గూగి వా థియోంగో

Reading Time: 4 minutes

84

గూగి వా థియోంగో (1938) కెన్యాకి చెందిన రచయిత. సమకాలిక ఆఫ్రికన్ రచయితల్లో అగ్రశ్రేణికి చెందినవాడు. కథ, నవల, నాటకం వంటి ప్రధాన ప్రక్రియల్లో చెప్పుకోదగ్గ రచనలు వెలువరించాడు. ముఖ్యంగా ఆఫ్రికన్ తెగల్లో ఒకటైన గికుయు తెగ వారి భాషలో ప్రస్తుతం రచనలు చేస్తున్నాడు. ఆ భాషలో ‘ముతీరీ’ అనే ఒక పత్రిక కూడా నడుపుతున్నాడు. అతణ్ణి కొన్నాళ్ళు కెన్యా ప్రభుత్వం జైలో నిర్బంధించింది. అమెస్టీ జోక్యంతో జైలునుంచి విడుదలైన గూగీ ప్రస్తుతం కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేస్తున్నాడు.

గూగి రచనలు చదువుతుంటే, ఆఫ్రికా గురించి సరే, అంతకన్నా కూడా, మన దేశం గురించీ, మన సమాజం గురించీ, గ్లోబలైజేషన్ కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలగురించీ మనకి మరింత బాగా అర్థమవుతుంది. తాను పుట్టిన లిమురు లో జీవితం గురించి అతడు రాసింది చదువుతుంటే నాకు పాడేరు గిరిజనుల గురించే చదువుతున్నట్టు అనిపిస్తుంది.

గూగి వ్యాస రచయిత కూడా. బాలసాహిత్యం మొదలుకుని అఖండ ఆఫ్రికా దాకా అతడు ఎన్నో అంశాల మీద విస్తారమైన పరిజ్ఞానంతోనూ, విస్పష్టమైన దార్శనికతతోనూ రాస్తాడు. అటువంటి ఏడు వ్యాసాల సంపుటి Secure the Base (సీగల్ బుక్స్, 2016).

గ్లోబలైజేషన్ గురించి మన వాళ్ళు కూడా పుస్తకాలు రాస్తారు కాని గూగీ వ్యాసాల్లో ఉన్న స్పష్టత వాటిలో కనిపించదు. ప్రధానమైన తేడా ఎక్కడుంతంటే, గూగీ ఆర్థికవిషయాల్నీ, రాజకీయ పరిణామాల్నీ చర్చించేటప్పుడు ఆఫ్రికన్ సాంస్కృతిక నేపథ్యాన్ని అడుగడుగునా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా, గ్లోబలైజేషన్ యుగంలో, పోస్ట్ మాడర్న్ బహుళతావాదం బలపడ్డాక, వివిధ ప్రాంతాలు, కులాలు, భాషలు తమ అస్తిత్వాల్ని ప్రకటించడం మొదలుపెట్టాక, వాటిని ఏ విధంగా తమ ఆశయాలతో సమన్వయపరుచుకోవాలో మనరచయితలకి అర్థం కాలేదు. ఎందుకంటే, వాళ్ళు ప్రధానంగా పందొమ్మిదో శతాబ్ది భాషలోనే ఆలోచించడానికి అలవాటు పడ్డారు కాబట్టి. కాని గూగి ఒకవైపు ఆఫ్రికాలోని తెగల, జాతుల, దేశాల సాంస్కృతిక అస్తిత్వం గురించి మాట్లాడుతూనే, మరొక వైపు అఖండ ఆఫ్రికా అనే ఆదర్శం వాస్తవం కాగలదని నమ్ముతాడు. ఆ రెండింటినీ తనకై తాను సమన్వయపరుచుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నం ఎంతో విశ్వసనీయంగానూ, అభినందనీయంగానూ కనిపిస్తుంది మనకి.

ఈ పుస్తకంలో మొదటి వ్యాసం ‘తెగ’ అనే పదం ఆఫ్రికా రాజకీయవాస్తవికతను ఏ విధంగా మరుగుపరుస్తున్నదనే అంశం మీద చర్చించిన రచన. ఆఫ్రికా అభివృద్ధికి అక్కడున్న తెగల విభేదాలే కారణమనీ, ఆ తెగలు తమలో తాము ఎప్పుడూ కలహించుకుంటూ ఉంటాయనీ,వాళ్ళు ప్రజాస్వామికం కాలేకపోయారనీ బయట ప్రపంచానికి ఏర్పడ్డ భావాలు పాశ్చాత్య ప్రపంచపు సృష్టి అంటాడు గూగీ. జనాభా, ప్రాంతం, భాష ఏ ప్రాతిపదికన యూరోప్ లో జాతులు, జాతీయ రాజ్యాలు ఏర్పడ్డాయో అవే అవకాశాలు ఆఫ్రికాలో ఉన్నా కూడా పాశ్చాత్య ప్రపంచ ఆఫ్రికా దేశాల్ని ఇప్పటికీ జాతులుగా గుర్తించడానికి ఇష్టపడటం లేదనీ, వాళ్ళని తెగలుగా మాత్రమే పేర్కొంటున్నందువల్ల, అఫ్రికాలో సదా ఒక రాజకీయ అనిశ్చితి నెలకొనేలా చూస్తున్నదనీ చెప్తాడు. 3 లక్షల మంది ఐస్ లాండ్ జనాభాని ఒక జాతి అని పిలుస్తున్నప్పుడు, 3 కోట్ల ఇబోల్ని ఒక జాతిగా ఎందుకు గుర్తించడం లేదని అడుగుతాడు. ఆఫ్రికాను రాజకీయ విభాగాలుగా విడగొట్టిన వలసపాలకులు జాతి, తెగ, భౌగోళిక ప్రదేశం వంటి ఏ ప్రాతిపదికను కూడా పాటించలేదనీ, కేవలం వనరులు, వనరుల మీద ఆధిపత్యం మాత్రమే ప్రధానంగా చూసుకున్నారనీ, అందువల్ల, బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలూ, అభివృద్ధి చెందని ప్రాంతాలుగా ఆఫ్రికా విడిపోయిందనీ, ఆఫ్రికన్ రాజకీయ అశాంతికి కారణం ఆ అసమానతలో చూడవలసి ఉంటుందనీ అంటాడు. ఆఫ్రికా మొత్తం మీద ఇప్పుడు రెండే తెగలున్నాయనీ, ఒకరు ఉన్నవాళ్ళూ, రెండవది లేనివాళ్ళూ అని తేల్చేస్తాడు.

రెండవ వ్యాసం గ్లోబలైజేషన్, పెట్టుబడిదారీ ఫండమెంటలిజాల నేపథ్యంలో ఆఫ్రికా పరిస్థితిని గుర్తుపట్టే రచన. పుస్తకంలో అతి పెద్ద వ్యాసం ఇది. చాలా విశిష్టమైన, ఆలోచనాత్మకమైన రచన. గత నాలుగైదువందల ఏళ్ళుగా ప్రపంచంలో సంభవిస్తున్న ఆర్థిక-రాజకీయ పరిణామాలు ఆఫ్రికాను ఎట్లా ప్రభావితం చేసాయో, ఆ చారిత్రిక క్రమాన్ని అతడు గొప్ప స్పష్టతతో వివరిస్తాడు. యూరోప్ లో మొదలైన మెర్కంటైలిజం ఆఫ్రికన్లను బానిసలుగానూ, పారిశ్రామిక విప్లవం ఆఫ్రికన్ దేశాల్ని కాలనీలుగాను మారిస్తే ఇప్పుడు గ్లోబల్ ఫైనాన్సు ఆఫ్రికాను సరికొత్త బానిసత్వంలోకి నెట్టివేసిందని చెప్తాడు. దీఇన్నటడు దెబ్త్ స్లవెర్య్ అంటాడు. ఇది కొత్తతరహా కలోనియలిజం అని కూడా ఆంటాడు.

కలోనియలిజం రోజుల్లో పెట్టుబడి ప్రవర్తనకీ, ప్రస్తుత నియో కలొనియలిజం రోజుల్లో ప్రవర్తనకీ మధ్య ఉన్న తేడా ఏమిటంటే, ఇప్పుడు పెట్టుబడి ఒక ఫండమెంటలిస్టు ధోరణిని సంతరించుకోవడమే అంటాడు. ఫండమెంటలిజం-ఆర్థికంగానీ, రాజకీయంగానీ, మతపరమైంది గానీ, దాని స్వభావమేమిటంటే, అది మన చుట్టూ ఉన్న వాస్తవాన్ని మనం ఒకే మూసలో, ఒకే చట్రంలో అర్థం చేసుకోవాలని మనల్ని నిర్బంధిస్తుంది. గ్లోబల్ పెట్టుబడి సహజంగానే జాతీయ రాజ్యాల్ని బలహీనపరుస్తుంది. కాని అది చెప్పే వాదన ఏమిటంటే, పెట్టుబడి (మానవవనరులతో సహా)జాతీయ సరిహద్దుల్ని దాటి ప్రపంచమంతా విస్తరించాలనీ, దానిమీద ఎటువంటి ఆంక్షలూ నిర్బంధాలూ ఉండకూడదనీ. కానీ గూగీ అడిగే ప్రశ్న ఏమిటంటే, నిజంగా పెట్టుబడి జాతీయ సరిహద్దుల్ని దాటి గ్లోబల్ కాగలిగిందా? మనం బహుళ జాతి సంస్థలుగా పేర్కొంటున్నవేవీ తమ పెట్టుబడినీ, లాభాల్నీ పంచడంలో బహుళ జాతి సంస్థలు కానే కావనీ, అవి ఇప్పటికీ పాశ్చాత్య దేశాల, అభివృద్ధి చెందిన దేశాల ఆస్తిపాస్తులుగానే ఉంటున్నాయనీ మనకి తెలుసు. ఒకప్పుడు ఆయుధాలతో, రక్తపాతంతో పాశ్చాత్యదేశాలు ఆఫ్రికా ను కొల్లగొట్టుకున్నాయనీ, ఇప్పుడు వస్తుసేవల రూపంలో, చౌకకూలీ రూపంలో మళ్ళా కొల్లగొట్టుకుంటున్నాయనీ గూగీ వాపోతున్నాడు. ఇది మనకి కూడా తెలిసిందే, మనం కూడా అనుభవిస్తున్నదే. అయితే, ఈ సందర్భంగా గూగీ చెప్తున్న కొత్త అంశం, ఆఫ్రికన్ మధ్యతరగతి పోషించవలసిన పాత్ర గురించి. కలోనియల్ రోజుల్లో ఆఫ్రికాను మేల్కొల్పింది మధ్యతరగతి మాత్రమే ననీ, వాళ్ళ వద్ద ఏ వనరులు లేకపోయినప్పటికీ, ప్రజలనే ఒకే ఒక్క అతి పెద్ద వనరును వాళ్ళు నమ్ముకున్నారనీ, ప్రజలతో కలిసి పనిచేసినందువల్లా, వాళ్ళకి అర్థమయ్యేటట్టు మాట్లాడిగలిగినందువల్లా మాత్రమే వాళ్ళు ఆఫ్రికాకు రాజకీయ స్వాతంత్ర్యం తీసుకురాగలిగారనీ చెప్తూ, ఇప్పుడు మధ్య తరగతి దగ్గర చాలా వనరులున్నాయిగానీ లేనిదల్లా ప్రజలతో సాన్నిహిత్యం మాత్రమే అంటాడు. అతడిలా రాస్తున్నాడు:

‘ ఒకటి మటుకు చాలా స్పష్టం. ఆఫ్రికా పురోగమించాలంటే, ఆఫ్రికన్ మేధావి వర్గం తన యథార్థమైన ప్రాతిపదిక దగ్గరకు -అంటే ప్రజలకి- చేరువకావాలి. అంతగా అభివృద్ధి చెందని దేశంలో మధ్యతరగతి తాను నిజంగా తన పాత్ర నిర్వహించాలనుకుంటే, వలసవాదులు తనకి అప్పగించినపాత్రగా అంటే పెట్టుబడిదారులకి పనికొచ్చే పరికరంగా బతకడం మానెయ్యాలి అని ఫ్రాంజ్ ఫేనాన్ రాసాడు. అంతేకాక, వాళ్ళు ‘ప్రజలకి ప్రాతినిధ్యం వహించే విప్లవశీల మూలధనానికి పూర్తివిధేయం కావాలి’.అటువంటి మధ్య తరగతి తన కాలం నాటి విశ్వవిద్యాలయాల్లోంచి కూడగట్టిన ‘మేధాపరమైన, సాంకేతికమైన పరిజ్ఞానాన్ని ప్రజలకు తిరిగి అందించాలి ‘

అని చెప్తాడు.

మధ్యతరగతి నిర్వహించవలసిన ఈ విప్లవాత్మక పాత్ర ఆఫ్రికాకన్నా ముందు భారతీయ మధ్యతరగతి మరింతగా వర్తిస్తుంది. వలసవాదం రోజుల్లో భారతీయ మధ్యతరగతి వలసవాద సాధనాలైన యూనివెర్సిటీలు, రైళ్ళు, పత్రికలు, తంతితపాలాల్ని వాడుకునే ప్రజల్ని కార్యోన్ముఖుల్ని చేసింది. కాని, ఇప్పుడు కొత్త వలసపాలన రోజుల్లో, మునుపటికన్నా శక్తిమంతమైన సమాచారప్రసార సాధానాలు తన చేతుల్లోకి వచ్చిన ఈ తరుణంలో భారతీయ మధ్య తరగతి ఆ సాధనాల్ని వినోదానికీ, కాలక్షేపానికీ, ఇంకా చెప్పాలంటే ద్వేషవ్యాప్తికీ వాడుకుంటూ ఉంది.

మధ్యతరగతి మళ్ళీ ప్రజలదగ్గరికి వెళ్ళాలని చెప్పడంతో ఆగకుండా గూగీ ఈ మాటలు కూడా రాస్తున్నాడు:

‘ మధ్యతరగతిలోని ఈ చిన్ని భాగం, అఫ్రికన్ మేధావి వర్గం గా పిలవబడే ఈ సమూహం, కలోనియల్ మూసల్ని తిరస్కరించడమంటే, యూరపియన్ జ్ఞాపకాలనుంచి బయటపడటం. తమ చుట్టూ ఉన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికీ, తమ కలల్ని ప్రకటించడానికీ ఐరోపీయ భాషలు మాత్రమే తగినవనే భ్రమనుంచి బయటపడటం. ఇంటా బయటా యూనివెర్సిటీల్లో ఉన్న విజ్ఞానాన్ని కొల్లగొట్టుకుని పైకొచ్చిన మధ్యతరగతి ఆ పరిజ్ఞానానికి బందీలుగా మారిపోగూడదు. ప్రజలభాషల్ని అందిపుచ్చుకోవడం, ఆ భాషల్ని ఉపయోగించుకోవడం కూడా మొదలుపెట్టాలి.’

అయితే ఇటువంటి భాషా వైవిధ్యం ఆఫ్రికన్ ఏకత్వానికి అవరోధం కాదా? కాదంటాడు గూగీ. వివిధ భాషల్లో వచ్చిన సారస్వతాన్నీ,విజ్ఞానాన్నీ పరస్పరం అనువదించుకోవడం ద్వారా, భాషా వైవిధ్యాన్ని గౌరవించుకోవడం ద్వారా, భిన్నత్వంలో ఏకత్వం సాధించుకోవచ్చని చెప్తాడు. భిన్నత్వంలో ఏకత్వం భారతీఅ ఆదర్శం. కానీ, ఇక్కడ ఒక భాషలో వస్తున్న విజ్ఞానం సాహిత్యం పక్క భాషలోకి ఏ మేరకు ప్రవహిస్తున్నాయి?

ఈ కొత్త సందర్భంలో ఆఫ్రికన్ సాంఘిక శాస్త్రవేత్త కర్తవ్యం ఏమిటనేది మూడవ వ్యాసంలో చర్చిస్తాడు. అతడిలా రాస్తున్నాడు:

‘ఈ రోజు ఆఫ్రికాలో సాంఘిక శాస్త్రజ్ఞుడి ముందున్న సమస్య ఇదే: గ్లోబలైజేషన్ యుగంలో ఆఫ్రికా ఖండాన్ని మరింత చేరువగా తీసుకురావడమెట్లా అన్నదే. ఒక ఉమ్మడి ఆఫ్రికన్ ప్రాతిపదికను రూపొందించడమెట్లా, తక్కిన ప్రపంచంతో అది సంవదించడానికి వీలుగా దాని బలపరచడమెట్లా? ఆర్థికంగానూ, రాజకీయంగానూ, సాంస్కృతికంగానూ ఆఫ్రికాను ఏకోన్ముఖం చెయ్యడమొక్కటే పరిష్కారం. ఇందులో రాజకీయ,ఆర్థిక సమగ్రతని సాదించడం రాజకీయ నాయకుల నిర్ణయాల మీద ఆధారపడ్డ విషయం కాగా, ఒక ఉమ్మడి మేధాప్రాతిపదికను ఏర్పరచడం మేధావుల చేతుల్లో ఉన్నదే. ప్రజల భాషల్లో వేళ్ళూనుకుని వాదించి, చర్చించి, నిజమైన ప్రజాప్రాతిపదికన ఏర్పడగల ఆఫ్రికన్ యూనియన్ కోసం ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయవలసిన బాధ్యత ఆఫ్రికన్ మేధావులదే.’

తక్కిన నాలుగు వ్యాసాలూ కూడా విలువైనవే. మొత్తం అన్ని వ్యాసాల్లోనూ అతడు మాట్లాడుతున్నదాన్ని స్థూలంగా ఇట్లా చెప్పవచ్చు. ఇప్పుడు గ్లోబలైజేషన్ యుగం మానవుడికి, జాతులకి, దేశాలకి ముందెన్నడూ లేనన్ని అవకాశాల్ని తెచ్చింది, అలాగే మున్నెన్నడూ లేనంత వినాశనానికి, దోపిడీకీ, పీడనకీ కూడా తలుపులు తెరిచింది. ఇప్పుడు ప్రపంచం చాలా కొద్దిపాటి సంపన్నదేశాలూ, అత్యధికసంఖ్యలో బీదదేశాలుగా విడిపోయింది. ఒకే దేశంలో కూడా చాలా కొద్దిసంపన్న కుంటుంబాలూ, అత్యధికసంఖ్యాకులు నిరాశ్రయులుగా మిగిలిపోయే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఈ పరిస్థితుల్ని కొద్దిమంది ప్రయోజనాలకి అనువుగా మలుచుకోవడం గ్లోబలైజేషన్. కాని, ఈ కొత్త అవకాశాల్ని అందిపుచ్చుకుని అత్యధికసంఖ్యాకుల ప్రయోజనాల కోసం పాటుపడటం ‘గ్లోబలిజం’ అంటాడు గూగీ. అటువంటి గ్లోబలిస్టు దృక్పథంతో రాసిన వ్యాసాలివి. గ్లోబలిస్టు దృక్పథం ఉన్న సాహిత్యం ఏమి చెయ్యాలో అతడిట్లా చెప్తున్నాడు:

‘మనం జీవిస్తున్న ప్రపంచం గురించిన పదచిత్రాల్ని మనకి సాహిత్యం అందిస్తుంది. ఆ పదచిత్రాల ఆధారంగా మనం ప్రపంచాన్ని ఒక నిర్ధిష్ట పద్ధతిలో చూడటం నేర్చుకుంటాం. ప్రపంచాన్ని మనం ఏ పద్ధతిలో చూస్తాం అన్నదానిబట్టే, మనం ఏదైనా చెయ్యడానికి పూనుకుంటామో, పూనుకోమో లేదా ఏదో ఒక పద్ధతిలో చెయ్యడమో, చెయ్యకపోవడమో ఆధారపడుతుంది. ఒక జాతిప్రజల్లోనూ, వివిధ జాతులమధ్యా కూడా ఒకళ్ళమీద ఒకళ్ళు పరాన్నభుక్కులుగానూ, ఒకళ్ళని ఒకళ్ళు దోచుకునేవాళ్ళుగానూ ఉండే పరిస్థితిని భరించలేకుండానూ, అటువంటి పరిస్థితుల్తో రాజీపడలేకుండానూ ఉండేలా మనుషుల్ని రూపొందించడమే నిజమైన శాంతికాముక రచన అనిపించుకుంటుంది. ఒకడు శుభ్రంగా ఉండటానికి మరొకడి జీవితం మురికికానక్కరలేకుండా ఉండటానికీ, ఒకడు ఆరోగ్యంగా ఉండటానికి మరొకడు అస్వస్థుడు కాకుండా ఉండటానికీ, ఒకడి సంక్షేమానికి మరొకడి దైన్యం కారణం కాకుండా ఉండటానికీ పోరాటం సాగించాలి. ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్క జాతి అభివృద్ధి చెందితీరే ప్రపంచం ఉన్నప్పుడే శాంతి సుసాధ్యమవుతుంది. దురాశమీదా, మానవవిధ్వంసం మీదా ఆధారపడ్డ గ్లోబలైజేషన్ కి, మానవ సృజనాత్మకతా, మానసిక స్వస్థతా పునాదిగా కలిగిన గ్లోబలిజం ఒక్కటే సమాధానం కావలసి ఉంటుంది.’

10-9-2017

Leave a Reply

%d bloggers like this: