మా మిత్రుడూ, నాకెంతో ఆత్మీయుడూ మహేష్ నిన్న రాత్రి చెన్నైలో ఈ లోకం వదిలిపెట్టివెళ్ళిపోయాడు. నిన్నసాయంకాలమే సురేష్ బాబు ఫోన్ చేసినప్పుడే నేనీ వార్త వినడానికి మానసికంగా సిద్ధపడిపోయాను. పొద్దున్నే కుప్పిలి పద్మ, కొప్పర్తి, వొమ్మి రమేష్.. రాజమండ్రి మిత్రులంతా ఫోన్ చేస్తూ ఉన్నారు.
మహేష్ గా మేమంతా పిలుచుకునే చక్రాల వెంకట సుబ్బుమహేశ్వర్ ని రాజమండ్రిలో కలవకముందే అతడి పేరు విన్నాను, అది కూడా కొంత విచిత్రంగా. 1980 లోనో, 81 లోనో, ఆంధ్రజ్యోతిలో అజంతా ‘కంప్యూటర్ చిత్రాలు’ కవిత వచ్చింది. ఆ కవితనెట్లా అర్థం చేసుకోవాలని నా మిత్రుడూ, ఇప్పుడు సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ప్రసిద్ధుడూ అయిన భరణి అజంతాని నిలదీస్తూ ఉత్తరం రాసాడు. ఆ ఉత్తరానికి అజంతా ప్రతిస్పందించలేదుగానీ, ఆయన మిత్రుడు ప్రసాద్ అనే ఆయన జవాబు రాస్తూ, ఆ కవిత గురించి తెలుసుకోవాలంటే రాజమండ్రి పేపర్ మిల్లులో పనిచేస్తున్న మహేష్ అనే ఆయన్ని కలవమని రాసాడు. ఆ ఉత్తరం నా మిత్రుడికి మరింత ఆగ్రహం తెప్పించింది. కవి విజయవాడలో ఉంటే వ్యాఖ్యాత రాజమండ్రిలో ఉన్నాడా అని విరుచుకుపడ్డాడు.
నేను 1982 లో రాజమండ్రిలో టెలిఫోన్స్ కార్యాలయంలో గుమాస్తాగా చేరిన తొలిరోజుల్లో సుదర్శనంగారిని కలిసినప్పుడు ఆయన సాహితీవేదిక గురించి చెప్పి, ఆ సమావేశాలకు తప్పకుండా వెళ్ళమన్నారు. నేనా మీటింగులకి వెళ్ళిన మొదటిసారే మహేష్ కంట్లో పడ్డాను.ఆయనప్పుడు రాజమండ్రి పేపర్ మిల్లులో సేఫ్టీ ఆఫీసరుగా పనిచేస్తుండేవాడు. నా మరో మిత్రుడూ, అత్యంత ఆత్మీయుడూ అయిన కవులూరి గోపీచంద్ కూడా ఆ మిల్లులో కెమిస్టుగా పనిచేస్తుండేవాడు. వాళ్ళిద్దరూ ఆ పురాతననగరాన్ని ఆధునికకాలంలోకి తీసుకురావడానికి కంకణం కట్టుకున్నట్టుండేవారు.
మహేష్ ని నేను మాగ్నెట్ లాగా ఆకర్షించానో, ఆయన నన్ను మాగ్నెట్ లాగా కరుచుకుపోయాడో నాకు తెలియదు. కాని ఆ తర్వాత నేను రాజమండ్రి జీవితంలో ఒక భాగమైపోయానంటే ఆయనే కారణం. టెలిఫోన్స్ లో పనిచేస్తూనే డిగ్రీ పూర్తి చేసుకుని సివిల్ సర్వీసెస్ రాయాలన్న నా చిన్నతనపు యాంబిషన్ ని పక్కకు నెట్టేసి నేనో కవిని కావాలనీ, తత్త్వశాస్త్ర విద్యార్థిని కావాలనీ కలలుగన్నానంటే అందుకు మహేష్ ఎంత కారణమో ఇప్పుడు బోధపడుతున్నది నాకు.
82 నుంచి 86 లో ఆయన శ్రీహరికోట వెళ్ళిపోయేదాకా మేము కలుసుకోని రోజు లేదు. ఎన్ని సాయంకాలాలు, రాత్రులు, సెలవురోజులు గోదావరి గట్టు ఇల్లుగా, మేము కవిత్వాని తింటూ, తాగుతూ జీవించామో చెప్పలేను.
రాజమండ్రి వచ్చేటప్పటికి మహేష్ కి ప్రత్యేకమైన జీవితాశయంటూ ఏదీ ఉండనుకోను.కాని అతణ్ణి సానబెట్టి వజ్రంగా మార్చింది సమాచారం సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం లేని రాజమండ్రి మా ఊహకి కూడా అందదు. సుబ్ర్హమణ్యం వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సమస్యలకి మహేష్ తోడుగా నిలబడితే, మహేష్ జీవితానికి సుబ్రహ్మణ్యం దారిచూపించాడు.
నన్నయ సహస్రాబ్ది ఉత్సవాలకోసం ‘నన్నయ భారత రచన’ అనే ఒక డాక్యుమెంటరీ రూపకం మహేష్ రాసాడంటే, దాన్ని మా గురువూ, మహనీయ ప్రయోక్తా టి.జె.రామనాథం ప్రదర్శించాడంటే అందుకు కారణం సుబ్రహ్మణ్యం. ఆ ప్రయోగం ఇచ్చిన సంతోషంతో ‘స్వాతంత్రోద్యమ శంఖారావం’ అనే డాక్యుమెంటరీ రూపకం నేను కూడా రాసానంటే, దాన్ని రామనాథం ప్రదర్శించాడంటే నాకిప్పటికీ నమ్మబుద్ధికాదు. కానీ అందుకు సుబ్రహ్మణ్యమెంతకారణమో, మహేష్ కూడా అంతే కారణం.
నేను రాజమండ్రి వెళ్ళిన కొత్తలో మహేష్, గోపీచంద్ లని చూసి నేనెంతో గాభరా పడిపోయాను. అప్పటికే తెలుగు సాహిత్యం మొత్తం చదివేసాననుకున్న నాకు వాళ్ళు నాకన్నా యుగాలు ముందున్నారనిపించింది. కామూ, జాయిస్, ఫాక్నర్ వంటి రచయితలగురించీ, ఆఫ్రికన్ కవిత్వం, హైకూ, వేస్ట్ లాండ్ ల గురించీ, మార్క్సు, ఫ్రాయిడ్, సార్త్రే ల గురించీ వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను నోరువెళ్ళబెట్టుకు వినేవాణ్ణి. మహేష్ ఇంట్లో ఆధునిక పాశ్చాత్యసాహిత్యం పుస్తకాలు దొంతర్లు ఉండేవి. అంత సుసంపన్నమైన పెర్సనల్ లైబ్రరీని చూడటం నాకదే మొదటిసారి. కొన్నాళ్ళకు సంకోచం విడిచి ‘నేను మీలా ఇంగ్లీషు పుస్తకాలు చదవాలంటే ఎలా, నాకేమన్నా చిట్కాలు చెప్పండి’ అనడిగాను.
సాయంకాలపు గోదావరిగాలిలో అర్థంలేని అశాంతితో ఊగిపోతూ సిగరెట్లు కాల్చుకుంటూ శ్రీశ్రీ గురించీ, బైరాగిగురించీ మహేష్ తో మాట్లాడుకున్న రోజుల్లోని ఆ అమాయకత్వం, ఆ authenticity ఇప్పుడు మళ్ళా రమ్మంటే ఎలా వస్తాయి?
మహేష్, శకుంతల ప్రేమించుకోవడం, వాళ్ళ పెళ్ళి, మహేష్ శ్రీహరికోట వెళ్ళిపోయినా, శకుంతల లా చదువుకోసం రాజమండ్రిలోనే మరికొన్నాళ్ళు ఉండటం,ఆ ఇల్లొక అడ్డాగా మేం గడిపిన అత్యంత సార్థక నిరర్థక కాలం- వీటిని మరిచిపోవడం కష్టం.
మల్లంపల్లి శరభయ్యగారూ, మల్లాప్రగడరామారావుగారూ, సావిత్రిగారూ, గౌతమీ గ్రంథాలయం, వీరేశలింగం పురమందిరం, రాజమండ్రి పుస్తకప్రదర్శన, గోదావరి మాత విగ్రహం దగ్గర ప్రతి ఉగాదికీ మేం చదువుకున్న తెలుగు కవిత్వం- ఈ జ్ఞాపకాలన్నిటిలో మహేష్ కూడా ఒక భాగం. యర్రాప్రగడ రామకృష్ణ, కొప్పర్తి, కల్లూరిభాస్కరం, చట్టి హనుమంతరావు, తమ్ముడు, ఆదిశేషసాయి, సోమయాజులు, ఎమ్మెస్ సూర్యనారాయణ వంటి మిత్రులందరికీ కూడా మహేష్ గురించి ఇట్లాంటి జ్ఞాపకాలే ఉంటాయి.
అదొక కాలం. కవిత్వం తప్ప మరేదీ సత్యం కాదనీ, శాశ్వతం కాదనీ నమ్మిన కాలం. ఆకలి, పేదరికం, కుటుంబకష్టాలు-వీటన్నిటికన్నా ఒక కవిత బోధపడకపోవడమే అతిపెద్ద సమస్యగా కనిపించిన కాలం. నీకోసమొక ప్రియురాలు ఎదురుచూస్తున్నా, ఇక్కడొక కవిమిత్రుడితో చివరి సిగరెట్టు పంచుకోవడంలోనే ఎక్కువ థ్రిల్ కనిపించిన కాలం.
మల్లంపల్లి శరభయ్యగారు, ఆర్.ఎస్.సుదర్శనంగారు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారు, సావిత్రిగారు, రామనాథం, సుబ్రహ్మణ్యం లు ఎక్కడికి వెళ్ళిపోయారో మహేష్ కూడా అక్కడికే వెళ్ళిపోయాడు. ఇక గోపీచంద్ సంగతి సరేసరి. వాళ్ళతో కలిసి అహర్నిశలు కవిత్వాన్ని శ్వాసించిన నేనేనా ఈ పొద్దున్నే ఇక్కడిట్లా మిగిలిపోయి ఈ అక్షరాలు టైపు చేస్తున్నది?
మహేష్ గొప్ప కవి. 80 ల తర్వాత తెలుగుకవిత్వంలో మనం చూస్తున్న మార్పుని ముందే పసిగట్టినకవి. తన కవితలొక సంపుటంగా రాకపోతే ఏ కవిగురించైనా తక్కిన ప్రపంచానికేమి తెలుస్తుంది? కాని సాహితీవేదిక కోసం మేం సంకలనం చేసిన ‘కవితావేదిక’ (1983), ‘ఆర్కెష్ట్రా’ (1985) లలో అతడి కవితలు చాలు. నా మాటలు నిజమని చెప్పడానికి. వాటిల్లోంచి మహేష్ కవిత ఒకటి మీకోసం:
వెదికేముందు
ఇప్పటికి తెలిసింది.
చెట్టునీడలో హాయిగా కూర్చునేవాడిని
కనబడని పక్షులపాటలు.
పువ్వుల పరిమళాలు.
ఆకులు నాపైకి మళ్ళించే చల్లని గాలి.
వచ్చేపోయే బాటసారులు.
వాళ్ళు చెప్పుకునే జీవితాలు.
ఏనాడూ బాటవైపు మనసుపోలేదు.
పక్షులూ, పువ్వులూ వికసిస్తూనే ఉన్నాయి.
చల్లటిగాలి వీస్తూనే ఉంది పరిమళాన్ని మోసుకుంటూ.
బాటని చూడటమే తెలుసు నాకు.
ఎక్కడమొదలవ్వాలో ఎలా తెలుస్తుంది?
దారి రెండువైపులనుంచీ ఆహ్వానాలు మాత్రం అందుతూనే వున్నాయి.
ఇప్పటికి తెలిసింది.
ప్రయాణానికి గమ్యం కుదరకపోయినా
దిశ అయినా నిర్ణయించుకోవాలని.
వెదికేముందు పోగొట్టుకున్నదేదో
నిశ్చయపరుచుకోవాలని.
15-3-2014