విలియం ఎడ్వర్డ్ డుబ్వా

d1

1861-65 మధ్యకాలంలో సంభవించిన అమెరికా అంతర్యుద్ధంనుంచి ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమం (1954-68) మధ్యకాలంలో దాదాపు ఒక శతాబ్దం పాటు ఆఫ్రికన్-అమెరికన్ చరిత్ర గతికి విలియం ఎడ్వర్డ్ డుబ్వా (1868-1963) జీవితం నిలువెత్తు దర్పణం.

తొంభై అయిదేళ్ళ ఆ సుదీర్ఘ జీవితంలో ఎనభయ్యేళ్ళకు పైగా అతడి జీవితం ఆఫ్రికన్-అమెరికన్ జాతి స్వేచ్ఛాసమర చరిత్రతో పెనవైచుకుపోయింది. మేము కూడా మనుషులమే అని చెప్పుకోడానికి పోరాటం చేసిన దశనుంచి మేము కూడా సమానమైన మనుషులమే అని చెప్పుకోడానికి చేసిన పోరాటాలదాకా ప్రతిఒక్క ఉద్యమంలోనూ అతడి పాత్ర ఉంది, చెరపలేని ముద్ర ఉంది.

డుబ్వా (William Edward Burghardt Du Bois) కేవలం ఆఫ్రికన్ అమెరికన్ జాతిచరిత్రలోనే కాదు, అమెరికన్ చరిత్రలో కూడా అత్యున్నత పాత్రపోషించాడు. పోరాటకారుడిగా కనీసం నాలుగుఖండాల్ని ప్రభావితం చేసాడు. (అతడిపుట్టినరోజు మావో చైనాలో కొన్నాళ్ళ పాటు జాతీయసెలవుదినం కూడా.) ఒక విద్యావేత్తగా అతడు మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసాడు. పదిహేడు, పద్ధెనిమిది శతాబ్దాల్లో యూరోప్ లో వర్ధిల్లిన ఎన్ లైటెన్ మెంట్ తత్త్వవేత్తలు రూసో, కాంట్, డిడిరో, వాల్టేర్, గొథే ల్లాగా డుబ్వా కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి, నడిచే విజ్ఞానసర్వస్వం. రౌట్లెడ్జి ప్రచురించిన Fifty Great Thinkers on Education: From Confucius to Dewey (2004) లో అతడి గురించి రాసిన వ్యాసంలో మొదటివాక్యమే ఇలా ఉంది:

‘డబ్ల్యు.ఇ.బి.డుబ్వా పండితుడు, చరిత్రకారుడు, సామాజికశాస్త్రవేత్త, నవలారచయిత, పత్రికాసంపాదకుడు, రాజకీయకార్యవాది, విప్లవశీల ప్రజాస్వామ్యవాది, సమసమాజదార్శనికుడు, శాంతికాముకుడు, విశాల ఆఫ్రికాసమాజ స్వాప్నికుడు, కమ్యూనిస్టు..’

కాని ఆఫ్రికన్-అమెరికన్ యోద్ధల్లో అత్యంత వివాదాస్పదుడు కూడా డుబ్వానే. తన జీవితకాలం పొడుగునా అతడు అనుసరించిన వ్యూహాలు, తీసుకున్న నిర్ణయాలు, సమర్థించిన పక్షాలు, తిరస్కరించిన వాదాలు-ప్రతి ఒక్కటీ ఆయన్ని వివాదంలోకి నెడుతూనే వచ్చాయి.

కాని, అతడు పోషించిన వివిధ పాత్రలన్నిటినీ సాకల్యంగా పరిశీలిస్తే ఒకటి మటుకు అర్థమవుతుంది. తన జాతి స్వేచ్ఛనీ, సమానత్వాన్నీ పొందడానికి అనువనిపించే ఏ ఒక్క అవకాశాన్నీ అతడు తడమకుండా వదిలిపెట్టలేదని. యెలియట్ ఎం రుడ్విక్ అనే ఆయన రాసిన W.E.B.Du Bois: Propagandist of the Negro Protest (1960) అనే పుస్తకానికి ముందుమాట రాస్తూ లూయీ ఆర్ హర్లాన్ అనే అతడు ఇలా రాసాడు:

‘అంతర్యుద్ధం ముగిసి మూడేళ్ళు కూడా తిరక్కుండానే జన్మించిన డుబ్వా వర్ణవివక్షత పొడుగుతా ఒక మహాసాహసయాత్ర చేసాడని చెప్పాలి. తన జాతిమీద సాగిన ఆఘాయిత్యాలనూ, ఇరవయ్య శతాబ్ది అమెరికాలో ఆ అత్యాచారాలు సృష్టించిన వర్ణవిద్వేషాలనూ ఎదుర్కోవడానికి అవసరమైన ప్రతి ఒక్క మార్గానా అతడు సంచరిస్తూనే ఉన్నాడు. ‘ఇరవయ్యవశతాబ్ది ప్రధాన సమస్య వర్ణవివక్షతనే’ అని 1903 లో వెలువరించిన తన రచన ‘ద సోల్స్ ఆఫ్ బ్లాక్ ఫోక్ ‘ లో ఒక ప్రవక్తలాగా ప్రకటించాడు. ఇక అప్పణ్ణుంచీ, తన సుదీర్ఘజీవితకాలంలో కనబడిన ప్రతి మార్గంలోనూ, అంటే న్యాయపరమైన పోరాటం మొదలుకుని, విద్య, సాంస్కృతిక బహుళతావాదం, బ్లాక్ నేషనలిజం మొదలుకుని బ్లాక్ పవర్ దాకా ప్రతి ఒక్క విధానంతోనూ, వైఖరితోనూ అతడు ప్రయోగాలు చేస్తూనే వచ్చాడు.’

అంతర్యుద్ధం పూర్తయి, అమెరికా పునర్నిర్మాణకాలం (1865-77)నుంచి, పౌరహక్కుల ఉద్యమాలకాలందాకా నల్లజాతి జీవితాన్ని మెరుగుపర్చడానికి అనేక దృక్పథాలు తలెత్తినప్పటికీ, వాటిలో మూడు ప్రధానమైనవి.

మొదటిది, దక్షిణాది నల్లజాతి అనుభవాలమీంచి బుకర్ టి వాషింగ్టన్ ప్రత్రిపాదించిన ఆచరణాత్మక వైఖరి. అతడు నల్లజాతిసోదరులకు ముందు కావలసింది, ఉపాధి, ఆర్థిక స్వావలంబన తప్ప రాజకీయహక్కులు కావని భావించాడు. అందుకని, నల్లజాతివారికి పారిశ్రామిక, వృత్తిపరమైన విద్యావకాశాల కోసం కృషి చేసాడు. దాన్ని ఒక విధమైన మితవాదంగా భావిస్తే, అందుకు పూర్తి విరుద్ధమైన అతివాదం మార్కస్ గార్వే ది. అతడు నల్లజాతివాళ్ళు తిరిగి ఆఫ్రికా పోయి తమదైన ఆఫ్రికన్ రాజ్యాన్ని నెలకొల్పుకోవాలని కలలుగన్నాడు. డుబ్వా కొన్నిసార్లు మొదట్లో ఈ ఇద్దరితో ఏకీభవించినా, చివరికి, ఈ రెండు వైఖరుల్నీ తీవ్రంగా తూర్పారబట్టాడు. వాషింగ్టన్ ప్రతిపాదించిన పారిశ్రామిక విద్య అన్నం పెడుతుందేమోగాని, ఆత్మగౌరవాన్ని ఇవ్వదనీ, అంతిమంగా విద్య అంటే ఉన్నత విద్య, క్లాసిక్స్ విద్యమాత్రమేననీ, ప్రతి పదిమంది నీగ్రోల్లోనూ ఒకడు ఉన్నత విద్యావంతుడైనా (talented tenth) కూడా అది నల్లజాతి చరిత్రని మార్చివెయ్యగలదనీ అతడు వాదించాడు. అలాగే గార్వే ప్రతిపాదనలు కూడా అతడికి రుచించలేదు. ఆఫ్రికాను తిరిగి ఆఫ్రికన్-అమెరికన్లు పరిపాలించాలని కోరుకోవడం అర్థరహితమని వాదించాడు. కాని, ఆఫ్రికన్-అమెరికన్లు అంతిమంగా అమెరికాకి చెందుతారా, ఆఫ్రికాకి చెందుతారా అన్నది అతడు తన జీవితకాలంలో తేల్చుకోలేకపోయాడు. తన అవసానదశలో ఆఫ్రికా విజ్ఞానసర్వస్వ రూపకల్పనలో భాగంగా, ఘనా లో అతడు మరణించేటప్పటికి, అతడు ఘనా పౌరసత్వం స్వీకరించాడని కొందరంటారు, లేదని కొందరంటారు.

డుబ్వా ఏవో ఒకటి రెండు కవితలు రాయకపోలేదుగాని, అతడు ప్రధానంగా కవి కాడు. కాని, తన సుప్రసిద్ధ రచన The Art and Imagination of W.E.B.Du Bois (1976) మొదలుపెడుతూ ఆర్నాల్డ్ రాంపెర్షాద్ ఇట్లా రాసాడు:

‘అతడి అత్యున్నత ప్రతిభ స్వభావరీత్యా కవితాత్మకమని నాకు స్పష్టంగా తెలుసు కాబట్టే డుబ్వా కళాత్మకత, ఊహాశాలీనతల గురించి రాయడానికి పూనుకున్నాను. అతడి పాండిత్యం, ప్రచారపరత్వం, రాజకీయ క్రియాశీలత్వం అన్నీ కూడా మానవానుభవం గురించి అతడేర్పరుచుకున్న కావ్యదర్శనంలోంచీ, వాక్కు పట్ల అతడికున్న కావ్యగౌరవంలోంచే రూపుదిద్దుకున్నాయి..’

డుబ్వా రాసిన గద్యరచనల్లో కూడా ఈ కవితాత్మక గాంభీర్యం తేటతెల్లమే అయినప్పటికీ, సాహిత్య దృష్టితో అతడి రచనలు చదవాలనుకున్నవాళ్ళు Darkwater: Voices from within the Veil (1896,1920) తో మొదలుపెట్టడం ఉత్సాహకరంగా ఉంటుంది. ఆ పుస్తకానికి ఆయన ప్రవేశికగా రాసుకున్న credo ని తెలుగులో ఇక్కడ అందిస్తున్నాను.

నేను నమ్ముతున్నాను

ఈ భూమ్మీద జాతులన్నిటినీ ఏకరక్తకుటుంబీకుల్ని చేసిన ఈశ్వరుణ్ణి నేను నమ్ముతున్నాను. మనుషులంతా, నల్లనివాళ్ళు, గోధుమఛాయ మేనివాళ్ళు, తెల్లనివాళ్ళు అంతా అన్నదమ్ములేనని నమ్ముతున్నాను, కాలంలోనూ, అందిపుచ్చుకుంటున్న అవకాశాల్లోనూ ఒకింత భేదాలుండవచ్చుకాక , లభించినవరాల్లోనూ, ఆకృతిలోనూ ఈషద్వ్యత్యాసం వుండవచ్చుకాక, ప్రాయికంగా వారందరూ ఒక్కరేనననీ, ఆత్మలోనూ, అపారవికాసానికిగల అవకాశాల్లోనూ సమానమేననీ నేను నమ్ముతున్నాను.

నీగ్రో జాతిని నేను మరింత నమ్ముతున్నాను. వారి ప్రతిభాసౌందర్యాన్ని, ఆత్మమాధుర్యాన్ని, వారి దుర్బలత్వంలోని దారుఢ్యాన్ని, ఈ సమస్తపృథివికే వారసులుకాగల వారి పటిమని నేను నమ్ముతున్నాను.

జాతిస్వాతిశయాన్నీ, ఆత్మవారసత్వాన్ని నేను నమ్ముతున్నాను. ఆ ఆత్మాహంకారమెట్లాంటిదంటే, ఇతరులపట్ల అన్యాయాన్ని లేశమాత్రం కూడా సహించలేనంత అగాధమైనది. వారసత్వాన్ని చూసుకుని దానికెంత స్వాతిశయమంటే ఏ ఒక్క మనిషి తల్లిదండ్రులపట్లా అది అవజ్ఞ చూపలేదు. దాని జాత్యంహకారమెటువంటిదంటే, మదించినవాళ్ళతో వియ్యమందడానికి ఇష్టపడదు, మరీ బిడియపరులతో సాంకర్యాన్ని సహింపజాలదు. మనుషులు ఒకరికొకరు బావమరదులు కాకపోవచ్చుగానీ, క్రీస్తుహృదయంలో వారంతా అన్నదమ్ములే అని దానికి నమ్మకం.

సేవలో నాకు గొప్ప నమ్మకం. నమ్రతాపూర్వకంగా మన్ననతో చేసే సేవ. బూట్లు నల్లగా మెరుగుపెట్టడం నుంచి, ఆత్మల్ని తెల్లగా తోమడం దాకా. సేవాభాగ్యమే స్వర్గం. సోమరితనం నరకం, ‘బాగా చేసావు’ అని యజమాని తలపంకించడమే వేతనం. రెక్కాడేవాళ్ళందరినీ, జార్జియాలో పత్తితోటల్లో చెమటోడ్చేవాళ్ళు మొదలుకుని, వర్జీనియాలో ప్రథమపౌరుల దాకా, ప్రతి ఒక్కరికీ ఆయన పనిభారం సమానంగా పంచుతాడు. చేసిన పనిని బట్టికాక, మరే విధంగా మనుషుల మధ్య తేడా చూపించినా అది దేవుడి పని కాదు, దెయ్యం పని.

యాతనాపరులైన మానవుల అవకాశాల్ని , వాళ్ళు నల్లవాళ్ళయితే మరింతగా, వాళ్ళని కావాలని చిన్నబుచ్చే, కించపరిచే సైతాను తన పిశాచపరివారంతో మనమధ్యనే నడయాడుతున్నాడని నమ్ముతున్నాను. పతితజనులముఖం మీద ఉమ్ములూసేవాడు, ఎదురుతిరిగి జవాబివ్వలేనివాళ్ళని మరింత కిందకుపడదోసేవాడు, అత్యంత క్షుద్రమైన పరిస్థితి ఒకటుందని నమ్మి, దాన్ని సదా నిరూపించడానికి ప్రయత్నించేవాడు, సృష్టికర్త మనిషి మీద ముద్రించిన దైవచిహ్నాల్ని తీవ్రంగా ద్వేషించేవాడు, సైతాను, ఒకడున్నాడని నమ్ముతున్నాను.

శాంతిరాకుమారుడున్నాడని కూడా నేను నమ్ముతున్నాను. యుద్ధమంటే హత్య అని కూడా నమ్ముతున్నాను. కాల్బలాలూ, నౌకాబలాలూ కేవలం కాకిబంగారం మటుకేననీ, అంతిమంగా అణచివేతా , అపకారమూ తప్ప మరేమీ కాదని నమ్ముతున్నాను. తెల్లసైన్యాలు నల్లజాతుల్ని, దుర్బలుల్ని దుర్మార్గపూర్వకంగా ఓడించినందువల్ల, చివరికి అవి రేపటికి తమని తాము మరింత దుర్బలం చేసుకుంటున్నాయనే నమ్ముతున్నాను.

మనుషులందరి స్వేచ్ఛనీ నేను నమ్ముతున్నాను. తమ కరచరణాద్యవయవాల్నీ, తమ ఆత్మల్నీ స్వేచ్ఛగా నడుపుకోగలిగే స్వాతంత్ర్యాన్ని. శ్వాసించగల స్వేచ్ఛని, తమకి నచ్చిన నాయకులకు ఓటు వేసుకోగల స్వేచ్ఛని, తమకి నచ్చినవాళ్ళతో మితృత్వం నెరపగల స్వేచ్ఛని, చర్మవర్ణంతో సంబంధంలేకుండా రైళ్ళల్లో, రహదారులమీద సంచరించగలిగే స్వేచ్ఛని, ఒక సుందర ప్రేమాన్వితలోకంలో ఆలోచించగల, కలలుగనగల, కలిసి పనిచేయగల స్వేచ్ఛని నమ్ముతున్నాను.

తెల్లవాళ్ళైనా, నల్లవాళ్ళయినా పిల్లలపెంపకంలో నాకు నమ్మకముంది. నిశ్చలసరస్తీరాలచెంతకు, నిత్యహరిత శాద్వలాల చెంతకు ఆ చిన్నారి హృదయాల్ని చేర్చగలమని నమ్మకం. శాంతికోసమో, సౌభాగ్యం కోసమో కాదు, సత్యం, శివం, సుందరాల విశాలదర్శనం జీవితాన్ని వెలిగిస్తుందన్న నమ్మకం. లేకపోతే మనం మర్చిపోతాం. ఎసావు సంతతిలాగా, పిడికెడు అన్నం ముద్దకోసం, ఒక మహారాజ్యాధికారాన్ని వదిలేసుకుంటాం.

అంతిమంగా,నాకు సహనంలో విశ్వాసముంది. దుర్బలుల బలహీనతపట్లా, మదోద్ధతుల మదాంధతపట్లా నేను ఓపిక పట్టగలను. అజ్ఞానుల అపోహలనీ, సత్యం చూడలేనివాళ్ళ అంధత్వాన్నీ నేను సహించగలను. నత్తనడకతో సంతోషం సాధించగల అంతిమవిజయం కోసం ఓపిగ్గా ఎదురుచూడగలను. ఉన్మత్తవిషాదగతిని కూడా సహించగలను. ఎందుకంటే, అసలు నా ఓపిక మొత్తం ఈశ్వరుడిపట్లనే.

10-2-2018

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading