జోర్జ్ లూయీ బోర్హెస్

88

10 టివి ప్రేక్షకులకోసం ఈ ఆదివారానికి జోర్జ్ లూయీ బోర్హెస్ Selected Non-Fictions ( పెంగ్విన్, 2000) పరిచయం చేసాను.

జోర్జ్ లూయీ బోర్హెస్ (1899-1986) అర్జెంటీనాకు చెందిన కవి, కథకుడు, ఆలోచనాపరుడు, విమర్శకుడు. మాజికల్ రియలిజంగా ప్రసిద్ధి చెందిన విశిష్ట కథన ప్రక్రియకి ఆద్యుడు. 20 వ శతాబ్ది పూర్వార్థంలో ఇలియట్, జాయిస్, పౌండ్, కాఫ్కా, మార్సెల్ ప్రూ వంటి రచయితలు ప్రపంచసాహిత్యాన్ని గాఢంగా ప్రభావితం చేసారు. అయితే ఇరవయ్యవ శతాబ్ది ఉత్తరార్థంలో ఆ అవకాశం లాటిన్ అమెరికా రచయితలకు దక్కింది. బోర్హెస్, మార్క్వెజ్, పాబ్లో నెరూడా, సెజారో వల్లేజో, జూలియో కార్టజార్ వంటి కథకులూ, కవులూ అన్ని ఖండాల సాహిత్యాల్నీ తీవ్రంగా ప్రభావితం చేసారు. కాని వాళ్ళల్లో మార్క్వెజ్, నెరూడా ల పేర్లు తెలిసినంతగా తక్కినవాళ్ళ పేర్లు ప్రపంచానికి ఎక్కువగా తెలియదు. మాజికల్ రియలిజం ప్రక్రియ పట్ల గొప్ప క్రేజ్ కనపరచే తెలుగు సాహిత్యంలో కూడా బోర్హెస్ పేరు విన్నవారూ, ఆయన రచనల్ని సాకల్యంగా చదివినవారు ఏమంత ఎక్కువలేరు.

కాని మాజికల్ రియలిజం అంటే బోర్హెస్ చూపింఇచిన ధోరణికీ, తక్కినరచయితలు చూపించిన ధోరణికీ చాలా తేడా ఉంది. బయటసంఘటనల్లోనో, సంఘటనల్నిమనం ఇంద్రియగోచరం చేసుకునే తీరులోనో ఉన్న పరిమితుల్ని గుర్తించి వాటిని ఎత్తిచూపడం కోసం తక్కిన రచయితలు ఆ ధోరణి ని వాడుకున్నారు. కాని బోర్హెస్ అసలు ప్రపంచం గురించి మనం భావించే తీరులోనే ఒక అసంగతత్వం ఉందని గుర్తించి దాన్ని వ్యంగ్యంగానో, నిర్లిప్తంగానో, విషాదభరితంగానో ఎత్తిచూపడం కోసం రచనలు చేసాడు. ఒక విధంగా అతణ్ణి మనం తాత్త్వికుడన్నా తప్పులేదు. బెర్కిలీ లాగా, హ్యుమ్ లాగా meta-physician అన్నమాట. సత్యమేమిటో తెలుసుకోవాలని తపించి, దాన్ని అసత్యంద్వారా నిరూపించాలని ప్రయత్నించిన కాఫ్కాతరహా కళాకారుడు.

బోర్హెస్ రాసిన కథలు చదవడం గొప్ప అనుభవం. కథ అనే ప్రక్రియకి కాలక్రమంలో ఏర్పడ్డ పరిమితులన్నిటినీ అతడు తుంచేసాడు. వ్యాసం, విజ్ఞాన సర్వస్వంలో ఆరోపం, పుస్తకసమీక్ష, లేని పుస్తకానికి లేని విమర్శకుడి పేరుమీద రాసిన సమీక్ష, ఫుట్ నోట్ లతో కూడిన విశ్లేషణ, రేఖామాత్రజీవితచిత్రణ ఇలా ఎన్నో రకాల ప్రక్రియల్ని ఆయన మనతో కథలుగా ఒప్పిస్తాడు. కథని కథగా చూడటం 1950 కి పూర్వపు కథ. ఇప్పుడు కథని నెరేటివ్ గా అర్థం చేసుకుంటున్నాం. భౌతిక సంఘటనల్ని చెప్పడం ద్వారానే కథ ఏర్పడుతుందనే పాతకాలపు భావన స్థానంలో ఆదిమధ్యాంతాలుండే ప్రతి ఒక్క వాక్యంలోనూ ఒక మలుపు, ఒక పరివర్తన సంభవిస్తే అది నెరేటివ్ గా మారిపోతుందని నేడు మనం గ్రహించగలుగుతున్నాం. ప్రపంచం ఆ అవగాహనకి చేరుకోవడానికి బోర్హెస్ కథలు కూడా చాలావరకూ కారణం.

Fiction కీ Nonfiction కీ మధ్య హద్దులు చెరిపేసిన బోర్హెస్ కథలు చదవడం ఎంత ఆసక్తికరంగా ఉంటుందో అతడి నాన్-ఫిక్షన్ చదవడం కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. యథార్థానికి రెండింటి మూలమూ ఒకటే. అది బోర్హెస్ పఠనానుభవం. బహుశా ప్రపంచరచయితల్లోనే అంత విస్తృత పఠనానుభవం కలిగిన రచయిత మరొకరుండరేమో. బ్యునోస్ ఎయిర్స్ లో అర్జెంటినా జాతీయ గ్రంథాలయానికి డైరక్టరుగా పనిచేసిన బోర్హెస్ గ్రంథాలయంలో ఉన్న ప్రతి ఒక్కపుస్తకం చదివేసాడంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా విజ్ఞానసర్వస్వాలు. మనం మామూలుగా విజ్ఞానసర్వస్వాల్ని రిఫరెన్సు కోసం వాడుకుంటాం. కాని ఆయన విజ్ఞానసర్వస్వాల్లో ‘అ’ నుంచి ‘క్ష’ దాకా ప్రతి ఒక్క ఎంట్రీ కూడా చదివేసాడు. చరిత్ర, తత్తశాస్త్రం, గణితం, భూగోళశాస్త్రం, భౌతిక రాసాయినిక శాస్త్రాలు, సాహిత్యం-ఇట్లా ప్రతి ఒక్క రంగానికి సంబంధించి ఎంత చదవగలడో అంతా చదివేడు. ఎంత చదివేడంటే ఆ అక్షరాగ్నికి అతడు కళ్ళు ఆహుతైపోయాయి. యాభైయేళ్ళు వచ్చేటప్పటికే అంధుడైపోయాడు. జీవితంలో చివరి ముఫ్ఫై నలభయ్యేళ్ళు అంధత్వాన్ని మోస్తూనే రచనలు చేసాడు, ప్రసంగాలు చేసాడు, ప్రపంచమంతా పర్యటించేడు.

అతడి బాహబంధం చాలా విశాలం. అందులో మనకి హోమర్, డాంటే, షేక్ స్పియర్, గొథే, బాల్జాక్, కాఫ్కాలతో పాటు డేవిడ్ హ్యూం, 1001 అరేబియా రాత్రుల కథలు, ఎడ్గార్ ఎలన్ పో, మురాసకి సతి రాసిన గెంజిగాథ, స్కాండినేవియన్ పురాణగాథలు, టాగోర్,బౌద్ధ నికాయాలు, హిందూ ఇతిహాసాలు ఒకటేమిటి ప్రపంచసాహిత్యమంతా గోచరిస్తుంది. ఒక మనిషి తన జీవితకాలంలో ఇంత చదవగలడా అనిపిస్తుంది. చదవడం ఒక ఎత్తు, చదివినదాన్ని జీర్ణించుకుని మానవుడి స్థితిగురించి ధ్యానించి కథలుగా చెప్పడం మరొక ఎత్తు.

బోర్హెస్ రాసిన వ్యాసాలు చదువుతుంటే సంభ్రమం కలుగుతుంది. ఈర్ష్య జనిస్తుంది. కొంతసేపటికి అది ఆరాధనగా మారుతుంది. మనలో నిద్రాణంగా ఉన్న జిజ్ఞాసని మేల్కొల్పి మనం చూస్తూండగానే తృష్ణగా మార్చేస్తుంది. తన పాఠకుల్లో తాను ఇటువంటి జ్ఞానతృష్ణ మేల్కొల్పుతున్నానని బోర్హెస్ కి తెలుసు. అందుకని అతడు తన చివరిరోజుల్లో The Library of Babel (1978-86), A Personal Library (1985-86) అనే రెండు ప్రాజెక్టులు చేపట్టాడు. ఆ ప్రణాళిక ప్రకారం ప్రపంచసాహిత్యంలో తాను చదివిన సర్వోత్కృష్ట రచనల్ని అర్జెంటీనా పాఠకులకి పరిచయం చేయడానికి ప్రయత్నించాడు. అలా పరిచయం చేసిన ఆ రచనల పేర్లు చూస్తేనే అతడి ప్రపంచం ఎంత విస్తృతమో మనకి తెలుస్తుంది: జాక్ లండన్, హెన్రీ జేమ్స్, వోల్టేర్, హథార్న్, చెస్టర్ టన్, రాబర్ట్ లూయీ స్టెవెన్సన్, డాస్టవస్కీ, పో, కాఫ్కా, మెల్విల్లీ, అరీవర నో నరిహర, గిబ్బన్, వైల్డ్, మార్కో పోలో, ఫ్లాబే, డి క్విన్సీ, జీన్ కాక్తో, భగవద్గీత, కిర్క్ గార్డ్, మాటర్లింక్, వర్జిల్, ఈజిప్షియన్ బుక్ ఆఫ్ డెడ్…

A Personal Library కి రాసుకున్న ముందుమాటలో ఇలా రాసాడు: ‘ అందరూ తాము రాసిన పుస్తకాల గురించి గొప్పచెప్పుకుంటారు, కాని నేను చదివిన పుస్తకాల గురించి గొప్పచెప్పుకుంటాను. నేను మంచి రచయితను అవునో కాదో నాకు తెలియదు గాని, నేను చాలా మంచి పాఠకుణ్ణి. సున్నితపాఠకుణ్ణి. చదివిన పుస్తకాలపట్ల సదా కృతజ్ఞుణ్ణి.’

ఇంకా ఇలా అన్నాడు: ‘ ఒక పుస్తకం ఈ విస్తృతవిశ్వంలో తన పాఠకుణ్ణి కలుసుకునేదాకా ఎన్నిటిమధ్యనో మరుగునపడిఉండిపోతుంది. ఆ పాఠకుడనే పెద్దమనిషి ఆ పుస్తకంలో తనకోసం ఎదురుచూస్తున్న సంకేతాల్ని తనకోసం బహిర్గతం చేసుకోగానే మనం ‘సౌందర్యం’ అంటామే అట్లాంటిదేదో సంభవిస్తుంది. ఆ సమయంలో అతడిలో సంభవించే ఆ భావోద్వేగాన్ని ఏ మనస్తత్వశాస్త్రం, ఏ సాహిత్యవిమర్శ కూడా మనకి అర్థమయ్యేలా వివరించలేవు. ఏంజెలస్ సైలీషియస్ అన్నాడు, ‘ఒక గులాబీకి ఎందుకు అన్నది తెలీదు’ అని, శతాబ్దాల తర్వాత విష్లర్ ప్రకటించేసాడు ‘కళ సంభవిస్తుంది. అదంతే’ అని.

బోర్హెస్ ని చదవడమంటే పసిఫిక్ మహాసముద్రంనుంచి తూర్పుదిశగా మళ్ళా పసిఫిక్ మహాసముద్రానికి ప్రయాణించే ఒక ఓడ ఎక్కడం. ఆ ఓడలో మనం ఇరవయి ఒకటవ శతాబ్ది పాఠకులం ప్రయాణిస్తుంటాంగాని, దారితెల్సుకోవడానికి అతడు మనల్ని పదిహేనవశతాబ్ది సముద్రగాములు వాడిన పటాలు, దిక్సూచి, నక్సత్రమార్గాల్ని వాడమంటాడు. అందులో రెండుప్రపంచయుద్ధాల్ని చూసిన మానవులుంటారుగాని, వాళ్ళని ఐస్లాండిక్ సాగాల ప్రకారం యుద్ధానుభవాన్ని అర్థం చేసుకోమంటాడు. అతడి దగ్గర షేక్స్పియర్ సమగ్రనాటకసంకలనముంటుందిగాని, దాన్ని చదవడానికి ముందు థామస్ కిడ్ నీ, క్రిష్టఫర్ మార్లో నీ , మాంటేన్ వ్యాసాల్నీ చదివితీరాలంటాడు. డాంటే డివైన్ కామెడీ గురించి అతడికి బాగా తెలుసు, చాలా బాగా తెలుసు, కానీ ఆ కవిత్వాన్ని ఇటాలియన్ లోనే చదివి, ఇటాలియన్ లోనే ఆహా ఓహో అంటాడు, కనీసం స్పానిష్ లో కూడా పలవరించడానికి ఇష్టపడడు. సముద్రాన్ని చూడగానే అతడికి పో, మెల్విల్లీ, ఒడిస్సీలు తప్పనిసరిగా గుర్తురావడంలో ఆశ్చర్యం లేదుగాని, వాటన్నిటికన్నా సింద్ బాద్ వల్లనే తనకి సముద్రరహస్యాలు ఎక్కువ బోధపడ్డాయంటాడు. వెయ్యిన్నొక్క అరేబియా రాత్రుల కథల్ని మనలో ఎవరన్నా పూర్తిగా చదివారా? ( నేనయితే చదవలేదు). కాని బోర్హెస్ సంగతే వేరు. అతడు రిచర్డ్ ఫ్రాన్సిస్ బర్టన్ రాసిన 72 సంపుటాలూ మాత్రమే కాదు, అరేబియా రాత్రుల కథల్ని యూరోప్ కి మొదటిసారి పరిచయం చేసిన జీన్ అంటోయిన్ గాలండ్ ఫ్రెంచి అనువాదాన్ని కూడా చదవడమే కాకుండా, ఆ ఫ్రెంచి అనువాదాల్ని చదివి కోలరిడ్జి, డీక్విన్సీ, స్టెంధాల్, టెన్నిసన్, పో, న్యూమన్ ఎట్లా పలవరించారో కూడా చెప్తాడు.

మనం బోర్హెస్ ని చూసి విస్మయం చెందితే అతడు విస్మయం చెందే పాఠకులు కూడా కొందరున్నారు. ఉనమునో ఇరవయ్యవ శతాబ్ది స్పానిష్ కవుల్లో అగ్రగణ్యుడైన కవి. అతడు కిర్క్ గార్డ్ ని మూలంలో చదవడానికి డేనిష్ నేర్చుకున్నాడని, ఆ చదువు వృథాకాలేదని ఉనమునో చెప్పుకున్నాడనీ బోర్హెస్ పట్టలేనంత ఆనందంతో చెప్తున్నప్పటికీ, తానా పని చెయ్యలేకపోయానన్న కించిద్ నిరాశ అందులో ధ్వనించకపోదు. అలాగని బోర్హెస్ భాషాపరిజ్ఞానమేమీ తక్కువ కాదు, స్పానిష్, ఇంగ్లీషులతో సహా, లాటిన్, ఇటాలియన్, ఫ్రెంచి, జర్మన్ భాషలసాహిత్యాల్ని వివరించేటప్పుడు ఆయన ఆ భాషలు మాతృభాషలుగా కలిగినవాళ్ళకి ఏ విధంగానూ తీసిపోనట్టే మాట్లాడతాడు. సాహిత్యమే కాదు, సంగీతం కూడా. జర్మనీ రాజకీయాల గురించి ఎవరైనా మాట్లాడతారు. కాని బాక్ సంగీతం వినకుండా నీకు జర్మన్ జీవితమే అర్థం కాదంటాడు బోర్హెస్.

సెర్వాంటిస్, వాల్ట్ విట్మన్, స్వోడెన్ బెర్గ్ లు అతడి ఆరాధ్యదేవతలు. అతడి రాజకీయ విశ్వాసాలు రాజీలేనివి. తన విచిత్రకథ The Book of Sand లో లాగా మానవజీవితం కూడా ఎప్పటికప్పుడు చెరిగిపోతూ, ఎప్పటికప్పుడు అనంతంగా ప్రత్యక్షమవుతూ ఉండే ఒక విచిత్రగోచరానుభవం. అయితే, భావనాశీలురైన గొప్పరచయితలందరిలానే అతడు కూడా ఒక విజనరీ. ఉదాహరణకి అతడు The Book of Sand రాసేటప్పటికి కంప్యూటర్ అనే విచిత్ర యంత్రమింకా భూమ్మీద ప్రభవించలేదు. ఇంటర్నెట్లో The Book of Sand పేరిట నేనొక వీడియోగేం చూసాను. బహుసా బోర్హెస్ దాన్ని చూసుంటే చాలా సంతోషించి ఉండేవాడు. ఎందుకంటే, భారతీయ వేదాంతుల్లాగా , ఆయన కూడా , ప్రపంచం, జీవితం, సాహిత్యం అంతిమంగా, ఒట్టి ఖేల తప్ప మరేమీకాదన్న నిశ్చయానికి వచ్చినట్టే అనిపిస్తుంది.

బోర్హెస్ ని చదివితే ఏమవుతుంది? ఈ ప్రశ్నకి రెండంచెల్లో జవాబివ్వచ్చు. బోర్హెస్ రాసిన ఫిక్షన్ చదివితే ఈ ప్రపంచం మనం చూస్తున్నంతమేరకు మాత్రమే పరిమితం కాదేమో అని అనుమానమొస్తుంది. అతడు రాసిన నాన్-ఫిక్షన్ చదివితే ఈ ప్రపంచం మనం చూస్తున్నంతమేరకే పరిమితంకాదని నిశ్చయంగా తేలిపోతుంది.

21-6-2014

Leave a Reply

%d bloggers like this: