శ్యామలానగర్ మొదటిలైన్లో మూడవ ఇల్లు, వానజల్లు మధ్య ఇంట్లో అడుగుపెడుతూనే రాలుతున్న పారిజాతాలు పలకరించాయి. అత్యంత సుకుమారమైన జీవితానుభవమేదో నాకు పరిచయం కాబోతున్నదనిపించింది.
ఎనభై ఏళ్ళ వయసులో మోకాళ్ళ నొప్పుల్తో నా కోసం వీథి చివరిదాకా వచ్చి మరీ నన్ను ఇంటికి తీసుకువెళ్ళిన ఆ పెద్దమనిషి జవంగుల వెంకటేశ్వరరావుగారు. కొన్ని నెలలకిందట ఎక్కడో నా నంబరు సంపాదించి నాకు ఫోన్ చేసారు. మల్లంపల్లి శరభయ్యగారు తన గురువుఅని చెప్పుకోగానే నేను అడిగిన మొదటి ప్రశ్న ‘ఆయన వ్యాసాలు గాని ఉత్తరాలు గాని మీ దగ్గరేమన్నా ఉన్నాయా?’ అని. వ్యాసాలు లేవుగాని, ఆయన కల్పవృక్షం మీద రాసుకున్న మార్జినల్ నోట్సు లాంటిదేదో ఉందన్నట్లుగా ఆయన నాతో అన్నారు.
మాష్టారి సాహిత్యానుశీలన పుస్తకంగా తేవాలని, ఇంతదాకా నాకు లభ్యమైన వ్యాసాలన్నీ కంపోజ్ చేయించాను. మరికొన్ని వ్యాసాలు, ఉత్తరాలు కావాలి, ఆ నోట్సు కూడా ఆ పుస్తకంలో చేర్చవచ్చేమో అనుకున్నాను. విజయవాడ వచ్చిన మూడు నెలలుగా చాలాసార్లు ఆయన్ని కలవాలని అనుకుంటూన్నది, ఏమైతేనేం, చివరికి, నిన్నటికి సాధ్యపడింది.
కాని నేను నిన్న చూసింది నేను ఊహించలేనిది.
‘నాకు తెలుగుతో అంతగా పరిచయం లేదు, నేనేదైనా రాస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కాని విస్తృతంగా చదివాను. నేను చదివిన సాహిత్యమంతటిలోనూ మూడు పుస్తకాలు నన్ను పూర్తిగా లోబర్చుకున్నాయి. ఆ మూడు పుస్తకాలకోసం నేనేదైనా చెయ్యాలనుకున్నాను’ అన్నారు వెంకటేశ్వరరావుగారు.
నా దృష్టి ఆ ముందుగదిలో ఉన్న పుస్తకాల బీరువా మీదనే ఉంది. ఎంతో అరుదైన గాంధీ, టాగోర్ సాహిత్యమంతా అక్కడ కనిపిస్తోంది.
‘మొదటిది, తిరుప్పావై. తిరుప్పావైకి తెలుగులో దాదాపు నలభై దాకా అనువాదాలు వచ్చాయి. వాటిల్లో బాగా అనిపించినవి ఒక్కొక్క పాశురానికి ఒక్కొక్కటి చొప్పున తెలుగులో సంకలనం చేసాను. ఇదిగో చూడండి’, అంటో, ‘తిరుప్పావై-తిరువెంబావై’ (2010)’ అనే పుస్తకం చేతుల్లో పెట్టారు. ఆండాళ్,మాణిక్యవాచకర్ల పట్ల ఉన్న నా ఆరాధనకి ఆ ఒక్క పుస్తకం చాలు, వెంకటేశ్వరరావుగారిముందు సాష్టాంగ పడటానికి.
‘రెండవది, సౌందర్యలహరి. ఆ దివ్యస్తోత్రానికి తెలుగులో ఇప్పటిదాకా డెభ్భై దాకా అనువాదాలు వచ్చాయి. వాటన్నిటిలోనూ రాయప్రోలు సుబ్బారావుగారిది, కాటూరి వెంకటేశ్వరరావుగారిది కమనీయమైన అనుకృతులు. అందుకని వారినుంచి ఎక్కువపద్యాలు, తక్కిన అనువాదాలనుంచి ఒకటి రెండు పద్యాల చొప్పున ఏరి కూర్చి ‘సౌందర్య లహరి’ (2012) ప్రచురించాను, ఇదిగో’ అంటో చేతుల్లో పెట్టారు.
‘ఇక మూడవది, రామాయణం. వాల్మీకి, విశ్వనాథ. ముఖ్యంగా కల్పవృక్షపఠనం. వారిద్ద్దరినీ చదివినతరువాత, వాల్మీకి విపులంగా చెప్పనిదీ, విశ్వనాథ విస్తారంగా చెప్పిందీ ఏమై ఉండవచ్చునా అని చూస్తే, దాంపత్యవైభవమని పించింది. అందుకని ‘వాల్మీకి-విశ్వనాథ దర్శించిన సీతారాముల దాంపత్యవైభవం’ (2005) అనొక పుస్తకం రాసాను’ అన్నారు. ఆ పుస్తకం తెరవగానే ప్రేమా నందకుమార్ రాసిన ముందుమాట కనిపించింది. ఇంతలో ఆయన దాని ఇంగ్లీషు అనువాదం The Domestic Felicity of Sita and Rama నా చేతుల్లో పెట్టారు. అనుకర్త ప్రేమా నందకుమార్!
నా ఎదట కూచున్న మనిషి మామూలు మానవుడు కాదని అర్థమయింది నాకు.
‘ఇంతకీ నేను మీకోసం అన్నిసార్లు ఎందుకు ఫోన్ చేసానో తెలుసా? ఒక విషయం చెప్పాలి మీకు’ అంటో లోపలకి వెళ్ళి ఒక బైండు తీసుకొచ్చారు. అది రామాయణ కల్పవృక్షం అయోధ్యాకాండ. అందులో పేజీ పేజీకి మధ్య ఒక తెల్లకాగితం. ఆ కాగితం మీద ముత్యాలకోవలో ప్రతిపదార్థం, అన్వయక్రమం. అది మాష్టారి చేతివ్రాతలాగా ఉందే అనుకుంటూండగానే ఆయన చెప్పుకొచ్చారు:
‘అవును, అది మల్లంపల్లి శరభయ్యగారు నా కోసం రాసిపెట్టారు.’
‘ఎందుకు? మీ కోసమే ఇదంతా రాసారా?’
‘అవును, ఆయన ఒకప్పుడు కల్పవృక్షంలో సుందరకాండకి అట్లాంటి అన్వయక్రమంతో,ప్రతి పదార్థవ్యాఖ్య రాసారు. దాన్ని జువ్వాది గౌతమరావుగారు ప్రచురించాలనుకొని, ఏ కారణం చేతనో విరమించారు. ఆ తర్వాత అది ఒక ఎన్నారై సంస్థ చేతుల్లోకి వెళ్ళింది. వాళ్ళు దాన్నెక్కడో పారేసారు. ఈ చేతులు మారడంలో ఎవరో తీసిపెట్టుకున్న జిరాక్సు కాపీ ఒకటి నాకు దొరికింది. అయితే, నేనప్పటికి చాలాకాలం కిందటనే, ఆయన తిరుపతిలో ఉండగా వెళ్ళి కలిసాను. కల్పవృక్షం చదువుకుంటున్నాననీ, అయితే అన్వయం క్లిష్టంగా ఉందనీ, పదాలు అర్థం కావడం లేదనీ, నాకా కావ్యం అర్థం కావడానికి దారి చూపించమనీ అడిగాను. అందుకని, ఇదిగో, ఇట్లా అన్వయక్రమం, ప్రతి పదార్థం రాసిపెట్టారు’ అన్నాడాయన.
నేను వింటున్నదేమిటో నాకు కొంతసేపు అర్థం కాలేదు. ఇదేమిటిది? ఒక పాఠకుడు అడిగాడని, ఆయన, ఇట్లా ఒక కావ్యానికి ఇంత ఓపిగ్గా ప్రతిపదార్థం ఇట్లా చేతిరాతతో, అది కూడా, ఒక ప్రచురణకర్తకోసం కాదు, ఒక యూనివెర్సిటీకోసం కాదు, ఒక పాఠకుడికోసం రాసిపెట్టాడా!
మై గాడ్!
ప్రపంచసాహిత్య చరిత్రలోనే ఇట్లాంటి సంఘటన నేనిప్పటిదాకా వినలేదు. ఒడెస్సీకిగాని, డివైన్ కామెడీ, షానామా, పారడైజ్ లాస్ట్, రామ చరిత మానస్ లకి కూడా ఇటువంటి భాగ్యం లభించి ఉండదు. మహాపండితుడు మీనాక్షిసుందరం పిళ్ళ తన ప్రియశిష్యుడు యు.వి.స్వామినాథ అయ్యర్ కోసం కూడా ఇట్లాంటి పని చేసి ఉండలేదు.
ఇంతకీ ఆయన ఆ ప్రతిపదార్థవ్యాఖ్య ఆ పాఠకుడికోసం రాసింది ఎప్పుడని? 1992-93 లో. అప్పటికి మాష్టారికి దాదాపు డెభ్భై ఏళ్ళు. ఉద్యోగవిరమణ చేసినా పెన్షనింకా స్థిరపడలేదు. భార్య ఆరోగ్యం సరిగ్గా లేదు. ఇంకా ఇద్దరమ్మాయిలకి పెళ్ళి చెయ్యవలసి ఉంది. టిటిడిలో ఒక అసైన్మెంటు ఇస్తామటూ తాత్సారం చేస్తోన్నారు. మరొకరెవరైనా, ఇప్పటి పండితులై ఉంటే, భక్తిగ్రంథాలు రాసో, ప్రవచనాలు చెప్పో డబ్బు చేసుకుని ఉండేవారు. కాని, ఆయన ఒక పాఠకుడికోసం కల్పవృక్షానికి ప్రతిపదార్థ తాత్పర్యం రాయడానికి పూనుకున్నారు. తాను స్వయంగా అంతకన్నా మించిన మహాకావ్యం రాయగలిగిన శక్తి ఉండికూడా, ఆ పనికోసం ఆ వయసులో ఆ పరిస్థితుల మధ్య అంత త్యాగం చేసారు.
21-12-92 న వెంకటేశ్వరరావుగారికి రాసిన ఉత్తరంలో ఆయనిట్లా రాసారు:
‘.. వ్యాఖ్య అనుకున్నంత సులభంగా లేదు.కఠిన పదములకు అర్థం వ్రాయుట మాత్రముతో సరిపోవుట లేదు. అన్వయక్లేశమున్నచోట తాత్పర్యము కూడ వ్రాయవలసి వచ్చుచున్నది. ఆయన వాడిన పలుశబ్దములు నిఘంటువులలోనుండవు. ఆయన పలుకుబడియే వేరు. భారవాదులకు వ్యాఖ్య వ్రాయుట వేరు. ఇది వేరు. మీరు వ్రాయించుచున్నందుకు ఫలితము ఉండవలయును అన్న ఉద్దేశముతో వివరముగనే వ్రాయుచున్నాను. ఇంకొకపని చేయుట లేదు. తెల్లవారు జాములలో లేచి కూర్చుండి వ్రాయుచున్నాను. మీరు నా మీద కొండంత బరువు పెట్టితిరి. శక్తివంచన లేకుండ చేయవలయునని నా తాత్పర్యము.’
నాకు దుఃఖం ఆగలేదు. కన్నీళ్ళు పొంగిపొర్లాయి.
‘ఈ పుస్తకం జిరాక్సు తీసుకుంటాను’ అన్నాను వెంకటేశ్వరరావుగారితో.
‘జిరాక్సు తీయించండి, కాని నాకు జిరాక్సు ఇవ్వండి. ఈ ఒరిజినల్ మీ దగ్గరే ఉంచండి. నేను పెద్దవాణ్ణైపోయాను. ఈ పుస్తకాన్ని ఎటు తీసుకువెళ్ళాలో నాకు తెలియదు. ఇది నాకొక మోయలేని బాధ్యత అయిపోయింది. ఇప్పుడిది మీ చేతుల్లో పెడుతున్నాను. మీ ఇష్టం, మీరేం చేస్తారో’ అన్నాడాయన.
ఆ పుస్తకాన్ని చేతుల్తో తడిమి చూసాను. దాన్ని హెర్క్యులస్ కూడా మొయ్యలేడు.
ఇదెవరైనా కల్పవృక్షపండితుల చేతులకప్పగిస్తే?
ఉహు, కవితాప్రసాద్ ఫోనులో దొరకడు.
నాకేమీ పాలుపోలేదు. నేను కల్పవృక్షపండితుణ్ణి కాను, ఆ కావ్యం మీద నాకెటువంటి భక్తి ప్రపత్తులూ లేవు. కాని మాష్టారికి నేను జీవితకాలం ఋణపడి ఉన్నాను. బహుశా ఆ ఋణమే ఆ పుస్తకాన్ని నా చేతుల్లోకి అప్పగించింది. ఆ ఋణమే ఋణవిమోచనకీ దారి చూపిస్తుందనుకుంటాను.
21-9-2016