మల్లు వెళ్ళిపోయాడు

Reading Time: 3 minutes

 

అవును, జీవన్, మల్లు వెళ్ళిపోయాడు.

వారం రోజులైంది. 8 వ తేద్ది పొద్దున్నే తెల్లవారగానే నా మొబైల్ బ్లింకవుతూ ఉంది. మనసేదో కీడు శంకిస్తూనే ఉంది. అనుమానంగానే తెరిచి చూసాను.

మల్లు మనల్ని వదిలివెళ్ళిపోయాడన్నవార్త.

వారం రోజులైంది.

నిజమే, దైనందిన జీవితం చాలా విచిత్రమైంది. ఏ ఒక్క పనీ ఆగదు, ఏదీ జరగనట్టే, అన్నీ జరగాలన్నట్టే అదే నడక, అదే పరుగు.

కాని ఇట్లాంటి వార్త మన బాహ్యజీవితాన్ని కాదు, మన ఆంతరంగిక జీవితాన్ని ధ్వంసం చేసేస్తుంది. మనమెంతో పదిలంగా దాచుకున్న ఒక పిచికగూడుని ఎగరేసుకుపోతుంది.

ఎటువంటి కష్టం,అవమానం, దుస్సహమైన సంఘటన సంభవించినా మనం బయట తలుపు మూసేసి లోపలకి వెళ్ళి ఒక ఆంతరంగిక మైదానంలో కొద్దిసేపట్లా పచారు చేసి వస్తాం. అప్పుడు మళ్ళా బయటకు వచ్చేటప్పటికి ఒంట్లో కొత్త రక్తం, కొత్త శ్వాస, కొత్త ఆశ ఊరిఉంటాయి.

కాని మల్లు లేడనగానే నా ఆంతరంగిక మైదానం అదృశ్యమైపోయినట్టనిపించింది. ఆ మైదానం నాది, నీది, మల్లుది, భద్రానిది, ఇమ్మానియేలుది, మనందరిదీ.

అక్కడ అడవులున్నాయి, కొండలున్నాయి, పొలాలున్నాయి, పూలచెట్లున్నాయి, మనం ఎంతో ఉల్లాసంగా జీవించిన ఎన్నో ఏళ్ళకు ఏళ్ళున్నాయి.

ఇప్పుడవన్నీ అదృశ్యమైపోయినట్టుంది.

అయినా బతుకుతాం, కాని నువ్వు పదిలంగా దాచుకున్న నిధి అంతా ఎవరో కొల్లగొట్టుకుపోయాక కూడా నువ్వు బతకాల్సి ఉంటుందే అట్లా బతుకుతామన్నమాట.

చాలా కష్టంగా ఉంది, తలుచుకుంటేనే చాలు, నిజంగా తలుచుకోవలసిన పనికూడా లేదు.ఎముకలు కొరికేసే చలిగాలి ఏదో మనసులోపల మన ప్రమేయం లేకుండానే బలంగా వీచి గుండెకు రాచుకుపోతోంది.

ఇదెట్లా ఉందంటే, మనం నలుగురం విందుకి కూచున్నాం.సంతోషంగా మాట్లాడుకుంటున్నాం. ఒకప్పటి జ్ఞాపకాలు తలుచుకుంటున్నాం. ఇంతలో వాడు ‘ఒక్క నిమిషం’ అంటూ బయటికివెళ్ళాడు. మళ్ళా వస్తాడుకదా అని మనం మామూలుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇంతలో ఎవరో వచ్చి చెప్తారు, వాడింక మళ్ళా వెనక్కి రాడని,

మనమింక వాణ్ణి మళ్ళీ ఎప్పటికీ చూడలేమని.

చూడు, మనమంతా కలిసి పంచుకున్న జీవితం ఒక్కసారి ఎంత శూన్యంగా మారిపోయిందో.

మనమేమీ చెయ్యలేమే, ఆ అర్థరాత్రి వాడట్లా ఉన్నట్టుండి ఈ లోకాన్ని వదిలివెళ్ళిపోతే మనం పక్కన లేమే.

చాలా కష్టంగా ఉంది జీవన్,

తలుచుకోవడం కష్టంగా ఉంది. తట్టుకోవడం కష్టంగా ఉంది.

2

మనమంతా మల్లు అని పిలుచుకునే శ్రీధర మల్లికార్జున్, నాకనిపిస్తుంది, ఈ లోకంలో పుట్టవలసినవాడు కాడని.

వాడి ఆత్మధాతువు ఎంతో పరిశుద్ధమైంది. గుర్తుందా, వాళ్ళ నాన్నగారు వాడితో రాజవొమ్మంగిలో మెడికల్ షాపు పెట్టించారు. ఆయన జీవితమంతా పైసా పైసా కూడబెట్టుకున్న కష్టార్జితంతో పెట్టిన షాపు. కాని వాడు దాన్ని నడపలేకపోయాడు. ఎందుకని?

ఎందుకంటే, రోజూ నాతో చెప్పేవాడు, ‘చూడు ఈ ఆర్ ఎం పీలు, ఈ ట్రైబల్స్ కి అవసరంలేని టానిక్కులు, మందులు, ఇంజెక్షన్లు ఎట్లా రాసేస్తున్నారో చూడు, ఎంత మోసం’. ఆ మాట నాతోనే కాదు, ఆ గిరిజనులకి కూడా చెప్పేవాడు. అర్థంకాని చేతిరాతలో ఆ డాక్టర్లు రాసిన మందుల వివరాలు వాళ్ళకి విడమర్చి చెప్పేవాడు. ‘ఇదిగో ఈ మందులన్నీ అనవసరం, ఈ రెండు టాబ్లెట్లు మింగితే చాల’నేవాడు.

వాడి మెడికల్ షాపు ఆ కొండగ్రామాల్లో ఒక ఆరోగ్యవిద్యా కేంద్రమైంది. అదే సమయంలో వాళ్ళ నాన్నగారు పెట్టిన పెట్టుబడి ఒక్కో రూపాయీ తరిగిపోతూ వచ్చింది.

రాజవొమ్మంగి ప్రాక్టీషనర్ల బాధపడలేక, గిరిజనుల అమాయకత్వాన్ని తట్టుకోలేక వాడా షాపు మూసేసి ఉద్యోగం వెతుక్కున్నప్పుడు ఎంత గుండెకోత అనుభవించాడని.

మల్లు ఇట్లా అర్థాంతరంగా వెళ్ళిపోయాడని తెలియకుండానే మా అమ్మానాన్నా వెళ్ళిపోవడం ఎంత మంచిదైంది. వాళ్ళకి గుండె పగిలిపోయుండేది, ఈ వార్త వింటే, మా అమ్మకి మరీ ముఖ్యంగా.

మా అమ్మ మనసు, మా భద్రం మనసు, మల్లు మనసు ఒక్కలాంటివనిపిస్తుంది. వాళ్ళ ఒంట్లో రక్తం కాదు, గంగాజలం ప్రసరిస్తూంటుంది.

నేనో రోజు రాజమండ్రినుంచి వెళ్ళగానే ఆ రాత్రంతా నాతో రాజవొమ్మంగి ఎంత కల్లోలప్రాంతంగా మారిపోతోందో, ఆ విషయాలే చెప్తూ ఉండిపోయాడు.

అన్నలకి అన్నం పెడుతున్నారని తాళ్ళపాలెం నుంచి కొందరు గిరిజనుల్ని తెచ్చి రాజవొమ్మంగి పోలీసులు చితకబాదారుట. ఆ బాధ భరించలేక ఒక గిరిజనుడు పోలీసు స్టేషన్ పక్కనున్న బావిలో దూకేసాడట.

‘నాగరాజూ, ఈ అన్యాయానికి అంతం లేదా, ఇట్లా కొనసాగుతూనే ఉంటుందా?’ పదే పదే అడుగుతూ ఉన్నాడు ఆ రాత్రంతా. నాకు లోకం తెలుసుననీ, సిద్ధాంతం బాగా చదువుకున్నాననీ వాడికొక నమ్మకం. కాని నిజంగా నాకేమి తెలుసు?

ఆ గిరిజనులకోసం వాడిలాగా ఒక్కరోజేనా ఆలోచించానా?

నువ్వూ,నేనూ, మనందరం శరభవరంలో ఆ జెండాకొండనీ, ఆ చాపరాయినీ, ఆ ఏటినీ , జాగరాలమ్మ గుడినీ, దాకరాయి, వణకరాయి,కొండపల్లి, కిర్రాబు, బోయపాడులాంటి గిరిజన గ్రామాల్నీ, కాకరపాడుసంతనీ, కృష్ణదేవిపేట ఏడొంపుల ఘాటిని ఎంతో ప్రేమించేం. కాని మనం ప్రేమించింది ఆ రంగుల్ని, ఆ వెన్నెల్ని, ఆ అడవుల్ని, ఆ పువ్వుల్ని మటుకే.

కాని వాడు ఆ మట్టిని ప్రేమించాడు, ఆ మనుషుల్ని ప్రేమించాడు, పోలీసులకీ, నక్సలైట్లకీమధ్య నలిగిపోయిన ఆ గిరిజనుల్ని, వాళ్ళ తీరని శోకాన్ని తన హృదయానికి దగ్గరసా తీసుకున్నాడు.

నేను ‘అమృత సంతానం’ చదివితే అందులో పనసపూలగాలిగురించీ, కమలాపూల గాలి గురించీ చదివాను, కాని వాడు అమృతసంతానాన్ని ఆ కోదు జీవితం పట్ల ఆపుకోలేని ఇష్టంతో చదివేడు, ఎప్పటికన్నా తనొక కోదుగా బతకగలనా అన్న తపనతో చదివాడు. అక్షరం అక్షరం ఆవురావురుమంటూ చదివేడు. ప్రతి ఒక్కటీ అట్లానే చదివేడు, మహాశ్వేతాదేవి ‘ఎవరిదీ అడవి ‘ చాలా చిన్నపుస్తకం, మనమైతే ఓ గంటలో చదివేస్తాం, వాడు కొన్నేళ్ళ పాటు చదివేడు. ఆ చిన్నపుస్తకంలో వాడికి మన వాతంగి, లోదొడ్డి, కొయ్యూరు, కాకరపాడు- ఆ ఊళ్ళనీ, ఆ మనుషుల్నీ పోల్చుకుంటూ చదివేడు, దారి తప్పిపోయినవాడు యాత్రాపటం చదివినంత క్షుణ్ణంగా చదివేడు.

మల్లుని పోగొట్టుకున్నది మనం మటుకే కాదు, మన ఊరు, మన లొద్దు, ఆ లొద్దులో అవధాన్లుగారి పొలంలో ఈ వేసవి అంతా విరబూసే కొండసంపెంగ చెట్టు కూడా వాడికోసం ఇప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటూనే ఉంటుంది.

చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, చేతిలో పదిరూపాయలు కూడా లేని రోజుల్లో మా నాన్నగారికి వాడెంతా ఆసరాగా నిలబడ్డాడని!

వాళ్ళకి మాత్రమేనా?

నేను మర్చిపోలేను, రాజమండ్రిలో పేపర్ మిల్లు దగ్గర నా ఒంటరి గదిలో నేనొక్కణ్ణీ గడిపిన ఆ ఒంటరికాలంలో ఒకసారి, నాకు బాగా జ్వరం, లేవలేను,అన్నం తినలేదు, బయటికిపోలేను, నేనమయ్యానో కూడా ఎవరికీ అక్కర్లేని ఆ ఊళ్ళో, ఆ రోజుల్లో, డాస్టొవస్కీ ‘క్రైమ్ అండ్ పనిష్మెంటు ‘ ఒక్కటే నాకు తోడుగా ఉన్నప్పుడు, హటాత్తుగా వచ్చాడు, నన్ను వెతుక్కుంటూ.

వచ్చినావాడట్లానే ఉండిపోయాడు, నాకు సపర్య చేస్తూ, నాకు మళ్ళా ప్రాణమొచ్చేదాకా,

మల్లూ, ఎక్కడున్నావు నువ్వు?

మల్లూ మళ్ళా మనం కలిసి తిరుగుతామా? హేమంత కాలపు అపరాహ్ణాల్లో తాళ్ళపాలెం అడవుల్ని మహాలిఖారూపపర్వతశ్రేణితో పోల్చుకుంటూ విభూతిభూషణుణ్ణి తలుచుకుంటూ తిరిగేవాళ్ళమే అట్లా మళ్ళా తిరుగుతామా?

మన ఊరినుంచి వణకరాయిమీదగా పనసలపాలెం దాకా పోయి వచ్చేవాళ్ళం కదా, ఊరికినే, మరేపనిలేకుండా, ఆ కొండవాలులో గుప్పున విసిరే మాఘమాసపు మామిడిపూలపరిమళం కోసం పోయివచ్చేవాళ్ళమే,

అట్లా మళ్ళా పోయివస్తామా?

మళ్ళా రామనవమి పండగ చేస్తామా?

గంగాలమ్మ పండగలో ఉయ్యాల ఊగుతామా?..

జీవన్, మల్లు అట్లా వెళ్ళిపోయాడంటే, నాకు బతకడం మీదనే ఇష్టం పోయింది.

3

కానీ –

జీవన్, మనం బతకాలి, మల్లు వాళ్ళ నాన్నగారు,అమ్మగారు, శంకర్, అమ్మలు,అన్నపూర్ణ, విజయక్క, మల్లు కుటుంబం,

ప్రతి ఒక్కరం బతకాలి, వాడికి మన గుండెలో గుడికట్టుకుని బతకాలి,

నజీం హిక్మత్ చెప్పినట్లుగా

however and wherever we are,
we must live as if we will never die.

14-5-2015

Leave a Reply

%d bloggers like this: