రెండు వారాల కిందట, ఢిల్లీకి చెందిన ‘జన కలెక్టివ్’ అనే సంస్థకి చెందిన కళాకారుల బృందమొకటి నన్ను కలుసుకున్నారు. భారతప్రభుత్వం కోసం వాళ్ళు గదబల మీద ఒక డాక్యుమెంటరీ తీసే పనిలో ఉన్నారు. ఆ జాతి గురించీ, వాళ్ళ సంస్కృతి గురించీ ఏదన్నా చెప్పగలనేమోనని నన్ను వెతుక్కుంటూ వచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 34 తెగల్లోనూ ఏ ఒక్క తెగ గురించీ మనదగ్గర సమగ్రమైన సమాచారం లేదు. ఇప్పటికీ, జాతుల గురించీ, తెగల గురించీ తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఎడ్గార్ థర్ స్టన్ రాసిన ‘Castes and Tribes of South India’ (1909) నే దిక్కు. కొన్ని తెగల గురించి, కొందరు మహనీయులు ప్రత్యేకమైన కృషి చేసి, వాళ్ళ జీవన విధానాన్ని గ్రంథస్థం చెయ్యకపోలేదు. గిడుగు రామ్మూర్తి సవరల గురించీ, వెన్నెలకంటి రాఘవయ్య యానాదుల గురించీ, హైమండార్ఫ్ కొండరెడ్లు, చెంచుల గురించీ, జక్కా వెంకటరెడ్డి ఎరుకల వారి గురించీ ఎంతో విలువైన సమాచారాన్ని అందించారు. కాని, ఆ కృషి దాదాపు యాభై ఏళ్ళ కిందటిది.
గిరిజన సమాజాలు, సంస్కృతి, గత యాభైఏళ్ళల్లో, ముప్పై ఏళ్ళల్లో, గత పదేళ్ళల్లో అనూహ్యంగా మారిపోతూ వచ్చాయి.వారి సాంస్కృతిక పరివర్తనని పట్టుకుని, ఆ మార్పుని అర్థం చేసుకోవడానికి ఉపకరించే రచనలు చెప్పుకోదగ్గవేమీ రాలేదు. కొంతలో కొంత, డా.శివరామకృష్ణ, డా.వి.ఎన్.వి.కె.శాస్త్రి అటువంటి ప్రయత్నం అవసరమని గుర్తించి రాస్తూన్నారు. కాని అది చాలదు.
ఒకప్పుడు పందొమ్మిదో శతాబ్దంలో తెగల గురించీ,జాతుల గురించీ విన్నది విన్నట్టుగా, చూసింది చూసినట్టుగా రాసుకుపోయేవారు. అందులో కల్పనలూ, కట్టు కథలూ కూడా కలగలిసి ఉండేవి. దాన్ని ethnography అన్నారు. ఆ తర్వాత,అమెరికన్ సాంఘిక శాస్త్రజ్ఞులు యాంత్రొపాలజి ని ఒక శాస్త్రం గా తీర్చిదిద్దేక, ఒక జాతిని, తెగనీ శాస్త్రీయంగా చిత్రించడానికి అవసరమైన పనిముట్లు, పద్ధతులు ప్రపంచానికి లభ్యమయ్యాయి. కాని దురదృష్టవశాత్తూ, మన దేశంలో తెగల గురించీ, జాతుల గురించీ ఆ పద్ధతుల ప్రకారం రావలసిన రచనలు చెప్పుకోదగ్గట్టుగా, రానే లేదు.
ఈ నేపథ్యంలో, గదబల గురించి,జన కలెక్టివ్ వారు నన్ను సమాచారం అడిగినప్పుడు, నేను నిస్సహాయత ప్రకటించాను.
రాష్ట్రంలో ఉన్న 34 గిరిజన తెగల్లోనూ, ఏడు తెగల్ని ప్రభుత్వం ఆదిమ గిరిజన తెగలుగా (పిటిజిలు) గుర్తించింది. ఏ తెగలు ఇంకా ఆహారసేకరణమీదనే బతుకుతూ ఉన్నారో, ఎవరిలో స్త్రీల అక్షరాస్యత చాలా చాలా తక్కువగా ఉంటున్నదో, ఎవరి జనాభా పెరుగుదల స్వల్పంగా ఉందో, వాళ్ళని ఆదిమ గిరిజనులుగా గుర్తించారు. ఆ ఏడు తెగలు-సవరలు, పొరజాలు, కోందులు, కొండరెడ్లు, కొలాములు, గదబలు, చెంచులు. వాళ్ళల్లో అతి తక్కువ డాక్యుమెంటేషన్ కి నోచుకున్న తెగ గదబలు మాత్రమే.
అయితే, గదబలు విస్తారంగా ఉంటున్న విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో నేను పనిచేసినందువల్ల, నాకు తెలిసిన అరకొర సమాచారమేదో ఇవ్వగలిగాను గానీ ఇట్లాంటి సందర్భాల్లో ఇట్లాంటి కళాకారులకి నేనివ్వగలిగే సలహా ఒకటే, అదేమంటే, ఆ తెగలు విస్తారంగా ఉండే గ్రామాలకు వెళ్ళి, అక్కడ ఏ స్థానిక ఉపాధ్యాయుణ్ణో, గిరిజన యువకుణ్ణో పట్టుకుని, మీరే స్వయంగా సమాచారం సేకరించుకోండి అని.
కొన్నాళ్ళ కిందట, నక్కలవారి మీద ఒక డాక్యుమెంటరీ తీయడానికి ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వాళ్ళు జగ్గరాజు గారిని పురమాయించినప్పుడు నేను ఆయనకి ఆ సలహానే ఇచ్చాను. ఎక్కడో ఒక నవలలపోటీకి న్యాయనిర్ణేతగా ఉన్నప్పుడు, నక్కలవారి గురించిన రాసిన ఒక నవల నా కంటపడింది. ఆ రచయిత వి.ఆర్. రాసాని అని తర్వాత తెలిసింది. అందుకని, ముందు రాసానిని కలవమని జగ్గరాజుకి చెప్పాను. మూడు నెలలు కూడా తిరక్కుండానే జగ్గరాజు అద్భుతమైన డాక్యుమెంటరీ తీసుకొచ్చాడు. నక్కల వారి గురించి అతడు తెలుసుకున్నవిషయాలు గిరిజనసంక్షేమ శాఖకే తెలియదు!
ఇప్పుడు కూడా జన కలెక్టివ్ వారికి, అట్లాంటి రచయితనెవరినైనా సూచిద్దామని ఆలోచిస్తూండగా, నాకొక సంగతి గుర్తొచ్చింది. 1990 లో, నేనూ, మా అక్కా అమరావతి వెళ్ళినప్పుడు, ప్రముఖ సాహిత్యవేత్త డా.వావిలాల సుబ్బారావుగారిని కలుసుకున్నప్పుడు,ఆయన మాటల మధ్యలో గదబ భాష మీద తాను కొంత కృషి చేసాననీ, వాళ్ళ వ్యాకరణం మీద ఒక పుస్తకం రాసాననీ చెప్పడం గుర్తొచ్చింది. అందుకని, జన కలెక్టివ్ టీం లీడర్ నమ్రతకి, సుబ్బారావు గారి నంబరు ఇచ్చి వారిని కలుసుకొమ్మని చెప్పాను.
కాని ఆశ్చర్యంగా, మొన్న విజయవాడలో నవోదయా పుస్తకాల షాపుకి వెళ్తే, అక్కడ, Gadaba, The Language and The People (1992) కనిపించింది. (లైబ్రరీల్లోనూ, పుస్తకాల షాపుల్లోనూ దేవదూతలుంటారనే నా నమ్మకం మరో సారి రుజువయ్యింది) డా.వావిలాల సుబ్బారావుగారూ, డి.ఆర్. పట్నాయిక్ గారూ రాసిన ఆ పుస్తకం బహుశా గదబలమీద మనకి లభ్యమవుతున్న ఏకైక రచన. డా.సుబ్బారావుగారు బొబ్బిలి డిగ్రీ కాలేజిలో పనిచేస్తున్నప్పుడు, అక్కడికి దగ్గరిలో ఉన్న రాజాచెరువు వలస అనే గదబ జనావాసం కేంద్రంగా చేసిన పరిశోధన సారాంశం ఆ రచన.
ఆ పుస్తకం కొనగానే ఆవురావురుమంటూ చదివేసాను. అందులో రెండు భాగాలున్నాయి. మొదటిది,గదబ భాషానిర్మాణం మీద పరిశీలనలు, సూత్రీకరణలు. రెండవది ఆ జాతి గురించిన సామాజిక చిత్రణ. నేను భాషావేత్తను కాను కాబట్టి, మొదటి భాగం గురించి చెప్పలేనుగానీ, రెండవ భాగం నాకెంతో చాలా విలువైందనిపించింది. ఆ పుస్తక రచయితలు సుశిక్షిత మానవశాస్త్రవేత్తలు కాకపోయినప్పటికీ, ఎంతో నిర్దుష్టంగానూ, శాస్త్రీయంగానూ, గొప్ప ఔదార్యంతోనూ గదబల జీవితాన్నీ, సంస్కృతినీ పట్టుకున్నారు. వారి సునిశిత పరిశీలన వల్ల, గత యాభై ఏళ్ళల్లో వచ్చిన మానవశాస్త్ర అధ్యయనాల్లో ఆ రచన ముందు వరసలో నిలుస్తుందని చెప్పడానికి నాకు సంకోచం లేదు.
డా.సుబ్బారావుగారి పేరు చెప్పగానే చలంగారి పైన ఆయన చేసిన అధ్యయనం తెలుగువాళ్ళకి స్మృతికొస్తుంది. కాని గిడుగురామ్మూర్తిలాగా సుబ్బారావుగారు సాహిత్యవేత్త మాత్రమే కాదు, మానవశాస్త్రజ్ఞుడు కూడా అని ఈ పుస్తకం ద్వారా తెలుగువాళ్ళు గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది.
ఇప్పుడీ పుస్తకం నమ్రతకి ఎలానూ పంపిస్తాను. మీరు చదవాలనుకుంటే, నవోదయాలో కొన్ని కాపీలే మిగిలి ఉన్నాయి. త్వర పడండి.
17-7-2016