లొరైన్ హాన్స్ బెర్రీ

Reading Time: 3 minutes

99

మా మాష్టారు రాసిన ఒక పద్యంలో ‘పునర్యానం’ అనే పదం వాడితే, నేనా పదం తీసుకుని ఒక కావ్యం రాసాను. ఆ పుస్తకం ఆవిష్కరిస్తో మా మాష్టారు కవిత్వానికి multiply అయ్యే గుణముంటుందనీ, వాల్మీకి ఎక్కడో బాలకాండలో వాడిన ఒక పదబంధం తీసుకుని కాళిదాసు కుమారసంభవమనే కావ్యం రాసాడనీ అన్నారు.

డన్ బార్ I know why the caged bird sings అని కవిత రాస్తే, మాయా ఏంజిలొ ఆ వాక్యం తీసుకుని, తన ఆత్మకథ రాసుకుంది. అట్లానే, లాంగ్ స్టన్ హ్యూస్ What happens to a dream deferred (1951) అనే కవిత రాస్తూ, అందులో వాడిన ఒక ప్రయోగం A raisin in the sun తీసుకుని, లొరైన్ హాన్స్ బెరీ అనే రచయిత్రి ఒక నాటకమే రాసింది.

లొరైన్ హాన్స్ బెర్రీ (1930-65) రాసిన A Raisin in the Sun (1959) ఆఫ్రికన్-అమెరికన్ రంగస్థలంలో విప్లవాత్మకమైన మలుపు. అతికష్టమ్మీద ప్రదర్శించిన ఆ నాటకం మొదటివిడతలోనే 500 కి పైగా ప్రదర్శనలకి నోచుకోవడమే కాక, ఆ రచయిత్రికి న్యూయార్క్ రంగస్థల విమర్శకుల పురస్కారం కూడా లభించింది. అటువంటి పురస్కారానికి నోచుకున్న మొదటి ఆఫ్రికన్-అమెరికన్ రచయిత్రి ఆమెనే.

చారిత్రికంగానూ, సామాజికంగానూ అరుదైన ఆ సంఘటన, అన్నిటికన్నాముందు, రెండువందలేళ్ళ అమెరికన్ సంప్రదాయ రంగస్థలం నల్లజాతివాళ్ళకు చేస్తూ వచ్చిన అన్యాయం మీద సాధించిన విజయం. అప్పటికి నూటయాభై ఏళ్ళకు పైగా అమెరికన్ నాటక కర్తలు, అగ్రశ్రేణి రచయితలతో సహా, నీగ్రోని ఒక మూర్ఖుడిగా, వెకిలిమనిషిగా, అనాగరికుడిగా, మడ్డిమనిషిగా, నేరస్థుడిగా చిత్రిస్తూ రావడం మీద తిరుగుబాటు అది. ముఖ్యం, నీగ్రో భాషనీ, యాసనీ హాస్యాస్పదంగా చిత్రించడం మీద ధిక్కారం అది.

కాని లొరైన్ హాన్స్ బెర్రీతోటే ఆఫ్రికన్-అమెరికన్ రంగస్థల ప్రయాణం మొదలుకాలేదు. The Roots of African-American Drama (1991) అనే సంకలనానికి అద్భుతమైన ముందుమాట రాస్తూ, జేమ్స్ వి.హేచ్ అనే విద్వాంసుడు, సంప్రదాయ అమెరికన్ రంగస్థలాన్ని ప్రశ్నిస్తూ హ్యూస్ A Note on Commercial Theater (1949) కవిత రాయడానికన్నా కనీసం పాతికేళ్ళముందే డుబ్వా క్రిగ్వాలనే నల్లజాతి నాటకబృందాల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడని రాసాడు. ‘నీగ్రోలగురించి, నీగ్రోలకోసం, నీగ్రోలతో, నీగ్రోలకు దగ్గరగా నాటకాలు ప్రదర్శించడం’ ఆ బృందాల ఉద్దేశ్యమనీ రాసాడు.

అయితే, హాన్స్ బెర్రీ రాసిన నాటకం ప్రత్యేకత ఎక్కడుందంటే, అది కేవలం నల్లజాతి ఐడెంటికీ సంబంధించిన ప్రశ్నల్ని చర్చించడంతోటే ఆగిపోకుండా, జీవనచిత్రణలో ఒక సార్వజనీనతను సాధించగలగడంలో. దాని వెనక కూడా హ్యూస్ స్ఫూర్తి ఉందని చెప్పాలి.

తాను తెల్లజాతి రచయితలాగా రచనలు చెయ్యడమెట్లానో చెప్పమని ఒక నీగ్రో యువకుడు తనని అడిగితే అతణ్ణి తీవ్రంగా మందలిస్తూ హ్యూస్ 1926 లో The Negro and the Racial Mountain అనే ఒక వ్యాసం రాసాడు. తెల్లరచయితగా రాయాలనే కోరిక వెనక, తెల్లవాడిలా బతకాలనే అవ్యక్తకాంక్ష ఉందని హెచ్చరించాడు. అయితే ఆ ప్రశ్నమీద హ్యూస్ ఆ తర్వాత మరొక ముప్పై ఏళ్ళ పాటు ఆలోచిస్తూనే ఉన్నాడు. బహుశా, ఆ యువ రచయిత తెల్లవాడిలాగా రాయడమెలా అని కాదు, అసలు మంచి రచయితగా రచనలు చెయ్యడమెలా అని అడిగి ఉండవలసిందని హ్యూస్ భావించాడు. అందుకని 1959 లో, Writers: Black and White అనే వ్యాసం మొదలుపెడుతూనే ‘నువ్వు నల్లజాతివాడివైతే చాలు, చెత్త రాసి కూడా చలామణి చెయ్యగలిగే రోజులొకప్పుడుండేవి. తెల్లవాళ్ళకన్న ఒకింత సులువుగానే నీ రచనలు అమ్ముడుపోయేవి. కాని, ఇప్పుడా రోజులు గడిచిపోయాయి. కేవలం తన నెగ్రిట్యూడ్ వల్లనే, ఒక నీగ్రో, రచయితగా నెగ్గుకురావడమనేది ఇప్పుడు పూర్తిగా గతించిపోయిన విషయం’ అని రాసాడు.

అతడింకా ఇలా రాసాడు:

‘ డుబోస్ హేవర్డ్ ని చూడండి, అతడు అన్నిటికన్నా ముందు ఒక రచయిత, ఆ తరవాతే తెల్లవాడు. మీరు కూడా ఇలానే కావాలి. ముందు రచయితలుగా, తర్వాత, నల్లజాతివాళ్ళుగా. దానర్థం మీ నల్లజాతి ఐడెంటిటీని మీరు కోల్పోవలసి ఉంటుందని కాదు. నిజమైన కళ, ఎప్పుడైనా, ఎక్కడైనా సరే దేశాన్నీ, జాతినీ, జాతీయతనీ దాటిపోతుంది, అక్కడ రంగు వెనక్కిపోతుంది. నువ్వు నిజంగా మంచి రచయితవి కాగలిగితే, అప్పుడు పాఠకులకి, తెలుపుతోనూ, నలుపుతోనూ నిమిత్తమే ఉండదు…నీగ్రో రచయితలకి నేనిచ్చే సలహా ఇదే. ఒక్కసారి మీనుంచి మీరు కొంచెం ఎడంగా జరిగి మిమ్మల్ని మీరు వెనుతిరిగి చూసుకోండి-మీరెంత మానవీయంగా ఉన్నారో, అదేసమయంలో మీ నల్లజాతిలక్షణాలతో మీరెంత అందంగా ఉన్నారో కూడా తెలుస్తుంది. మానవాళితో ఒక్కటైన తర్వాత కూడా మీ నల్లదనంలో మీరెంత శోభాయమానంగా ఉన్నారో గ్రహిస్తారు.’

హాన్స్ బెర్రీ నాటకం ఈ ఆకాంక్షని పూర్తిగా నెరవేర్చింది.

కథావస్తువు 1950 ల్లో చికాగో దక్షిణ ప్రాంతంలో జీవించిన ఒక ఆఫ్రికన్-అమెరికన్ కార్మిక కుటుంబానికి సంబంధించింది. కుటుంబ పెద్ద, యంగర్ల కుటుంబానికి చెందిన పెద్ద యంగర్ చనిపోవడంతో అతడి ఇన్సూరెన్సు చెక్కు పదివేల డాలర్లు అతడి భార్యకి చేరుతుంది. ఆమె కొడుకు వాల్టర్ లీ కారు డ్రైవరుగా పనిచేస్తుంటాడు. ఆ ఇన్సూరెన్సు డబ్బుతో మదుపు పెట్టి వ్యాపారం చేసి పైకిరావాలని అతడి కల. అతడి చెల్లెలు బెణేతా కళాశాల విద్యార్థి. తన చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులు మారి నల్లజాతివాళ్ళకి మంచిజీవితం రావటమెట్లా అన్నది ఆమె ఆలోచన. ఈలోపు వాల్టర్ లీ భార్య రూత్, గర్భవతి. ఆమెకి అప్పటికే ఒక కొడుకు ఉన్నాడు. ఈ బీదరికంలో మరొక సంతానాన్ని స్వాగతించలేక అబార్షను చేయించుకుందామనుకుంటుంది. కుటుంబ పెద్ద, మరణించిన కార్మికుడి భార్య, వాల్టర్ లీ తల్లి ఆలోచనలు మరోలా ఉన్నాయి. ఆ డబ్బులో కొంత పెట్టి తన కూతుర్ని మెడిసిన్ చదివించాలనుకుంటుంది. అలాగే తమ కుటుంబమంతా మరింత మెరుగైన ఇంట్లో ఉండాలన్న ఉద్దేశ్యంతో తెల్లవాళ్ళు నివసించే పరిసరాల్లో ఒక ఇల్లు బేరమాడుతుంది. కాని, ఆ కాలనీ అసోసియేషన్ కి చెందిన పెద్దమనిషి ఒకాయన వాళ్ళని కలిసి, ఒక నల్లజాతి కుటుంబం తెల్లజాతివాళ్ళ కాలనీలోకి రావడంలో ఇరుపక్షాలకీ ఇబ్బంది తప్పదనీ, అందుకని,ఆ కుటుంబం గాని ఆ ఇంటిని అమ్మేయదలచుకుంటే, తాము మరింత హెచ్చు మొత్తం వేసి ఆ ఇంటిని కొనుక్కుంటామనీ ప్రతిపాదిస్తాడు. ఈ వ్యవహారమిట్లా సాగుతుండగా, వాల్టర్ లీ ఆ సొమ్ము తీసుకుపోయి ఒకడి చేతిలో పెడతాడు. వాడా సొమ్ము పట్టుకుని ఉడాయించేస్తాడు. ఇల్లు మారడానికి సిద్ధంగా ఉన్న ఆ కుటుంబానికేమి చేయాలో పాలుపోదు. కాని, ఆ హఠాత్పరిణామాలు వాల్టర్ లీని వాస్తవప్రపంచంలోకి తీసుకొస్తాయి. తామెంతటి కష్టాలకు గురికానీ, తామెక్కడుండాలో నిర్ణయించే హక్కు మరొకరికి లేదనీ, కాబట్టి ఆ కొత్త ఇంటికి మారడానికే సిద్ధపడతారు.

హాన్స్ బెర్రీ నాటకం ఏకకాలంలో ఒక నల్లజాతి కథ, ప్రపంచంలో ఎక్కడ, ఏ కుటుంబమైనా తమని తాము అందులో పోల్చుకోగలిగే కథ. ఆ కథలో ఆమె అమెరికాలో ఆఫ్రికన్-అమెరికన్లు ఎదుర్కుంటున్న ముఖ్యమైన సమస్యలన్నిటినీ, నిరాశ్రయత్వం, పీడన, అవమానం -అన్నింటినీ చిత్రించింది. కాని అదే సమయంలో, శుభ్రమైన గాలీ వెలుతురూ వచ్చే ఇంటికోసం కలగనడం, భరించలేని బీదరికంలో గర్భం దాల్చినప్పుడు, ఆ బిడ్డకి జన్మనివ్వాలా వద్దా అన్న సమస్య, జీవితం ఇరుగ్గా మారినప్పుడు అత్తాకోడళ్ళు, భార్యాభర్తలు, అన్నాచెల్లెళ్ళు, తల్లీకొడుకుల సంబంధాల్లో తలెత్తే వేదన లాంటివన్నీ ఎంతో సహజంగానూ, స్వాభావికంగానూ చిత్రీకరించబడటంతో- ఆ నాటకం దేశకాలాలకి అతీతమైన అజరామర కృతిగా మారిపోయింది. తన రచన ఏకకాలంలో స్థానికంగానూ, సార్వత్రికంగానూ స్ఫురించడం కన్నా ఏ రచయితైనా కోరుకునేదేముంటుంది?

20-2-2018

Leave a Reply

%d bloggers like this: