ఆఫ్రికన్-అమెరికన్ రచయితలందరిలోకీ, అత్యంత ఆత్మీయంగా అనిపించే రచయిత్రి ఎవరంటే మాయా ఏంజెలొ పేరే చెప్తాను. ఆమె రాసిన Letter to my daughter (2008) చదివినప్పుడే నిజమైన విద్యావంతురాల్ని, సంస్కారవంతురాల్ని, జీవితప్రేమికురాల్ని చూసిన సంతోషం నాకు అనుభవానికి వచ్చింది.
మాయా ఏంజెలొ (1928-2014) గా ప్రసిద్ధి చెందిన మార్గరెట్ అన్నీ జాన్సన్ ఆఫ్రికన్-అమెరికన్ రచయితల్లో అత్యంత ప్రతిభావంతురాలు. కవి, రచయిత, గాయని, నర్తకి, ఆత్మకథకురాలు, ఉపాధ్యాయిని, స్క్రీన్ ప్లే రచయిత, చలనచిత్ర దర్శకురాలు, అన్నిటికన్నా ముఖ్యంగా పౌరహక్కుల ఉద్యమనేత.
కాని ఆమె రచనలు చదువుతున్నప్పుడు మనకు కలిగే భావం ఆమె మనకి చాలా సన్నిహితంగా తెలిసిన మనిషి అనే, బహుశా, మన చిన్నతనంలో మనం చూసిన మొదటి కళాశాల విద్యార్థిని, మన తొలి ఉపాధ్యాయురాలు, బాగా పాటలు పాడే మన పిన్ని, బాగా కథలు చెప్పగల మన మేనత్త. నువ్వు చిన్నప్పుడు రోజూ హైస్కూలు నుంచి మట్టిబాటన ఇంటికి వచ్చేటప్పుడు నీతో నడుస్తూ దారిపొడుగునా పూలనీ, పిట్టల్నీ చూపిస్తూ తుళ్ళింతలాడిన నీ స్నేహితురాలు.
మాయా ఏంజెలో రచనల దగ్గరకు వచ్చేటప్పటికి, ఆఫ్రికన్-అమెరికన్లు ఒక జాతిగా ఎంత పరిణతి సాధించారో మనకి బోధపడుతుంది. ఆమె అటు ఆఫ్రికన్ల మౌఖిక సాహిత్యానికీ, ఇటు ఐరోపీయ రచయితల వచన సాహిత్యానికీ సమానమైన వారసురాలు. అందుకనే, మిమ్మల్ని ప్రభావితం చేసిన రచయితలెవరంటే, డన్ బార్, షేక్ స్పియర్ అని చెప్పిందామె.
మనుషులందరూ పుట్టుకతోటే ప్రతిభావంతులుగా పుడతారనీ, కానీ, ఆ ప్రతిభని వాడుకుంటూ మనం ఎప్పటికప్పుడు నిజమైన మనుషులుగా రూపొందవలసిన బాధ్యత మటుకు మనదే అని ఆమె చెప్తుంటే వినడం నిజమైన వ్యక్తిత్వవికాసపాఠం వింటున్నట్టు ఉంటుంది. నువ్వు రచయిత కావడం ఒక బాధ్యత అని చాలామంది చెప్తారు. కాని, అది నిజానికి రెండు బాధ్యతలని మాయా ఏంజిలో మాత్రమే మనకి స్పష్టం చేస్తుంది. మొదటి బాధ్యత, నువ్వు మనిషిగా మారడం, రెండో బాధ్యత, అప్పుడు నీకేదైనా చెప్పాలనిపిస్తే, నువ్వు దాన్ని ఎంత శక్తిమంతంగా చెప్పాలో సాధనచెయ్యడం. క్లాడియా టేట్ అనే ఆమెకి ఇచ్చిన సుప్రసిద్ధమైన ఇంటర్వ్యూలో ఆమె ఇలా అంటున్నది:
‘రచయితగా నా బాధ్యత నా రచనాశిల్పం పట్ల వీలైనంత శ్రద్ధ పెట్టడమే. అందుకని నేను రచనా శిల్పాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తాను. నాకు తోచింది తోచినట్టు రాసిపారెయ్యను. దాని సంగతి అదే చూసుకుంటుందిలే అని ఏది పడితే రాసెయ్యడం మోసకారితనమే అవుతుంది. అది శిల్పం కానే కాదు. రచన చెయ్యడమెట్లానో నేర్చుకోవడం, భాష ఏమి చెయ్యగలదో అర్థం చేసుకోవడం, భాష మీద పట్టుసాధించడం ముఖ్యం. శబ్దాన్ని దౌడు తీయించడమెట్లానో తెలుసుకోగలిగితేనే నీ రచనద్వారా మనుషుల్ని ఏడిపించేలా చెయ్యడం, నవ్వేలా చెయ్యడం, అవసరమైతే యుద్ధం చెయ్యడానికి సిద్ధపడేలా చెయ్యడం సాధ్యపడుతుంది. రెండవది, మనిషిగా వీలైనంత మంచిగా ఉండగలగటం. ఒకసారి భాషమీద నీకు అధికారం చిక్కాక, నీ బలహీనతల్ని వాళ్ళమీద రుద్దకుండా ఉండటం. లేకపోతే, వాళ్ళు నీ బలహీనతల్ని ఆరాధిస్తూ తమ శక్తుల్ని తాము దుర్వినియోగపరుచుకునే ప్రమాదముంది…కాబట్టి, రెండు విషయాలు. మొదటిది, నేనొక మంచి మనిషిని కావడానికే సదా ప్రయత్నిస్తాను, అప్పుడు, నాకేదైనా ఒక మంచి విషయం చెప్పాలని అనిపిస్తే, దాన్ని ఎంతబాగా చెప్పగలనా అని చూస్తాను. అది నా బాధ్యత.’
ఆమె ఇంకా ఇలా అంటున్నది:
‘నా మొత్తం సాహిత్యం, నా జీవితం, దాన్లో ప్రతి ఒక్కటీ మనుగడకి సంబంధించిందే. నా సాహిత్యమంతా చెప్పేదిదే: మీరు చాలా పరాజయాలు ఎదుర్కోవచ్చు, కాని ఓడిపోకండి అని మటుకే. నిజానికి, అట్లా పరాజయాల్ని ఎదుర్కోవడం వల్లనే జీవితాన్ని కొనసాగించగల శక్తిసామర్థ్యాలు సిద్ధిస్తాయి కూడా.’
ఆమె ఆత్మకథనాత్మక రచనలు ఏడింటిలో మొదటిది, I Know Why the Caged Bird Sings (1969) లో ఆమె తన మొదటి 17 ఏళ్ళ జీవితాన్ని వివరిస్తున్నప్పుడు,ఒక అమాయికమైన బాలిక ఒక బాధ్యతాయుతమైన యువతిగా మారిన వైనమంతా కనిపిస్తుంది. ఎవరికీ సంభవించకూడని అసాధారణమైన అనుభవాలు, ఎనిమిదేళ్ళప్పుడు తాను తన తల్లి బాయ్ ఫ్రెండ్ చేతుల్లో రేప్ కి గురి కావడం , పదహారేళ్లప్పుడు, పెళ్ళి కాకుండానే గర్భం ధరించవలసి రావడం, తన తండ్రి గర్ల్ ఫ్రెండ్ తనని ఇంట్లోంచి తరిమేస్తే వీథిన పడటం-వాటిని ఆమె ఎట్లా ఎదుర్కొందీ, వాటిమీంచి తన వ్యక్తిత్వాన్ని తానెట్లా నిర్మించుకుందీ చదివితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అప్పటిదాకా ఆఫ్రికన్-అమెరికన్ పురుష రచయితలు మాట్లాడిన స్వాతంత్ర్యం కన్నా ఈ స్త్రీ మాట్లాడుతున్న స్వాతంత్ర్యం మరింత లోతైనదీ,సంక్లిష్టమైనదీ, గంభీరమైనదీ అని బోధపడుతుంది.
మాయా ఏంజిలో భగవద్విశ్వాసి. అందువల్ల ఆమె మానవత్వం మరింత బలపడింది. ఆమె మానవప్రయత్నం మరింత బాధ్యతని భుజాలకెత్తుకుంది.
మాయా ఏంజిలో సాహిత్యం నుంచి కొన్ని స్మరణీయవాక్యాలతో రాండమ్ హౌస్ సంస్థ Rainbow in the Cloud: The Wisdom and Spirit of Maya Angelou (2014) అనే సంకలనం వెలువరించింది. అందులోంచి కొన్ని వాక్యాలు:
ఒక్క మనిషే ఒక జనబాహుళ్యం
1
నల్లజాతి బిడ్డ అన్నిటికన్నా ముందు నేర్చుకోవలసింది, తన నోరారా నవ్వగలగడం. ఎందుకంటే రేపు ఆమె ఎదుర్కోబోయే లక్షలాది కాఠిన్యాలు ఉండలాగా ఆమె గొంతుకి అడ్డుపడబోయే ప్రమాదముంది.
2
అజ్ఞానానికి బందీగా మిగిలిపోకు. ఈ ప్రపంచం చాలా విశాలం, నువ్వకున్నదానికన్నా సంక్లిష్టం, నీ అజ్ఞానం చూడగలిగినదానికన్నా మించిన అద్భుతం.
3
మనలో ప్రతి ఒక్కరం ఒక వినాశనాన్ని, ఒక ఒంటరితనాన్ని, ఒక ప్రాకృతిక వైపరీత్యాన్ని, ఒక ఆధ్యాత్మిక ఉపద్రవాన్ని అనుభవించినవాళ్ళమే. మనం ఒకరినొకరం కలుసుకున్నప్పుడు, చూసుకున్నప్పుడు, ‘నీ పరిస్థితి ఏమిటో నేనర్థం చేసుకోగలను,ఎందుకంటే, ఒకప్పుడు నేనా దారుల్లోంచే నడిచివచ్చాను’ అని చెప్పగలగాలి.
4
కలిసి ఉంటేనే మనం ఇంతకన్నా తక్కువ వ్యథతో కూడుకున్న ప్రపంచాన్ని సాధించగలుగుతాం. విడిపోతే, మనకి మిగిలేదల్లా మరిన్ని అశనిపాతాలూ, మరింత ఒంటరితనమే.
5
ప్రేమ అంటూ ఒకటున్నందుకు నేను ధన్యురాలిని. కౌటుంబిక ప్రేమ (రక్తసంబంధీకుల మధ్య ఉండేది), ప్రణయప్రేమ (ఇద్దరు ప్రేమికుల మధ్య చెలరేగే మోహోద్వేగం), దివ్యప్రేమ (దేవుడికీ, స్నేహితులకీ మధ్య ఉండే స్నేహాత్మక ప్రేమ), ప్రకృతి ప్రేమ (పర్వతశ్రేణుల గాంభీర్యాన్నీ, సముద్రాల శాశ్వతత్వాన్నీ చూసినప్పుడు కలిగే ప్రేమ), మనసారా నవ్వుకోగలడంలోని సంతోషం. ప్రేమ మన వాతావరణంలో ఉంది కాబట్టే మనం మరింత దృఢంగానూ, మరింత దయతోనూ, మరింత ఉదారంగానూ జీవించగలుగుతున్నాం.
6
నేనొకటి తెలుసుకున్నాను: మనుషులు నువ్వు చెప్పింది మర్చిపోతారు, నువ్వు చేసింది మర్చిపోతారు. కాని నువ్వు వాళ్ళకి కలిగించిన అనుభూతిని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరు.
7
అర్థమయింది నాకు, నేను పాఠాలు చెప్పే రచయితని కాను, రచనలు చేసే పంతులమ్మని మాత్రమేనని.
8
విజయం సాధించడమంటే నిన్ను నువ్వు ఇష్టపడుతుండటం. నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో దాన్ని ఇష్టపడటం, ఎలా చెయ్యాలనుకుంటున్నావో దాన్నిష్టపడటం.
9
నేను భగవంతుడి బిడ్డనని అర్థం చేసుకోవడమే కష్టమైన పని. ఇక మతోన్మాదీ, హంతకుడూ కూడా దేవుడిబిడ్డలేనని అర్థం చేసుకోవడం మరింత కష్టమైన ప్రయాణం.
10
ఈశ్వరాజ్ఞని పాటించే ఒక్క మనిషే ఒక జనబాహుళ్యం.
11
చిన్న చిన్న కానుకలు తీసుకునేటప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది, కాని భూరిబహుమానాల ప్రదాతని కాగలిగినప్పుడు మరింత సంతోషంగా ఉంటుంది.
12
గౌరవంగా ఉండటమంటే బిగదీసుకుని కూర్చోడం కాదు. అది నీ పట్ల నీకుండే నమ్మకం. నువ్వు అత్యుత్తమమైనదానికి అర్హురాలవనే ఆత్మవిశ్వాసం. ఆత్మగౌరవమంటే, నేను చెప్పాలనుకున్నది నాకు ముఖ్యమనీ, అదెప్పుడు చెప్పడం ముఖ్యమో నాకు తెలుసనీ అర్థం. ఆత్మగౌరవమంటే నేను పొందవలసిన గౌరవానికి నేను తగినదాన్ననే ఒక వైఖరి. అట్లానే ఇతరులకి నేనివ్వవలసిన అత్యున్నత గౌరవం ఇచ్చి తీరవలసిన బాధ్యత కూడా.
13
అన్నిటికన్నా ముఖ్యం మనం వినయం అలవర్చుకోవడం. అంటే, నువ్విట్లా ఉన్నావంటే, నీకన్నాముందు చాలామంది నీకోసం కష్టపడ్డారని గుర్తుపెట్టుకోవడం. నీ తర్వాత కూడా మరొకరు రానున్నారని, వాళ్ళ కోసం, నిన్ను నువ్వు బాధ్యతతో సంసిద్ధపరుచుకోవడం. మీకోసం ఇంతకు ముందే చాలామంది చాలా త్యాగం చేసారు. నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, పచ్చన, ఎర్రన, చామనచాయవాళ్ళు-మీ చర్మం రంగు ఏదైనా కానీ, మీలో ప్రతి ఒక్కరూ మీముందు వెళ్ళినవాళ్ళకి ఋణపడి ఉన్నారు. మీ పూర్వీకులు కొందరు త్యాగాలు చేసిఉండకపోతే, మీరిక్కడ ఉండి ఉండేవారే కాదు. కాబట్టి మీరెప్పుడైనా ఒక సవాలు ఎదుర్కొంటున్నప్పుడు వాళ్ళని కూడా మీ మధ్యకు తీసుకురండి, ఆ సుదూరగళాలు మీ మాటలకు శక్తినీ, సంగీతాన్నీ సమకూర్చనివ్వండి. ఎందుకంటే, మీ తర్వాత రానున్నవాళ్ళకోసం మీరు కూడా అట్లానే త్యాగం చెయ్యవలసి ఉంటుంది, అది మీ బాధ్యత.
14
మీరిట్లా కలకాలం జీవించాలన్నదే నా ఆకాంక్ష. మీరెవరైనా సరే, ఎలాగైనా సరే, మీ దయాపూరిత కార్యకలాపంతో ఈ నీచ ప్రపంచాన్ని నివ్వెరపరచాలి. మీ కోమల హృదయభారం తగ్గించుకోడానికి మీరొకింత సంతోషంతో నడయాడాలి.
15
నువ్వేదన్నా నేర్చుకున్నావా, దాన్ని తక్కినవాళ్ళకి బోధించు, నువ్వేదన్నా పొందావా తక్కినవాళ్ళకి పంచిపెట్టు.
16
ఒక పక్షి పాడుతోందంటే దానికి సమాధానం దొరికిందని కాదు, పాట దొరికిందని అర్థం.
17
నేనొక అమెరికన్ గా జీవిస్తున్నందుకు ధన్యురాలను. 9/11 దాడి చేసిన ఉగ్రవాదులమీద మనం ఆగ్రహం చూపించగలుగుతున్నందుకు నేను ధన్యురాలిని, కాని, అదే సమయంలో, నాకు, ప్రతి ఒక్క అరబ్బునీ, ప్రతి ఒక్క ముస్లిం నీ ద్వేషించకూడదనే మెలకువ ఉన్నందుకు కూడా ధన్యురాలని.
18
మగవాళ్ళకీ, పురుషులకీ మధ్యా, ఆడవాళ్ళకీ,స్త్రీలకీ మధ్యా అపారమైన తేడా ఉందని నాకు చాలాకాలంకిందటే అర్థమయింది. జననేంద్రియాల తేడా వల్ల తెలిసేది ఆడా, మగా అన్నది మటుకే. కాని, స్త్రీపురుషులు రూపొందాలంటే మటుకు, నిర్విరామ కృషి, క్రమశిక్షణ, సాహసం, ప్రేమ తప్పనిసరి.
19
నేనొక స్త్రీగా జీవిస్తున్నందుకు ధన్యురాలిని. ఒక స్త్రీగా పుట్టడానికి ఏ జన్మలోనో ఏదో సుకృతం చేసుకుని ఉంటాను.
20
ఒక స్త్రీ తనని తాను నిలబెట్టుకోడానికి లేచి నిలబడ్డప్పుడల్లా, ఆమెకి తెలియకుండానే, ఆమె చెప్పుకోకుండానే, ఆమె సమస్త స్త్రీ జాతినీ నిలబెట్టడానికి లేచి నిలబడుతున్నది.
26-2-2018