మీకు కొన్ని సంగతులు చెప్పాలి

Reading Time: 3 minutes

93

‘ద పొయెట్రీ ఆఫ్ అవర్ వరల్డ్ ‘ (పెరిన్నియల్, 2000) చాలా విలువైన పుస్తకం. ‘ ద వింటేజి బుక్ ఆఫ్ కాంటెంపరరీ వరల్డ్ పొయెట్రీ’ (1996), ‘వరల్డ్ పొయెట్రీ’ (నార్టన్,1997) లతో పాటు ప్రతీ రోజూ నాకు నా స్పూర్తినివ్వడానికి  నా బల్లమీద పెట్టుకునే పుస్తకంగా మారిపోయింది.

ఇటువంటి ఒక పుస్తకాన్ని సంకలనం చెయ్యాలన్న ఆలోచన జొసెఫ్ బ్రాడ్ స్కీదట. అతడి మిత్రుదు జెఫెరీ పేయిన్ దీనికి ప్రధాన సంపాదకుడు. అప్పటిదాకా వస్తున్న ప్రపంచ కవితాసంకలనాలకు ప్రపంచమంటే అమెరికా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జర్మనీ మాత్రమేననీ, అలాకాకుండా గ్లోబు అంతటా వినిపిస్తున్న శక్తిమంతమైన గళాల్నీ, కవిత్వసంప్రదాయాల్నీ పరిచయం చెయ్యాలనే ఉద్దేశ్యంతో తీసుకువచ్చిన సంకలనం.

విస్తృతి విషయానికొస్తే దీనికన్నా వింటేజి సంకలనంలాన్నే నేను ఎంపికచేస్తాను. అయితే దానిలో కన్నా ఇందులో అదనపు అంశం ప్రతి ఒక్క ఖండానికీ చెందిన కవిత్వం మీద ఒకటి, రెండు విశిష్ట వ్యాసాలు.

ఈ సంకలనంలో భూమిని ఇంగ్లీషు మాట్లాడే ప్రపంచం, లాటిన్ అమెరికా, యూరోప్, ఆఫ్రికా, ఆసియా అని అయిదు భాగాలుగా విభజించారు. ప్రతి ఒక్క ఖండం నుంచీ అయిదేసి దేశాల్ని ఎంపికచేసి ఒక్కొక్క దేశానికీ ఒక్కొక్క ప్రతినిథి కవిని ఎంపిక చేసారు. ప్రతి ఖండంమీదా ఒక విపులవ్యాసంతో పాటు, ప్రతి దేశం నుంచి ఎంపికచేసిన కవిమీద కూడా ఒక పరిచయ వ్యాసం కూడా పొందుపరిచారు, ఆ వ్యాసంతో పాటు కొన్ని ఎంపిక చేసిన కవితల అనువాదాలు. అయితే దీనికీ మినహాయింపులున్నాయి. అమెరికానుంచి ఒక్క కవి బదులు ఇద్దరు కవుల్ని తీసుకున్నారు. ఆసియా మీద ఒక్క పరిచయవ్యాసం బదులు భారతదేశం, మధ్య, పశ్చిమాసియా, ఆగ్నేయాసియా, పసిఫిక్, చీనా, జపాన్ లమీద విడివిడిగా అయిదు వ్యాసాలు పొందుపరిచారు.

ఆయా దేశాల్నీ, ఆ దేశాలకు ప్రతినిధి కవుల్నీ ఎంపిక చేయడంలో కొన్ని ఆశ్చర్యాలు లేకపోలేదు. యూరోప్ కి ప్రతినిధులుగా ఎంపిక చేసిన దేశాల్లో స్పెయిన్ లేదు, ఫ్రాన్సు లేదు. బహుశా లాటిన్ అమెరికా విభాగంలో దాదాపుగా స్పానిష్ కవిత్వమే ఉంటుంది కాబట్టీ, ఆఫ్రికానుంచి ఎంపిక చేసిన కవుల్లో సెంఘార్ ని అగ్రశ్రేణి ఫ్రెంచి కవిగా కూడా గుర్తించవచ్చు కాబట్టీ అలా చేసిఉంటారనుకోవచ్చు. భారతదేశానికి ప్రతినిధికవిగా ఎ.కె.రామానుజన్ ని ఎంపిక చేయడం సమంజసమే. కాని ఒక దేశ భాషకి చెందిన కవిని కూడా కరందీకర్, గోపాలకృష్ణ అడిగ, నామదేవ్ దేశాల్ వంటి కవినెవర్నయినా కూడా ఎంపికచేసిఉంటే బాగుండేది. అటువంటి లోటు ఒకటి ఉంటుందన్న ఉద్దేశ్యంతో ప్రతి విభాగంలోనూ ఇతరకవుల కవితలు కూడా కొన్ని ఒక సాంఫ్లింగ్ లాగా పొందుపరిచారు. ఎంపిక చేసిన కవుల కవితలు దాదాపుగా ఇదివరకే చదివినవికాబట్టి, అందులో చెప్పుకోదగ్గ విశేషమేమీఇ లేదు. కాని, ఒక కవివే ఎన్నో అనువాదాలు బయట లభ్యమవుతున్నప్పుడు అందులో తమకి బాగా నచ్చిన అనువాదాన్నే ఎంపికచెశామని సంకలనకర్తలు చెప్పుకున్నారు. ఉదాహరణకి అన్నా అక్మతోవా కవితలు ఎంపిక చేయడంకోసం సుమారు 17 అనువాదాల్ని తరచిచూసామని చెప్పుకున్నారు.

అటువంటి శ్రద్ధ చూపించినందువల్లనేమో ఎంపిక చేసిన కవితలు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఉదాహరణకి, పాబ్లో నెరుడా కవిత ఒకటి చూపిస్తాను. బహుశా తెలుగులో చాలా ప్రాచుర్యం పొందినందువల్ల కాబోలు, అంతకన్నా గొప్ప కవుల్ని తెలుగు ప్రపంచం తెలుసుకోవడం లేదనే బాధ వల్ల కాబోలు, నెరుడాని నేనెక్కువ ప్రస్తావించను. (నా నిర్వికల్పసంగీతంలో లాటిన్ అమెరికాకి ప్రతినిథి కవిగా నేను నెరుడా కవితనే అనువదించినప్పటికీ.) కాని ఈ సంకలనంలో నెరుడా రాసిన ఒక కవిత చదవగానే దాన్ని అనువదించాలన్న ఆతృత ఆపుకోలేకపోయాను. ఆ కవిత చూడండి.

మీకు కొన్ని సంగతులు చెప్పాలి

మీరడుగుతారు, లిలాక్ ల మాటేమిటని
స్వప్నసదృశంగా, దుప్పటిలాగా పరుచుకున్న గులాబులమాటేమిటని.
అతడు మాట్లాతుండగా
చినుకుకీ, చినుకీ మధ్య నిశ్శబ్దంతో,
పిట్టలపాటలతో
ముంచెత్తే వానల మాటేమిటని.

నాకేం జరుగుతోందో కొద్దిగా చెప్పనివ్వండి.

నేను మాడ్రిడ్ లో
ఒక ఇంట్లో ఉండేవాణ్ణి.
చెట్లు, గంటలు, గడియారాలు.
అక్కణ్ణుంచి స్పెయిన్ నేల
తోలుసముద్రంలాగా కనిపించేది

నా ఇంటినొక
పూలపొదరిల్లనేవారు, ఎక్కడచూసినా
విరబూసిన జిరేనియంలు, పిల్లల్తో
కుక్కపిల్లల్తో కలకలలాడే ఇల్లది.

రావుల్, గుర్తుందా?
రాఫేల్, గుర్తుందా?
ఫెడెరికో, నీకు గుర్తున్నాయా,
జూన్ నెలల సూర్యకాంతి
నీ నోట్లో పూలగుత్తులు కుక్కే
ఆ ఇల్లు, ఆ బాల్కనీలు.

తమ్ముడూ, తమ్ముడూ!
ఎటుచూసినా అల్లరి, రుచికరమైన తిండి
గుట్టలుగుట్టలు రొట్టెలు,
వెండిరంగు చేపలమధ్య నిలబెట్టినైంకుసీసాలాగా
సంతలో విగ్రహం
ధారళంగా ప్రవహించే ఆలివ్ నూనె
తొడతొక్కిడితో కిక్కిరిసిపొయ్యే వీథులు
మీటలు, లీటర్లు
పదునెక్కే జీవితసారాంశం
గుట్టలు, గుట్టలు చేపలు,
సాయంకాలానికి అలసిపోయిన
గాలిమరలమీద చల్లబడ్డ సూర్యకాంతి
దంతపునగిషీలాగా బంగాళదుంపలు
సముద్రందాకా పోగుపడ్డ టమాటోలు.

హటాత్తుగా ఒక ఉదయాన్న
నేలని చీల్చుకుని
అగ్నిజ్వాలలు పైకి చిమ్మాయి
మనుషుల్ని కబళించడం మొదలెట్టాయి.

ఇక అప్పణ్ణుంచీ ఎటుచూసినా నిప్పు,
ఎటు చూసినా తుపాకిమందు,
ఎటు చూసినా రక్తం.

బందిపోట్లు, విమానాలతో విరుచుకుపడ్డారు
బండిపోట్లు, తోడుదొంగలతో, గూడుపుఠానీలతో,
బందిపోట్లు, దేవుడిపేరిట నల్లని ఆశీర్వచనాలతో
పిల్లల్ని చంపడానికి గాల్లోంచి తేలివచ్చారు,
వీథుల్లోంచి, పిల్లలరక్తం
అచ్చంగా పిల్లలరక్తంలానే ప్రవహిస్తున్న వీథుల్లోంచి.

నక్కలు, వాళ్ళని నక్కలు కూడా భరించలేవు
రాళ్ళు, వాళ్ళని ముళ్ళపొదలుకూడా ముట్టుకోవు,
పాములు, వాళ్ళని పాములు కూడా ద్వేషిస్తాయి.

మిమ్మల్ని చూస్తుంటే
మొత్తం స్పెయిన్ రక్తం చివ్వున చిమ్మినట్టుంది,
మిమ్మల్ని కత్తులతో, గర్వంతో
ఒక్క పెట్టున నేలకూల్చినట్టుంది.

ద్రోహులు:
ముక్కలైన స్పెయిన్ ని చూడండి
కూలిపోయిన నా ఇంటిని చూడండి.
ప్రతి మృత గృహం నుంచీ
పువ్వులకు బదులు
మండుతున్న లోహశకలాలు బయటికొస్తున్నాయి,
బీటలుపడ్డ స్పెయిన్ లో ప్రతి పగుల్లోంచీ
స్పెయిన్ పొడుచుకొస్తోంది
మరణించిన ప్రతి శిశువునుంచీ
కళ్ళు తెరుచుకుని తుపాకులు పుట్టుకొస్తున్నాయి,
జరిగిన ప్రతి అత్యాచారంలోంచీ బుల్లెట్లు పుడుతున్నాయి,
ఒక రోజు అవి నీమీద పడి
నీ హృదయమెక్కడుందో చీల్చి చూడబోతున్నాయి.

అయినా అడుగుతారు మీరు:
సుందరశాఖాగ్రాలగురించీ, సుమధురస్వప్నాలగురించీ
నీ దేశంలోని మహాగ్నిపర్వతాలగురించీ

నీ కవిత్వం
మాట్లాడదెందుకని?

రండి, చూడండి, వీథుల్లో రక్తం,
రండి, చూడండి
వీథుల్లో రక్తం,
రండి, చూడండి రక్తం
వీథుల్లో.

5-5-2013

Leave a Reply

%d bloggers like this: