బొంబోల్

86

చినుకు ఏప్రిల్ సంచికలో మేరీ లూయీ బొంబోల్ రాసిన కథకి పి.సత్యవతి గారు చేసిన అనువాదం ‘చెట్టు ‘ పేరిట వచ్చింది, చదివారా?

బొంబోల్ (1910-80) బోర్హెస్ వంటి మహారచయిత మన్నన పొందిన రచయిత్రి. సత్యవతిగారు ఇప్పటి తెలుగు కథకుల్లో అగ్రశ్రేణిలో నిలబడే రచయిత్రి. ఒక విశిష్ఠ రచయిత్రి మరొక విశిష్ఠ రచయిత్రికథకు చేసిన అనువాదం అది.

ఇటువంటి కథలు చదవడం, వాటి గురించి చర్చించడం తెలుగు కథకులకి చాలా అవసరం. వాళ్ళల్లో చాలామందికి కథ అంటే, వార్తా కథనంలాగా, ఒక లీనియర్ నెరేటివ్. ఇప్పుడు కవిత కథలాగా మారుతుంటే కథ కవిత్వంగా మారుతోంది. కవిత లాగా ఒక మెటఫర్ ని ఎన్నుకుని దాంతో నెరేటివ్ ను అల్లడమనేది చెకోవ్ నుంచీ ఉన్నప్పటికీ, 1950 తర్వాత ప్రపంచకథకులు ఆ టెక్నిక్ కి కొత్త మెరుగులు దిద్దారు. క్లారిస్ లిస్పెక్టర్, బొంబోల్ లాంటి లాటిన్ అమెరికన్ రచయిత్రుల కథలు చదివితే గొప్ప చలనచిత్రాల్ని చూసిన అనుభూతి మిగులుతుంది.

ఈ కథ గురించిన సమగ్ర విశ్లేషణ కావాలనుకునేవాళ్ళు గూగుల్ పేజీలు తిరగెయ్యవచ్చు. కాని ఎంత చర్చించినా ఈ కథలో రబ్బర్ చెట్టు కేంద్రంగా రచయిత్రి అల్లిన కథా, అందులో ఆమె మొజార్ట్ నుంచి చోపిన్ దాకా ప్రస్తావించిన సంగీతతరంగాలు మనకేదో చెప్తూనే ఉంటాయి. ఒక సంగీత కృతి వినడంలాగా ఇటువంటి కథ చదవడంలో కూడా పూర్తిగా వివరణకు లొంగని సబ్జెక్టివిటీ మిగిలే ఉంటుంది. గొప్ప సాహిత్యపు ఒక లక్షణం అది. అందుకనే మనం ఆ సాహిత్యకృతుల్ని పదేపదే సమీపించకుండా ఉండలేం.

6-5-2013

Leave a Reply

%d bloggers like this: