ఒక పద్యసముద్రం ఇంకిపోయింది

Reading Time: 6 minutes

80

ఆ పార్థివ శరీరం అగ్నికి ఆహుతైపోయింది. చుట్టూ చిగురిస్తున్నకానుగ చెట్లు, వేపచెట్లు.. కవితావసంతుడు వసంతఋతువులో కలిసిపోయాడు.

నిబ్బరంగా నిల్చుందామనే అనుకున్నాను, కాని ఎక్కణ్ణుంచి వచ్చాయి అన్ని కన్నీళ్ళు. ఇంతగా ఆయన నా హృదయాన్ని మెలివేసుకుపోయాడని ఊహించలేదే. ఆ పిల్లల్ని, ముఖ్యంగా ఆ చిన్నపిల్లవాడు సంవరణ్ ని చూస్తే, ఇప్పుడు తలుచుకుంటున్నా కూడా కన్నీళ్ళు ఆగడం లేదు.

సాయంకాలమయ్యేటప్పటికి చెప్పలేనంత బెంగ ఆవహించింది. చాలా ఒంటరివాణ్ణయిపోయానని అనిపించింది. నా జీవితం పొడుగునా ఎందుకు ఈ మిత్రులిట్లా నా ప్రమేయంలేకుండా నా హృదయంలోకి జొరబడి నన్ను పట్టి లాక్కుని ప్రేమించి ఒక్కసారిగా ఇట్లా వదిలిపెట్టేస్తున్నారు?

రాజమండ్రి రోజులనుంచీ ఇంతే కదా. సావిత్రిగారు, గోపీచంద్, సమాచారంసుబ్రహ్మణ్యం,రామనాథం, భూషణం మాష్టారు, చివరికి నిన్న మొన్న మహేష్. అసలు నేను మనుషుల్తో కలిసేదే తక్కువ, మనసు విప్పి మాట్లాడుకునేది మరీతక్కువ,సాహిత్యంగురించి మాట్లాడుకునే మనుషులెవరూ లేరనే అనుకుంటాను. ఏళ్ళ నిరీక్షణ మీదట ఎవరో ఒకరో ఇద్దరో తారసపడతారు, జీవితాన్ని రసమయం, రాగభరితం చేస్తారు, ఉన్నట్టుండి వెళ్ళిపోతారు, ఎన్నాళ్ళిట్లా?

1

ముఫ్ఫై ఏళ్ళకిందటి మాట. కృష్ణా జిల్లా మధిర నుంచి చంద్రశేఖర్ ఆజాద్ అనే లెక్చెరర్ స్పాట్ వాల్యుయేషన్ కోసం రాజమండ్రి వచ్చాడు. ఆయన ద్వారా విన్నాను మొదటిసారి కవితాప్రసాద్ గురించి. మాది Love at first word. ఆయన కూడా అప్పణ్ణుంచీ ఎప్పుడు చూస్తానా అన్న ఆతృతలో ఉన్నాడేమో, నేను హైదరాబాదు రాగానే మా అన్నయ్య ఇంటికి వచ్చేసాడు. సరూర్ నగర్ చెరువు గట్టున ఎన్ని గంటలు కూచున్నామో, మీరేం పుస్తకాలు చదివారు, మీరేం పుస్తకాలు చదివారు, మీకే కవులిష్టం. మీకే కవులిష్టం. ఇంతే కదా ఇద్దరు సాహిత్య పిపాసులమధ్య నడిచే తొలి స్వీట్ నథింగ్స్.

2

చాలా ఏళ్ళ తరువాత, ఆయన కృష్ణా జిల్లా సాంఘికసంక్షేమ శాఖ డిప్యూటీ డైరక్టరుగా పనిచేస్తున్నాడు. తన పుస్తకావిష్కరణ సభకు నన్నూ, సిరివెన్నెల సీతారామ శాస్త్రినీ పిలిచాడు. అదంతా ఒక పండగలాగా చేసాడు. విందుభోజనం, కొత్త బట్టలు పెట్టాడు. నేను మొదటిసారి మచిలీపట్టణం చూడటం. ఒకప్పటి బందరు సాహిత్యవైభవమంతా ఆ రోజు మళ్ళా కళ్ళకు కట్టించాడు.

3

మరికొన్నాళ్ళ తరువాత, ఉద్యోగం నిమిత్తం నేను హైదరాబాదులో అడుగుపెట్టేటప్పటికి ఆయన సాంఘిక సంక్షేమ గురుకులంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. సంక్షేమభవన్ లో ఇద్దరం గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉండేవాళ్ళం. నేనీ పక్క, ఆయన ఆ పక్క. ఎప్పుడు తీరికచిక్కినా అది కవిసమయంగానే ఉండేది, నెమ్మదిగా నేనాయన్ను విభ్రాంత నేత్రాలతో చూడటం మొదలుపెట్టాను.

4

మరికొన్నాళ్ళకి, అంటే పదేళ్ళ కిందట, ఆయన గిరిజన గురుకులానికి జాయింట్ సెక్రటరీగా వచ్చాడు. ఒకే శాఖలో ఇద్దరం కొలీగ్స్ గా మారాం. సాహిత్యంతో పాటు ఉద్యోగకష్టాన్ని కూడా పంచుకోవడం మొదలుపెట్టాం. చాలాసార్లు ఉద్యోగ కష్టమే ఎక్కువ పంచుకునేవాళ్ళం. నా రూంలోకి వస్తూనే ‘ఇప్పుడు కొంతసేపు మనం ఆత్మస్తుతీ, పరనిందా చేసుకుందాం’ అనేవాడు. బహుశా సాహిత్యం కన్నా కూడా ఎక్కువగా ఆ దైనందిన జీవితమే మమ్మల్ని ఎక్కువ దగ్గరచేసిందనుకుంటాను.

5

ఆ రోజుల్లోనే భద్రాచలంలో గురుకులపాఠశాలలో ఆయనతో ఒక అష్టావధానం చేయించాం. నాతోపాటు ఆరోజు తుమ్మపూడి కోటీశ్వరరావుగారు వంటి పెద్దలు కూడా ఉన్నారు. ఆ అనుభవంతొ వరల్డ్ స్పేస్ రేడియోలో మృణాళినిగారు ఆయన్ని నాతో ఇంటర్వ్యూ చేయించారు. విశ్వనాథ మీద. ఎంత గొప్ప గోష్ఠి అది! అటువంటి విద్వత్తుని మళ్ళా ఎక్కడ చూడగలుగుతాం.

6

మా శాఖనుంచి ఆయన సాంస్కృతిక శాఖ డైరక్టరుగా వెళ్ళాడు. ఒక స్కూల్ టీచరు గా జీవితం ప్రారంభించి ఒక రాష్ట్రశాఖాధిపతిగా అది కూడా సాంస్కృతిక శాఖాధిపతి కావడం.. జీవితం ఆయనకు అందించిన మహానందాల్లో అదొకటి. ఆ శాఖకి ఆయన రెండుసార్లు డైరక్టరుగా పనిచేసాడు. చివరిలో తెలంగాణా సాంఘిక సంక్షేమ శాఖకు కూడా కొన్నాళ్ళు డైరక్టరుగా పనిచేసాడు. కాని ‘నేనొక లెక్కల మాష్టర్ని. చాలా మంచి లెక్కల మాష్టర్ని. ఉపాధ్యాయుడిగా జీవించినప్పుడు కలిగిన ఆనందం లాంటిది మళ్ళా నాకు దొరకనే లేదు’ అనేవాడు. మా ఇద్దర్నీ కలిపిన మరొక బంధం కూడాఉంది. సి.ఎస్.రావు అనే మహనీయుడు మా తాడికొండ గురుకుల పాఠశాలని ప్రారంభించి మాకు తోవ చూపినవాడు. అత్యుత్తమ ఉపాధ్యాయుడు. కవితాప్రసాద్ భద్రాచలంపేపర్ మిల్లు పాఠశాలలో ఆయనతో కలిసి పనిచేసాడు. ఆ మహోన్నత మానవుడి ముద్ర ఆయనమీదా, నామీదా కూడా ఒక్కలానే పడింది. మేమిద్దరం ఆ విధంగా ఒకే గురువుకి శిష్యులమని చెప్పుకోవడం కవితాప్రసాద్ కి ఎంతో ఇష్ఠంగానూ,గర్వంగానూ ఉండేది.

7

తిరుపతిలో ధర్మప్రచారపరిషత్ కార్యదర్శిగా పనిచేసి తిరిగి మళ్ళా సాంఘిక సంక్షేమశాఖ కి వచ్చినతరువాత మా అనుబంధం మరింత బలపడింది. అప్పణ్ణుంచీ అంటే దాదాపు గత అయిదారేళ్ళుగా ఆయన నా దైనందిన జీవితంలో ఒక భాగమైపోయాడు. రోజూ ఎన్నో గంటలపాటు ఎందరో కవులు, రచయితలు, పుస్తకాలు, పద్యాలు..నేనాయన సాహిత్య విశ్వరూపం చూసాను. ఆయన పొట్టలో కనీసం యాభైవేల పద్యాలైనా ఉంటాయి. లక్షపద్యార్చనకి శ్రీకారం చుట్టినవాడు. చాలామంది అవధానుల ధారణకీ, కవితాప్రసాద్ ధారణకీ తేడా ఉంది. చాలామందిపండితులూ, అవధానులూ సాయంకాలం సమావేశానికి వెళ్ళేముందు ఒక్కసారి పద్యాలు నెమరు వేసుకుని వెళ్తారు. కవితాప్రసాద్ అట్లా కాదు. మా మాష్టారు శరభయ్యగారి తర్వాత అంత శక్తివంతమైన random access memory మళ్ళా కవితా ప్రసాద్ దగ్గరే చూసాను. తిక్కన పద్యాలు ఎత్తుకుంటూ, నాచన సోముణ్ణి చుట్టుబెట్టి అనంతామాత్యుణ్ణుంచి కల్పవృక్షందాకా విహంగవీక్షణం చేస్తాడు. ఏ ఛందస్సు గురించి అడగండి, కొన్ని వందల పద్యాలు ఉదాహరణగా దొర్లిపోయేవి.

8

పండితుడంటే ఆయన. కాని మేమొకసారి గుంటూరు దగ్గర బోయపాలెం డైట్ లో టీచర్ ట్రైనీల్ని ఉద్దేశించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ఆయన పల్లెల్లో పాడుకునే బాలగేయాలెన్నో పాడి వినిపించాడు. ఆ ఉపాధ్యాయులు సంతోషపారవశ్యంతో ఊగిపోయారు. ‘కవిగారూ, మీరు మొత్తం సాహిత్యం వదిలిపెట్టి ఈ బాలగేయాలు ఒక్కటీ పాడుకుంటూ తిరిగినా కూడా ఆంధ్రదేశమంతా మీకు బ్రహ్మ రథం పడుతుంది’ అన్నాను. అదొక కోరిక ఉండేది మాకు, దేశమంతా తిరగాలని, తిరుపతివెంకట కవుల్లాగా, గ్రామాలు, పాఠశాలలు, కళాశాలలు.. పద్యాలు పాడి వినిపిస్తూ, పాటలు పాడి వినిపిస్తూ, భాష గురించి ప్రజానీకాన్ని జాగృతపరుస్తూ. కాలమెంత మోసకారి! రేపు రేపనుకుంటూనే ఆ కోరికనట్లానే వాయిదావేస్తూ వచ్చేసాం.

9

55-65 మధ్యకాలంలో పుట్టిన తరం మాది. మా జీవితాలన్నీ ఒక్కలానే నడిచాయి. బీదరికంలో పూటగడవడంకష్టమైన బాల్యం. కాని ఎందుకో సాహిత్యమంటే వల్లమాలిన ఇష్టం. మా తల్లిదండ్రులు కూటికి పేదలు కాని ప్రేమసుసంపన్నులు. ఎట్లానో ఈదేం ఆ కాలాన్ని. సమాజంలో మా ప్రతిభని చూపించడానికి ఉత్సాహపడ్డాం.మాదనే ముద్ర వెయ్యాలని తహతహలాడేం. అ తహతహ కవితా ప్రసాద్ కి మరీ ఎక్కువ. ఒక అర్థశతాబ్దపు పోరాటం గడిచేక, జీవితం కొద్దిగా వెసులుబాటు ఇచ్చి, ఒకింత తీరిగ్గా జీవితఫలాస్వాదన చెయ్యవలసిన తరుణంలో వెళ్ళిపోయాడే ఆయన , ఆ ఊహ వస్తేనే నాకు గుండెపిండేసినట్టనిపిస్తోంది.

10

కవులు పుట్టవచ్చు, కళాకారులు పుట్టవచ్చు. కాని తన హృదయాన్నీ, రసననీ, మొత్తం జీవితాన్నీ పద్యానికి పల్లకిగా మార్చుకుని ఊరేగించగల వాళ్ళు మాత్రం ఇక ముందు తరాల్లో పుడతారనుకోను. నాకు తెలిసి ఆ పద్యగంధర్వుల్లో కవితాప్రసాద్ చివరి వాడు. ఆయన లేని లోటుని ఆయన కుటుంబం, ఆయన మిత్రులు భరించడం కష్టమే. కాని ఆయన లేని లోటు తెలుగుభాషకి మాత్రం ఊహించడం కూడా కష్టమే.

 

II

పొద్దున్నే 9.30.
మొబైలు మోగుతూ ఉంది.
ఎక్కడున్నారు, కౌన్సిల్ కి వచ్చెయ్యండి, ఆ ప్రశ్నకి సప్లిమెంటరీ సమాచారం తయారు చేసారా, తెలుగు నోట్సు సిద్ధంగా ఉందా?

అయ్యో, ఒక పద్యసముద్రం ఇంకిపోయిందే, నేనింకా అక్కడే ఆ అంచుదగ్గరే నిలబడిఉన్నానే,

ఒక కవికి తన కవిమిత్రుడు నిష్క్రమిస్తే, ప్రపంచమే కూలిపోయినట్టు, అయినా ఈ ప్రపంచం ఇంకా ఇలా మామూలుగా ఎలా నడిచిపోతోందనే ఇట్లాంటి వేళల్లో ప్రతి కవీ ఆశ్చర్యపోతూనే ఉంటాడు, కొంపెల్ల జనార్దనరావు పోయినప్పుడు శ్రీ శ్రీ ఆశ్చర్యపడ్డట్టుగా:

ఎవరు దుఃఖించారులే నేస్తం! నువ్వు చనిపోతే
ఏదో నేనూ ఆరుగురు స్నేహితులూ తప్ప
ఆకాశం పడిపోకుండానే ఉంది!
ఆఫీసులకు సెలవు లేదు
సారాదుకాణాల వ్యవహారం
సజావుగానే సాగింది
సానుభూతి సభలలో ఎవరూ
సాశ్రునేత్రాలు ప్రదర్శించలేదులే నీ కోసం
ఎవరి పనుల్లో వాళ్ళు
ఎవరి తొందరలో వాళ్ళు!

వెళ్ళిపోయినవాడు కవి కాకపోయినా కూడా ఒక మామూలు మనిషి- నిన్నటిదాకా నీతో కలిసి గడిపినమనిషి- మీరు కలిసి తిరిగారు, జోకులేసుకున్నారు, నవ్వుకున్నారు, లేనప్పుడు ఒకళ్ళమీద ఒకళ్ళు ఫిర్యాదు చేసుకున్నారు, ఎదురుగా ఉన్నప్పుడు అన్నీ మర్చిపోయి, మనస్ఫూర్తిగా ఒకరినొకరు ప్రశంసించుకున్నారు, అట్లాంటి మనిషి ఇవాళ నిన్ను పిలవడు, నువ్వతనికి కాల్ చేస్తే జవాబు రాదు.

ఇట్లా ఒక మనిషి అదృశ్యమైపోవడం, దీన్నేనా మృత్యువంటారు?

ఫ్రాన్సిస్కో డి క్వెవెడో అనే ఒక స్పానిష్ కవి రాసిన ఒక కవితను స్మరిస్తూ జేవియర్ మారియాస్ అనే ఒక స్పానిష్ నవలా రచయిత ఇలా రాస్తున్నాడు:

”వయసు గడుస్తున్నకొద్దీ మృత్యువు దగ్గరవుతున్నదన్న భావన కలుగుతున్నకొద్దీ మనల్ని శోకభరితం చేసే అంశం-మనకి మరింత విషాదభరితంగానూ, దుర్భరంగానూ అనిపించే అంశం-చిత్రంగా- మనమింకెంతమాత్రం బతకమనే భావన కాదు, మనకి రేపంటకిమరికొంత జీవితం అంటే మరికొంత జ్ఞానం,కుతూహలం, నవ్వులూ ఉండవనే భావన కాదు, అసలన్నిటికన్నాముందు మన జ్ఞాపకాలు, మన గతం మనతో పాటే తుడిచిపెట్టుకు పోతాయనే నిశ్చయజ్ఞానం, ఇంతదాకా మనకు జీవితంలో అనుభవానికొచ్చినదంతా, మనం చూసింది, విన్నది, ఆలోచించింది, అనుభూతి చెందిందీ, ఏదీ ఇంక ఈ ప్రపంచంలో మిగలదనేదే, నేను వాడుతున్న క్రియాపదం సరైంది కాకపోవచ్చు, కానీ చెప్పాలంటే మనం అనుభూతి చెందిందేదీ ఈ గాల్లో ఇంక ‘తేలియాడదనేదే’, అదే అన్నిటికన్నా దుర్భరమైన విషయం.”

“రేపు భవిష్యత్తులో మనం అదృశ్యమైపోతామన్న భావనని అంగీకరించకుండా మనం ఎదురుతిరిగినప్పుడల్లా మనకేదో ఒక స్ఫూర్తికలగడానికి కారణం అదేననుకుంటాను. అంటే, మనం అదృశ్యమైపోతామని కాదు, కాని మనలో మన అంతరంగపు లోతుల్లో దాచుకున్న ప్రతి ఒక్కటీ మన అస్తిత్వ నిర్ధారణకి మన అంతరంగం మీద ఆధారపడ్డ ప్రతి ఒక్కటీ అదృశ్యమైపోతుందన్న భావనని సహించలేకపోవడం..”

అందుకే మనం బొమ్మలేస్తాం, కవితలు రాస్తాం, పాటలు కడతాం, శిల్పాలు చెక్కుతాం. మనం మరణిస్తాం, మనం అదృశ్యమైపోతాం, కాని మనం తొలిసారి వలపులో పడ్డప్పటి మల్లెపూల నెత్తావి, మన ఇంట్లో మొదటి శిశువు పుట్టినప్పుడు మన నెత్తుటిరేఖ ఈ ప్రపంచంలో మరికొన్నాళ్ళు కొనసాగుతుందన్న హామీ, నీ తోటి మనిషికి నీ కళ్ళముందు అన్యాయం జరుగుతున్నప్పుడు నీ రక్తంలో కదలాడిన సలసల..ఆ క్షణాలట్లా అంతరించి పోగూడదనుకుంటాం, వాటిని జయపతాకల్లాగా, ధ్వజస్తంభాల్లాగా నిలపాలనుకుంటాం,

మనం మరణించినా కూడా మనలోదేదో ఈ పార్థివదేహాన్ని వదిలి మళ్ళా ఈ ప్రపంచంలోనే తిరుగాడుతుందనేది ఒక భావన. ప్రపంచం గురించీ, పరమార్థం గురించీ వేదాంతులూ, బౌద్ధులూ, జైనులూ ఒకరితో ఒకరు ఎంత విభేదించినా ఈ అంశంలో మాత్రం ఒక్కలాంటి నమ్మకమే చూపించారు (లేదా ఒక్కలానే భ్రాంతిపడ్డారు).

ఆత్మ వేరు, కర్మ వేరు. ఆత్మకి ఏదీ అంటదు, ఆ సముద్రపుగాలి, ఈ వేపపూల మాసం, ఈ రంగులసంగీతం-ఇవేవీ ఆత్మకి అందవు. అట్లాంటి ఆత్మని నేను నాదని ఎట్లా అనుకోగలుగుతాను? కాని కర్మ, పుద్గలం.. అది అది నాది, నా తప్పొప్పలన్నిటి సమాహారం, ఈ ప్రపంచంలో ఎన్నో జన్మలపాటు జీవిస్తూ, తీరుస్తూ మళ్ళా పోగేసుకుంటూ మళ్ళా తీర్చుకోడానికి మళ్ళీ మళ్ళీ జన్మలెత్తాలనుకునే ఋణం, ఈ ప్రపంచానికి నేను పడ్డ ఋణమేమిటో తెలుసుకునేలోపే నలభై ఏభై యేళ్ళు గడిచిపోతాయి, ఆ ఋణాన్ని తీర్చుకునేలోపే అర్థాంతరంగా మరణిస్తే?

బహుశా అందుకనే వేదకాలమానవుడు అన్నిటికన్నా ఎక్కువగా అకాలమృత్యువుకి భయపడ్డాడు. తన యెదుట ఒక యువకుడు నిలబడి ఆశీర్వదించమని కోరితే వేదకాల వృద్ధుడు ఇన్ని ధాన్యపుగింజలు చేతుల్లోకి తీసుకుని వణుకుతున్న పెదాలతో ‘దీర్ఘకాలం జీవించు’ అని మాత్రమే అనగలిగేవాడు.

నీ మిత్రుడొకడు అర్థాంతరంగా మరణించినప్పుడు నువ్వు దాన్నెట్లా అర్థం చేసుకోవడం?

బహుశా రెండు విధాలుగా-
ఒకటి, అతడి ఋణం తీరిపోయిందనుకోవడం,
లేదా నువూ అతడూ మిత్రులుగా తిరిగినందువల్ల అతడి ఋణానికి నువ్వు హామీపడ్డట్టే అని అనుకుని ఆ ఋణం నువ్వు తీర్చాలనుకోవడం, నీ ఋణంతో పాటు ఆ ఋణం కూడా.

మృత్యువు లో భయకారకమైన అంశం, అది మనం జీవితానికి కల్పించుకున్న అర్థాలన్నిటినీ ఒక్కసారిగా చెరిపేస్తుంది. ఒక ఇల్లు తగలబడిపోతే, ఆ ఇంట్లో పిల్లలు పేర్చుకున్న బొమ్మలు, నువ్వు పెంచుకున్న మొక్కలు అన్నీ అగ్నికి ఆహుతైపోయినట్టు, మృత్యువు నీ అన్ని కలల్నీ, కల్పనల్నీ తుడిచిపెట్టేస్తుంది.

కాని అట్లాంటప్పుడే, మృత్యువు కళ్ళల్లోకి సూటిగా చూసి, జీవితాన్ని మరింత సంతోషంగా మరికొన్నాళ్ళు జీవించగలిగే ఆ ధైర్యం..
అది అది కావాలి నాకు,
నీకూ, మరెవరికైనా సరే.

డబ్ల్యు.బి.యేట్సు మరణించినప్పుడు ఆడెన్ ఇట్లా రాసాడు:

Follow, poet, follow right,
To the bottom of the night
With your unconstraining voice
Still persuade us to rejoice.

ఇదీ మనకు కవితం అందించే వరదానం. భీకరమృత్యునిశ్శబ్దం అంచున నిలబడి, అయినా కూడా మనం సంతోషించక తప్పదని మనల్ని ఒప్పిస్తుంది కవిత్వం.

With farming of a verse
Make a vineyard of the curse
Sing of human unsuccess
In a rapture of distress.

శాపగ్రస్త జీవితక్షేత్రాన్ని ఒక ద్రాక్షతోటగా మార్చుకోవాలి.

In the deserts of the heart
Let the healing fountain start,
In the prison of his days
Teach the freeman how to praise.

ఊషరభూమిగా మారిన జీవితంలో ఒక ఓషధీజల ఉప్పొంగాలి.

మనం జీవితానికి కల్పించుకున్న అర్థాలన్నిటినీ మృత్యువు చెరిపేస్తుంది నిజమే, కాని సరిగ్గా ఆ క్షణంలోనే కొత్త అర్థాల్నీ, కొత్త కల్పనల్నీ మనముందు ప్రత్యక్షం చేస్తుంది.

నా మిత్రుడి ప్రాణరహిత దేహాన్ని చూసి హాస్పటల్ నుంచి ఇంటికి వచ్చిన రాత్రి, పన్నెండు దాటింది, ఒక మిత్రురాలు మెసేజి పెట్టింది, ‘ఒక్కసారి మాట్లాడాలనిపిస్తే మాట్లాడండి, ఈ క్షణంలో నేను మీ పక్కనే ఉన్నానని మీకు అనిపిస్తే చాలు’ అని.

ఇంతదాకా నేనూ నా మిత్రుడూ ఒకరి చేతులు ఒకరం పట్టుకుని నడుస్తూ ఉన్నాం. చాచిన నా చేయట్లానే ఉండగానే అతడు తన చేయి విడిపించుకుని ముందుకు వెళ్ళిపోయాడు.

క్షణమాత్ర శూన్యం.

తెల్లబోయినేను చూస్తున్నంతలో లక్నోనుంచి, కోయంబత్తూరునుంచి, విశాఖపట్టణం నుంచి, తిరుపతినుంచి, కరీంనగర్ నుంచి ఎన్నో హస్తాలు, ప్రేమపూర్వక హస్తాలు, అపారదయాన్వితాలు నా చేయి పట్టుకుని ‘మేమున్నాం, ముందుకు పద’  అంటున్నాయి.

అదృష్టవశాత్తూ ఈ ప్రపంచంలో ఒక మనిషి పడ్డ ఋణాన్ని ఆ మనిషొక్కడే తీర్చుకోనవసరం లేదు,

మనుషులందరూ కలిసి మనుషులందరి ఋణం తీర్చుకుంటారు.

16-3-2015 & 17-3-2015

Leave a Reply

%d bloggers like this: