాగయుక్త స్వరంతో ఆలపించడం మొదలుపెట్టారు. నాగస్వరం విన్న సర్పంలాగా క్లాసు మొత్తం మంత్రముగ్ధ అయిపోయింది. మళ్ళా మరోరాత్రి కరెంటు పోయినప్పుడు, బయట వెన్నెల. పిల్లలు ఈ సారి అరవలేదు, ‘హీరాలాల్ మాష్టారు ఎక్కడున్నారు, పోయి పిలుచుకు రండి’ అంటున్నారు.

3

తరగతి గదిలో దిద్దిన పరీక్ష పేపర్లు ఇచ్చే రోజు. తాడికొండ రాంకుల రణభూమి. అరమార్కుకి కూడా గొంతుకోసుకునేటంత పోటీ. పరీక్ష పేపర్లు ఇవ్వగానే పిల్లలు చూసుకుంటారు. ఎక్కడ అరమార్కు తగ్గినా ఉపాధ్యాయుణ్ణి నిలదీస్తారు. కాని ఈ సారి కొత్త హిందీ మాష్టారు దిద్దిన పేపర్లు. ఆతృతగా చూసుకుంటే, కొందరికి 120, కొందరికి 115, కొందరికి 130..’మాష్టారూ, మీరు ఎక్కువ మార్కులు వేసేసారు!’. ‘అట్లానా!మీ చిట్టి చేతుల్తో రాసిన ఆ హిందీకి ఎన్ని మార్కులేసినా తక్కువే’. ఆయన నిజంగానే మమ్మల్ని చూసి మురిసిపోయేవారు. మా మాటలు విని, మా ముఖాలు చూసి. ఆయనకి కోపం రావడం మేమెప్పుడూ చూడలేదు. ‘ఏమయ్యా, నాకు కోపం వచ్చిందంటే, తిట్టేస్తాను’ అనేవారు. కాని ఆయన తిట్టడమెలా ఉంటుందో మాకు తెలీనే తెలీదు.

4

అట్లాంటి మాష్టారు ఒకసారి పరీక్షలో మాకొక హిందీ పాసేజిని తెలుగులో అనువదించమని అడిగారు. చాలా మామూలు వాక్యాలు. అనువదిస్తే ‘అక్కడొక చెరువు ఉంది. అది చాలా అందంగా ఉంది. అందులో ఒక తామర పూసి ఉంది..’ లాంటి వాక్యాలు. అట్లానే అనువదించాం. కాని అందరికీ సున్నా మార్కులే. ‘ఎందుకు మాష్టారూ ఇట్లా సున్నా చుట్టారు?’. ‘మీకు అనువాదం చెయ్యడం రాలేదు. మక్కీకి మక్కీ రాస్తే మీ ప్రతిభ ఏమిటి? తులసీదాస్ వాల్మీకిని అనువదించలేదు. అనుసృజించాడు. మీకిచ్చిన దాన్ని మీరు మరింత సుందరంగా మార్చకపోతే, మీ ప్రత్యేకత ఏమిటన్నట్టు?’

5

ఎట్లా పసిగట్టారో ఆయన నాకు సాహిత్యం మీద ఆసక్తి ఉందని. ఇక ప్రతి సాయంకాలం ఆయనే నా స్నేహితుడు. తక్కిన పిల్లలు క్రీడా మైదానంలో తలముంకలై ఉంటే, ఆయన నన్ను, మా స్కూలు వెనక విరగబూసిన పత్తిచేలమ్మట తిప్పేవారు. ‘మీ ఊరు కొండల మధ్య ఉందన్నావు కదూ. సుమిత్రానందన్ పంత్ కూడా హిమాలయ సానువులనుంచే వచ్చాడు.’ నా తోటిపిల్లలు పై చదువులకి అమెరికా వెళ్ళాలని కలలు కంటుంటే నేను సుమిత్రానందన పంత్ ని కావాలని కలలు కనడం మొదలుపెట్టాను.

6

‘జగతి ఈనాటి ఈ మహోత్సవమునందు
మునిగి యానందమున పొంగిపోవుచుండ,
ఇట రగులుకొల్పిరెవరు నీ హృదయమందు
అణచికొనియున్న ఘోరదుఃఖానలమ్ము’

‘హిమగిరి కే ఉత్తుంగ్ శిఖర్ పర్
బైఠ్ శిలా కీ శీతల్ ఛాహ్
ఏక్ పురుష్ భీగే నయనో సే
దేఖ్ రహా థా ప్రలయ్ ప్రవాహ్..’

‘ఏమానందము భూమీ తలమున
శివతాండవమట! శివలాస్యంబట!
అలలై, బంగరు కలలై..’

‘వహ్ ఆతా, దో టూక్ కలేజో కో కరతా
పఛ్ తాతా, పథ్ పర్ ఆతా..’

‘దానిమ్మ చెట్టు కింద అమ్మాయీ..’

వేదుల, మధుశాల, కామాయని, నిరాలా, నారాయణబాబు, ఆధునిక హిందీ, తెలుగు కవిత్వాలను ఆయన నాతో కలశాలతో తాగించారు. ఆ మత్తులో ఒకరోజు ఇట్లా కలవరించాను:

‘గడ్డిపూవుని ప్రభూ, సుందరమందారాన్ని, పరిమళ భరిత పారిజాతాన్ని కాకపోవచ్చు..’

‘ఓహ్! నీకు కవిత్వం పలుకుతోందయ్యా’.

ఎప్పుడు సాయంకాలమవుతుందా, ఎప్పుడు మాష్టారితో, ఆ చేల గట్లమ్మట నడుస్తూ, కవిత్వం గురించి ఆయన చెప్పే మాటలు వింటానా-ఇదే ఆలోచన. ఆయన మా డార్మెటరీలోనే ఒక బాచిలర్స్ రూం లో ఉండేవారు. ఆయన చుట్టూ, మంచం మీద, బల్లమీద, పెట్టెల్లో, కిటికీ గూళ్ళల్లో పుస్తకాలే పుస్తకాలు. వాటిల్లో నచ్చినవన్నీ నేను పట్టుకుపోయేవాణ్ణి. క్లాసులో, మా జి.కె.గారి లెక్కల క్లాసుల్లో ఆ పుస్తకాలే నాకు తెరిచిన కిటికీలు. కాని ఒకరోజు, ఆయన క్లాసులో నా దగ్గరికొచ్చి ఆ పుస్తకాలన్నీ పట్టుకుపోయారు. ‘నువ్వు రాంకు తెచ్చుకోవలసిన పిల్లవాడివి, నేన్నీతో ‘జనరల్ బుక్స్’ చదివించి పాడుచేస్తున్నానట, ప్రిన్సిపాలుగారు అంటున్నారు’. కాని రెండురోజులే, మళ్ళా మా ప్రిన్సిపాలుగారి కళ్ళు గప్పి, ఆయన కొత్త ‘జనరల్ బుక్స్’ తో మళ్ళా ప్రత్యక్షం.

7

పేరుకి హిందీ మాష్టారు. కాని సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు, పారశీకం, తెలుగు సాహిత్యాల్లో ఆయన ఆయన అధికారం నివ్వెరపరిచేది. ఆయన రాజకీయ చైతన్యమే, ఆయన్ని ఎమర్జెన్సీ రోజుల్లో మా స్కూల్లో తలదాచుకునే పరిస్థితి కల్పిచిందని తరువాత తెలిసింది. ఆయన పరిజ్ఞానం ఎప్పటికప్పుడు అప్ టు డేట్. ఒక రాత్రి డైనింగ్ హాల్లో మేం భోంచేస్తున్నప్పుడు, మా సోషల్ మాష్టారి చేతుల్లో ఒక కొత్తపుస్తకం. ‘ఏమిటి మాష్టారూ అది?’ ‘ఇది జడ్జిమెంట్ అని కులదీప్ నయ్యర్ రాసిన పుస్తకం. ఎమర్జెన్సీ అత్యాచారాల మీద.’ కాని ఎమర్జెన్సీ అమల్లో ఉన్నంతకాలం మా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు దాన్ని సమర్థించినవాడే. ఇప్పుడు దాన్ని తూర్పారబడుతూ వచ్చిన పుస్తకాన్ని పొగుడుతున్నాడు. ఆయన దృష్టి హీరాలాల్ గారి మీద ఉంది. ‘మాష్టారూ. తెలుసా, కులదీప్ నయ్యర్!’ రెచ్చగొట్టినట్టున్న ఆ ప్రశ్నకి మాష్టారు వినయంగా జవాబిచ్చారు. ‘చదివాను, డిటెక్టివ్ రచనలాగా ఉంది.’ ఆయన ఆ రోజు అలా ఎందుకన్నారో అర్థం కావడానికి, నేనా పుస్తకం తెలుగులోకి అనువాదమయ్యేదాకా ఆగవలసి వచ్చింది.

8

మాష్టారు నాకు మాత్రమే కాదు, మా అక్కకీ, మా అన్నయ్యకీ కూడా మాష్టారే. సెలవుల్లో ఇంటికి వెళ్ళినప్పుడలా మాష్టారి మాటలే. వాళ్ళ పిల్లలు ‘విద్యారణ్య’, ‘వివేకానంద’. కొన్నాళ్ళు విద్యారణ్యకీ నాకూ మధ్య ఉత్తరాలు నడిచేయి. ఆయనకి సీతమ్మమీద పట్టలేనంత భక్తి. అందుకని ముగ్గురు ఆడపిల్లలకీ సీతమ్మ పేర్లే. వాళ్ళమ్మగారు శివరాత్రినాడు శివసాయుజ్యం చెందారు. ఈ వివరాలన్నీ మా అక్కకీ, మా అన్నయ్యకీ పూసగుచ్చినట్టు చెప్పేవాణ్ణి. తాడికొండ వదిలిపెట్టేసాక, చాలా రోజుల తర్వాత, ఒక నవల రాద్దామని కూచున్నప్పుడు, అందులో మళ్ళా మాష్టారు ఒక పాత్రగా ప్రవేశించారు. ఆ నవల ‘అసంపూర్ణ మథనం’ లో ఒక అధ్యాయం అక్క రాసింది. కాని, ఆమె కూడా మాష్టారి పాత్రని అట్లానే, అచ్చం నేనూహించినట్టే చిత్రించిందంటే, ఆశ్చర్యమేముంది!

9

78 లో స్కూలు వదిలిపెట్టాక, జీవితం నన్ను మరోదారుల్లో తిప్పుతున్నా కూడా, లోపల్లోపల ఒక గాఢమైన కోరిక. ఎప్పుడైనా కర్నూల్లో మాష్టారి ఇంటికి వెళ్ళాలి. ఆ చిరునామా నాకొక మంత్రం. ఒకప్పుడు నా క్లాస్ మేట్, జె.వి.ఎస్.డి.పి.రాజు మాష్టారి ఇంటికి వెళ్ళి వచ్చి నాతో చెప్పాడు: ‘ మాష్టారి ఇంట్లో తెలుసా, ఎక్కడ చూసినా పుస్తకాలే’ అని. అదొక స్వప్నంలాగా ఉండేది నాకు, ఆ ఇల్లు, ఆ ఇంట్లో ఎక్కడ చూసినా పుస్తకాలు.. సిల్వర్ జూబిలీ లో చదువుకునే అవకాశం తప్పిపోయేక, కర్నూలు వెళ్ళడం అసంభవమనే అనుకున్నాను. కాని జీవితం అనూహ్యం. ఊహించని పరిస్థితుల మధ్య, జిల్లా గిరిజన సంక్షేమాధికారిగా 92 లో కర్నూల్లో అడుగుపెట్టాను.ఊళ్ళో అడుగుపెట్టగానే, నేనూ, మా అన్నయ్యా చేసిన మొదటిపని, మాష్టారి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళడం. వాళ్ళింట్లో భోజనం కన్నా ముందు ఆ పుస్తకాల్ని చూస్తూనే నా కడుపు నిండిపోయింది.

10

నా పసితనంలో మాష్టారు నాకెంత ఆరాధనీయంగా కనిపించారో, నా ముఫ్ఫై ఏళ్ళప్పుడు కర్నూల్లో మళ్ళా అంత ఆరాధనీయంగానూ కనబడ్డారు. సాధారణంగా, మన పసితంలో మనల్ని ప్రభావితం చేసిన వ్యక్తుల కన్నా మనం కాలక్రమంలో మరింత దూరం ప్రయాణిస్తూంటాం. మన చిన్నతనంలో మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేసిన వారి గుణగణాలు, మనం పెద్దయ్యాక చూసినప్పుడు, చాలా పరిమితుల్తోనూ, వెలవెలబోతూనూ కనిపిస్తుంటాయి. కాని, మాష్టారు, నా కన్నా ఎప్పుడూ ఒక యోజనం ముందే పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వడివడిగా నడుస్తూ కనిపించేవారు. నేను కర్నూల్లో చేరగానే, రోజూ మాష్టారి దగ్గరకి వెళ్ళి, కవిత్వం చదువుకోవాలని అనుకున్నాను. రామ చరిత్ మానస్ మీద ఆయనతో మాట్లాడించుకోవాలనుకున్నాను. కాని ఆయన అప్పటికి ఆధ్యాత్మిక క్షేత్రంలోకి పూర్తిగా ప్రవేశించారు. సాధువులు, సిద్ధపురుషులు, సూఫీలు ఆయన ప్రపంచాన్ని ఆక్రమించేసారు. ఏ గుహ దగ్గరనో, ఏ దర్గా దగ్గరనో, ఏ సిద్ధభూమి దగ్గరనో కనీసం ఒకరాత్రేనా గడపాలన్న కోరిక తప్ప మరొక వ్యాపకం లేదాయనకు. ‘కర్నూలు అంటే తెలుసా! ఇక్కడ చరిత్ర పొరలు,పొరలుగా పేరుకుపోయి ఉంది’ అనేవారు. ఆ జిల్లా చరిత్రని అంతగా హృదయస్థం చేసుకున్న మనిషిని మరొకరిని ఇంతదాకా చూడలేదు. నాకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చెప్పి, నొస్సం తీసుకువెళ్ళారు. నయనాలప్ప గుడి, కోయిలకుంట్ల చూసి ఆళ్ళగడ్డ మీంచి నంద్యాల వస్తుంటే, దీబగుంట్ల అన్న ఊరు పేరు చూసి, ఇక్కడ వీరభద్ర స్వామి ఆలయం ఉండాలే అన్నారు. బండి దిగి కనుక్కుంటే,నిజంగానే ఆ ఊళ్ళో వీరభద్ర స్వామి ఆలయం ఉంది. ఆయన ఆ ఊరు అదే మొదటిసారి చూడటం. కాని, ఆ ఊరు చరిత్ర ఆయనకు కరతలామలకం. ఆ ఒక్క ఊరనే కాదు, ఆ జిల్లా మొత్తం పట్ల ఆయన పరిజ్ఞానం అట్లాంటిది.

11

నేను కర్నూల్లో ఉన్నంతకాలం ఆయనకీ, నాకూ మధ్య ఏదో ఒక విధమైన సాంగత్యం లభిస్తూనే ఉండింది. కర్నూలు జిల్లా రచయితల సంఘం కార్యక్రమాల్లో, జిల్లా గ్రంథాలయ సంస్థ సమావేశాల్లో, సంపూర్ణ అక్షరాస్యతా కార్యక్రమంలో- మా శిష్యుడు ఇక్కడ పనిచేస్తున్నాడని చెప్పుకోవడంలో ఆయనెంతో వివశత్వమనుభవించేవారు. చాలాసార్లు నాకనిపించేది, ఆయన విద్యారణ్య కన్నా నన్నే ఎక్కువ కన్నకొడుకులా చూసుకుంటున్నారా అని. ఆ రెండేళ్ళ కాలంలో ఆయన నన్ను ఒకవైపు గృహస్థాశ్రమం వైపూ, మరొకవైపు ఆధ్యాత్మిక సాధన వైపూ కూడా ఒక్కసారే నడిపించారు. నన్ను ఒక ఇంటివాణ్ణి చేయాలన్న తాపత్రయమే కాదు, నేను కర్నూలు నుంచి బదిలీ అయిపోతున్నప్పుడు, మళ్ళా కనీసం మన్ననూరు అయినా పోస్టింగు తెచ్చుకుని వచ్చెయ్యకూడదా అని చాలాసార్లే అన్నారు. ఆధ్యాత్మికంగా ఆయన ఆ రోజుల్లో ఎన్నో సాధనామార్గాల్ని స్వయంగా అన్వేషిస్తూ వచ్చారు. కాశిరెడ్డి నాయన ని కలుసుకున్నారు. బీజాపూర్ సూఫీల మీద పరిశోధన చేసారు. గజానన్ మహరాజ్, అక్కల్ కోట్ మహరాజ్, సాయినాథుడు ఆయనకు నిత్యస్ఫూర్తిగా ఉండేవారు. మహాయోగి లక్ష్మమ్మవ్వ తో సహా కర్నూలు జిల్లా సిద్ధపురుషుల గురించి ఆయన స్వయంగా తెలుసుకున్న విషయాలతో ఒక పుస్తకమే రాసారు. ఆయనతో మళ్ళా లభించిన ఆ సాంగత్యం ఈ సారి సత్సంగం గా మారింది. నా చిన్నప్పుడు నాలో సాహిత్యతృష్ణ ని ఎట్లా మేల్కొల్పారో, అట్లానే ఇప్పుడు ఆధ్యాత్మిక తృష్ణని కూడా.

12

ఆయన ఉరుకుంద వీరన్న గురించి రాసిన పుస్తకాన్ని మా మాష్టారు మల్లంపల్లి శరభయ్యగారికి పంపించాను. ఆ పుస్తకం చదివినప్పుడు, ఒక చేత క్షీరభాండమూ, మరొకచేత బెత్తమూ ధరించి బసవన్న తనని చేరవచ్చినట్టుగా అనిపించిందని శరభయ్యగారు నాకు ఉత్తరం రాసారు. హీరాలాల్ మాష్టారి వాక్యం ఎంత మహిమాన్వితమయినదో నాకప్పుడు బోధపడింది.

13

ఆశ్చర్యం కాకపోతే కర్నూల్ని వరదలు ముంచెత్తమేమిటి, ఆ వరదల్లో మాష్టారి ఇల్లు ములిగిపోవడమేమిటి. నా చిన్నతనం నుంచీ నన్ను ఊరిస్తూ వచ్చిన ఆ పుస్తకాలు (ఈ పుస్తకాలన్నీ నీకిచ్చేస్తానయ్యా, ఇందులో ఎన్నో పత్రికలు, సాహిత్యవ్యాసాలు జిరాక్సులు ఎక్కడా దొరకనివన్నీ ఉన్నాయి), ఆ భాండాగారమంతా ఆ వరదల్లో కొట్టుకుపోయింది. వరద తగ్గి మేట వేసిన మట్టి తొలగించుకుని, శుభ్రం చేసుకుని ఆయన మళ్ళా ఆ ఇంట్లో ఉండగా చూద్దామని వెళ్ళాను. అప్పటికి మాష్టారి శ్రీమతి ఈ లోకాన్ని వదిలిపెట్టి చాలాకాలమే అయ్యింది. ‘దేవుడు నా చివరి బంధాన్ని కూడా తెంపేసాడు’ అన్నారాయన వరద ఊడ్చిపట్టుకు పోయిన తన గ్రంథాలయాన్ని గుర్తు చేసుకుంటూ. ఆ మాటల్లో నిర్వేదం లేదు. అద్వితీయమైన ప్రశాంతి. ‘నీకు తెలుసా! మా అమ్మ నాకు ఇచ్చిన మహాభక్తవిజయం మాత్రం నాకు దక్కింది’ అన్నారాయన. మేటవేసిన మట్టికీ, గోడకీ మధ్యలో ఇరుక్కుపోయి ఉందట ఆ పుస్తకం. అట్టలు కట్టిపోయిన ఆ పుస్తకం పేజీలు ఒక్కొక్కటే తిప్పి చూపిస్తుంటే, ఆయన తన తల్లి చీరెకుచ్చెళ్ళను కావలించుకుని పట్టుకున్న పసిబాలుడిలా కనిపించారు.

14

మాష్టారిని ఒక్కసారేనా చూడాలని గంగారెడ్డి మరీ మరీ పట్టుబట్టడంతో రెండు సార్లు కర్నూలు వెళ్ళాం. కాని రెండు సార్లూ మాష్టార్ని కలుసుకోలేకపోయాం. మళ్ళా మూడో సారి, మరొకసారి కలవలేమేమోనన్నంత ఆతృతతో కలుసుకున్నాం. నిజంగానే ఆ తరువాత మరొకసారి కలుసుకోలేకపోయాం. కాని, ఆ చివరి సమావేశంలో ఆయన జ్ఞానేశ్వరుడి ‘అనుభవామృతం’ గురించీ, మహాదేవీ వర్మ కవిత్వం గురించీ, ఆయన ఎప్పుడూ చెప్పే, ‘వాసుదేవ మననం’ గురించీ, ‘విచారసాగరం’ గురించీ, ఎన్ని మాటలు, ఎన్ని మాటలు. గంగారెడ్డి, గుర్తుందా, మళ్ళా కలుసుకోలేమేమో, అదే చివరిసారేమో అన్నంత ఆతృతతో, ఎంత ఉద్వేగంగా, ఎంత తొందరతొందరగా మాట్లాడేరాయన!

15

పండిత హీరాలాల్ గొప్ప సాహిత్యవేత్త, చరిత్రపరిశోధకుడు, అత్యుత్తమ ఉపాధ్యాయుడు, ఆధ్యాత్మిక సాధకుడు అన్నీను. ఆయన లేని లోటు ఈ జాతికీ, ఈ భాషకీ ఇప్పట్లో పూడదు. కాని, నా సంగతి? నాకు ఆయన తల్లి, తండ్రి, స్నేహితుడు కూడా. మా అమ్మా నాన్నా ఈ లోకం వదిలివెళ్ళిపోయినప్పుడే నేనెంతో ఒంటరివాణ్ణయిపోయాను. ఇప్పుడు, మరింత కోలుకోలేనంతగా.

14-8-2016

Leave a Reply

%d bloggers like this: