బెన్ ఒక్రి

85

పాశ్చాత్య రచయితల్ని, ముఖ్యంగా ఐరోపా రచయితల్ని చదువుతుంటే, ఒక సెమినార్ హాల్లో ఒక మేధావితోనో, తాత్త్వికుడితోనో గంభీరమైన విషయాల గురించి మాట్లాడుకున్నట్టు ఉంటుంది. కాని ఆఫ్రికా రచయితల్ని చదివినప్పటి అనుభవం వేరు. వాళ్ళు పూర్వపు రచయితలైనా, ఇప్పటి రచయితలైనా కూడా, వాళ్ళని చదువుతుంటే, మన గ్రామాలకి వెళ్ళి, అక్కడి మట్టి అరుగులమీద కూచుని, ఆ గ్రామ వృద్ధులో, రైతులో, లేదా అక్కడి ముంగిళ్ళలో గృహిణులో చెప్పే సుద్దులు విన్నట్టుంటుంది.

బెన్ ఒక్రి  A Time for New Dreams, Poetic Essays (2011) చదువుతుంటే, అట్లానే అనిపించింది. బెన్ ఒక్రి నైజీరియన్ కవి, నవలా రచయిత, బుకర్ ప్రైజ్ విజేత. రానున్న కాలంలో నోబెల్ పురస్కారాన్ని కూడా పొందే అవకాశమున్నవాడు.

ఆఫ్రికా గురించి, మనిషి గురించి, బాల్యం గురించి, సాహిత్యం గురించి అతడు రాసుకున్న ఆలోచనల్లోంచి మీకోసం కొన్ని:

1

మునపటికన్నా కూడా ఇప్పుడు మనకి కవిత్వం చాలా అవసరమని ఆకాశానికి తెలుసు. కవిత్వం చెప్పే సత్యం మనల్ని ఇబ్బంది పెడుతుంది, అయినా అది మనకి కావాలి.వినడంలోని మహిమని అది మనకి పరోక్షంగా గుర్తు చేస్తూనే ఉంటుంది. పరస్పరం ఎక్కుపెట్టుకున్న తుపాకుల ప్రపంచంలో, బాంబుల వాదవివాదాల మధ్య, మన పక్షం, మన మతం, మన రాజకీయాలే సరైనవైనవని నమ్మే ఉన్మాదం మధ్య, ఎప్పుడూ యుద్ధం వైపే ఒరిగిపోయినట్లుండే ప్రపంచంలో-మనకొక కంఠం కావాలి, మనలోని ఉదాత్తమైనదానితో మటుకే సంభాషించే కంఠం. మన సంతోషాలతో, మన బాల్యాలతో, మన వ్యక్తిగత, జాతీయ పరిస్థితుల చిక్కుముడితో మాట్లాడే ఒక స్వరం కావాలి మనకి. మన సందేహాలతో, మన భయాలతో మాట్లాడే ఒక గొంతుక. ఒకవైపు మనం మనుషులుగానూ మరొకవైపు నక్షత్రాలకు మిత్రులుగానూ ఉంటున్నప్పుడు మనలో ఏయే పార్శ్వాలు మేలుకుంటాయో, ఆ పార్శ్వాలన్నిటితోనూ సంభాషించే ఒక గొంతుక కావాలి మనకి.

2

నిజానికి మనకి రాజకీయాలకన్నా కవిత్వమే ఎక్కువ సన్నిహితం. తినడంలానూ, నడవడంలానూ, అది మనకి చాలా సహజం. అసలు మనం పుట్టడంలోనే శ్వాసించడంతో పాటు కవిత్వం కూడా ఉంది. పుట్టుక కవిత్వం. అభౌతికం రక్తమాంసాలు ధరించడం అది. మరణించడం కూడా కవిత్వమే. రక్తమాంసాలు అభౌతికంలో విలీనమైపోవడం అది. ఒక వలయం పూర్తవడంలోని ఇంద్రజాలం. ఒక అమేయ నిశ్శబ్దంలోకి అనాహత జీవనరాగం మరలిపోవడం అది. చావుకీ, పుట్టుకకీ మధ్య, మన రోజువారీ క్షణాలు కూడా ప్రాథమికంగా కవితామయమే. అంతరంగానికీ, బహిరంగానికీ మధ్య ఒక విచిత్రమైన సాంధ్యస్థితి. మన లోపల స్ఫురించే కాలాతీత స్పృహకీ, కళ్ళముందే కరిగిపోయే బాహ్యదృశ్యానికీ మధ్య ద్వైదీభావస్థితి.

3

బాల్యం ఎప్పటికీ అంతుబట్టని ఒక రహస్యం. ఆత్మ కాలాతీతం, శరీరం కొత్తది, ప్రపంచం సంక్లిష్టం. ఎట్లాంటి పరిస్థితి. చిన్న దేహంద్వారా ఒక మహిమోన్నత భవిష్యత్తు విప్పారడం. అందుకనే బాల్యం మనల్ని విభ్రాంతపరుస్తుంది. అది ఎప్పటికీ చేతికందదు. మనలో ఎప్పటికీ చేతికందని పార్శ్వమది. మనం పెద్దవాళ్ళమవడంలో మన బాల్యం అదృశ్యమైపోయింది. జ్ఞాపకాలుంటాయి, సంవేదనలు మిగుల్తాయి, కాని ఆ స్థితి దాటిపోతుంది. దాంతో పాటే ఆ ప్రపంచమూ తరలిపోతుంది. అవును బాల్యమొక ప్రపంచం. ఒక ప్రత్య్ఖేమైన లోకం. దాని అద్భుతమైన కోణాలు మళ్ళా మళ్ళా దొరికేవి కావు. అప్పటి సంక్షోభాలు, అయోమయాలన్నీ తప్పుడు తథ్యాలుగా స్థిరపడిపోతాయి. ఆనాటి భయాలు మనలో కదలాడుతూనే ఉంటాయి, కాని ఎక్కడో గుర్తుపట్టలేం. ఇక మనం చేసేదల్లా ఇతరుల బాల్యాన్ని చూస్తూండటమే. అద్దం లో చూసుకున్నట్టు వాళ్ళ బాల్యాన్ని మనం పరికిస్తూంటాం. చూడబోతే బాల్యం అందరికీ కూడా వర్తించేదే అన్నట్టు. కాని బాల్యం శిశువులకు మటుకే సొంతం. అందుకనే మనం బాల్యమనే అద్దంలో చూసినప్పుడు మనకి కనిపించే ప్రతిబింబం మసగ్గా ఉంటుంది. మనం పోగొట్టుకున్న ప్రపంచం అస్పష్టమైన జ్ఞాపకాల్ని మనలో రేపుతుంది. కాని మనకి మళ్ళా వెనుతిరగడానికి తలుపులు తెరిచి ఉండవు. ఆ సరిహద్దులు మూసుకుపోయి ఉంటాయి. అద్దంలో కనిపించే ఆ తలం ప్రపంచంలోంచి అదృశ్యమైపోయి ఉంటుంది. ఆ విధంగా మనం పెద్దరికంలోకి ప్రవాసమైపోయి ఉంటాం. ఆ అద్భుత రహస్యాలకి కొన్ని సార్లు ఇంకా విభ్రాంతపడుతోనేనా ఉంటాం. లేదా వాటికి శాశ్వతంగా అంధులమేనా అయిపోతాం.

4

జాతులు పతమనమవుతున్నాయంటే, అందులోరహస్యమేమీ లేదు. వాటి రచయితలు పతనమయినప్పుడే ఆ జాతులు పతనం కావడం కూడా మొదలవుతుంది. జాతుల వైఫల్యానికి మొదటి కొండగుర్తు, అవి వాటి రచయితల్ని గౌరవించుకోలేకపోవడం. ఎందుకట్లా? ఎందుకంటే, ఒక జాతి అవ్యక్త సత్త్వానికీ, ఒక దేశ జీవస్ఫూర్తికీ ఆ జాతి రచయితలే ప్రతినిధులు కాబట్టి.

5

ఈ సూత్రం చాలా ఖండాల్లో పనిచేస్తూండటం చూసాన్నేను. ఆఫ్రికా నే తీసుకోండి, స్వాతంత్ర్యస్ఫూర్తి రగిలిన తొలిరోజుల్లో సత్యాన్వేషులైన దాని రచయితలు గొప్పగా గానం చేసారు. కాని వాళ్ళేం చెప్తున్నారో చాలా దేశాలు వినిపించుకోనేలేదు. దాంతో పతనమూ, అంతర్యుద్ధమూ తప్పలేదు. కనీసం ఆ దేశాలు ఇప్పుడైనా వింటాయని ఆశిద్దాం. తమ రచయితల్ని హింసించే, కైదు చేసే, హత్య చేసే, దేశం నుంచి తరిమేసే జాతులు తొందరలోనే తమ అజ్ఞానాంధకారంలో మృత్యుభూములుగా మారిపోతాయి. అట్లాంటి జాతుల్ని ఎవ్వరూ ప్రేమించలేరు. నిజానికి అట్లాంటి జాతులు తమని తామే ప్రేమించుకోలేవు.

6

ఒక నాగరికత తాలూకు పతాకదశ దాని స్వర్ణయుగమే కానక్కరలేదు. నిజానికి అది దాని ఫలితదశ. ఒక నాగరికత పతాకదశకు చేరుకునేది నిజానికి దాని తొలిదశల్లోనే. దీర్ఘకాల ప్రతికూల దశల్ని దాటుకుని ఒక జాతిజనులు తమని తాము నియంత్రించుకుంటూ, తమ సత్యాల్ని తాము కనుగొనగలుగుతూ గణనీయమైన, విలువైన లక్ష్యాల్ని తమకై తాము నిర్దేశించుకుంటూ నమ్మకంతో ఆ లక్ష్యాల దిశగా ప్రయాణిస్తో, వాటిని ఒక్కొక్కటే సాధిస్తోన్నప్పుడు గొప్ప ఆనందానికి లోనవుతో ఉన్నప్పుడే ఒక జాతి నిజంగా ఉచ్చదశలో అడుగుపెట్టినట్టు. డరయిస్ ని ఓడించినప్పుడు అలెగ్జాండర్ లాగా, ఎలిజబీత్ కాలంలో ఇంగ్లాండు లాగా: మనుషులు నిజంగా తమకు తాముగా రూపొందే కాలమది.

7

లావోత్సే చెప్పినట్టు, నిజమైన ఆతిథ్యం ఎప్పుడంటే, అతిథి గృహస్థు లానూ, గృహస్థు అతిథిలానూ ఉండగలినప్పుడు.

8

ఆఫ్రికాని కొట్టిపారెయ్యడం చాలా సులభం. ఆఫ్రికాని ఆదరించడం చాలా సులభం. ఆఫ్రికాని అభిమానిస్తున్నట్టు చెప్పుకోవడం చాలా సులభం. ఆఫ్రికాని దోచుకోవడం చాలా సులభం. ఇక ఆఫ్రికాని అవమానించడం కూడా చాలా సులభమే.కాని ఆఫ్రికాని యథార్థంగా చూడటం చాలా కష్టం. దాని వైవిధ్యాన్ని, దాని సంక్లిష్టతని, దాని సారళ్యాన్ని, దాని మనుషుల్ని చూడటం చాలా కష్టం. దాని ఆలోచనల్ని, దాని ఉపాదానాల్ని, దాని సాహిత్యాన్ని చూడటం చాలా కష్టం. దాని నవ్వుల్ని వినగలగడం, దాని క్రూరత్ర్వాల్ని అర్థం చేసుకోవడం,దాని ఆత్మశక్తిని దర్శించడం, దాని దుఃఖాన్ని తట్టుకోవడం, దాని ప్రాచీన దర్శనాల్ని అవగతం చేసుకోవడం చాలా కష్టం. ఆఫ్రికాని దర్శించడం ఎందుకు కష్టమంటే, దాన్ని చూడాలంటే, హృదయముండాలి కాబట్టి. ఎట్లాంటి అయోమయానికీ లోనుకాకుండా దాన్ని చూడాలంటే, చూసేవాళ్ళ ఆత్మలో ఎంతో సారళ్యముండాలి. పరిణతి చెందిన మనుషులకి మాత్రమే అపోహలు లేకుండా ఆఫ్రికాని చూడటం సాధ్యపడుతుంది.

9

కాంతి తెలివితేటలుగా ఫలదీకరణం చెందటమే ఐరోపా అనే ఒక పురాణగాథ. ఒక హృదయం ఆ పురాణగాథలో ఇరుక్కుని విలపిస్తోనే ఉంది.

10

చెప్పే విషయమే నిలబడుతుందనుకొంటారు కొందరు. కాని చెప్పే పద్ధతి వల్లనే, రూపం వల్లనే సారానికి నిలబడే శక్తి వస్తుంది.

11

మనలో ప్రతి ఒక్కరిలోనూ ఆఫ్రికా అనే ఒక చోటు ఉంది. మనందరిలోనూ ఆఫ్రికా ఉంది.

13

బయటి ఆఫ్రికా సమస్యల్తో రుజాగ్రస్తంగా ఉంటే, మన లోపలి ఆఫ్రికా మనల్ని మానసికంగా అస్వస్థుల్ని చేస్తుంది.

14

ఆఫ్రికాని మనం మళ్ళా కొత్తగా కనుగొనవలసి ఉంది. యూరోపు ఆఫ్రికాని మొదటిసారి చూసినప్పుడు తప్పుగా చూసింది. నిజానికి అది కలుసుకోవడం కాదు, కాజేయడం. వాళ్ళు చూసిందీ, తదనంతర తరాలకీ వారసత్వంగా అందచేసిందీ తమ అపోహనే. వాళ్ళసలు ఆఫ్రికాని చూడనే లేదు. వాళ్ళు ఆఫ్రికాని చూడటంలో పడ్డ పొరపాటే ఇప్పటి సమస్యలకు దారితీసింది. వాళ్ళు దాన్ని అత్యాశతోనే చూసారు, దాన్నుంచి ఏది పొందాలో అదే పొందారు. వాళ్ళు చేసిన అన్యాయాలన్నింటినీ తమ అత్యాశతోనే సమర్థించుకున్నారు.

15

పిల్లల్లో ఉండే నిష్కాపట్యం ఏ కొంచెమో పెద్దల్లో కూడా కనిపించినప్పుడే ఆ జాతులు అత్యుచ్చదశలో ఉన్నట్టు. ప్రాచీన దేవాలయాల్లో కనిపిస్తుందే, అట్లా సరళంగా ఉండగలిగే పరిణతి సాధ్యపడ్డట్టు.

 

15-9-2016

Leave a Reply

%d bloggers like this: