శివలెంక రాజేశ్వరీదేవి

Reading Time: 3 minutes

51

శివలెంక రాజేశ్వరీదేవి కవితాసంపుటి ‘సత్యం వద్దు, స్వప్నమే కావాలి’ (2016)కి ఈ ఏడాది ఇస్మాయిల్ కవిత్వ పురస్కారం ప్రకటించారు. ఆదివారం సాయంకాలం కాకినాడలో ఇస్మాయిల్ మిత్రమండలి ఏర్పాటు చేసిన ఆ పురస్కార సభకి అధ్యక్షత వహించేను. కాకినాడ రోటరీ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన ఆ సభలో ఇస్మాయిల్ గారి కవిత్వంగురించి డా.కాళ్లకూరి శైలజగారు, ఆయన సాహిత్యవ్యాసాల గురించి ‘చినుకు’ పత్రికా సంపాదకులు నండూరిరాజగోపాల్ గారు మాట్లాడేరు. పురస్కారం పొందిన పుస్తకం గురించి, ఆ కవిగురించి మాట్లాడే బాధ్యత నాకు అప్పగించారు.

ఎంత కఠినమైన బాధ్యత!

నిన్నటిదాకా నీ తో మాట్లాడుతున్న మనిషిని ఇంక నువ్వెప్పటికీ చూడలేవని తెలిసినతర్వాత ఆ మనిషి గురించి తలుచుకోవడం, మాట్లాడటం అన్నిటికన్నా కష్టమైన పని. అట్లాంటి మనుషుల జీవితేచ్ఛ మరింత బలమైంది అయినప్పుడు, ఈ లోకంతోనూ, ఈ మనుషుల్తోనూ, ఈ సూర్యాస్తమయాలూ, ఇక్కడి కవిత్వాలతోనూ వాళ్ళు గాఢంగా పెనవైచుకోవడం నువ్వు కళ్ళారా చూసి ఉన్నాక, ఇప్పుడు, వాళ్ళు లేరు, నువ్వున్నావు, వాళ్ళ గురించి మాట్లాడటానికి లేచి నిల్చున్నావనుకో, ఒక మహేష్, ఒక కవితా ప్రసాద్, ఒక భూషణం, ఒక సావిత్రిగారు, ఒక రాజేశ్వరీదేవి-బహుశా నా జీవితంలో ఎట్లా ఎదుర్కోవాలో తెలియని అత్యంత సున్నితమైన క్షణాలవే.

ఆ అదివారం కూడా.

1986 లో నా ‘నిర్వికల్ప సంగీతం’ పుస్తకం, ఆమెకెట్లా చేరిందో (బహుశా మోహన ప్రసాద్ గారు ఇచ్చి ఉండాలి) అప్పుడు ప్రవేశించింది రాజేశ్వరి నా జీవితంలోకి. 25 ఏప్రిల్ 2015 న ఈ లోకం నుంచి నక్షత్రలోకానికి వెళ్ళిపోయేదాకా, కొన్నిసార్లు కంటి ఎదట జ్వలిస్తున్న దీపంలాగా, చాలాసార్లు తడిమబ్బులవెనక చిక్కుకున్న మసకచంద్రకాంతిలాగా.

వాళ్ళు జీవించిఉండగా వాళ్ళ విలువ తెలియక, వాళ్ళు మన కళ్ళముందరి నుంచి తప్పుకోగానే, వాళ్ళెంత అమూల్యమైన వాళ్ళో తెలిసేది ముందు మన తల్లిదండ్రుల విషయంలో. ఆ తర్వాత ఇట్లాంటి వాళ్ళు ఒకరిద్దరి విషయంలో.

నా దురదృష్టమేమిటోగాని, నా చిన్న జీవితంలో నా హృదయానికి చేరువగా రాగలిగినవాళ్ళే తక్కువ, ఆ వచ్చిన కొద్దిమందీ కూడా నా జీవితానికి అనుగ్రహించింది ఆ కొన్ని సాయంకాలాలు, ఆ కొన్ని సమావేశాలూ, ఆ కొన్ని ఫోన్ కాల్స్ మాత్రమేనని వాళ్ళు వెళ్ళిపోయాకే తెలుసుకోవలసి రావడం.

… she always spoke softly
gentle and quiet, an excellent thing in a woman

రాజేశ్వరి వెళ్ళిపోవడంతో నేనొక్కసారిగా వృద్ధుణ్ణైపోయానని అర్థమయింది.

ఇప్పుడు ఆమె కవిత్వం గురించి మాట్లాడాలి.

రాజేశ్వరి కవినా?

