శ్రీకాకుళం జిల్లా సవరసమాజంలో గత ఇరవయ్యేళ్ళుగా పాదుకొంటున్న అక్షరబ్రహ్మ ఉద్యమం గురించి తెలుసుకోవాలన్న కోరిక నాకు చాలా బలంగా ఉండిందిగానీ, ఇంతదాకా ఆ అవకాశం కలగలేదు. అందుకని రెండురోజులకిందట శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐ.టి.డి.ఏ కి వెళ్ళినప్పుడు, దగ్గరలో ఏదైనా ఒక సవరగూడలో అక్షరబ్రహ్మ కార్యక్రమం చూడాలని ఉందనగానే సహాయ ప్రాజెక్టు అధికారి నాగోరావు నన్ను నౌగడ గ్రామానికి తీసుకువెళ్ళాడు.
నౌగడ ఒక పాతకాలపు సవరజనావాసమే అయినప్పటికీ, ఇప్పుడక్కడ పాతకాలపు కోపురు గడ్డి ఇళ్ళకు బదులు ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళు దర్శనమిచ్చాయి. ఆ ఇళ్ళకి ఏ కుటుంబానికి ఆ కుటుంబం యథాశక్తి ఎంతో కొంత అదనపు సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంది. గ్రామం మధ్యలో సిమెంటు కాంక్రీటు రోడ్లు. ఊళ్ళో అడుగుపెట్టగానే ఒక సవరయువకుడు పాతకాలపు పద్ధతిలో తెల్లటి పంచె, చొక్కా తొడిగి స్వాగతమిచ్చాడు. అతడు అక్షరబ్రహ్మ కార్యకర్త. అప్పుడొక సవర గృహిణి మాకు నమస్కారం చేసింది. ఆమె పేరు బరంతి అట. నీ ఇంట్లో అడుగుపెట్టవచ్చునా అని అడిగాను. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చింది. ఆమె ఇంట్లో ఒక మూల పరిశుభ్రమైన స్థలంలో ఒక చిన్నగూడు, ఒక దేవతా పటం, పూలు, దీపం కనిపించాయి. దగ్గరకు వెళ్ళి చూసాను. అది దేవతా విగ్రహం కాదు. అక్షరబ్రహ్మ పటం. పాతకాలపు సవరవాళ్ళ ఇళ్ళల్లో కనవచ్చే ఎడిసింగ్ అక్కడ లేదు.
ఆమె కొడుకు, కోడలు, మనవడు ఇంట్లో ఉన్నారు. లోపలకీ వెళ్ళి చూసాను. వంట ఇంటి వెనక బయట చేస్తున్నారు. పొయ్యి కట్టెల పొయ్యి. దాన్ని పేడతో అలికి ముగ్గులు పెట్టారు. పొద్దున్నే నాలుగింటికే తమ వంట పూర్తయిపోతుందని చెప్పారు. మళ్ళా ఇంట్లోకి అడుగుపెట్టగానే అక్కడ ఎలెక్ట్రిక్ కుక్కర్ కనిపించింది. నా ఆశ్చర్యానికి అంతులేదు. కొత్తపాతల మేలుకలయికలో గిరిజనులది అసాధారణమైన సామర్థ్యమని నాకు మరోసారి బోధపడింది.
మేం ఆ ఇంటినుంచి బయటకు రాగానే అక్షర బ్రహ్మ దేవాలయానికి వెళ్దామన్నారు. నాలుగడుగులు వేసామో లేదో, ఆ గూడలో బాలబడి నడుపుతున్న శాంతి అనే సవరయువతి తన ఇంట్లో కూడా అడుగుపెట్టమని తన బడిపిల్లల్ని పలకరించమనీ అడిగింది. అప్పుడే పూసిన పూలలాగా ఉన్నా ఆ సవరచిన్నారుల్తో కొద్దిసేపు గడిపాను. కాని ఆ బాలబడిలో తెలుగుపాటలు వినిపించాయేగాని సవరపాటలు వినిపించలేదు.
ఆ ఊరిపక్కనే ఒక పెద్దమిట్టమీద అక్షరబ్రహ్మ ఆలయం ఉంది. అక్కడకు తీసుకువెళ్ళారు. మెట్లు ఎక్కబోయే ముందు సవరస్త్రీలు అతిథిమర్యాదల్తో స్వాగతం పలికారు. ఆ మెట్లు ఎక్కుతూ ఉండే చుట్టూ దిగంతందాకా పరివ్యాప్తమైన సవరసీమ నా కళ్ళముందు ఆవిష్కృతమవుతూ వస్తున్నది. ఎటుచూసిన ముదురునీలం వన్నె తిరిగిన ఆకుపచ్చని పొలాలు, కొండచరియలు, అడవులు. దూరంగా నీలికొండలు కరిగి ఆవిరవుతున్నాయా అన్నట్టు నీటిమేఘమాలికలు. చరిత్ర స్మరణకి అందని అతీతకాలంనుంచీ ఏ సవరదేవతలు ఈ దృశ్యానికి ప్రలోభపడి ఇక్కడ ఆగిపోయారోగాని, ఆ పితృదేవతల్ని ఒదులుకోలేక ఈ కొండల్లోనే ఉండిపోయిన వారి సంతతి, ఆ జనావాసాలు.
పైకి వెళ్ళిన తరువాత మమ్మల్ని లోపలి మందిరంలోకి ఆహ్వానించారు. లోపల నల్లని గూడులాగా ఉంది. ఆ గూడుకి అటువైపు తిరిగి చూస్తే లోపల దీపం వెలుగుతున్నది. అక్కడ పూజారి కూచుని నా చేతికి పువ్వులందించాడు. నేను ఆ పూలు ఆ గూట్లో ఉన్న దేవత ముందు సమర్పిద్దామనిముందుకు వంగాను. ఆ లోపల నాకేమీ దేవతా విగ్రహం కనిపించలేదు. తెల్లని పూలకాంతి, దీపం వెలుతురు కలుసుకుంటున్న నిర్మలప్రకాశం తప్ప మరేమీ గోచరించలేదు.
‘ఇక్కడ దేవుడి విగ్రహమేమీ లేదే’ అన్నాను.
‘అదిగో అక్కడ లోపల నేల మీద సవర అక్షరాలు 24 ఉన్నాయి. అదే అక్షర బ్రహ్మ. ఆ నేల భూమి. ఆ గూటి పైకప్పు ఆకాశం. ఆ అక్షరాలే మా దేవుడు’ అన్నాడు పూజారి.
నా ఒళ్ళు జలదరించింది.
ఇదేమిటిది?
ప్రాచీన గ్రీసులోని డెల్ఫిలో దివ్యవాణికి గుడి కట్టారు. అదిలాబాదు జిల్లా బాసరలో గోదావరి ఒడ్డున జ్ఞానసరస్వతికి గుడికట్టారు. వాటికన్ నుంచి ఆంకార్ వాట్ దాకా ఎందరో దేవుళ్ళు, ఎన్నో దేవాలయాలు. కాని ఎక్కడా అక్షరానికి గుడికట్టినట్టు నేను వినలేదు. చూడలేదు.
‘అక్షరానికి గుడి.’
ఒక మంత్రంలాగా ఆ మాట నాకు నేను పదేపదే చెప్పుకున్నాను.
పూలు సమర్పించి బయటకు వచ్చాక సవర యువతీ యువకులు సవరభాషలో ప్రార్థనాగీతాలు పాడారు. వాళ్ళ దగ్గర కీబోర్డు, మృదంగం, తాళాలు ఉన్నాయి. ఇందాక సవర ఇంట్లో కనిపించిన ఎలెక్ట్రిక్ కుక్కర్ లాగా ఈ కీబోర్డు కూడా నన్ను ఆశ్చర్యపరిచింది. ‘మీ వాద్యాలుండాలే, గొగోడ్ రజన్ లాంటివి’ అన్నాను. ‘
‘అవి కూడా ఉన్నాయి. కీబోర్డూ, గొగోడ్ రజన్ కలిపే మా ఆర్కెస్ట్రా’ అన్నారు.
వచ్చిన అతిథికి మర్యాదగా ఒక శాలువా కప్పారు. ప్రేమతో మరొకపాట పాడతామన్నారు. ‘పల్లెల్లో అక్షరదీపం వెలగాలి’ అనే ప్రసిద్ధి చెందిన అక్షరాస్యతా గీతానికి సవర అనువాదమది.ఆ పాటని నాతో పాటు నింగీ, నేలా, చెట్టూ, చేమా కూడా చెవి ఒగ్గి విన్నాయి.
ఒక ప్రజాసమూహం బతకడానికి ఒక వంగడం, ఒక నైపుణ్యం, ఒక యంత్రం, ఒక మంత్రం ఏదో ఒకటి అవసరమవుతుంది. ఒక్కొక్కప్పుడు ఒక ఆయుధం కూడా అవసరమవుతుంది. కాని ఎస్.పి.మంగయాజీ గొమాంగో అనే సవర సంస్కర్తకి సవరజాతి బతకాలంటే ఒక కొత్త దేవుడు అవసరమని తోచింది. పూర్వకాలపు సవరదేవతలు రక్తానికీ, సారాయికీ అలవాటు పడిపోయారనీ, అందువల్లనే వాళ్ళ సంతతి ఆర్థికంగా పైకి వస్తున్నా నానాటికీ కుంగిపోతూనే ఉన్నారనీ ఆయన భావించాడు. ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ పాతకాలపు మతం నుంచి బయటపడటానికి సవరలకు లభ్యంగా ఉన్న ఒకే ఒక్క దారి క్రైస్తవంలో చేరడం. అక్కడ ప్రతి గూడలోనూ చినువా అచెబె రాసిన The Arrow of God పునరావృతమవుతున్నట్టే ఉంది.
దీన్నుంచి సవరసమాజాన్ని బయటకు తీసుకురావడంకోసం 1936 లో అక్షరబ్రహ్మ లేదా మడీర్ బ్రహ్మ ఉద్యమం మొదలయ్యింది. ఇందుకోసం ఎస్.పి.మంగయాజి ఒక నూతన పురాణాన్ని సృష్టించాడు.
ఆయన చెప్పినదాని ప్రకారం పూర్వకాలంలో సవరలు భగవంతుణ్ణి దారుబ్రహ్మగా ఆరాధించేవారు. అయితే సవర రాజకుమారి లలిత ఒక బ్రాహ్మణుడితో ప్రేమలో పడి అతడికి తమ ఆరాధనారహస్యాలన్నీ చెప్పేసింది. దాంతో ఆ బ్రాహ్మడు సవరదేవుణ్ణి సులభంగా వశపర్చుకున్నాడు. ఇక ఆ దేవుడు సవరల ప్రార్థనలు వినడం మానేసాడు.అప్పుడు సవర తన దేవుడితో ‘సరే, మంచిది, నువ్వు మా మాట వినడం మానేసావు. ఇక నాకు మిగిలిందల్లా జంతువుల రక్తం, ఇప్పసారా. వీటితోటే నిన్ను పూజిస్తాను’ అన్నాడు. ఏళ్ళు గడిచాయి. కలియుగం అంతమయ్యే రోజులు వచ్చాయి. దేవుడి మనసుమారింది. అతడు మళ్ళా సవరకు దర్శనమిచ్చాడు. ‘నేను మళ్ళా నీ కోసం వచ్చాను. అయితే ఈ సారి దారుబ్రహ్మగా కాదు.అక్షరబ్రహ్మగా’ అన్నాడు. సవర లేచి కళ్ళు నులుముకుని బయటకు పోయి చూసాడు. 24 సవర అక్షరాలు ఓం ఆకారంలో కనిపించాయి. ఆ దృశ్యాన్ని కళ్ళకద్దుకున్నాడు, గుడికట్టాడు.
ఇప్పుడు సీతంపేట మండలంలో 28 గ్రామాల్లో అక్షరబ్రహ్మ ఉద్యమం వేళ్ళూనుకుంది. యువతీయువకులు కార్యకర్తలుగా సంఘబాధ్యులుగా చేరుతున్నారు. ఎవరినుంచీ ఏ విధమైన ధనసహాయం లేదు. కాని ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమాన్ని భుజానికెత్తుకున్నారు.
ఆ సాయంకాలం శ్రీకాకుళంలో కాళీపట్నం రామారావుమాష్టార్ని కలిసినప్పుడు ప్రసిద్ధ కథారచయితలు గంటేడ గౌరునాయుడు, మల్లిపురం జగదీష్, ప్రసిద్ధ కవి సిరికి స్వామినాయుడు, ప్రసిద్ధ ఎత్నోబోటనిస్టు బి.ఎ.వి రామారావు నాయుడు కూడా కలిసారు. వారితో నేను పొద్దున్న చూసిందంతా చెప్పేను. మా మాటలు ముగిసేటప్పటికి శ్రీకాకుళసాహిత్యంలో వచ్చిన కొన్ని గొప్ప కథల్ని సవరభాషలోకి అనువాదం చేయించాలనే సంకల్పం రూపుదిద్దుకుంది. అక్షరబ్రహ్మ ఉద్యమం నాగావళి తీరానికి చేరుకుందనిపించింది.
9-9-2014