కాళీపట్నం రామారావు మాష్టారి తొంభైవ పుట్టినరోజు. నవతీ తరణం పేరిట విశాఖ పట్నంలో ఈ రోజొక మహోత్సవం జరగనుంది. ఆగష్టు 29, గిడుగు పుట్టినరోజు , తెలుగుభాషోత్సవంగా జరుపుకుంటున్నట్టే, నవంబరు 9 తెలుగు కథానికోత్సవంగా జరుపుకోవలసిన రోజు.
ఈ రోజు నేను కూడా ఆ వేడుకలో పాలుపంచుకోవలసినవాణ్ణే. కాని ఇక్కడుండిపోయాను. అయినా ఈ పొద్దున్నే ఆయనతో నా అనుబంధాన్ని తలుచుకోవాలనిపిస్తోంది. రామారావు మాష్టారి కథలు నేను 84 కన్నా ముందే చదివినా,మొదటిసారి ఆయన్నుంచి ఉత్తరం అందుకున్నది 84 లోనే. అప్పట్లో వసీరా విశాఖపట్నంలో ఆంధ్రభూమిలో పనిచేస్తుండేవాడు. ఆ పత్రికలో మాష్టారు రోజూ నేటికథ పేరిట ఒక కార్డుసైజు కథ ఎంపికచేసి ప్రచురిస్తూ ఉండేవారు. ఆ శీర్షికకోసం వసీరా నా ‘సొంతప్రపంచం-పరాయి ప్రపంచం’ కథ పట్టుకెళ్ళాడు. ఆ కథ నిడివి పొడుగైందని మాష్టారు ప్రచురించలేదుగానీ, సమాచారం పత్రికా కార్యాలయం అడ్రసుకి నాకో ఉత్తరం రాసారు. ఆ ఉత్తరం అందుకున్న రోజు నా కాళ్ళు నేలమీద ఆనలేదు.
ఆ తర్వాత, 1985 లో విజయనగరంలో యువస్పందన తరఫున రామసూరి ఏర్పాటు చేసిన గురజాడ జయంతి సభలో ఆయనా నేనూ ఒక వేదిక పంచుకున్నాం. ఆ యేడాదే త్రిపురగారికి ఆక్సిడెంటు జరిగి హాస్పటల్లో ఉన్నప్పుడు ఆయన్ని చూడటానికి వెళ్తే అక్కడ మళ్ళా మాష్టారు కనబడ్డారు. మానవుడి అంతస్సంఘర్షణని చిత్రించిన ఒక కళింగాంధ్ర కథకుడి కోసం మానవుడి బాహ్యపోరాటాన్ని చిత్రించిన మరొక కళింగాంధ్ర కథకుడు హాస్పటలు వరండాలో కూచున్న దృశ్యం నన్ను చాలాకాలమే వెంటాడింది.
ఆ మరుసటి సంవత్సరమనుకుంటాను, మాష్టారు నాకో అసైన్ మెంటు అప్పగించారు. ఆయన నేటికథ శీర్షికన ప్రచురించిన కథలనుంచి కొన్ని కథలు ఎంపికచేసి పుస్తకం తేవాలనుకుంటున్నాననీ, ఆ కథల్ని చదివి ఎంపిక చెయ్యమని ఒక గృహిణినీ, ఒక విద్యార్థినీ అడిగాననీ, ఒక రచయితగా నన్ను అడుగుతున్నాననీ అన్నారు. అది నాకు గొప్ప ప్రశంసగా అనిపించింది. ఆ రోజు మాష్టారి ఇంట్లోనే భోజనం చేసాను.
నేను పార్వతీపురంలో పనిచేస్తున్నప్పుడు మాష్టారు కొంతకాలం గజపతినగరంలో ఉన్నారు. అప్పుడు నేనూ, భూషణం మాష్టారూ ఆయన్ను చాలా సార్లే కలిసాం. అవి గొప్ప దినాలు. నేను మళ్ళా పాడేరు లో పనిచేస్తున్నరోజులనాటికి మాష్టారు శ్రీకాకుళంలో కథానిలయం పనిమొదలుపెట్టారు. ఆ తర్వాత నేను విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాలకి ఎప్పుడు వెళ్ళినా మాష్టార్ని కలవడం తప్పనిసరి. మాష్టారు హైదరాబాదు వచ్చినప్పుడల్లా వచ్చేముందో వచ్చిన తరువాతో నాకు ఫోన్ చెస్తుంటారు.
‘బాబూ, ఒక్క మాట చెప్తాను గుర్తుపెట్టుకో. అదేదో సినిమా వచ్చిందే. గజిని అని, అందులో వాడు ఫోన్ నంబర్లు వంటిమీద రాసుకున్నట్టు నేను కూడా కొద్దిమంది నంబర్లు మాత్రమే నా దగ్గర పెట్టుకుంటాను. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పిలిస్తే పలికేవాళ్ళ కోసం. అందులో నీ నంబరు కూడా ఉంది ‘
నాలుగైదేళ్ళ కిందట కాళీపట్నం రామారావుగారు నాతో అన్నమాటలు.
మరోసారి శ్రీకాకుళంలో వాళ్ళింటికి వెళ్ళి వచ్చేస్తుండగా ‘చూడు బాబూ, మీరు ఎప్పుడు ఇటు వచ్చినా ఇక్కడ మీకోసమొక మనిషి చూస్తుంటాడని గుర్తుపెట్టుకోండి’ అని.
మరోసారి విశాఖపట్నంలో ఒక మధ్యాహ్నం వాళ్ళింట్లో బోజనం చేసాక ఆయన గదిలో అపరాహ్ణనిశ్శబ్దాన్ని పంచుకున్నాక, బయటకి వస్తున్నప్పుడు గుమ్మందాకా వచ్చి ‘నా జ్ఞానం, అజ్ఞానం రెండూ నీతో పంచుకున్నాను. మర్చిపోకు’ అన్నారు.
ఆ మాటలు వినగానే నాకేమనాలో తోచలేదు. కానీ ఇప్పుడు పూర్తిగా రూఢి అయ్యింది, మాష్టారికీ, నాకూ మధ్య ఉన్నది సాహిత్యానుబంధం కాదు. ఎక్కడో ఆయన నన్ను తన కుటుంబంలో ఒకడిగా స్వీకరించారు. ఎక్కడో ఆయన హృదయంలో ఎవరికీ ఇవ్వని స్థానమేదో నాకు కేటాయించారనే భావనవల్ల ఒక్కసారిగా నా జీవితమెంతో విలువైందనిపిస్తుంది నాకు.
మాష్టారూ, మీరు శతాధిక శరత్తులు చూడాలి. ఇక్కణ్ణుంచే మీ పాదాలకు నా సాష్టాంగ ప్రణామాలు.
8-11-2014