అవును, పాల్కురికి సోమన, బమ్మెర పోతన కవులైతే, రాజేశ్వరి కూడా కవినే. కాని, సోమన, పోతన ఈశ్వరుణ్ణి నమ్ముకుని కవిత్వం చెప్పారు. నీ జీవితంలో మానవుడు తప్ప మరే ఈశ్వరుడూ లేకపోతే, ఆ అస్థిరమైన, చంచలమైన, బలహీనమైన మానవీయ ఉపాధిని పట్టుకునే జీవితం పట్ల నీ నమ్మకాన్ని, passion ని, వెర్రి ప్రేమని మహాపారవశ్యంతో నువ్వు ప్రకటించవలసి ఉంటే, అప్పుడు బహుశా రాజేశ్వరిని పోల్చడానికి తెలుగు సాహిత్యంలో ఒక వేమన, ఒక గురజాడ, ఒక కాళోజి, ఒక రేవతీదేవి, అంతే.

ఈ వాక్యాలు పలికిన మనిషిని కవి అనాలా లేక అన్నిటికన్నా ముందు నిజమైన మనిషి అనాలా?

‘హృదయాన్ని వొంపి
ఎవరూ మాట్లాడటం లేదెందుకని?
అందరూ
మస్తిష్కంతో మాట్లాడుతున్నారెందుకని?’

‘నేను కవిత్వాన్ని చదివి
కరుడుకట్టాను కనుక బతికి ఉన్నాను ‘

‘ఎంత కఠినత చవిచూసినా
ఎద కరగటం మానలేదు
ఎదలో కన్నీటి కడలి
వున్నది కాబోలు!’

తమ పిల్లల అవసరాల్ని కూడా పక్కన పెట్టి, పుస్తకాలు ప్రచురించుకుని, వాటికి ముందుమాటలు రాయించుకుని, అట్టహాసంగా ఆవిష్కరణ సభలు పెట్టుకుని, ఆ తర్వాత సమీక్షలకు పంపించి, ఆ తర్వాత అవార్డులకోసం పంపించుకుంటూ, ఎవరైనా తమ కవిత్వంలోంచి ఒక్కమాటైనా ప్రస్తావించినరోజు పట్టలేనంతగా పొంగిపోతూ,తన గురించి ఎవరూ ఆసక్తి చూపించరేమని కుంగిపోతూ ఉండే కవులు ఒక తరగతి. వాళ్ళకి కవిత్వం ఒక career, తీరికసమయపు వ్యాపకంగా మొదలై, వ్యసనంగా పరిణమించి, వాళ్ళని తమకీ, సమాజానికీ కూడా కాకుండా చేసే ఒక ప్రక్రియ.

కాని, మరొక తరగతి ఉన్నారు, తమ ‘కోమల కావ్య కన్యక’ ను అపురూపంగా చూసుకునేవాళ్ళు, ఒకరిద్దరైనా. వాళ్ళకి కవిత్వం ఒక article of faith, highest form of morality. అత్యున్నత మానసిక సంస్కారం. జీవితంలో ఎక్కడా రాజీపడకుండా చేసే ఒంటరి పోరాటం. వాళ్ళకి కవిత్వం character, శీలం, నడవడి, చరిత్ర.

రాజేశ్వరి రెండవ కోవకి చెందిన కవి అని నేను చెప్పనక్కర్లేదు, ఈ మాటలే చెప్తున్నాయి:

‘ఏడాదికొకసారైనా యాంత్రికం కాక
స్వప్నాలకీ సత్యాలకీ మధ్య తెరలు తొలగించకపోతే ఎలా
అది మోహమైనా కళయినా
సత్యమైనా, స్వప్నమైనా
పారిజాత పొన్నల పొగడ పరిమళాలమీంచి
నిరర్థక ప్రయాణమైనా సరే-
ప్రయాణించకపోతే అస్తిత్వ నిరూపణ ఎలా ‘

Between the idea
And the reality
between the motion
And the act
Falls the shadow

అన్నాడు ఆధునిక కవి.

ఆ నీడని చెరిపివెయ్యగల మహాబలశాలురు జీవితంలోనూ, సాహిత్యంలోనూ కూడా చాలా చాలా అరుదుగా కనిపిస్తారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో, బహుశా ఒక గురజాడ, ఒక చలం, ఒక పాణిగ్రాహి, ఒక బైరాగి, ఒక ‘శారద’. నా కళ్ళతో నేను చూసినవాళ్ళల్లో ఒక సావిత్రిగారు, ఒక రాజేశ్వరి.

మనం మాట్లాడుతున్న మహనీయ ఆదర్శాల ప్రకారం మనమెందుకు జీవించలేం అనేది ఒక నిర్మలమైన ప్రశ్న. ఎంతో అమాయికంగా వినిపించే ఆ ప్రశ్న చాలా పదునైనది కూడా. ఆ ప్రశ్న వేసుకున్న మనిషి ఒక తీక్ష్ణఖడ్గాన్ని కౌగిలించుకున్నట్టే.

అట్లా తమనొక రంపానికి అర్పించుకుని తుత్తునియలయ్యే వారి ఆత్మతేజోద్యుతిముందు మనం మామూలుగా మసలలేం. మనం పనిచేసుకుంటూంటే, మన వొళ్ళో వాలి మారాం చేసే పసిపిల్లలు మనల్ని పనిచేసుకోనివ్వట్లేదనే అనుకుంటాం.పని చేసుకుంటూనే, మారాం చేసే పిల్లని పక్కకు నెట్టకుండా ఉండగలిగేది ఒక్క తల్లి మాత్రమే.

నేనొక తల్లినై ఉండి ఉంటే, బహుశా రాజేశ్వరిని సముదాయించుకోగలిగి ఉండేవాణ్ణి, సంబాళించుకోగలిగి ఉండేవాణ్ణి. కాని, ఆమె నాలాంటి, నీలాంటి అర్భకులకందరికీ తల్లిగానే బతికింది, అందుకనే ఇట్లా అనగలిగింది:

‘అమ్మనై స్నేహితనై ఆ కొమ్మల్లో వలస వచ్చిన పక్షినై
ఒక జోలపాట పాడుతున్నాను ‘

అంతేకాదు, నిన్ను జీవితకాలం వెంటాడే ఈ వాక్యం కూడా:

‘నీ కోసం
మళ్ళీ పుట్టిపెరగాలనుంది ‘

‘ఏదో ప్రచ్ఛాయ నన్ను వెంటాడుతోంది ‘అని రాసుకుందామె. అదేమిటై ఉండవచ్చు?

‘జీవితం ఒక్క సోక్రటీస్ ని మాత్రమే
విషపాత్రికతో గౌరవిస్తుంది ‘

అని రాసాడు పల్లవ హనుమయ్యగారనే ఒక మహనీయుడు.

జీవితం ఒక్క రాజేశ్వరిని మాత్రమే కన్నీటితో గౌరవించింది. అందుకే ఆమె ‘నా కన్నీరు నన్ను స్వచ్ఛంగా ఉంచుంతుంది’ అని చెప్పగలిగింది. ఇంకా ఇలా కూడా అనుకుంది:

‘ఏది ఏమయినా నేనివాళ
కన్నీరింకిపోయిన మోడుని కాకూడదు
కన్నీరు ద్వేషంగా విషపూరితం కాకుండా
పాటని ఆసరా చేసుకుంటాను ‘

ఆమెకీ, నాకూ, ఆమెకీ, తక్కిన కవులకీ,ఆమెకీ, ప్రపంచానికీ ఉన్న అనుబంధం personal తప్ప private కాదు. ఒకప్పుడు సుప్రసిద్ధ ఫ్రెంచి రచయిత, ఫ్లాబే అన్నాడట, యోగులు పరస్పరం ఈశ్వరుడిలో కలుసుకున్నట్టు, మనం కళాకారులం కళద్వారా ఒక్కటవుతాం అని. రాజేశ్వరి కవితద్వారా మాత్రమే లోకంతో ఒక్కటవ్వాలనుకుంది.

‘వొదలలేని భావోద్వేగంలో
ఏదో అనుకుంటానుగానీ
తీరా కవిత వినా నీవు నీవు కాదని
కవిత వినా నాకేం కావని అర్థమవుతుంది ‘

అవును, ఆమెకి చాలా స్పష్టంగా తెలుసు:

‘కవిత అంటే
నువ్వనీ కాదు
నేననీ కాదు
ఎవరనీ కాదు
ఒకానొక అపురూపమైన భావన.’

ఆ రోజు లేచి నిలబడి మాట్లాడటానికి నాకు శక్తినిచ్చిన భావన ఒక్కటే. ‘నలుగురు కూచుని నవ్వే వేళల’ ఆమె పేరొక తరి తలుచుకుంటే ఆమె సంతోషిస్తుందన్నదే.

ఇస్మాయిల్ గురజాడసమానుడు, రాజేశ్వరి పుత్తడిబొమ్మ పూర్ణమ్మ.

30-12-2016

Leave a Reply

%d bloggers like this: