మతాలకి అతీతమైన ఆధ్యాత్మికత

q1

ఎల్.ఎమ్.బ్రౌనింగ్ అమెరికాకి చెందిన రచయిత్రి, కవయిత్రి. తత్త్వశాస్త్రం, ప్రకృతి, మతవిశ్వాసాల విద్యార్థి. ఆమె తన అన్వేషణలో భాగంగా ఇటీవలి కాలంలో డ్రూయిడ్రి, ఆదిమ షామానిజంలలో ఆసక్తి పెంచుకుంది. ఆ ఆసక్తి గాఢమైన ఆవేదనగా మారి, OakWise (2010) పేరిట ఒక దీర్ఘకావ్యంగా వెలువడింది.

ఆమె మాటల్లోనే చెప్పాలంటే:

‘నాకు ఒక మతమంటూ లేదు. నా జీవితయాత్ర పొడుగునా నేను కూడగట్టుకున్న అనేక ఆదర్శాలు, తాత్త్విక ధోరణులు, వ్యక్తిగతంగా తెలుసుకున్న సత్యాల మీంచి నా ఆధ్యాత్మికత రూపుదిద్దుకుంది. గత పదిహేనేళ్ళుగా సాగుతున్న నా ప్రయాణంలో నేను కాథలిక్, బౌద్ధ, యూదీయ, డ్రూయిడు, ఆదిమ షామానిజం ల దారిన ప్రయాణిస్తూవచ్చాను. OakWise – డ్రూయుడు, ఆదిమ షామాన్ విశ్వాసాల ద్వారా నా ప్రయాణాన్ని విశదీకరించే కావ్యం. ఈ రెండు ఆరాధనా సంప్రదాయాల దారిన నా ప్రయాణం ద్వారా నాకు రెండు విషయాలు బోధపడ్డాయి. మొదటిది, ప్రకృతికన్నా పవిత్రమైనది మరేదీలేదని, ఈ భూమిని మించిన దేవాలయం లేదని డ్రూయిడ్రి ద్వారా నాకు నమ్మకం కలిగింది. రెండవ నమ్మకం ఆదిమ షామానిజం కలిగించింది. అదేమంటే, మనిషికీ, దైవత్వానికీ ప్రత్యక్ష సంబంధం ఉందని. పవిత్రమైన ఒక దివ్యాస్తిత్వంతో మనిషి సంభాషించడానికి మరే మాధ్యమం అవసరం లేదని. అది అపరోక్ష అనుభూతి అని.’

డ్రూయిడ్రి అంటే చాలామంది దృష్టిలో ఐర్లాండుకి చెందిన వనదేవతారాధన. కాని గత ముఫ్ఫై నలభయ్యేళ్ళుగా ప్రపంచంలో డ్రూయిడ్రి పట్ల పెరుగుతున్న మక్కువ వల్ల ఎన్నో కొత్త విషయాలు తెలుస్తున్నాయి. డ్రూయిడ్రి మూలాల గురించిన అన్వేషణ మరింత తీవ్రతరమవుతున్నది. దీన్ని ఒక పృథ్వీ-పితృదేవతారాధనగా చూడటమే కాక, తక్కిన ప్రపంచంలో వర్థిల్లిన ప్రాచీన పృథ్వీ-పితృదేవతారాధనలు- అమెరికన్ ఇండియన్, మావోరి, హుణా, అస్ట్రేలియన్ ఆదిమ తెగలు, ప్రాచీన ఆఫ్రికా తెగలు, ఆసియా జాతుల క్రతువులకూ, విశ్వాసాలకూ సన్నిహితమైన విశ్వాసంగా, క్రతుకాండగా చూస్తున్నారు.

మానవచరిత్రలో మతవిశ్వాసాల పరిణామాన్ని నిశితంగా పరిశీలించినవారికి మూడు దశలు కనిపిస్తాయి. మొదటి దశ, ఏ ప్రాచీనకాలంలోనో మొదలై, క్రీ.పూ 4000-3000 సంవత్సరాల దాకా కొనసాగింది. వేట, ఆహారసేకరణ ముఖ్య జీవనోపాధిగా బతికిన ఆనాటి మానవుడికి భూమిని మించిన దేవత లేదు. అయితే, అతడి భూమి కేవలం నేల కాదు. ఇప్పుడు మనం universe గా పరిగణిస్తున్నదంతా కూడా అతడికి భూమినే. ఆ భూమిలో దృశ్యప్రపంచంతో పాటు, పితృదేవతానీకంతో కూడుకున్న అదృశ్య ప్రపంచం కూడా ఉంది. కాబట్టి అతడు భూమినీ,పితృదేవతల్నీ ఆరాధించేవాడు. క్రీ.పూ నాలుగవ సహస్రాబ్దం నుండి క్రీ.పూ 600 దాకా, మానవచరిత్రలో వ్యావసాయిక యుగం మొదలయ్యాక, భూమి, నేలగానూ, నింగిగానూ విడిపోయింది. భూమికన్నా అకాశానికి ఎక్కువ ప్రాధాన్యత లభించింది. ఆకాశదేవతలు, సౌర, చాంద్ర, తారాదేవతలు, వారికి సంబంధించిన పురాణగాథల్తో కూడుకున్న సుమేరియన్, బేబిలోనియన్, అసీరియన్, ఈజిప్షియన్, గ్రీకు నాగరికతల్తో పాటు అవెస్తా, వైదిక దేవతలు, క్రతువులూ ఈ కాలానికి చెందినవే. క్రీ.పూ 600 నుంచి క్రీ.శ 600 దాకా ఒక ప్రవక్తని ఆధారం చేసుకున్న మతాలు ప్రభవించాయి. జొరాస్టరీయం, బౌద్ధం, జైనం, క్రైస్తవం, ఇస్లాం ఆ కోవకి చెందిన మతాలు. ఆ తర్వాత ఆయా మాతాల్లోనో లేక ఆ మతాలకి చెందిన వివిధ శాఖల్లోనో గురువుని కేంద్రంగా చేసుకున్న అసంఖ్యాకమైన విశ్వాసాలు, ఆరాధనా సంప్రదాయాలు ప్రభవిస్తూ వచ్చాయి.

ప్రతి దశలోనూ, కొత్త మతాలు పాతమతాలతో తీవ్రంగా తలపడ్డాయి.అసీరియన్-ఈజిప్షియన్ మతాలతో పాతనిబంధన ప్రవక్తలు తలపడ్డట్టు. కొన్ని సార్లు సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నించేయి. ఋగ్వేదం లాగా. కాని ప్రతి సారీ కొత్త మతాలు పాతమతాల్ని వాటి క్రతుస్వభావంనుంచి బయటపడెయ్యడానికే ప్రయత్నించేయి, బుద్ధుడు వైదిక క్రతువులమీద తిరుగుబాటు చేసినట్టుగా. గ్రీకు దేవతలమీద, ఆ దేవతలని చిత్రించిన హోమర్, హెసియోద్ ల మీద తిరుబాటు చేసిన సోక్రటీస్, అతడి పూర్వపు ఋషులూ తీసుకొచ్చిన కొత్తధోరణిని philosophy (జ్ఞానప్రేమ) అన్నారు. కాని, ఆక్వినాస్, కాంట్, డెరిడా ల్ని చదివినవాళ్ళకి, philosophy కూడా ముసుగేసుకున్న మతమేననని స్పష్టంగా తెలుస్తుంది.

కాని, ఆదిమ మతవిశ్వాసాలనుంచి గురువు కేంద్రంగా వికసించిన విశ్వాసాల దాకా జరిగిన పరిణామంలో ఒక ముఖమైన మార్పు సంభవించింది. అదేమంటే, ఒకప్పుడు ఆదిమజాతులు భూమినీ-పితృదేవతల్నీ కొలిచినప్పుడు, వారికి తమ చుట్టూ ఉన్న దృశ్య-అదృశ్య ప్రపంచమంతా ఒక అఖండ అస్తిత్వం. అందులో ఏ భాగాన్ని తాకినా తక్కిన అస్తిత్వమంతా స్పందిస్తుందని వారు నమ్మేరు. కాని, రాను రాను ప్రవక్తలు, పవిత్రగ్రంథాలు, గురువులు కేంద్రంగా వికసించిన మతాల్లో, ఆయా విశ్వాసుల ప్రపంచం వారి విశ్వాసవర్గానికి మాత్రమే పరిమితమైపోయింది. అంటే, విశ్వమంతా ఒకే అస్తిత్వంగా భావించిన ఆదిమానవుడినుంచి, తన మతశాఖని మాత్రమే సవ్యమైందిగా భావించే ఆధునిక మానవుడిదాకా మతపరిణామం జరిగింది.

ఇట్లా ఒకప్పుడు మానవసముదాయమంతటినీ కలిపి ఉంచగలిగిన మతవిశ్వాసాలు మనుషుల్ని విడదీసేవిగా మారిపోయాయి. దీన్నుంచి బయటపడటానికి రెండు ప్రత్యామ్నాయాలు: ఒకటి, విశ్వాసాన్ని కాకుండా హేతువుని కేంద్రం చేసుకుని మనుషుల్ని కలపాలనే ప్రయత్నం. తత్త్వశాస్త్రమూ, సైన్సూ చేస్తూ వస్తున్నదిదే. కాని,మనుషులకి ఏదో ఒక స్థాయిలో, ఏదో ఒక రూపంలో, ఏదో ఒకదానిపట్ల విశ్వాసం అవసరం. అది మనుషుల ఆధ్యాత్మిక అవసరం. అందుకని, రెండో ప్రత్యామ్నాయం, మతం (religion) నుండి ఆధ్యాత్మికత (spirituality) ని విడదీయడం. కాని, ఈ రెండో ప్రత్యామ్నాయానికున్న పెద్ద లోపమేమిటంటే, ఇది క్రతువుల్ని (ritual) తక్కువ చేస్తుంది. కాని, క్రతువులేని ఆధ్యాత్మికత, ఆచరణ లేని సిద్ధాంతం లాంటిది.

కాబట్టి, ఇప్పుడు మనుషుల ఆధ్యాత్మిక అవసరాలు తీరాలనీ, అదే సమయంలో వారి క్రతువులు వార్ని ఒకరినుంచి ఒకరిని వేరుచేసేవిగా ఉండకూడదనీ అనుకునేవాళ్ళు, కొత్త ritual ని అన్వేషిస్తున్నారు. అంతేకాక, మతాలు రెండవదశనుంచీ ఇప్పటిదాకా పూర్తిగా మానవకేంద్రీకృతంగా ఉన్నాయనీ, ఒక్క ఆదిమవిశ్వాసాలు మాత్రమే, మట్టినీ, మనుషుల్నీ, సమస్త ప్రాణికోటినీ ఒక్కటిగా చూడగలిగాయనీ, అందువల్ల, మనం కోరుకోవలసిన కొత్త క్రతుకాండ, మొత్తం పర్యావరణమంతటినీ ఒక్కలాగా భావించేదిగా ఉండాలనీ వాళ్ళు కోరుకుంటున్నారు.

ఇప్పుడు బ్రౌనింగ్ డ్రూయిడ్ల దారిలో కవిత్వం చెప్పినప్పుడు ఆమె కేవలం సర్వే జనాః సుఖినోభవంతు అనుకోవడం లేదు, సర్వ ప్రాణులూ సుఖంగా ఉండాలని కూడా కాదు, చేతనాచేతనాలతో కూడుకున్న స్థావరజంగమాత్మకమైన సమస్త విశ్వానికీ ఆమె శాంతి కోరుకుంటున్నది.

ఈ వాక్యాలు చూడండి:

‘గతాన్ని మేల్కొల్పవలసిన తరుణం ఆసన్నమైంది
.. దాన్ని నెమరు వేసుకోవడానికి కాదు,
ఆవాహన చెయ్యడానికి.

గతించిపోయిన చరిత్రల్ని నమోదు చెయ్యడానికి కాదు,
ప్రాచీన జీవనపద్ధతులకి
మన జీవితాన్ని జోడించి
వాటిని పునర్నవం చెయ్యడానికి.

ప్రాచీనవివేకస్రవంతిని పైకిలేపి
ఊషరక్షేత్రాలకు నీళ్ళు పెట్టవలసిన
సమయం సిద్ధమైంది.

ఆధునికం మన ఆకలి తీర్చలేకపోయింది.
మనం ఆ చిన్నప్పటి మన ఇంటికోసం బెంగపెట్టుకున్నాం,
ఇల్లంటే, మనం పుట్టి పెరిగిన ఇల్లు కాదు
మానవజాతికంతటికీ ఊయెలతొట్టిలాంటి
ప్రకృతి ఒడి.

మనమెక్కడినుంచి వచ్చామో మర్చిపోయాం,
అయినా మనం గృహోన్ముఖులమైనాం,
ఆధునిక జీవితంలోకి వలసవచ్చాం, కానీ
చివరికి మళ్ళా మనం చేరేది ఆ అడవికి, ఆ పొలానికే.

ఈ ఆకాశ హర్మ్యాల, నియాన్ దీపాల
విదేశంలో జీవిస్తున్నాం కానీ
ఇక్కడ మనం మనం కాము.

కాబట్టి, పునర్యాన తరుణం సమీపించింది,
మన ఆరాటాలు మనల్ని పడమటికి లాక్కొచ్చాయి,
కాని మన బెంగ మనల్ని తూర్పుదిశగా తిప్పుతున్నది’

ఇట్లా ఈ కావ్యం ఆసాంతం తెలుగు చెయ్యాలని ఉంది. మతాలకి అతీతమైన ఆధ్యాత్మికత కావాలంటే, మనం మనుష్యకేంద్ర విశ్వాసాల నుంచి పర్యావరణ కేంద్ర విశ్వాసానికి (ecological faith) పయనించాలన్నదే Oak Wise సారాంశం.

27-7-2016

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s