బ్రెజిల్ కవులు

91

కన్నెగంటి రామారావులాగా, ఉపేంద్రనాథ్ చోరగుడిలాగా నేను ప్రపంచపథికుణ్ణి కాను. కాని, ఎప్పటికప్పుడు కొత్తదేశాలు చూడాలనీ, కొత్త సముద్రాలు దాటాలనీ ఉవ్విళ్ళూరుతుంటాను. నాకు ఎప్పుడో ఏ సిద్ధుడో అంజనమొకటి అనుగ్రహించాడు.ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దాన్ని నా కళ్ళకి రాసుకుంటే చాలు, నా భావనాప్రపంచంలో కొత్తద్వీపాలకీ, కొత్త దిగంతాలకీ ఇట్టే ఎగిరిపోతుంటాను. చాలాసార్లు పూర్వకాలాల్లోకి పయనిస్తూంటాను, నిర్విశేషంగా అదృశ్యమైపోయిన ప్రాచీన నాగరికతల్లోకి కూడా పయనమైపోతుంటాను.

అట్లా ఈ మధ్యకాలంలో నేను చూసిన దేశం బ్రెజిల్. దక్షిణ అమెరికా ఖండంలో అతి పెద్ద దేశం. ఆ దేశాన్ని నాకు పరిచయం చేసిన రెండు ట్రావెల్ గైడ్లు: ఎలిజబెత్ బిషప్, ఇమాన్యుయెల్ బ్రసిల్ సంకలనం చేసిన An Anthology of Twentieth Century Brazilian Poetry (1972), ఫ్రెడరిక్ జె విలియమ్స్ అనే ఆయన అనువదించి సంకలనం చేసిన poets of Brazil (2004).

రెండు పుస్తకాలూ కలిపి చదువుకుంటుంటే, బ్రెజిల్ నా కళ్ళముందు ఆవిష్కృతమవుతూ ఉంది. ఎలిజబెత్ బిషప్ స్వయంగా కవయిత్రి. చాలాకాలంగా బ్రెజిల్ కవిత్వానికి సంబంధించి ఆమె సంకలనమే ప్రామాణికంగా కొనసాగుతూ వచ్చింది. అందులో ఆమె ఎంపిక చేసిన కవులూ, కవితలూ ఇరవయ్యవశతాబ్దపు బ్రెజిల్ గురించి మనకొక స్థూల రేఖాకృతిని గోచరింపచేస్తారు. తమ సంకలనానికి సంపాదకులిద్దరూ చక్కటి ముందుమాట కూడా రాసారు. ఆ ముందుమాట చదవగానే ఆ బ్రెజిల్ కవులు మనకెంతో సన్నిహితులైపోతారు. తమ ముందుమాట మొదలుపెడుతూనే వాళ్ళిట్లా రాసారు:

‘కవులన్నా, కవిత్వమన్నా బ్రెజిల్లో గొప్ప గౌరవం. ఆ మనిషి వ్యాపారస్థుడు గానీ, రాజకీయవేత్తగానీ, అసలతడికి కవిత్వంతో ఏ మాత్రం సంబంధం లేకపోయినా, అతణ్ణి ఆదరంగా పలకరించవలసి వచ్చినప్పుడో, లేదా ప్రశంసించవలసి వచ్చినప్పుడో, కవీ అని పిలవడంలో వాళ్ళకో సంతోషం..’

ఈ లక్షణం భారతదేశానిదీ, చైనాదీ, మధ్యాసియా దేశాలదీ కూడా. మనదేశంలో ఒక మనిషి ప్రధానమంత్రి అయినతర్వాత కూడా, రాష్ట్రపతి అయిన తర్వాత కూడా కవిత్వం రాయాలనీ, కవి అనిపించుకోవాలనీ ఉత్సాహపడుతుంటాడు. తాను కవితలు రాయలేకపోతే, కనీసం మరొక కవయిత్రి కవితలు అనువాదమేనా చెయ్యాలనుకుంటాడు.

కానీ, అమెరికాసంయుక్త రాష్ట్రాల్లోలాగా,బ్రెజిల్లో కేవలం కవిత్వం మీదనే బతికే అవకాశం ఉండదు కాబట్టి, ఆ కవులు డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీరులుగా ఏదో ఒక వృత్తిసాగించుకుంటూ, కవిత్వం కూడా రాస్తుంటారని కూడా ఎలిజబెత్ బిషప్ చెప్తోంది. మన శ్రీ శ్రీ లాగా అక్కడ అత్యంత ప్రజాదరణకి నోచుకున్న కార్లోస్ డ్రమ్మండ్ డె ఆండ్రాడే లాంటి కవి మాట్లాడిన మాటలు, ఛలోక్తులూ కూడా పదే పదే తలుచుకుని ఆ మనుషులు మురిసిపోతుంటారని కూడా ఆమె రాసింది. అన్నిట్లోకీ మాన్యుయెల్ బండీరా అనే కవి గురించి రాసిన రెండు మాటలు మర్చిపోవడం కష్టం. ఒకటి, రియో డి జనిరో లో ఆయన ఉండే అపార్ట్ మెంటు ముందు ఆయనకోసం పార్కింగ్ ప్లేస్ ని శాశ్వతంగా కేటాయించిపెట్టారట, ఆయనకి కారు లేకపోయినా, డ్రైవింగు చేతకాకపోయినా. (ఈ మాట విజ్జితో అంటే అంది కదా, బహుశా, ఆయన్ను చూడటానికి, కలవడానికీ వచ్చే వాళ్ళకి కావలసి ఉంటుంది కదా అని. నిజమే, నాకు తట్టలేదు.) రెండోది, ఆయన రిటైర్ అయ్యేనాటికి, పూర్తి పెన్షను కు సరిపడా సర్వీసు లేదట. కానీ, ఆయన ఉద్యోగానికి సంబంధించిన మానేజిమెంటు ఆయనకి పూర్తి పెన్షను మంజూరు చెయ్యాలని ప్రతిపాదిస్తే ఆ తీర్మానాన్ని చప్పట్లు చరుస్తూ మరీ ఏకగ్రీవంగా ఒప్పేసుకున్నారట.! (నేను కూడా కవినే కదా, నాక్కూడా ఇట్లాంటి గౌరవమిస్తానంటే, రోజూ ఆఫీసుకి అరగంట లేటుగా వెళ్ళడానికి అనుమతిస్తే చాలని కోరుకుంటాను).

ఎలిజబెత్ బిషప్ ఇరవయ్యవ శతాబ్ది కవుల్ని సంకలనం చేసిందనీ, కానీ, తొలియుగాలనుంచీ ఇప్పటిదాకా బ్రెజిల్ కవిత్వాన్ని ప్రతిబింబించే సంకలనం కూడా ఒకటి రావాలనీ ఫ్రెడిరిక్ విలియమ్స్ తన సంకలనం వెలువరించాడు. ఆ సంకలనానికి కూడా రెండు ఆకర్షణలున్నాయి. బ్రెజిల్ కవిత్వం భాషా పరంగా పోర్చుగీసు కవిత్వం. కాబట్టి, అది పోర్చుగీసుమూలమూ, ఇంగ్లీషు అనువాదమూ ఉన్న ద్విభాషా సంకలనం. రెండవది, బ్రెజిల్ కవిత్వ వికాసాన్ని సమగ్రంగా వివరించే సుదీర్ఘమైన పరిచయ వ్యాసం.

రెండు సంకలనాలనుంచీ, రెండు కవితలు మీ కోసం. మొదటిది, బ్రెజిల్ రొమాంటిక్ కవుల్లో అగ్రేసరుడైన గోంకాల్వ్స్ డియాస్ (1823-64) రాసిన ప్రవాసగీతం. రెండవది, ఇటీవలి కవుల్లో ప్రతిభావంతుడిగా పరిగణించే జొయావో కబ్రాల్ డె మెలో నెటో (1920-) రాసిన కవిత.

ప్రవాస గీతం/ గొంకాల్వ్స్ డియాస్

నా దేశంలో ఎక్కడ చూసినా తాటిచెట్లు,
అక్కడ స్వర్గాన్ని తలపించే పక్షిరుతాలు.
ఇక్కడ కూడా పక్షులు కూస్తుంటాయికాని
అక్కడ వినిపించే కలకూజితాలు కావు.

మా ఆకాశాల్లో అసంఖ్యాక నక్షత్రాలు,
మా మైదానాల్లో అగణితపుష్పరాశులు.
మా అడవుల్లో అపారమైన జీవితేచ్ఛ,
మా జీవితాల్లో చెప్పలేనంత ప్రేమ.

సంజవేళ మాగన్నుగా కలగంటున్నప్పుడు
అక్కడ పట్టలేనంత సంతోషపు స్ఫురణ.
నా దేశంలో ఎక్కడ చూసినా తాటిచెట్లు,
అక్కడ స్వర్గాన్ని తలపించే పక్షిరుతాలు.

నా దేశంలో కనిపించే సౌందర్యరాశులు
ఇక్కడ నాకెక్కడా కనిపించడం లేదు.
సంజవేళ మాగన్నుగా కలగంటున్నప్పుడు
అక్కడ పట్టలేనంత సంతోషపు స్ఫురణ.
నా దేశంలో ఎక్కడ చూసినా తాటిచెట్లు,
అక్కడ స్వర్గాన్ని తలపించే పక్షిరుతాలు.

ముందు నా దేశానికి పునర్యానమవకుండా
భగవంతుడా, నేను మరణించకుండాలి.
నేనాస్వాదించేలోపు కనుమరుగుకాకుండాలి,
ఇక్కడెక్కడా కనిపించని అక్కడి సౌందర్యాలు,
ఆ తాటిచెట్లు, ఈతచెట్లు, పోకచెట్లు, కొబ్బరిచెట్లు,
స్వర్గాన్ని నేలకు దింపే ఆ కలకూజితరవాలు.

కవిత/ జొయావో కబ్రాల్ డె మెలో నెటో

నా కళ్ళల్లో దుర్భిణులున్నాయి
మైలుదూరంనుంచే వీథుల్లోకి చూడగలవు
నా అంతరంగంలోకీ చూడగలవు.

అగోచరనదీ ప్రవాహాల్లో
యువతులు ఈదులాడుతుంటారు మీనాల్లాగా
వస్తూ పోతూ.
గుడ్డి చేపల్లాగా కార్లు అల్లుతుంటాయి
నా చూపుల్ని యాంత్రికంగా.

ఇరవయ్యేళ్ళయింది, బయటికిరానేలేదు
నేను నా నుంచి సదా ఎదురుచూస్తున్న
ఆ వాక్యం.

ఇక, మరణించిన నా ముఖచిత్రాన్ని
ఎటూ తేల్చుకోలేకుండా
ఇట్లా తేరిపారచూస్తూనే ఉంటాను.

11-8-2017

Leave a Reply

%d bloggers like this: