డెరెక్ వాల్కాట్

92

కవి, నాటక కర్త, చిత్రకారుడు, డెరెక్ వాల్కాట్ (1930-2017) మొన్న మరణించాడు. కరీబియన్ సాహిత్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని తీసుకువచ్చిన సమకాలిక కవి. సుమారు నాలుగుకోట్ల జనాభా ఉన్న 25 కరీబియన్ దీవులనుంచి సాహిత్యంలో నోబేల్ పురస్కారం పొందినవాళ్ళల్లో సెంట్ జాన్ పెర్స్ వి.ఎస్.నయిపాల్ తర్వాత వాల్కాట్ మూడవవాడు. ఆయన రాసిన ‘ఒమెరోస్’ (1990) అనే దీర్ఘకావ్యానికి గాను 1992 లో నోబేల్ పురస్కారం లభించింది.

తాతముత్తాతలు ఆఫ్రికానుంచి తరలివచ్చిన బానిసలు. తండ్రి చిత్రకారుడు. తన చిన్నప్పుడే పోయాడు. తల్లి ఉపాధ్యాయిని కావడంతో వాల్కాట్ కి ఇంగ్లీషు విద్య దొరికింది. ఆ తర్వాత అతడి మానసిక జీవితమంతా రెండు మహాఖండాలు, రెండు మహాసంస్కృతుల మధ్య నడిచిన నిరంతర సంవాదం.

తన కవిత The Star-apple Kingdom(1979) లో రాసుకున్నట్టుగా:

I’m just a red nigger who love the sea,
I had a sound colonial education,
I have Dutch, nigger and English in me,
and either I’m nobody , or I’m a nation.

కాని జాతికీ, రక్తానికీ సంబంధించిన ఐడెంటిటీ సమస్య అతణ్ణి జీవితమంతా వేధిస్తూనే ఉండింది. చాలాకాలం పాటు తాను గ్రీకు, ఆఫ్రికా దేవతల అనుగ్రహానికి సమంగానే నోచుకున్నాననుకున్నాడు. కానీ, నెమ్మదిగా అతడికి తెలిసి వచ్చింది:

I had no nation now, but the imagination.
After the white man, the niggers didn’t want me
when the power swing to their side.
The first chain my hands and apologize,’history’;
the next said I wasn’t black enough for their pride

ఈ పెనగులాట పడ్డంతకాలం పడ్డాక అతడు చివరికి తానొక కరీబియన్ అని మాత్రమే అని నిర్ధారించుకున్నాడు. ఆ ఐడెంటిటీనే బలంగా ప్రకటించుకుంటూ వచ్చాడు. దాన్నే ఒక ఐతిహాసిక స్థాయిలో ‘ఒమెరోస్’ కావ్యంద్వారా గానం చేసాడు.

వాల్కాట్ కవితలు, రెండు, మచ్చుకి.

సముద్రపు ద్రాక్షలు

దీవులంటే విసుగెత్తి
వెలుగువాటుగా
తెరచాపలెత్తిందొక కరీబియన్ నౌక.

ఇంటిదిక్కుగా,అందులో బహుశా
బెంగపెట్టుకున్న ఒడెస్యూస్
ఒక భర్త, ఒక తండ్రి.

అందనిద్రాక్షపళ్ళ చేదుతనంలో ,
ఏ సముద్రపు పక్షి అరుపువిన్నా
ఆ స్త్రీలోలుడికి ఒక స్త్రీనే స్ఫురిస్తున్నది.

ఇక్కణ్ణుంచి శాంతి రాదు. మోహానికీ
బాధ్యతకీమధ్య పురాణవైరం
ఎప్పటికీ ముగిసిపోదు.

ఏమంత తేడా లేదు
సముద్రాలమీద సంచరిస్తున్న వాడికీ, ట్రాయి నగరం
తన చివరి జ్వాలని కూడా నిట్టూర్చేసాక
ఇంటికిపోవాలని ఒడ్డున తచ్చాడుతున్నవాడికీ.

ఆ మహాకాయుడు, అంధుడు, ఆ జలాల్లో
ఏ బరువు ఎత్తిపడేసాడోగాని మహాఛందస్సులు
పొంగిపొర్లుతూనే ఉన్నాయి సముద్రపు నురగలా.

మహాకావ్యాలు ఓదార్చగలవు, కాని సరిపోదు.

ఆఫ్రికానుంచి గావుకేక

ఆఫ్రికా గాయాన్ని గాలి కెలుకుతున్న వేళ
గడ్డిభూముల్లో ప్రవహిస్తున్న రక్తపుటేర్లమీద
ముసురుకుని బలుస్తున్న ఈగల్లాగా కికుయుతెగవాళ్ళు.
ఒక స్వర్గం పొడుగునా పరుచుకున్న శవాలు,
మాంసంగుట్టలనాయకుడొకడు క్రిమితుల్యుడు
అరుస్తూంటాడు:
‘చచ్చినవాళ్ళకోసం మీ సానుభూతి ఖర్చుపెట్టకండి’ అంటో.
గణాంకాలు సమర్థిస్తుంటాయి
మేధావులు వలసవాదాన్ని పొగుడుతుంటారు.
తెల్లవాళ్ళ పిల్లవాణ్ణొకణ్ణి నిద్రలో చంపేస్తే
ఈ ఆదిమజాతులేమి చేసాయి?
యూదుల్లాగా వీళ్ళనెందుకు తుడిచిపెట్టడం?

నాగరికతా ఉషోదయకాలం నుంచీ
ఎండిపోయిన ఈ నదీగర్భంలో
మృగసంకులమైదానాలమీద
ఈ రాబందులిట్లానే ముసురుకుంటున్నాయి
మృగం మీద మృగం విరుచుకుపడితే
ప్రాకృతికన్యాయమని సరిపెట్టుకుంటాం.
కాని సాటిమనిషిని హింసించడంలో
దైవత్వాన్ని వెతుక్కుంటున్నాడే ఈ మొనగాడు
భీతావహమైన ఈ మృగసముదాయం మధ్య
బిగువుగా రాపాడుతున్న బాజా చర్మం దరువేస్తుంటే
యుద్ధనాట్యం కొనసాగిస్తూనే ఉన్నాడు వాడు
ఒకపక్క వాడు ధైర్యం కూడదీసుకుంటున్నాడు
మరొక పక్క మరణించినవాళ్ళు సంపాదించుకున్న
స్మశానశాంతికి స్థానికులు వణికిపోతున్నారు.

ఏదో ఒక మురికి సాకుమీద
కిరాతకప్రయోజనాలు మళ్ళీ చెయ్యి తుడుచుకుంటాయి
స్పెయిన్ విషయంలో జరిగినట్టే
మళ్ళా మరొకమారు మన సానుభూతి నిరర్థకమవుతుంది.

ఒక గొరిల్లా ఒక మహామానవుడితో తలపడుతుంటాడు
ఆ ఇద్దరి రక్తంతోనూ విషపూరితమైన నేను
నా రక్తనాళాల కడకంటా చీలిపోయిన నేను
ఇప్పుడెవరివైపు నిలబడాలి?
తప్పతాగిన బ్రిటిష్ పరిపాలకుణ్ణి
నోరారా శపించిన నేను
ఎవరినెంచుకోను?
ఆఫ్రికానా? నేనిష్టపడే ఇంగ్లీషు భాషనా?
లేదా ఎవరిది వారికిచ్చేసి
ఇద్దర్నీ వదిలిపెట్టెయ్యనా?
ఇట్లాంటి నరమేధం చూస్తూ కూడా శాంతంగా ఎట్లా ఉండగలను?
ఆఫ్రికాకి వెన్ను చూపి ఎట్లా బతగ్గలను?

18-3-2017

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s