బోర్హెస్ సంభాషణలు

Reading Time: 2 minutes

89

మంచం మీద వెల్లకిలా పడుకుని ఏదన్నా పుస్తకం చదువుకోడంలో గొప్ప సుఖముంది. కానీ కొన్ని పుస్తకాలు పడుకుని చదువుకునేవికావు, కూర్చుని చదవవలసినవి. పక్కనొక నోటు పుస్తకం, కలం లేకుండా తానే పుస్తకం చదవలేనని అకిరా కురొసువా రాసుకున్న మాటలు నాకు మరెవరి విషయంలో కాకపోయినా బోర్హెస్ విషయంలో మాత్రం అక్షర సత్యాలనిపిస్తాయి.

జోర్జ్ లూయీ బోర్హెస్ (1899-1986) ని ప్రసిద్ధ అర్జెంటీనియన్ రచయిత అనో లేదా మాజికల్ రియలిస్టు ధోరణికి ఆద్యుడనో పరిచయం చెయ్యడం చాలా కొరవగా ఉంటుంది. అతణ్ణి ప్రపంచ రచయిత అని అన్నా కూడా ఇంకా ఏదో మిగిలిపోతూనే ఉన్నట్టనిపిస్తుంది. ‘జాన్ డన్ అనగానే గొప్ప కవి అని స్ఫురిస్తుంది. కాని షేక్ స్పియర్ అనగానే ఆ పేరు మనలో రేకెత్తించే స్పందనలు అపారంగానూ, అంతులేకుండానూ ఉంటాయి’ అని బోర్హెస్ అన్న మాటలు బోర్హెస్ కి వర్తింపచెయ్యవచ్చు.

బోర్హెస్ ని చదువుతున్నప్పుడు పక్కన నోట్ బుక్ ఎందుకుంటాలంటే బోర్హెస్ చెప్పిన మాటలు రాసుకోడానికి కాదు. (నిజానికి అతడు మాట్లాడే ప్రతి మాటా మనం మనం మళ్ళా ఎత్తిరాసుకునేదిగానే ఉంటుంది). అంతకన్నా కూడా ఆ మాటలు మనలో రేకెత్తించే అద్వితీయ, అనూహ్య స్పందనల్నీ, స్ఫురణల్నీ అప్పటికప్పుడే రాసిపెట్టుకోకపోతే అవి మనకు తెలీకుండానే ఆవిరైపోతుంటాయి. అపారమైన సముద్రాన్ని చూస్తున్నప్పుడో, ప్రగాఢమైన సంగీతం వింటున్నప్పుడో మనలో రేకెత్తే స్పందనల్లాంటివవి.

నేను మాట్లాడుతున్నది నేనింతదాకా చదివిన బోర్హెస్ Fiction, Non-Fiction ల గురించి. అవి మాధ్యమాలు. అటువంటి మాధ్యమాలతో పనిలేకుండా, అతడు నేరుగా మాట్లాడితే ఎలా ఉంటుంది? అతడి 84 వ ఏట, ఆస్వాల్డో ఫెర్రారి అనే ఒక యువకవి ఆయన్ని ఎన్నో విషయాలమీద మాట్లాడించి ఆ సంభాషణలు రికార్డు చేసాడు. అవి ఇప్పటిదాకా మూడు సంపుటాలుగా వెలువడ్డాయి. అందులో రెండో సంపుటం Conversations ( సీగల్ బుక్స్, 2015) చదువుతున్నాను. ఇంకా పూర్తికాలేదు. పుస్తకం పూర్తిగా చదవకుండానే రాయడం నా తత్త్వానికి విరుద్ధం కానీ, ఉండబట్టలేక రాస్తున్నాను. ఏమి చెయ్యను? బోర్హెస్ ‘మాటలనియెడు మంత్రమహిమ’ అటువంటిది.

అసలు అన్నిటికన్నా ముందు, ఇటువంటి ఒక మానవుడు నాకు ఆధునిక తెలుగు సాహిత్యంలో ఎందుకు కనిపించడనేది నన్ను వేధించే ప్రశ్న. ముఖ్యంగా నా సమకాలిక సమాజంలో? ఒక్క మనిషేనా, ఒక్క సాహిత్యవేత్త అయినా ఇట్లా మాట్లాడగలిగేవాడు ఇప్పుడు నాకు కనిపించడం లేదు. ఇప్పుడెవరేనా ఒక రచయితని లేదా కవిని కలిసామనుకోండి, రెండు మాటల తర్వాత సంభాషణ పరనిందగా మారిపోతుంది. మనం గాసిపింగ్ స్థాయిని మించి ఎదగలేకపోయాం. ఎందుకంటే, మన ప్రపంచం చాలా చిన్నది. మన దృష్టి ఎంతసేపూ, మన పొరుగుకవికి లభించిన ఆహ్వాన పత్రిక దగ్గరే ఆగిపోతుంది.

తెలుగు సాహిత్యమంటే ఈ పదేళ్ళ సాహిత్యమేనా? నన్నయ, తిక్కన,పెద్దన, పోతనల గురించి సాధికారికంగా సంభాషించగలిగే సాహితీవేత్తని ఎవరినీ నేనీ మధ్య కాలంలో కలవలేదు. ఇక వ్యాసవాల్మీకుల భాస కాళిదాసుల సంస్కృతసాహిత్యాన్ని కూడా చేరిస్తే మల్లంపల్లి శరభయ్యగారే నేను చూసిన మొదటి, చివరి సాహితీ వేత్త.

అట్లాంటిది, హోమర్, వర్జిల్, సెర్వాంటిస్, గొథే, షేక్ స్పియర్, వోల్టేర్, వాల్ట్ విట్మన్, ఎడ్గార్ అలన్ పో, చెస్టర్ టన్, బెర్నార్డ్ షా, టాల్ స్టాయి, డోస్టొవిస్కీ వంటి పాశ్చాత్య మహారచయితల్నీ, కన్ ఫ్యూసియస్, బౌద్ధం, హిందూ దర్శనాలనీ, స్వోడెన్ బెర్గ్ వంటి మిస్టిక్ లనీ, స్పినోజా వంటి తాత్త్వికుల్నీ, టర్నర్ వంటి చిత్రకారులూ, బాక్ వంటి సంగీతస్వరకర్తల్నీ-ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాక్పశిమాల్నీ, ఉత్తరదక్షిణాల్నీ ఒక్క గుక్కలో స్మరించుకోగల, వారి గురించి సాధికారికంగా సంభాషించగల సాహితీవేత్త ఎవరున్నారు?

నాకు తెలిసినంతవరకు బోర్హెస్ మాత్రమే.

బోర్హెస్ గురించి నేనింతకుముందొకసారి రాసాను. కాబట్టి అదంతా మళ్ళా రాయాలని లేదు.

కానీ గమనించవలసిందేమంటే, మనం బోర్హెస్ ని చదువుతున్నప్పుడు, లేదా ఈ సంభాషణల్లో వింటున్నప్పుడు, మనకు తెలిసిన సాహిత్యప్రపంచం కూడా కొత్తగా కనిపిస్తుంది. అంటే, కేవలం వాళ్ళ సాహిత్య కృషిని ప్రశంసించడం కాదు, వాళ్ళని బోర్హెస్ కొత్త insights తో గుర్తు చేసుకుంటాడు. ఆ అంతర్దృష్టి అత్యంత మౌలికం. అసీమిత స్ఫూరిదాయకం. ఆ అంతర్దృష్టికోసం బోర్హెస్ ని చదవాలి. ప్రపంచ సాహిత్యమంతా చదివినవాడికి మాత్రమే, చదివి జీర్ణం చేసుకున్నవాడికి మాత్రమే సాధ్యమయ్యే లోచూపు అది. ఒక సున్నితపు త్రాసులాంటి రసజ్ఞహృదయం మాత్రమే చేపట్టగల మూల్యాంకనం అది.

బోర్హెస్ ని ఎందుకు చదవాలి? ముఖ్యంగా నా సమకాలిక తెలుగు రచయితలు? ఎందుకంటే తమ ప్రపంచం, తమ రచనలు, తమ ఆత్మ ప్రశంసలు, పుస్తకావిష్కరణ సభల్లో చేసుకునే స్తోత్రాలు ఎంత సంకుచితమైనవో తెలుసుకోడానికి. వాళ్ళ సంగతి సరే, నా వరకూ నేను బోర్హెస్ ను ఎందుకు చదవాలంటే, నేను చదివింది చాలా స్వల్పమని గుర్తుచేసుకోడానికి. జీవితాన్నిఎప్పటికప్పుడు సరికొత్తగా చూడటమెట్లానో తెలుసుకోడానికి.

ఒక్క మాటలో చెప్పాలంటే, బోర్హెస్ ఒక మిస్టిక్, కానీ ఆధునిక rational ప్రపంచం మాత్రమే సృష్టించగల మిస్టిక్. ఆ మిస్టికానుభవం ఎలాంటిదో తెలుసుకోడానికి బోర్హెస్ కథలు చదవాలి, పుస్తక సమీక్షలు చదవాలి, ఇదిగో, ఈ సంభాషణలు చదవాలి.

ఈ సంభాషణ ల గురించి మళ్ళా రాస్తాను. కానీ, బోర్హెస్ మన కాలపు సోక్రటీస్, మన కాలపు కన్ ఫ్యూషియస్ అని మాత్రం ఇప్పటికి చెప్పనివ్వండి.

27-12-2017

Leave a Reply

%d bloggers like this: