ఆక్టేవియో పాజ్

90

వెనకటికి తమిళదేశంలో శాత్తనార్ అనే కవి ఉండేవాడట. మణిమేఖలై మహాకావ్య కర్త. అతడు చెడ్డ కవిత్వం వినవలసి వచ్చినప్పుడల్లా తలబాదుకునేవాడట. అట్లా బాదుకుని బాదుకునీ ఆ తల పుండైపోయిందట. శీత్తలై (చీముతల) శాత్తనార్ అంటే తలపుండైపోయినవాడు అని అర్థం.

అకవిత్వం చదివి, అకవులతో వేదికలు పంచుకుని, అకవిస్తుతులు వినీ వినీ నా తలా, హృదయమూ రెండూ పుండై పోయాయి.

అటువంటి అస్వస్థమష్తిష్కానికి ఒక ఔషధలేపనంలాగా నాగరాజు రామస్వామిగారి ‘సూర్య శిల’ కవితాసంపుటి లభించింది. (శాత్తనార్ తలనొప్పికి తిరుక్కురళ్ అట్లా మందుగా పనిచేసిందట!)

నాగరాజు రామస్వామిగారు కరీంనగర్ జిల్లా ఎలగందలలో 1939 లో పుట్టారు. ఎలక్ట్రికల్ ఇంజనీరుగా దేశవిదేశాల్లో పనిచేసారు. పిల్లలు అమెరికాలో ఉన్నందువల్ల, పదవీవిరమణ తర్వాత, తరచూ అక్కడికి వెళ్ళి ఉంటున్నప్పుడు, అక్కడి గ్రంథాలయాల్లో ఉత్తమ కవిత్వం చదివి డెబ్బై ఎనిమిదేళ్ళ ఈ వయసులో కవితాకన్యతో ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమోల్లాసం నాలాంటి వ్యాకులచిత్తులకి మానసోల్లాసంగా మారింది.

మొదట టాగోర్ నీ, ఆ తర్వాత కీట్స్ నీ అనువదించాక, ఆయన దృష్టి ఈ ఏడాది ఆక్టేవియో పాజ్ (1914-98) మీద పడింది. పాజ్ కవిత్వంలోంచి యాభై కవితలతో పాటు, అతడు స్పానిష్ లో రాసిన Piedra de Sol (1957) అనే దీర్ఘకావ్యాన్ని కూడా ఆయన అనువదించారు. ఆ కావ్యానికి నేను ముందుమాట రాయాలని కోరడంతో సరేనన్నాను. కానీ, అది ఎంత కష్టసాధ్యమో నెమ్మదిమీద కానీ తెలియరాలేదు.

ఆ దీర్ఘకావ్యం నాకొక పట్టాన కొరుకుడు పడలేదు. కాని, దాన్ని వ్యాఖ్యానించినవాళ్ళూ, వివరించినవాళ్ళూ కూడా దాన్నేమంత సరిగ్గా అర్థం చేసుకున్నారని కూడా అనిపించలేదు. ఒకాయన దాని గురించి స్పానిష్ లో అద్భుతంగా వివరించేడంటే, ఆ స్పానిష్ వ్యాసాన్ని గూగుల్ ట్రాన్స్ లేటర్ సహాయంతో అరకొరగా అనువదించుకుని, వాక్యం వాక్యం కూడబలుక్కుని చదువుకున్నాను. కానీ, ఆ రచయిత కూడా పాజ్ మానసికప్రపంచపు బాహ్యప్రాకారానికి మాత్రమే చేరగలిగాడని అర్థమయింది. ఈలోపు రామస్వామిగారినుంచి ఫోన్లు. నాకు ముందుమాట రాసే తీరికలేదని చెప్పి తప్పించుకోవచ్చు. కాని, వడలి మందేశ్వరరావు గారు అన్న మాట ఒకటి గుర్తొచ్చింది. ఆయన గణితశాస్త్ర ఉపాధ్యాయుడు, సాహిత్యవిమర్శకుడిగా మారారు. ఎందుకట్లా అనడిగితే, గణితంలో ఉన్న rigour మళ్ళా నాకు సాహిత్యవిమర్శలో కనబడింది అన్నారాయన. నేను గణితంలో మందబుద్ధిని. కానీ, ఒక సాహిత్యకృతిని పొరలుపొరలుగా విశ్లేషించుకుంటూపోవడంలోని సవాలు రుచిచూసినవాణ్ణి. అందుకని సూర్యశిలను సాధించవలసిందే అని తీర్మానించుకున్నాను.

అట్లా రెండుమూడు నెలలు గడిపిన తర్వాత, ఒకరోజు హటాత్తుగా, ఆ రహస్య చిత్రలిపి నాకు బోధపడింది. నొబేల్ పురస్కార స్వీకార ప్రసంగంలో పాజ్ దాని తాళం చెవిని నిక్షిప్తపరిచాడు.  చదవండి, జీవితజ్వరం నుండి కాస్తేనా ఉపశమనం దొరుకుంతుంది.

రామస్వామిగారు నన్ను సూర్యశిలతో పాటు, ఆయన అనువదించిన పాజ్ ఖండకావ్యాలకు కూడా ముందుమాట రాయమన్నారు. కానీ సమయం చాలింది కాదు. ఆ కవితలు ఇప్పుడు చదివాను. అవి ఎంతో హృదయాకర్షకంగా ఉన్నాయి. నిన్న ఆ కవిత్వం చదువుతూ మిత్రుడు వాసు తనకి బైరాగి, శ్రీ శ్రీ ఎందుకు గుర్తొస్తున్నారని అడిగాడు. ఆ మహిమ రామస్వామిగారి ‘మాటలనియెడు మంత్రమహిమ’ లో ఉంది. ఎటువంటి భాష పట్టుబడిందాయనకి! ఇట్లాంటి వాక్యసంయోజనం చెయ్యగల కవి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక్కడు కూడా లేడని చార్మీనార్ పైకెక్కి చెప్పాలని ఉంది.

ఈ రెండు కవితలు చూడండి, నా మాట అత్యుక్తి కాదని గ్రహిస్తారు.

ప్రోయెం (Proem)

ఒక్కోసారి
కవిత్వం అంటే-
ఒకానొక తలదిమ్మ,
దేహభ్రమణం, వాక్ భ్రమణం, మరణభ్రమణం;
కళ్ళు మూసుకొని
కొండచరియల చివరంచుల మీద వెర్రెత్తి పరుగెత్తడం
పవిత్ర నిశ్చితార్థాల ఛాందస ఆదేశాల మీద,
రూఢ్యసూత్రాల శిఖల శిరసుల మీద
పగలబడి నవ్వడం,
పేజీల ఎడారులమీద పదాల అవరోహణం,
కలతల కాగితప్పడవల మీద దిగి
నలభై దివారాత్రాల విషాద సైకతాలను దాటడం,
ఆత్మాశ్రయ ప్రతిమారాధనం, స్వీయావహేళనం, స్వచ్ఛంద పతనం.
శ్లాఘవ్యాఖ్యల శిరఃఖండనం, స్వయం ప్రతిష్టల ఖననం,
‘ఎపిక్యురస్’ తోటల, ‘నెట్జాహౌలకొయోటి’ తోపుల
తలతెగిన సర్వనామాల
తన్మయ తలపులను గుర్తు తెచ్చుకోవడం,
స్మృతుల డాబా మీది ఏకపాత్రాభినయ వేణుగానం,
చింతనా కుహరాలలో సాగే చిరంతన జ్వలన నర్తనం.
కవిత్వం అంటే-
రెక్కలైన, వాడి గోర్లయిన, హస్తాలైన, క్రియా పదాల విత్తనాలు,
భాషా కెరటాల మీద నాటిన నామవాచక అంకురాలు,
కనివినీ ఎరుగని అనుక్త అనురాగాల అవయవ వ్యుత్తత్తుల
రాగ ప్రత్యయాల అక్షర బీజాలు.

వేడుకోలు (Invocation)

శివపార్వతులారా!
మేము మిమ్ములను దైవాలుగా కాక
మానుష దైవాంశలుగా కొలుస్తున్నాం;
పులుగడిగిన మానవ అస్తిత్వ రూపాలుగా కాక
అపురూప మనుజసృష్టిగానే భావిస్తున్నాం.
శివా!
నీ చతుర్భుజాలు
ప్రవహిస్తున్న నాలుగు నదులు,
నింగికి చిమ్ముతున్న నాలుగు పిచికారీలు;
నీవు మూర్తీభవించిన ఓ నిర్మలమైన నీటి ఊటవు.
జలతరంగాల మీద ఓలలాడుతున్న లావణ్యనౌకలా
అందాల పార్వతి ఆ జలధిమీద జలకాలాడుతుంటుంది;
నీ స్మితకిరణకాంతిలో జ్వలిస్తున్న సాగర కెరటాల మీద
పార్వతి లలితలాస్యాలు చేస్తుంటుంది.
ఓ పార్వతీపరమేశ్వరులారా!
మేము-నేనూ నా సతీ-
మీ నుండి ఏ అతిలోక కానుకలు ఆశించడం లేదు;
మేము కోరుకునేదల్లా
ఆవులించే అర్ణవాల వెలుగుల తరగలను,
నిదురించే తీరాల వెలుతురు నురగలను.

10-12-2017

Leave a Reply

%d bloggers like this: