గోపీనాథ మొహంతి

చాలా రోజులుగా పుస్తకాల అలమారులో ఉన్న నవల, గోపీనాథ మొహంతి ‘ దాదీ బూఢా’ (Ancestor, సాహిత్య అకాదెమీ, 1997) బయటకు తీసాను. ఆ అనువాదం ఏకబిగిన చదివించింది.చాలా ఏళ్ళ కిందట, ‘అమృత సంతానం’ చదివినప్పుడు ఎటువంటి సంతోషం కలిగిందో, అటువంటి సంతోషంలోనే చాలా సేపటిదాకా ఉండిపోయాను.

గోపీనాథ మొహంతి (1914-1991) ఆధునిక ఒరియా సాహిత్యంలో, ముఖ్యంగా వచనసాహిత్యంలో ఫకీర్ మోహన సేనాపతి తర్వాత అంతటి ఖ్యాతి పొందాడు. 24 నవలలు, 10 కథాసంపుటాలతో పాటు కవిత్వం, నాటకం,వ్యాసం, జీవితచరిత్ర వంటి ప్రక్రియల్లో కూడా చెప్పుకోదగ్గ కృషి చేసాడు. గిరిజన భాషా, సంస్కృతుల మీద అయిదు సంపుటాలు వెలువరించాడు. టాల్ స్టాయి నీ, గోర్కీని, టాగోర్ నీ ఒరియాలోకి అనువదించాడు. ఆయన రచనల్లో ‘అమృత సంతానం’ సాహిత్య అకాదెమీ పురస్కారాన్నీ, ‘మటిమటాల’ జ్ఞానపీఠ పురస్కారాన్నీ సముపార్జించేయి. గోర్కీ My Universities ని అనువదించినందుకు గాను, సోవియెట్ లాండ్ నెహ్రూ పురస్కారం లభించింది. భారత ప్రభుత్వం పద్మభూషణ సత్కారాన్ని అందించింది. తన చివరిరోజుల్లో ఒక అమెరికన్ విశ్వవిద్యాలయంలో సాంఘిక శాస్త్ర ఆచార్యుడిగా పనిచేస్తూ అక్కడే కాలం చేసారు.

మొహంతి సమకాలికులైన ఒరియా రచయితలు మేరుసమానులు చాలామంది ఉన్నారు. కాళిందీ చరణ పాణిగ్రాహి, మాయాధర మానసింహ, సచ్చిదానంద రౌత్రాయ్, సురేంద్ర మొహాంతి లతో పాటు మొహంతి సోదరుడు కానూ చరణ మొహంతి కూడా ఉన్నారు. ఒకప్పుడు నేను మా శాఖకి కార్యదర్శిగా పనిచేసిన చిత్తరంజన బిశ్వాల్ గారితో మొహంతి గురించి మాట్లాడినప్పుడు, ఆయన కానూ చరణ్ గోపీనాథ మొహంతి కన్నా గొప్ప రచయిత అన్నారు.

కాని గోపీనాథ మొహంతిని సమకాలిక ఒరియా రచయితల్లోనే కాక, ఆధునిక భారతీయ రచయితలందరికన్నా ప్రత్యేకంగానూ, మిన్నగానూ నిలబెట్టేది గిరిజనుల గురించి ఆయన సృష్టించిన సాహిత్యం.

ఆయన 1938 లో ఒరిస్సా రాష్ట్ర పాలనా సర్వీసులో చేరిన తర్వాత చాలాకాలం పాటు అవిభక్త కోరాపుట్ జిల్లాలో వివిధ స్థాయిల్లో పనిచేసారు. గిరిజనులు అత్యధికంగా నివసించే ఆ ప్రాంతాల్లో పనిచేసినందువల్ల ఆయనకి వారిని చాలా దగ్గరనుంచి చూసే అవకాశం లభించింది. కోదులు, పొరజాలు, గదబలు, డొంబులు మొదలైన గిరిజన తెగల గురించి ఆయన ప్రత్యక్షంగా చేసిన ‘దాదీ బూఢా’ (1944), ‘పరజ’ (1945), ‘అమృతర సంతాన్’ (1947) లతో పాటు ‘అపహంచ’ (1961) అనే మరొక నవల కూడా రాసారు. అందులో ‘అమృతర సంతాన్’ ని సాహిత్య అకాదెమీ కోసం పురిపండా అప్పలస్వామిగారు అద్భుతంగా తెలుగు చేసారు. అద్దేపల్లి అండ్ కో, రాజమండ్రి వారు ప్రచురించిన ఆ పుస్తకం ఇప్పుడు లభ్యం కావడం లేదు. అందులో ఆయన కోరాపుట్ అడవుల్లోని కోదు తెగ జీవితాన్ని చిత్రించారు.

కోదులు (ఇంగ్లీషులో khonds) భారతదేశంలోని అత్యంత ప్రాచీన మానవసమూహాల్లో ఒకరు. వారు ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన ‘కుయి’ అనే భాష మాట్లాడతారు. ఒకప్పుడు, ఆ తెగలో, ‘మెరియా’ అనే పేరిట నరమేధక్రతువు కూడా జరుగుతుండేది. బెంగాల్లో సతిని రూపుమాపడానికి పూనుకున్నట్టే, ఈస్టిండియా కంపెనీ, బ్రిటిష్ ప్రభుత్వం ఆ ఆచారాన్ని నిర్మూలించడానికి ఒక శతాబ్దం పాటు చాలా ప్రయత్నాలు చేసాయి. అందులో భాగంగా, బయటి ప్రపంచానికి ఆ తెగ పట్ల అపోహలూ,అపార్థాలూ ఏర్పడటానికి కూడా కారణమయ్యింది. ఆ నేపథ్యంలో ఆ జాతి జీవితం ఒక ఉత్సవంలాంటిదని చెప్పడం కోసం మొహంతి ఆ మహేతిహాసం రాసాడు.

నా దృష్టిలో, ఆ నవల War and Peace కన్నా గొప్పది, బహుశా, భారతీయ సాహిత్యంలో, మహాభారతం తరువాత, ఆ రచనకే నేను పట్టం కడతాను. ఈ మాట రాస్తున్నప్పుడు శరత్, బిభూతి భూషన్ బందోపాధ్యాయ, తారాశంకర్ బందోపాధ్యాయ, ప్రేంచంద్, తకళి శివశంకర పిళ్ళై, శివరామకారంత, ఖాండేకర్ వంటి పూర్వపు మహారచయితలు మొదలుకుని భైరప్ప,విక్రమసేథ్ వంటి నేటికాలపు రచయితలెంతమందో నా మనస్సులో మెదుల్తున్నారు. అయినా కూడా నేను అమృతసంతానాన్నే ఎంపిక చేస్తాను.

ఎందుకంటే ఈ మహారచయితలంతా నాగరిక, గ్రామీణ సమాజాల గురించి రాసారు. అమృతసంతానంలో గొప్పదనం ఎక్కడుందంటే, ఆయన దాన్ని బయటివాడు గిరిజనుల గురించి రాసినట్టుగాకాక, గిరిజనుడి ప్రాపంచిక దృక్పథంతో మమేకమై రాసాడు. గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న దోపిడీ గురించీ, పీడన గురించీ రాసినవాళ్ళు లేకపోలేదు. ఆ విషయంలో మహాశ్వేతాదేవిని మించిన వాళ్ళు లేరు. కాని మొహంతి అక్కడితో ఆగిపోలేదు. ఆయన ‘జీవితం సత్యం’ అని మాత్రమే కాక,’జీవితం సుందరం’ అని కూడా అనగలిగాడు. అది భారతీయ మహేతిహాసాలైన రామాయణ, మహాభారతాల సాహిత్య వారసత్వం. దుఃఖాన్ని చూసి, చిత్రించి, అక్కడితో ఆగకుండా, అధీరుడు కాకుండా, ఏ సత్త్వం ఇన్ని మహాయుగాలపాటు ఆదివాసుల్ని బతికిస్తూ వచ్చిందో,ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని దాటి మనుగడ సాగనిస్తున్నదో, ఆ జీవశక్తిని ఆయన దర్శించాడు, అద్భుతమైన ఐతిహాసిక శైలిలో చిత్రించాడు.

దాదీ బూఢా ఆయన రాసిన రెండవ నవల, కానీ గిరిజన జీవితానికి సంబంధించిన మొదటినవల. కావడానికి అమృతసంతానం లో కోదుల గురించీ, దాదీ బూఢా లో పొరజా ల గురించీ రాసినట్టు కనిపించినా, ఇతివృత్తం స్థూలంగా ఒక్కటే. ఒక విధంగా దాదీ బూఢా అమృతసంతానానికి preliminary sketch అనుకోవచ్చు. ఈ నవల రాసిన మూడేళ్ళకే అమృతసంతానం రాసినప్పటికీ, ఈ ఇతివృత్తాన్ని తీర్చిదిద్దడానికి అవసరమైన పరిపూర్ణ శిల్పం అప్పటికి ఆయనకు పూర్తిగా సిద్ధించిందని చెప్పవచ్చు.

దాదీ బూఢాఅనే పదం కోదు-పొరజా భాషలకు చెందిన రెండు పదాల కలయిక. ఆ పదానికి వాచ్యార్థం ఏమైనా గాని, లాక్షణికార్థం ‘పితృదేవత’ అని చెప్పుకోవచ్చు.

కోరాపుట్ జిల్లాలోని లుల్ల అనే గిరిజన గ్రామం పొరజాలు, దొంబులు కలిసి జీవించే ఒక గ్రామం. ఆ గ్రామస్థులు ఒక ఈతచెట్టులో తమ పితృదేవతగా ప్రతిష్టించుకుని, తమ మంచిచెడ్డలన్నింటినీ ఆ దేవతకు నివేదించుకుంటూ బతుకుతుంటారు. ఆ గ్రామపెద్ద రామచంద్రముదులి పొరజా తెగకి చెందినవాడు. అతడి కొడుకు తెంగా జానికి యుక్తవయసు రాగానే తమ తెగకే చెందిన అమ్మాయితో పెళ్ళి చెయ్యాలని నిశ్చయిస్తాడు. కొత్త జంట కోసం ఒక ఇల్లు కూడా కట్టడం మొదలుపెడతాడు.

కాని తెంగా జాని తమ గ్రామానికి చెందిన డొంబు కులస్థురాలు సంతోషకుమారిని ఇష్టపడతాడు. ఒక పొరజా, అది కూడా గ్రామపెద్ద కొడుకు, కాబోయే గ్రామపెద్ద, ఒక డొంబును ఇష్టపడటం, పెళ్ళి చేసుకోవడం ఆ తెగ చరిత్రలోనే ఊహించడానికి వీల్లేనిది. అందుకని వాళ్ళిద్దరూ, గ్రామంనుంచి పారిపోయి, అస్సాం టీతోటల్లో పనివెతుక్కుంటూ వెళ్ళిపోతారు. కొన్ని రోజులకి ఆ గ్రామం లో పశువులు చనిపోవడం మొదలవుతుంది. గ్రామపెద్ద ఇంట్లో సంభవించిన దోషం వల్లనే పశునష్టం సంభవిస్తోందని ఊరంతా భావిస్తారు. గ్రామపెద్ద ఊరికంతా విందుచేస్తాడు, ప్రాయశ్చిత్త క్రతువులు చేస్తాడు. కొన్నాళ్ళకి ఊరు మీద పులి విరుచుకు పడుతుంది, మనుషుల్నీ, పశువుల్నీ కూడా చంపి తినడం మొదలవుతుంది. ఈ సారి తప్పెవరిదో అర్థం కాదు, దేవతకు పూజచేస్తారు. దేవత గ్రామస్థుల్ని ఆ ఊరు వదిలిపెట్టి దగ్గరలో మరో కొత్త ఊరు కట్టుకొమ్మని చెప్తుంది. ఆ పొరజా సమాజం ఎన్నో ఏళ్ళుగా జీవించిన ఆ ఊర్ని వదిలిపెట్టి కొత్త ఊరుకి తరలివెళ్ళిపోతారు. ఆ పాత గ్రామం నెమ్మదిగా కూలిపోతుంది, దానితో పాటే, ఆ గ్రామపెద్ద తన కొడుకు, కోడలి కోసం కట్టడం మొదలుపెట్టి సగంలో ఆగిపోయిన ఇల్లు కూడా.

ఇప్పుడే ఇంత దోపిడీ, పీడన,అశాంతి గిరిజన ప్రాంతాల్లో ఉంటే, స్వాతంత్ర్యం పూర్వం గిరిజన ప్రాంతాలు ఎంత దుర్భరంగా ఉండేవో ఊహించడం కష్టం కాదు. మొహంతి అదంతా చూసాడు, చిత్రించాడు. కాని ఆయన హృదయం అక్కడితో ఆగిపోలేదు. అమానుషమైన ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కుని గిరిజనులు ఎట్లా బతకగలుగు తున్నారు? వారి జీవన రహస్యమేమిటి? గిరిజనుల గురించి మాట్లాడే వాళ్ళు రాజకీయవేత్తల్లా, ఆర్థికశాస్త్రవేత్తల్లా మాట్లాడం సహజం. కాని మొహంతి ఒక మానవశాస్త్రవేత్తలా, ఒక సౌందర్యశాస్త్రవేత్తలా ఆలోచిస్తాడు, మాట్లాడతాడు. అందుకనే దాదీ బూఢా ముగించేటప్పటికి, మాటల్లో వివరించలేని ధైర్యమేదో మనకి స్ఫురిస్తుంది. మనం ఆ సమాజాన్ని చూసి జాలిపడం, ఇష్టపడతాం, ఆశ్చర్యపోతాం, బహుశా మనకు తెలీకుండానే ఆరాధించడం మొదలుపెడతామేమో కూడా.

ఈ నవలను ఇంగ్లీషులోకి అనువదించిన అరుణ్ కుమార్ మొహంతి చాలా మేరకు సఫలమయ్యాడనే చెప్పవచ్చు. చాలాచోట్ల ఆ ఇంగ్లీషు చదువుతుంటే, నాకు తెలీకుండానే నా మనసు పురిపండా శైలిలో తెలుగులోకి అనువదించుకుంటూ ఉంది. మూలభాషలో ఏ సంగీతం, సుగంధం ప్రవహించిఉంటాయో, అవి ఇంగ్లీషు హద్దుల్ని దాటి నా హృదయాన్ని తాకుతూన్నట్టే అనిపించించింది.

బహుశా తెలుగుగిరిజనులకి కావలసింది ఒక మొహంతి లాంటి రచయిత, మరొక మొహంతి లాంటి అనువాదకుడూ కూడా.

14-7-2016

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%