సి.వి.కృష్ణారావుగారు

Reading Time: 3 minutes

47

కృష్ణారావు గారు 90 వ ఏట అడుగుపెట్టినప్పుడు నేను రాసింది చదివి మీరంతా ఎంతో ఆత్మీయంగా ప్రతిస్పందించారు. ఆ అభిమానం, ఆ స్నేహస్పందన ఆయనకు కొత్త ఉత్సాహాన్నిస్తాయనే అనుకుంటూ, ఈ సారి జూలై 3 న ఆయన 91 వ ఏట అడుగుపెట్టినప్పుడు మళ్ళా ఆయన్ను పలకరించాలనుకున్నాం. అందుకని శుక్రవారం సాయంకాలం, సోమయ్యగారూ, గంగారెడ్డీ, నేనూ కృష్ణారావుగారి ఇంటికి వెళ్ళాం.

మమ్మల్ని చూస్తూనే ఆయన చిన్నపిల్లవాడిలా లేచి కూచున్నారు. బాగా చిక్కిపోయిన ఆ దేహంలోనూ, వదనంలోనూ కూడా కొత్త ఉత్సాహమొకటి తళుకులీనడం మాకు స్పష్టంగా కనిపించింది.

ఆ తర్వాత చాలాసేపటిదాకా ఆగని కుశలప్రశ్న పరంపర. మా అక్కచెల్లెళ్ళ గురించీ,అన్నయ్యలగురించీ, బంధుమిత్రులగురించీ ఎవరెవరిగురించో అడుగుతూనే ఉన్నారు. ఆయన గురించీ,ఆయన ఆరోగ్యం గురించీ నాకు అడిగే అవకాశమే ఇవ్వకుండా. ఆ వయసులో ఆయన జ్ఞాపకశక్తి అంత నిశితంగా పనిచేస్తుండటం సంభ్రమం కలిగించింది. ఆయన వినికిడి శక్తి కూడా మునపటికన్నా మెరుగైనట్టు అనిపించింది.

మాతో మాట్లాడుతూనే మాటల మధ్యలో వాకర్ తీసుకుని నెమ్మదిగా పుస్తకాల షెల్ఫుదాకా వెళ్ళారు. ఆ పుస్తకాల మధ్యలో వేటి గురించో వెతికి, రెండు కవర్లు బయటికి తీసారు. ఒక్కొక్కటీ తెరిచి వాటిల్లోంచి శాలువాలు బయటికి తీసారు. ఒకటి సోమయ్యగారి భుజాల చుట్టూ కప్పారు. మరొకటి నా చుట్టూ కప్పి నిండుగా ఆశీర్వదించారు. ఎవరి పుట్టిన రోజు,ఎవరు ఎవరికి శుభాకాంక్షలు అందచేస్తున్నారు?

మళ్ళా కూచున్నాక, ఆయన తన మంచం పక్కనుండే రెండు పెద్ద పుస్తకాలు దగ్గరగా లాక్కున్నారు. మార్సెల్ ప్రూ రాసిన In Search of Lost Time రెండు సంపుటాలు. ‘ఈ పుస్తకం నాకు మా అమ్మాయి ఆస్ట్రేలియా నుంచి పంపించింది. చిన్న అచ్చు. చదవలేకపోతున్నాను. నువ్వు తీసుకో’ అన్నారు.

కాని ఆ ప్రచురణ నా దగ్గరా ఉంది.

‘మొత్తం కాకపోతే కొంతైనా చదవండి, నెమ్మదిగా’ అన్నాను.

‘ఏ భాగం చదవమంటావు?’ అన్నారు.

‘పుస్తకం తెరిచి మొదటి భాగం Swann’s Way చూపించాను. కాని కృష్ణారావుగారి మనస్థితి గతాన్ని తలుచుకోవడం మీదా, నెమరేసుకోవడం మీదా లేదు. ఆయన పూర్తిగా ప్రస్తుత సమయంలో, ప్రస్తుత క్షణాల్లోనే జీవిస్తున్నారు.

‘నువ్వు Language and Silence చదివావా?’ అనడిగారు. నేనా పుస్తకం పేరే వినలేదు. ఆ మాటే చెప్పాను. ఇప్పుడు తెలిసింది, అది జార్జి స్టీనర్ రాసిన వ్యాసాల సంకలనం అని.

‘మీరిచ్చిన Modernism to Postmodernism చదివేసాను. చాలా మంచి పుస్తకం. ఫ్రాయిడ్ Interpretations of Dreams చదవాలని ఉంది. పంపిస్తారా?’ అనడిగారు. ఇంతకుముందు కూడా అడిగారు. ఈ సారి మర్చిపోకుండా కొరియర్ చెయ్యాలని నాకు నేను గిల్లి చెప్పుకున్నాను.

‘మీరీమధ్య కవిత్వమేమైనా రాసారా ?’ అనడిగాను.

‘కవిత్వమా?’ అని సగం ఆలోచనతో కూడిన చిరునవ్వు నవ్వారు. ‘అదిగో ఆ పుస్తకం తియ్యండి’ అన్నారు, పుస్తకాల షెల్ఫు వైపు చూపిస్తూ. అదొక డైరీ.

దానిలో రెండు పేజీలు వెతికి మడత పెట్టి నాకిచ్చారు, చదవమని. ఒకటి శివలెంక రాజేశ్వరీ దేవి మీద రాసిన కవిత. ఇద్దరూ జగ్గయ్యపేట కి చెందిన వాళ్ళే. కానీ, ఇద్దరూ ఈ లోకానికి చెందిన మనుషులు కారు. ఆ చెల్లెలి కోసం ఆయన రాసిన వాక్యాలు -వాటిని మామూలుగా చదువుకుంటూ పోవడం కష్టం.

‘మరొక కవిత రాసాను గానీ నాకే అర్థం కాలేదు’ అన్నారు. అది కూడా చదివాను. ఒక చిత్రకారుడు 91 వ ఏట బొమ్మ గీస్తే మనకి అర్థమవుతుందా లేదా అని ఆలోచిస్తాడా? తన అంతరంగాన్ని తనకు తాను తేటపరుచుకోవడం కోసం రాసుకున్న వాక్యాలవి.

‘ఈ మధ్య నేను బైరాగి ఆగమగీతి పూర్తిగా చదివాను. గొప్ప కవిత్వం’ అన్నారు. మాతో పాటు ఆదిత్య కూడా ఉండిఉంటే ఎంత బాగుండేది అనుకున్నాం.

మేం మాట్లాడుకుంటూ ఉండగానే వాళ్ళబ్బాయి రెండు పుస్తకాల పార్సెళ్ళు తెచ్చి టీపాయి మీద పెట్టాడు. వాటిని ఆయన చూసి పక్కనపెట్టారు, కాని ఆయన మనసు వాటిచుట్టూతానే ఉందనిపించి గంగారెడ్డి ఆ పార్సెళ్ళు విప్పాడు.

ఒకటి, నెల్లూరు నుంచి అల్లు భాస్కరరెడ్డిగారు పంపిన రెండు పుస్తకాలు, శ్రీ వెంకయ్యస్వామి జీవితచరిత్ర, రెండవది తావో తె చింగ్ కు ఆయన చేసిన తెలుగు అనువాదం. మరొక పార్సెల్లో, నాగరాజు రామస్వామిగారి నాలుగు పుస్తకాలు.

‘నిన్ననో, మొన్ననో కాసుల ప్రతాపరెడ్డిగారు వచ్చారు, రెండు పుస్తకాలిచ్చారు’ అని కృష్ణారావుగారి శ్రీమతి చెప్పారు. తానూ, బైరెడ్డి కృష్ణారెడ్డిగారూ కృష్ణారావుగారిని వెళ్ళి చూసామనీ, మాట్లాడామనీ ప్రతాపరెడ్డి ఆ రోజే నాకో మెసేజి పెట్టాడు. ‘వినయ భూషణ్ అనే ఆయన కూడా ఫోన్ చేసారు, అడ్రస్ అడిగారు’ అన్నారు కృష్ణారావు గారి శ్రీమతి.

ఒకరూ, ఇద్దరూనా,కొన్ని వందలమంది రోజూ వచ్చి చూడవలసిన మనిషికాదూ ఈయన!

ఆ డైరీ తిరగేసాను. అందులో అక్కడక్కడ కొన్ని విశేషాలు క్లుప్తంగా నమోదు చేసుకున్నారు గానీ, ఎక్కువ పేపర్ కటింగ్స్ అంటించిపెట్టుకున్నారు. అనేక విషయాల మీద, ఎవరో హైస్కూలు విద్యార్థి ప్రాజెక్టు వర్కు పుస్తకంలా ఉందది.

‘మీ గురించి మాట్లాడండి, మిమ్మల్ని విందామని వచ్చాను’ అని రాసాను కాగితం మీద.

‘నా గురించా ‘నవ్వేసారాయన. ‘నా గురించి చెప్పుకోవడానికేమీ లేదు. వెయిట్ చేస్తున్నాను’ అంతే. అన్నారు.

‘ఈ మధ్య కఠోపనిషత్తు చదివాను. అదంతా మృత్యువు గురించే’ అన్నారు. అవును, ఆ ఛాయ ఆయన రాజేశ్వరి గురించి రాసిన కవితలో కనిపించింది. ఆ కవితలో ఆయన రాజేశ్వరిని నచికేతుడితో పోల్చారు.

ఆయన జ్ఞాపకాల్లో జీవించడం లేదనీ, గంగారెడ్డి చెప్పినట్లుగా, ఏ రోజు లెక్క ఆ రోజుకే ముగించేస్తూ, తన మనసునీ, జీవితాన్నీ కూడా ఖాళీగా పెట్టుకుంటున్నారనీ అర్థమయింది. కానీ, ఆ విలువైన అనుభవాలు, ఆ జ్ఞాపకాలు?

వారి శ్రీమతి చెప్తునారు, ఆ మధ్య భారత ప్రభుత్వ పూర్వ కార్యదర్శి కె.ఆర్.వేణుగోపాల్ గారూ, పొత్తూరి వెంకటేశ్వర రావు గారూ ఆయన్ను కలవడానికి వచ్చినప్పుడు, వేణుగోపాల్ గారు తానూ, కృష్ణారావుగారూ ఉన్న ఫొటోలు తీసుకొచ్చి చూపించారని. ఎవరు చెయ్యగలిగిందైనా, చెయ్యవలసిందైనా అంతే కదా, కృష్ణారావుగారితో తమ జ్ఞాపకాలు పంచుకోవడమే.

వేణుగోపాల్ గారు తనకు రాసిన ఉత్తరాలు చూపించారొకసారి. తన కింద పనిచేసిన ఒక ఉద్యోగికి ఏ ఐ.ఏ.ఎస్ ఆఫీసరూ అటువంటి ఉత్తరాలు రాసి ఉండడు. కాని ఆయన్ను తమ కింద ఉద్యోగిగా ఎవరు చూసారని? ఎన్ టి ఆర్ పాలనలో 55 ఏళ్ళ రిటైర్మెంటులో కృష్ణారావుగారు రిటైర్ అయి, మళ్ళా అందరితో పాటు కోర్టు తీర్పు వల్ల పునర్నియామకానికి అర్హులయ్యేటప్పటికి ఆయనకు 58 ఏళ్ళు వచ్చేసాయి. అప్పుడు శంకరన్ గారు ఆయన్ని వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ డైరక్టరుగా నోషనల్ గా ప్రమోట్ చేసి మరీ రిటైర్మెంటు ఆర్డరు ఇచ్చారు. ఆయన చేసిన సేవలకు ప్రభుత్వం ఆ చిన్న సహాయం కూడా చేయకపోతే ఎలా అనుకున్నారే తప్ప శంకరన్ గారు తాను కృష్ణారావుగారికేదో మేలు చేసాననుకోలేదు.

కృష్ణారావుగారి శ్రీమతి చెప్తున్నారు, ఆయన కరీంనగర్ జిల్లాలో పనిచేసినప్పుడు బొర్నపల్లి అనే ఊళ్ళో దళితులకి ఇళ్ళు కట్టించే కార్యక్రమం ఆయనకి అప్పగించారట. అయిదారు నెలలు పట్టిన పని. ఆ కాలమంతా తమ ఇంట్లో ఉండమని ఆ గ్రామంలో భూస్వామి ఒకరు ఆయన్ని ఆహ్వానించేరట. కాని ఆయన తన శ్రీమతితో కలిసి ఆ దళితవాడలోనే ఒక గుడిసెలోనే కాపురం చేసేరట. నులకమంచం, మూడురాళ్ళ పొయ్యి-అవి ఆమెకి గుర్తున్నాయి, ఆయనకి గుర్తున్నాయో లేదో, కాని ఆయన దృష్టి తన జయాపజయాల్ని దాటి మరింత ఊర్ధ్వముఖమైపోయింది.

ఈశోపనిషత్కారుడు ‘కృతం స్మర, గతం స్మర’ అన్నాడు.

‘ఏమిటి చేసావు నీవు మానవుడా’ అనడిగాడు బైరాగి.

తానేమి చేసాడో, ఏమి చెయ్యలేకపోయాడో-కృష్ణారావుగారికి ఆ ధ్యాస లేదు, బహుశా తానేమి చదివాడో, ఏది చదవలేకపోయాడో తలుచుకుంటూ ఉండవచ్చు. కాని అంతకన్నా కూడా- ఇతరులు ఏమి రాసారో, ఏమి రాయలేకపోయారో-దాని గురించే ఆయన చింత.

‘మీ సత్యాన్వేషణ ఏదైనా యూనివెర్సిటీ లో పాఠ్యగ్రంథంగా పెట్టారా?’ అనడిగారు.

‘మీ ఆత్మదర్శనం మొదలుపెట్టారా? పూర్తయిందా?’

ఎన్నాళ్ళకిందటనో అనుకుని పక్కన పెట్టేసిన ప్రాజెక్టు, ఆయన అడిగినందుకైనా మళ్ళా మొదలుపెట్టాలనిపించింది.

సోమయ్యగారితో ‘మీ అల్లుడు (ప్రసిద్ధ మనస్తత్వశాస్త్రవేత్త, చింతనాశీలి మైకేల్ మయోవిచ్) కొత్తగా ఏమి రాస్తున్నాడు?’ అనడిగారు.

బహుశా మనం రోజూ కలవవలసింది, చూడవలసింది, మాట్లాడుకోవలసిది అట్లాంటి వాళ్ళతో, బహుశా అప్పుడే జీవితం మరికొంత ప్రయోజనకరంగా మారుతుందేమో.

కాని, దురదృష్టమేమిటంటే, అట్లాంటివాళ్ళని ఎప్పుడో ఏడాదికొక్కసారి మాత్రమే కలుసుకోగలగడం.

కాని ఆ అదృష్టమైనా మరికొన్నేళ్ళ పాటు కలిగితే, అంతకన్నా కోరవలసిందేముంది?

12-7-2016

Leave a Reply

%d bloggers like this: