ప్రసిద్ధ చిలీ కవి/వికట కవి నికనర్ పారా మంగళవారం ఈలోకాన్ని భౌతికంగా వీడిపోయాడన్న వార్త నిన్న ఎం.ఎస్.నాయుడు వాల్ మీద చూసాను. పారా ఇంతకాలం బతికున్నాడని ఇప్పుడీ మరణవార్త చూసాకనే తెలియడంలో కూడా ఒక ఐరనీ ఉందనిపించింది.
ఆధునిక చిలీ కవిత్వానికొక దిశానిర్దేశం చేసిన నలుగురు మహాకవుల్లో-విసెంటె హుయిడుబ్రో, పాబ్లో నెరూదా, గాబ్రియేలా మిస్ట్రల్ తో పాటు నికనర్ పారా కూడా నిలుస్తాడు. కాని తక్కినకవులెవరూ దీర్ఘాయుర్దాయానికి నోచుకోలేదు. హుఇడుబ్రో 55 ఏళ్ళకి, మిస్ట్రల్ 68 ఏళ్ళకి, నెరుడా 69 ఏళ్ళకే మరణించినప్పుడు, 70 ఏళ్ళు జీవిస్తే అమరత్వమే అని రాసాడు పారా. కాని, అతడు నూరేళ్ళ పూర్ణాయుష్కుడిగా జీవించి తన 103 వ ఏట కన్నుమూసాడు.
నికనర్ పారా (1914-2018) వృత్తిరీత్యా గణితం, భౌతికశాస్త్రం బోధించాడు. ‘జీవించడం కోసం ఫిజిక్సు పాఠాలు చెప్తున్నాను/సజీవంగా ఉండటానికి కవిత్వం రాస్తున్నాను’ అని చెప్పుకున్నాడు. కాని అతడు తనని ‘కవి’ చెప్పుకోడం కన్నా antipoet అని చెప్పుకోడానికే ఇష్టపడ్డాడు. Antipoet అంటే నిర్వచించడం కష్టం. పఠాభి వాడిన ‘అహంభావకవి’ అనే ప్రయోగం లాంటిదది. ఆ మాటకి అర్థం ‘అకవి’ కాదు, ప్రతినాయకుడిలాగా ‘ప్రతికవి’ కూడా కాదు. కొన్ని లక్షణాల్ని బట్టి ఆ పదాన్ని ‘వికటకవి’ అని అనువదించుకోవచ్చు. కాని ఆ మాట కూడా దానికి న్యాయం చేయదు.
నిజానికి antipoet అనే మాటగాని, ఊహగాని పారా వి కావు. అతడి మార్గదర్శీ, జీవితకాల స్ఫూర్తీ అని చెప్పదగ్గ కవి విసెంటె హుయిడుబ్రో ప్రవేశపెట్టిన పదం అది. 1931 లో వెలువరించిన తన ఆధునిక మహాకావ్యం ‘ఆల్టజార్’ లో హుయిడొబ్రొ తనని తాను antipoetగా చెప్పుకున్నాడు. నాలుగువందలేళ్ళ చిలీ సంప్రదాయ కవిత్వం మీద తిరుగుబాటు అది.
ఒక ఆదిమజాతి ఇండియన్ ఒకసారి హుయిడొబ్రొ తో అన్నాడట. ‘కవి కూడా దేవుడే, వాన గురించి కవిత రాయడం కాదు, కవీ, నీ కవితతో వాన కురిపించు’ అని. కవిత్వం తాలూకు అతిపెద్ద సమస్య కవిత్వంతోనే అని హుయిడొబ్రొ భావించాడు. అప్పటికే వ్యాప్తిలో ఉన్న కవితాభివ్యక్తికి మరింత కవిత్వాన్ని చేర్చడం ‘తేనెలో మరింత తేనెపొయ్యడమే’ ననీ, విశేషణాలూ, అలంకారాలూ కవిత్వానికి అతివ్యాప్తి దోషాన్ని ఆపాదిస్తాయనీ, ప్రకృతిని అనుకరిస్తూ కవిత్వం చెప్పినందువల్ల లాభంలేదనీ, కవి సృష్టికి ప్రతిసృష్టి చేయాలనీ హుయిడొబ్రొ భావించాడు.
అతడి స్పర్థ ప్రధానంగా పాబ్లో నెరూదా తో. నెరుదా తన కవిత్వమంతా విస్తారంగా ప్రాకృతిక ప్రతీకలమీదా, రూపకాలంకారాలమీదా ఆధారపడుతుండటమ్మీద చేసిన ఎద్దేవా అది. ఎవరు చిలీ అగ్రకవి అనే ఆ పందెంలో దీర్ఘకాలం కొనసాగకుండానే హుయిడొబ్రో మరణించడంతో ఆ స్థానం నెరుదా కైవసమయ్యింది. కాని, అప్పుడు నెరూదాకి ప్రతిస్పర్థిగా జీవించవలసిన బాధ్యత పారా తన భుజాలకెత్తుకున్నాడు.
తన గురువు హుయిడొబ్రో మీద రాసిన Thus Spake Altazar (1993/2006) అనే దీర్ఘకావ్యంలో పారా తక్కిన ఇద్దరు చిలీ మహాకవులు నెరుదా, రోఖాలకన్నా హుయిడొబ్రొ నే మహాకవి అని తీర్మానించేసాడు. కాని ఆ కావ్యంలో మరొకవైపు హుయిడొబ్రొని కూడా విమర్శించకుండా ఉండలేకపోయాడు. నెరుదా కవిత్వాన్ని అతిశయోక్తిగా మారిస్తే, హుయిడొబ్రొ అభూతకల్పనగా మార్చాడని చెప్పకుండా ఉండలేకపోయాడు. కాబట్టి, ఆ మహాకవులనుంచి కవిత్వాన్ని రక్షించడానికున్న ఏకైకమార్గం కవిత్వాన్ని నిర్మూలించడమేనని పారా వాదించాడు. ‘ఆధునిక కవిత్వం నాతోనే మొదలయ్యింది’ అని హుయిడొబ్రో 1938 లో ఒక ఇంటర్వ్యూలో అన్నాడట. (1934 నుంచీ తెలుగు కవిత్వాన్ని తాను నడిపిస్తున్నానని శ్రీ శ్రీ చెప్పుకున్నట్టు). కాని అరవయ్యేళ్ళ తరువాత పారా తన దీర్ఘకావ్యంలో ‘కవిత్వం నాతో అంతమైంది’ అని చెప్పుకున్నాడు. (శ్రీ శ్రీ కవిత్వానికి 1950లో యోగ్యతాపత్రం రాస్తూ చలంగారు ‘కవిత్వపు కాలం అంతమైంది’ అని రాసినట్టు).
‘నాలుగు దిక్కులూ మూడు-ఉత్తరం,దక్షిణం ‘అని హుయిడొబ్రొ రాసాడు. పారా ఆ వాక్యాన్ని తిరగరాస్తూ ‘నలుగురు చిలీ మహాకవులూ ముగ్గురు’ అని చెప్తూ ఇద్దరు కవుల్ని, అది కూడా చిలీ ఆదికవి ఎర్సిల్లానీ, మొదటి ఆధునిక కవి రూబెన్ డారియో ని మాత్రమే పేర్కొన్నాడు. అంటే హుయిడొబ్రొగాని, రోఖాగాని, నొబేల్ బహుమతి పొందిన మిస్ట్రల్ గాని, నెరుదాగాని తన దృష్టిలో మహాకవులు కాదన్నట్టే.
ఈ గొడవంతా ఎందుకింత వివరంగా రాసానంటే, ఈ నేపథ్యం తెలియకుండా, కేవలం Poems and Antipoems (1954) ఆధారంగా నికనర్ పారా ని అర్థం చేసుకోలేమని చెప్పడానికి. పారా ప్రధానంగా సైన్సు విద్యార్థి. సత్యాన్ని నిష్పక్షపాతంగానూ, భావోద్వేగాలకు అతీతంగానూ చూడాలని తెలిసినవాడు. కాని మానవజీవనసత్యాన్ని ఆవిష్కరించవలసిన కవిత్వం దంబంతోనూ, వాగాడంబరంతోనూ, కవుల స్వీయ ఔద్ధత్యంతోనూ కలగాపులగం కావటాన్ని అతడు తన జీవితం పొడుగుతా ఎత్తిచూపుతూనే ఉన్నాడు. హాస్యం, వ్యంగ్యం, వెటకారం, అవహేళన, ప్రహసనం,నింద సాధనాలుగా దేవుణ్ణి, చర్చిని, సాంఘికసంస్థల్ని, అన్నిరకాల కృత్రిమత్వాల్ని తూర్పారబడుతూనే ఉన్నాడు. తెలుగులో పఠాభిలాగా అన్నిరకాల కవిసమయాలమీదా, లిరిసిజంమీదా, మాధుర్య, ప్రసాదగుణాలమీదా దుమ్మెత్తిపోస్తూనే ఉన్నాడు. అందరూ సభల్లో కవిత్వం వినిపించాలని కోరుకుంటే, అతడు సర్కస్ లో కవిత్వం చెప్పాడు. పోస్ట్ కార్డులమీద బొమ్మల్తో కవిత్వం ప్రింటు చేసి స్నేహితులకీ, పరిచయస్థులకీ పంపి వాళ్ళని షాక్ చేస్తూ వచ్చాడు.
మన తెలుగులోలానే వామపక్షం పట్ల మొగ్గు చూపడం ఒక విలువగా కవులు భావిస్తూ ఉండే లాటిన్ అమెరికాలో ‘నేను కుడివైపూ లేను/ఎడమవైపూ లేను’ అని చెప్పుకోగలిగాడు. పినోచెట్ నియంతృత్వం పట్ల అతడికెంత అసహనముందో అలెండీ వామపక్షపాలన పట్ల కూడా అంతే అసహనాన్ని చూపించాడు. అందుకనే, అతడు నూరేళ్ళ పాటు జీవించినా ఒంటరిగానే బతకవలసివచ్చింది. (నూరేళ్ళ ఒంటరితనం!)
చిలీ సాహిత్యంలో అతడు ఒక outcast గా బతికాడని చెప్తూ, రూబెన్ గొంజాలెజ్ అనే విమర్శకుడు ఆ పదానికి మెరియం వెబ్స్టర్ డిక్షనరీ ఇలా అర్థం చెప్పిందని గుర్తుచేస్తాడు: An outcast is a person who is not involved with a particular group of people or organization or who does not live in a particular place, also a person or animal with only a slight chance of winning.
కానీ పారా నెగ్గాడనే అనాలి. అతణ్ణి ప్రపంచం కవిగానే అంగీకరించింది. నోబెల్ బహుమతి తప్ప తక్కిన అన్ని అత్యున్నత పురస్కారాలూ అతణ్ణి వరించేయి. కాని, అతడు తనకి లభిస్తున్న గుర్తింపుపట్ల నిర్లిప్తంగానే ఉన్నాడు. ఎప్పుడు కవిత్వం వినిపించినా, ప్రసంగించినా చివరికి మళ్ళా I take back everything I’ve said అనేవాడు. తాము నిర్మించుకున్న వ్యవస్థల్లో, మహానిర్మాణాల్లో తాము మిగలకుండా పోతున్న మనుషుల పట్ల అతడు కనపరిచిన ఆవేదనవల్ల, ఆ ఆవేదనతో చేపట్టిన అవహేళనాత్మక పోరాటం వల్ల అతడు స్పానిష్ సాహిత్యంలో మరొక డాన్ క్విక్సోట్ గా గుర్తుండిపోతాడు.
నికనర్ పారాని తెలుగువాళ్ళకి పరిచయం చేసింది ఇస్మాయిల్ గారు. సమయానికి ఆయన అనువాదాలు కనబడకపోడంతో, ఈ నాలుగు అనువాదాలూ నేనే చెయ్యకతప్పలేదు.
యు ఎస్ ఏ
అక్కడ లిబర్టీ
ఒక స్టాట్యూ.
యువకవులు
మీకెలా కావాలంటే అలా రాయండి,
మీకు నచ్చిన పద్ధతిలో రాయండి.
ఏదో ఒకటే పంథా మటుకే సరైనదని
నమ్ముతూపోయినందుకు
ఇప్పటికే చెప్పలేనంత నెత్తురుకాలవకట్టింది.
కవిత్వంలో ఏదైనా చెల్లుబాటవుతుంది.
అయితే ఒక్క షరతు
మీరు తెల్లకాగితాన్ని
ఉన్నదానికన్నా మరింత ఉన్నతం చెయ్యాలి.
కాలం
చిలీలో, సాంటియాగోలో,
రోజులు మరీ సుదీర్ఘాలు.
ఒక్కరోజులోనే లెక్కలేనన్ని యుగాలు.
ఎండుచేపలు అమ్ముకుంటూ
గాడిదలమీద ప్రయాణించేవాళ్ళల్లా
మీరు ఆవలిస్తుంటారు-ఆవలిస్తూనే ఉంటారు.
కాని వారాలు మాత్రం బహుకురచ,
నెలలు వేగంగా పరుగెడుతుంటాయి,
సంవత్సరాలు రెక్కలమీద ఎగిరిపోతుంటాయి.
నేను చెప్పిందంతా వెనక్కి తీసుకుంటున్నాను
నేను చెప్పిందంతా వెనక్కి తీసుకుంటున్నాను
నేను వెళ్ళిపోయేముందు
నాదో చివరికోరిక,
సహృదయ పాఠకుడా,
ఈ పుస్తకాన్ని తగలబెట్టెయ్యి.
నేను చెప్పాలనుకున్నది ఇందులో లేనే లేదు,
ఇందులో నేను రాసిందంతా
నా రక్తంలో ముంచే రాసినప్పటికీ
ఇది కాదు నేను చెప్పాలనుకున్నది.
నాకన్నా దురదృష్టవంతుడెవరూ ఉండరు,
నేను నా నీడచేతిలోనే ఓడిపోయాను,
నా శబ్దాలు నా మీదనే ప్రతీకారం తీర్చుకున్నాయి.
పాఠకుడా, నన్ను క్షమించు,
ఒక గాఢపరిష్వంగం కాకపోయినా
కనీసం తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతోనైనా
నన్ను సెలవు తీసుకోనివ్వు.
బహుశా నేనింతేనేమో
కాని నా చివరిమాట విను.
నేను చెప్పిందంతా వెనక్కి తీసేసుకుంటున్నాను,
లోకంలో కరడుగట్టిన కటుత్వమంతటితోనూ
నేను చెప్పిందంతా వెనక్కి తీసేసుకుంటున్నాను.
25-1-2018