పేరుపేరునా నమస్సులు

Reading Time: 3 minutes

101

పాణ్యం చెంచుకాలనీ అనుభవాలపట్ల శతాధికంగా మీరంతా ఎంతో ప్రేమనీ, ప్రశంసనీ వర్షించి నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేసారు. మీకందరికీ పేరుపేరునా నా నమస్సులు, నా సుమనస్సులు.

మిత్రురాలు రమాదేవి అన్నట్టుగా ఒక విజయగాథ వినగానే మనలో ఏదో సంభవిస్తుంది. బహుశా మనిషి జీవనిర్మాణం లోనే మంచితనం పట్ల ఉద్వేగం చెందే మహత్తర గుణముందనుకుంటాను, లేకపోతే అన్ని స్పందనలు, అంత ఉద్వేగం, అంత ఉత్కంఠ ఎక్కణ్ణుంచి వస్తాయి!

అందరికీ మరోమారు పేరుపేరునా వందనాలు. అయితే కొందరి మాటలతో మళ్ళీ కొన్ని మాటలు కలపాలనే ఈ నాలుగు మాటలూను.

మొదట, వసంత లక్ష్మి గారు, సత్యసాయి విస్సా, జగదీశ్ కుమార్ గార్లు గార్లు ఈ కథ తర్వాత ఏమయ్యింది, మధ్యలో ఆపెయ్యకండి అన్నారు. నేను కథ మధ్యలో ఆపలేదు. మొదలుపెట్టిందే చివరినుంచి. మీకులానే నేను కూడా ఆ రైతులేమయ్యారు, ఆ భూమి ఏమయ్యింది చూద్దామనే మొన్న పాణ్యం వెళ్ళాను. అక్కడ అడుగుపెట్టిన మొదటి ఇంట్లోనే బియ్యం మూటలు కనబడ్డాయి. ఆ బియ్యం ఆ రైతులు ఆ భూమిలో పండించిందే. ఆ సంగతి తెలియగానే నా వళ్ళు ఝల్లుమంది. ఎక్కడి నుంచి ఎక్కడిదాకా ప్రయాణించారు వాళ్ళు. ముఫ్ఫై ఏళ్ళకిందట దారిదోపిడీలు చేస్తున్నట్టు ముద్రపడ్డ కుటుంబాలు అడవినుంచి ఊళ్ళోకి వచ్చి, కోళ్ళఫారంతొ మొదలై, పాతికేళ్ళకిందట మొదటిసారి జొన్నపంట వేసుకుని, అదేలా కోతకొయ్యాలో కూడా తెలియని కుటుంబాలు ఇప్పుడు రైతులై సోనామసూరీ పండిస్తున్నారు. ఈ కథ ఇక్కడితో ఆగిపోయిందనుకోలేం. ఇప్పుడు కూడా అడుగడుగునా కొత్త సమస్యలు, కొత్త సవాళ్ళూ ఎదురవుతూనే ఉంటాయి. చూడగలిగి, రాయగలిగితే అదంతా గొప్ప ఇతిహాసమవుతుంది.

అందుకనే ఆత్మీయులు సుజాత కలిమిలి గారు స్పందిస్తూ ఆహారసేకరణదశనుంచి స్థిరవ్యవసాయానికి ఒక జాతి చేసినప్రయాణం ఈ కథలో ఉందన్నారు. ఆమె ప్రపంచప్రసిద్ధి చెందిన మానవశాస్త్రజ్ఞురాలు. ఢిల్లీలో నేషనల్ యూనివెర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ లో ఆచార్యులు. ఆమె కూడా ఈ అనుభవాన్ని చదివి ప్రతిస్పందించినందుకు నాకు చాలా సంతోషమనిపించింది.

మరికొన్ని సంతోషకరమైన స్పందనలు. ఒకటి సాయినాథ్ తోటపల్లి గారు రాసింది. ఆ రోజు చెంచువారి పక్షాన నిలబడ్డ లాయర్ గురుమూర్తిగారు తనకి మామగారని ఆయన రాయడం నాకు అనూహ్యమైన ఆనందాన్నిచ్చింది. సాయినాథ్ గారు, నా తరఫున గురుమూర్తిగారికి నమస్కారాలు చెప్పండి. మరొకటి రాజారాం తూముచర్ల గారు రాసింది, ఆయన కూడా తాను నంద్యాల్లో చదువుకుంటున్నప్పుడు గురుమూర్తిగారిగురించి విన్నానని రాసారు. ఒక వ్యక్తి తన వృత్తిని సత్యసంధతతో, నిష్టతో అనుష్టిస్తే అతడి పేరు ఎన్నాళ్ళయినా చెక్కుచెదరదనడానికి ఇట్లాంటివే ఉదాహరణలు.

ఇంకొకటి ధేనుకా నాయక్ చేత్తో రాసిన స్పందన. పేదప్రజలనుంచి వచ్చి తిరిగివాళ్ళకోసం జీవితాన్ని అంకితం చేస్తున్న ధేనుకానాయక్ వంటి యువకులే గిరిజనుల ఆశాదీపాలు.

అన్నిటికన్నా నమస్కరించవలసిన స్పందన రామారెడ్డి గంటా గారినుంచి వచ్చింది.ఆయన సి.వి.కృష్ణారావుగారిని స్మరించారు. అందుకు కృష్ణారావుగారి కుమార్తె, నా సోదరి పార్వతి మేడికొండూరుఆయనకు ధన్యవాదాలు చెప్పారు కూడా. రామారెడ్డిగారూ, కృష్ణారావుగారు సాహిత్యంలోనే కాదు, నా ఉద్యోగజీవితంలో కూడా నా రోల్ మోడల్. ఆయన సాంఘికసంక్షేమాధికారిగా కరీంనగర్, వరంగల్, అదిలాబాదు జిల్లాల్లో చేసిన సేవ అద్వితీయమైంది. ఎస్.ఆర్. శంకరన్, కె.ఆర్.వేణుగోపాల్ వంటివారే ఆయన్ను అభిమానించకుండా ఉండలేకపోయారు. గిరిజనప్రాంతాల్లో కాగడా పట్టుకు నడిచిన మొదటి తరం అధికారుల్లో ఆయన ఆజానుబాహువు కాబట్టే ఫణికుమార్ తన ‘గోదావరి గాథలు’ పుస్తకానికి ఆయనతో పరిచయం రాయించుకున్నారు. నా చిన్నతనంలో, అంటే నేను ఎనిమిదోతరగతి చదువుకుంటున్నప్పుడు ఆయన మా జిల్లాలో రంపచోడవరం ఐ.టి.డి.ఏ కి ప్రాజెక్టు అధికారిగా వచ్చారు. ఆయన మా గ్రామానికి వచ్చి మా ఊళ్ళో గిరిజనులతో మాట్లాడిన తీరు నా మీద చెరగనిముద్ర వేసింది. ఒక అధికారిగా కృష్ణారావుగారు చేసిన సేవగురించీ,సాధించిన విజయాల గురించీ మరోమారు వివరంగా రాయాలి.

అట్టాడ అప్పల్నాయుడు గారు తన స్పందనలో అభివృద్ధి గతం కంటే కొంచెం జరిగినప్పటికీ అది సాపేక్షమేననీ, అందువల్ల ప్రభుత్వాలని తప్పుపట్టకూడదు అని అనకూడదనీ రాసారు. అప్పల్నాయుడు ప్రజాపక్షం వహించిన రచయిత. ఉత్తరాంధ్ర సాహిత్యంలో కాళీపట్నానికీ,భూషణానికీ వారసుడు. నికార్సైన నిబద్ధత కలిగిన కలంవీరుడు. ఆయన మాటల్ని కాదనే సాహసం చెయ్యను. కానీ ఒకటనుకుంటాను. ప్రభుత్వం అమూర్తస్వరూపం. కన్యాశుల్కంలో జట్కావాడు ప్రభుత్వమంటే కనిష్టీబనే అనుకున్నట్టు, ప్రజలు ఏ ప్రభుత్వోద్యోగిని చూస్తే ఆ రూపంలోనే వాళ్ళకి ప్రభుత్వం సాక్షాత్కరిస్తుంది.

మిత్రురాలు కుప్పిలి పద్మ దీన్నొక నవలగా ఎందుకు రాయకూడదని అడిగింది. ఇందులో నేనున్నాను కాబట్టి నవలగా రాయగల నిస్పాక్షికత నాకు సాధ్యం కాదు. కాని వేరెవరన్నా దీన్నొక నవలికగా మలచడం అసాధ్యం కాదనుకుంటాను. ఆ మాటకొస్తే ఈ అనుభవమే కాదు, ఇట్లాంటి అనుభవాలు మనందరి జీవితాల్లోనూ కనీసం ఒకటిరెండేనా ఉంటాయి. ఒక బాలికను ఆమె బంధువులు బడిమానిపించి పెళ్ళి చేయబోతే వాళ్ళని అడ్డుకుని వాళ్ళ చేత తన్నులు తినైనా సరే ఆ పిల్లకు చదువు చెప్పిన ఒక ఉపాధ్యాయుడి అనుభవాన్ని తీసుకుని చింగిజ్ అయిత్ మాతొవ్ ‘తొలి ఉపాధ్యాయుడు’ నవల రాసాడు. ప్రపంచవ్యాప్తంగా ఆ కథ లక్షలాదిమందిని చైతన్యపరుస్తూనే ఉంది. అట్లాంటి అనుభవాలు తెలుగుమిత్రులకు కూడా పుష్కలంగా ఉన్నాయి. కాని పుస్తకరూపంలో రావాలంతే.

నా అనుభవాలు మరికొన్ని రాయమని కూడా మిత్రులు కొందరు రాసారు. గిరిజన విద్యారంగంలో నా అనుభవాలు ఇప్పటికే ‘కొన్ని కలలు-కొన్ని మెలకువలు’ (ఎమెస్కో, 2005) పేరిట పుస్తకరూపంలో వచ్చాయి. కర్నూల్లోనూ, శ్రీశైలంలోనూ చెంచు వారితో కలిసి జీవించిన అనుభవాల్ని పుస్తకరూపంగా తెమ్మని కూడా మిత్రులడుగుతూ ఉన్నారు. చూడాలి, ఎప్పుడు వీలవుతుందో.

26-6-2015

arrow

Painting: ‘The Gleaners by Jean-François Mille

Leave a Reply

%d bloggers like this: