బయ్యన్న

 

81

ఇతిహాస సంకలన సమితి వారు గిరిజన సంస్కృతి మీద రెండు రోజుల పాటు ఏర్పాటు చేసిన నేషనల్ వర్క్ షాప్ లో పాల్గోటానికి శ్రీశైలం వెళ్ళాను. నిన్న తిరిగివస్తూంటే ఒక చెంచురైతు తన పొలంలో మొక్కజొన్న పంట పండిదనీ, తొలికంకులు తమ దేవుడు బయ్యన్నకు నైవేద్యంగా పెడుతున్నాననీ, ఆ పూజకి నన్ను కూడా రమ్మనీ అడిగాడు.

సుండిపెంటలో ఉంటున్న చెంచువాళ్ళకు ప్రభుత్వం అటవీహక్కులచట్టంకింద ఇచ్చిన భూమి అది. ఆ భూమి వాళ్ళకి పట్టాలిచ్చి చదును చేస్తున్నప్పుడు వెళ్ళాను. ఇప్పుడక్కడ తొలిపంట పండిందని తెలిసినప్పుడు సంతోషమనిపించింది.

మిట్టమధ్యాహ్నం పన్నెండింటికి అక్కడకు వెళ్ళగానే ఏపుగా పెరిగిన మొక్కజొన్నతోట నన్ను కట్టిపడేసింది. ఏళ్ళతరబడి భూమిలో పేరుకున్న సారమంతా బలమైన కంకులుగా కనిపిస్తోంది. నిలువెత్తు పెరిగిన మొక్కలపొత్తిళ్ళల్లో కంకుల్ని చూస్తుంటే జీవితాన్ని అప్పుడే మొదటిసారి చూస్తున్నట్టు, చాలా దగ్గరగా చూస్తున్నట్టు, ఎంత దగ్గరగా అంటే చేతుల్తో పట్టుకునేటంత దగ్గరగా చూస్తున్నట్టనిపించింది.

ఆ రైతు కుడుముల చిన్నమూగెన్నది చిన్నారుట్ల గూడెం. అతడి భార్య గౌరమ్మ భూమని వారి ఆడపడుచు. తుమ్మలబైలు గూడెం ఆమెది. ఆమె అక్కా, మూగెన్న తల్లీ, మరికొందరు కుటుంబసభ్యులూ ఉన్నారక్కడ.

బయ్యన్న అంటే భైరవస్వామి. ఒక రకంగా వీరభద్రస్వామికి మరొకరూపమని కూడా వాళ్ళ నమ్మకం. బయ్యన్న కుడుముల గోత్రానికి ఇలవేల్పు. తోటలో అడుగుపెడుతూనే బయ్యన్నకి కట్టిన చిన్నమందిరం కనిపించింది. అందులో నిలువెత్తు విగ్రహం. ఎక్కడ చేయించావని అడిగితే ఆళ్ళగడ్డ లో చేయించానని చెప్పాడు. కర్నూలు జిలా ఆళ్ళగడ్డ విజయనగరకాలం నుంచీ శిల్పులకి ప్రసిద్ధి. యర్రగొండపాలెం మండలంలో తెలుగురాయని చెరువు అనే గూడెముంది. అక్కడి బయ్యన్న స్వామి విగ్రహం ఫొటో తీసి ఆళ్ళగడ్డ శిల్పులకిస్తే వాళ్ళు శిల్పం చెక్కారన్నాడు. ఆ బయ్యన్న ఏకశిలామూర్త్. తనలో తాను ఆలోచనలో నిమగ్నుడైనట్టున్న నేత్రాలు, వీరభద్రమీసం. కింద కాళ్ళకి చెట్టుకుని నాగసర్పం. వెనగ్గా కుక్క. ఆయన పాదాల దగ్గర రాశిపోసిన క్షీరాన్నం. అరటిపండ్లు. కొబ్బరికాయలు
ఉడికించి నైవేద్యంగా పెట్టిన తొలిమొక్కజొన్నలు. పురిటిశయ్యమీద చనుబాలవాసనలాంటి సుగంధం.

నేను తొందరగా తిరిగి వచ్చేసే హడావిడిలో ఉన్నాను. పూజమొదలుపెట్టమని మూగెన్నను తొందరపెట్టాను. అప్పటికి ప్రాజెక్టు ఆఫీసరు కూడా అక్కడికి చేరుకున్నాడు. ఇక రావలసిన వాళ్ళెవరూ లేరు. ఆ ముంగిట్లో మూడు కడవలనీళ్ళు పోసి మూగెన్న దేవుడి ముందునిలబడ్డాడు. మమ్మల్ని కూడా అక్కడ నిలబడి పూజమొదలుపెట్టమన్నాడు. ‘మొదటి పూజ నీదే, నువ్వు రైతువి’ అన్నాడు ప్రాజెక్టు అధికారి. మూగెన్న ముందుకి అడుగువేసి అక్కడున్న కొబ్బరికాయ తీసి కళ్ళకద్దుకుని కొట్టడానికి ఉపక్రమించేంతలో-

ఉన్నట్టుండి కలవరం.

మాకు అర్థం కాక పక్కకు చూసేటప్పటికి, కింద మూగెన్న భార్య గౌరమ్మ పూనకంలోకి జారిపోయింది. ఆమె ముఖమంతా అసహనంగా కంపించిపోతోంది. రెండుచేతులూ మొక్కుతున్నట్టుగా దగ్గరగా పెట్టుకుని పళ్ళు పటపటలాడిస్తూ ఏదో అరవడం మొదలుపెట్టింది. మూగెన్న తల్లి ఆమెకేదో చెప్తోంది. కొన్ని క్షణాలకు నాకు అర్థమయిందేమంటే బయ్యన్న ఆమె మీద వాలాడు. ‘నరుడా, నాకు తప్పెట్లు పెడతానన్నావు, బజారు బజారూ తిప్పి ఊరేగిస్తానన్నావు. ఏమీ లేకుండానే ఈ పూజేమిటి’ అని అడుగుతున్నాడు. ‘ఇప్పుడు తప్పెట్లు ఎవరు కొడతారు? బాజాలు ఎవరు మోగిస్తారు? మనుషులెక్కడున్నారు? ఒక్క మనిషి ఎన్నని చూసుకుంటాడు?’ అంటున్నది మూగెన్న తల్లి. కాని బయ్యన్న ఊరుకోలేదు. అరుస్తున్నాడు. గొణుగుతున్నాడు, మారాం చేస్తున్నాడు. ‘నాకు తప్పెట్లు కావాలి. మీరంతా ఆడాలి. పాడాలి’ అంటున్నాడు.

కొబ్బరికాయ కొట్టబోయిన మూగెన్న ఆగిపోయి ఆ కొబ్బరికాయ అట్లానే పక్కన పెట్టేసి కిందకు వెళ్ళి గోడదగ్గర రాటకు వేలాడుతున్న డప్పు చేతుల్లోకి తీసుకున్నాడు. దానిమీద ఒక చేత్తో రాపాడుతూ మరొక చేత్తో వాయించడం మొదలుపెట్టాడు.అనాది మంత్రధ్వనిని ఆవాహన చేసినట్టుగా, అతీతకాలాల చెంచు పూర్వదేవతలంతా, పితృదేవతలంతా బిలబిల్లాడుతూ నల్లమల కొండలమీంచి అక్కడ వాలినట్టుగా ఆ ప్రాంతమంతా నా కళ్ళముందే మంత్రమయలోకంగా మారిపోయింది. ఆ తోట, ఆ భూమి, ఆ ప్రాజెక్టు అధికారి లేరప్పుడు. మేమేదో చరిత్రపూర్వ, జ్జానపూర్వ, స్మృతిపూర్వ ప్రపంచంలోకి నెట్టబడ్డాం. ఆ చప్పుడు వింటూనే చన్ను చేతికందిన శిశువులా బయ్యన్న చేతులు చాపాడు. తొలిపాల తడి పెదాలకి అందినట్టు ఆ ముఖంలో అంతదాకా ఉన్న అసహనం స్థానంలో ఒకింత ప్రసన్నత. పాలుతాగిన పిల్లాడిలా బయ్యన్న ఆడటం మొదలుపెట్టాడు. యుగాలుగా దేవుడు తమ మధ్యకు దిగివచ్చినప్పుడల్లా మనుషులు ఆడినట్టే, పాడినట్టే అక్కడున్న నలుగురైదుగురు చెంచు స్త్రీలూ, పురుషులూ కూడా ఆడటం మొదలుపెట్టారు.

తాను కొడుతున్న బాజా పక్కన పెట్టి మళ్ళా మూగెన్న దేవుడి ముందు నిల్చుని కొబ్బరికాయ కొట్టబోయాడు. కాని మళ్ళా బయ్యన్న అరవడం మొదలుపెట్టాడు. మూగెన్న నుంచున్నది బయ్యన్న విగ్రహం ముందు. పూజచెయ్యబోతున్నది బయ్యన్న విగ్రహానికి. కాని అతడి వెనక బయ్యన్న అతడి బార్యమీద వాలి గోల చేస్తున్నాడు. బయ్యన్న ఎక్కడున్నాడు? విగ్రహంలోనా? మనిషిలోనా? మూగెన్న వెనక్కి చూడకుండానే ‘స్వామీ, నాకు చేతనయ్యింది నేను చేస్తున్నాను. నువ్విట్లా నన్ను ఇబ్బంది పెట్టకు. నేన్నిన్ను బజారు బజారూ తిప్పి ఊరేగించలేదు నిజమే. కాని దసరాకి పండగ చేస్తాను. మేకపోతును బలిస్తాను. ఇప్పటికి నేను చెయ్యగలిగిందింతే’ అంటూ మళ్ళా కొబ్బరికాయ పక్కనపెట్టి బయ్యన్న నుదిటిన ఉన్న విభూతి తీసుకువెళ్ళి కిందనున్న గౌరమ్మ నుదుటిన అద్దాడు.

అప్పుడు మళ్ళా మూగెన్న పైకి వచ్చి కొబ్బరికాయకొట్టాడు. మేమంతా కొబ్బరికాయలు కొట్టాం. హారతి వెలిగించాం. అప్పుడు కింద నిప్పు వెలిగించారు. తొలి క్షీరాన్నం ముద్దలు తెచ్చి బయ్యన్న అగ్నిలో ఆహుతిచ్చాడు. ‘ఈ మంట మేం నోటితో ఊదం. దానికదే మండాలి. ఈ అన్నంకోసం కూడా మంట నోటితో ఊదం. ఈ పూజ అయ్యేదాకా ఒక్క కంకి కూడా ముట్టుకోం. ఇదిగో, ఇప్పుడీ అన్నం నిప్పుకిచ్చాం కదా. ఇంక మేం ఈ తొలి అన్నం తినొచ్చు. ఈ పంట కోసుకోవచ్చు’ అన్నాడు.అక్కడ రగుల్తున్న అగ్నిలో ఆ అన్నం ఆహుతిని చూస్తుంటే వేదకాలమానవుడు నవాగ్రాయణ పూజ చేసినట్టుగా ఉంది.

అప్పుడు చూస్తే, ఏడీ బయ్యన్న? గౌరమ్మ మామూలుగా బకెట్లో నీళ్ళు నింపి అక్కడ తెచ్చిపెడుతోంది. ఆమె ముఖం మామూలుగా, అంతదాకా ఏమీ జరగనట్టే ఉంది.నల్లని చెంచుకళ ఉట్టిపడుతున్న ముఖం. అచ్చం మా అమ్మ ముఖంలానే. మా ఇలవేల్పు వీరభద్రుడు మా అమ్మ మీద వాలి వెళ్ళిపోయిన తరువాతా మా అమ్మ ముఖమెట్లా ఉండేదో అట్లానే.

‘మేం మామూలుగా తప్పెట్లు కొట్టకుండా బయ్యన్న పూజ మొదలుపెట్టం. ఆయన్ని పిలవకుండా పూజ మొదలుకాదు. తప్పెట్లు మోగిస్తే చాలు, అడవిలో ఎక్కడున్నా వచ్చేస్తాడు బయ్యన్న. పిలిస్తే చాలు. వచ్చి వాలతాడు. ఇవాళ తప్పెట్లు కొట్టకుండా, పిలవకుండా పూజ మొదలుపెట్టాం. అదీ మేం చేసిన తప్పు’ అన్నాడు మూగెన్న.

‘ఇప్పుడింతకీ బయ్యన్న వచ్చినట్టేనా’ అనడిగాను, for I am a man of little faith.

‘వచ్చాడు కదు సామీ, అరిచాడు, కోపగించుకున్నాడు, మళ్ళా సర్దిచెప్పుకున్నాం కదా’ అన్నాడు మూగెన్న. ఆ మాటలంటున్నప్పుడు అక్కడికి ప్రాజెక్టు అధికారి రావడం ఎంత నిజమో బయ్యన్న రావడం కూడా అంతే నిజమన్నట్టున్నాయి అతడి మాటలు.

తిరిగి నల్లమల అడవి మధ్యనుంచి హైదరాబాదుకి. మా పిల్లలకి అదంతా కొత్తగా ఉంది. మేమంతా ఆ చెంచుకుటుంబం గురించే మాటాడుకుంటూ ఉన్నాం. ఎంత అదృష్టవంతులు వాళ్ళు! దేవుడు వాళ్ళకెంత సన్నిహితంగా ఉన్నాడు. ఇట్టే పిలిస్తే పలుకుతున్నాడు. మన మిత్రులు మనకి మొబైల్లో కూడా అంతసన్నిహితంగా ఉంటారని చెప్పలేం. దేవుడు వాళ్ళకి సన్నిహితంగానే కాదు, ఆ ఉండటం కూడా చాలా సున్నితంగా ఉన్నాడు. పిలిస్తే చాలు, పరుగెత్తు కొచ్చేటట్టున్నాడు. బాజా మోత వినగానే బయ్యన్న మొఖంలో ఆవరించిన ప్రసన్నతని నేను మర్చిపోలేను. ఎండిన మొక్క మొదట్లో నీళ్ళు పోసినప్పుడు ఆ తేమ ఈనె ఈనెల్లోనూ ప్రసరించినట్టు బయ్యన్న వదనంలో ఎంత సంతోషం వ్యాపించిందని!

ఆ ఊళ్ళో, ఆ అత్యాధునిక జీవితం మధ్య, అ చెంచుగోత్రం ఏ కాలంలో ఏ దేశంలో జీవిస్తున్నారు? కాని ఆలోచించినకొద్దీ బయ్యన్న నాకు అర్థం కాకుండా పోయాడు? ఆయన ఎవరు? దేవుడా? మిత్రుడా? చుట్టమా? అసహనశీలుడైన పితృప్రభువా? లేక పసిపిల్లవాడా? మూగెన్న నెత్తిన కూచుని ఎందుకట్లా మారాం చేస్తున్నాడు? ఊరేగించమనీ, పండగ చెయ్యమనీ అడుగుతున్నాడే తప్ప ఆ మనిషికి ఆ స్తోమతూ, తాహతూ ఉన్నాయో లేదో ఎందుకు ఆలోచించడు?

అటవీ హక్కుల చట్టమే లేకపోతే, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఆ నేల చదును చేసిఉండకపోతే, ప్రాజెక్టు అధికారి ఆదిమజాతుల అభివృద్ధి పథకం కింద బోరు వెయ్యకపోతే, విత్తనాలు ఇచ్చివుండకపోతే, ఆ మొక్కజొన్న తోట వచ్చేదా? అందులో బయ్యన్న చేసిందేమిటి? ఆయనకేమి వాటా ఉంది? ఎందుకంత గద్దించి మరీ అడుగుతున్నాడు?

హైదరాబాదు చేరేటప్పటికి బంగారు మలిసంధ్యకాంతి దక్కన్ పీఠభూమి మీద విస్తారంగా వాలుతోంది. దారిలో ఒక ఫ్రెండ్ కి మెసేజి పెట్టాను. గంట సేపైనా జవాబు లేదు. మరొక గంట చూసాను. రెస్పాన్స్ లేదు.

బయ్యన్న నవ్వినట్టనిపించింది.

‘చూడు మిత్రమా, నువ్వు రేపు ఆఫీసుకి వెళ్ళిపోయాక, నీ పనుల్లో పడిపోతావు. మోటారు పని చేయడం లేదని చెప్పడానికి మూగెన్న నీకు ఫోన్ చేస్తాడు. నువ్వు ఫోన్ ఎత్తుతావా? తెలీదు. అదే నేను చూడు, మూగెన్న నన్నెప్పుడు పిలిచినా పరుగెత్తుకొస్తాను. ఒకవేళ మీరు పెట్టే హడావిడిలో పిలవడం మర్చిపోయాడే అనుకో, నేనే వచ్చి గుర్తు చేస్తాను, మర్చిపోయావెందుకని గొడవచేస్తాను’ అంటున్నాడు బయ్యన్న.

29-9-2013

One Reply to “బయ్యన్న”

Leave a Reply

%d bloggers like this: