బాబ్ డిలాన్

Reading Time: 3 minutes

B1

స్వీడిష్ కమిటి మరొకసారి సాహిత్యప్రపంచాన్ని సంభ్రమానికి గురిచేసింది. పోయిన సంవత్సరం స్వెత్లానాకు సాహిత్యపురస్కారం ఇవ్వడం ద్వారా జర్నలిజాన్ని కూడా సాహిత్యప్రక్రియగా గుర్తించినట్టే, ఈ ఏడాది బాబ్ డిలాన్ కు పురస్కారం ప్రకటించడం ద్వారా ఫోక్ రాక్ మూజిక్ ని కూడా అత్యుత్తమ సాహిత్యప్రక్రియగా గుర్తించినట్టయింది.

1993 లో టొనీ మారిసన్ కి పురస్కారం లభించిన తరువాత, 26 ఏళ్ళ విరామం అనంతరం మళ్ళా యు.ఎస్ కి నోబెల్ సాహిత్య బహుమతి లభించింది. ఈ పురస్కారాన్ని పొందిన అమెరికన్లలో తొమ్మిదవ వాడు. కానీ ఈ ఎంపిక ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నది. ఒకవైపు డిలాన్ కి ఈ పురస్కారం ఎప్పుడో రావలసిఉంది అనే వాళ్ళూ, మరొకవైపు ఇది కేవలం ‘నోస్టాల్జియా’ తప్ప మరేమీ కాదనే వాళ్ళూ కూడా ఉన్నారు.

కాని స్వీడిష్ అకాడెమీ లో డిలాన్ విషయంలో ఏకాభిప్రాయమే ఉన్నదని అకాడెమీ శాశ్వత కార్యదర్శి సారా డానియస్ అంటున్నది. ఆమె డిలాన్ ని హోమర్, శాఫో ల కోవకి చెందిన ప్రాచీన వాగ్గేయకార పరంపరకు చెందిన కవిగా పేర్కొంది. ‘డిలాన్ రాసే కవిత్వం చెవుల కోసం’ అందామె. అంతేకాదు, ‘అతడు రాసేది కవిత్వ నిర్వచనానికి పరిపూర్ణంగా ఒదిగిపోతుంది’ అని కూడా అంది. స్వీడిష్ అకాడెమీకి చెందిన మరొక సభ్యుడు పెర్ వాస్ట్ బెర్గ్ డిలాన్ ను ‘జీవించి ఉన్నవాళ్ళల్లో సర్వశ్రేష్ట కవి’ అని అభివర్ణించడానికి వెనకాడలేదు.

ఆఫ్రికన్ నవలా రచయిత గ్యూగీ, జపనీస ఐతిహాసిక రచయిత మురాకామి, సిరియన్ కవి శ్రేష్టుడు ఎడొనిస్ ల ను కూడా పక్కకు నెట్టి బాబ్ డిలాన్ ను నోబెల్ పురస్కారానికి ఎంపిక చేయడం ద్వారా స్వీడిష్ అకాడెమీ గొప్ప సాహసం చేసిందనే నేననుకుంటున్నాను.

స్వెత్లానా, బాబ్ డిలాన్ లు ప్రత్యామ్నాయ సాహిత్య సంప్రదాయాలకు చెందిన వాళ్ళు. పాండిత్యం, సాంప్రదాయిక సాహిత్యప్రక్రియలు, శిష్టవర్గానికి చెందిన పాఠకులతో కూడి ఉండే మహారచయితల కోవకు చెందిన వాళ్ళ స్థానంలో, ప్రజల మధ్య తిరుగుతూ, ప్రజల సుఖదుఃఖాలకు చలిస్తూ, సద్యఃస్పందనతో, నిజాయితీతో తమకేది తోస్తే అది పాడుకుంటూ, ప్రవచిస్తో తిరిగే కొత్త రచయితలు వీళ్ళు. ఒకరకంగా చెప్పాలంటే, 21 వ శతాబ్దపు సాహిత్యం ఇటువంటి రచయితల కోసమే చూస్తూ ఉన్నది.

అత్యధికసంఖ్యాకులు అక్షరాస్యులుగా అవతరించిన మన కాలంలో, పండిత కుటుంబాల్లోనో, గురుకులాల్లోనో ఏళ్ళ తరబడి సాహిత్యసాధన చేసే అవకాశం లేని సాహిత్యాభిమానుల కాలంలో, ఇంతదాకా, విద్యకీ, సాహిత్యానికీ, రసాస్వాదనకీ నోచుకోని సామాజిక వివక్షతకు గురై, అప్రధానీకరణకు లోనైన ప్రజాసమూహాలు తమకు స్ఫూర్తికోసమో, తమకుదారిచూపించే సత్యంకోసమో, తమ జీవితాల్ని వెలిగించే సౌందర్యం కోసమో, సాహిత్యం వైపు చూస్తున్నప్పుడు ఒక స్వెత్లానా,ఒక బాబ్ డిలాన్ నిస్సందేహంగా నవప్రపంచపు తారలుగా అవతరిస్తారు.

‘ఫిలిప్ రోత్ కన్నా బాబ్ డిలాన్ గొప్ప రచయిత అని నమ్మమంటున్నారా?’ అని ఒక అమెరికన్ ఈ రోజు ప్రశ్నించి ఉండవచ్చు. కాని, ఆసియా దేశాల సాహిత్య సంప్రదాయాలు తెలిసినవాళ్ళకి, స్వీడిష్ అకాడెమీ నిర్ణయంలో అనౌచిత్యమేమీ కనిపించదు. అందుకనే, సాల్మన్ రష్ది ఈ వార్త వినగానే ‘ ఆర్ఫియస్ నుంచి ఫైజ్ దాకా గీతమూ, కవిత్వమూ ఒకదానితో ఒకటి పెనవైచుకునే వస్తున్నాయి. గాయక-కవి సంప్రదాయానికి డిలాన్ అత్యంత ప్రతిభావంతుడైన వారసుడే’ అన్నాడు. ఈ వార్త వినగానే నెట్ లో స్పందిస్తూ వచ్చిన అసంఖ్యాకమైన సాహిత్యాభిమానుల్లో ఒకరు టాగోర్ కూడా డిలాన్ లానే కవిగాయకుడే కదా అని కూడా అన్నారు.

ఆసియా దేశాల సాహిత్యవేత్తలే కాదు, కవిత్వం గురించి తెలిసిన ఏ రసజ్ఞుడైనా కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తాడు. కవిత్వానికి ఇంతదాకా ఇచ్చిన అనేక నిర్వచనాల్లో నాకు చాలా నచ్చిన నిర్వచనం కోలరిడ్జ్ చెప్పిన మాట. ఆయన వచనమంటే proper words in proper order, కవిత్వమంటే, best words in best order అన్నాడు. ఈరోజు, డిలాన్ గురించి మీరేమనుకుంటున్నారు అని బి.బి.సి ఒకప్పటి బ్రిటిష్ ఆస్థాన కవి సర్ ఆండ్రూ మోషన్ అని అడిగితే ఆయన డిలాన్ కవిత్వమంతా best words in best order అన్నాడు.

రాబర్ట్ అలెన్ జిమ్మర్ మాన్ 1941 లో ఒక యూదు కుటుంబంలో పుట్టాడు. సుప్రసిద్ధ బ్రిటిష్ కవి డిలాన్ థామస్ మీద ఇష్టం కొద్దీ తన పేరులో డిలాన్ చేర్చుకున్నాడు.1959 నుంచీ మిన్నెసోటా కాఫీ హౌసుల్లో గీతాలాపన మొదలుపెట్టాడు. 60 ల్లో అతడు అమెరికా కష్టసుఖాలకి ఒక అనధికార చరిత్రకారుడిగా మారిపోయాడు. వియత్నాం యుద్ధాన్ని నిరసిస్తూ, పౌరహక్కుల్ని బలపరుస్తూ, వ్యవస్థ ఇరుకతనం పట్ల అసమ్మతి ప్రకటిసూ పాటలు కట్టి పాడటం మొదలుపెట్టాడు. సారా డనియస్ మాటల్లో చెప్పాలంటే, ‘గత 54 సంవత్సరాలుగా అతడు తనని తాను మళ్ళీ మళ్ళీ కొత్తగా దర్శిస్తూనే ఉన్నాడు, నూతన అస్తిత్వాన్ని సదా సృష్టించుకుంటూనే ఉన్నాడు.’

జార్జి బెర్నార్డ్ షా తర్వాత, నోబెల్ బహుమతీ, ఆస్కార్ అవార్డూ కూడా పొందిన రచయిత డిలాన్. నోబెల్, అస్కార్ లతో పాటు గ్రామీ అవార్డులు కూడా వరించిన ఏకైక రచయిత ప్రపంచ చరిత్రలో ఇప్పటిదాకా అతడే. ‘మహత్తర అమెరికన్ గీత సంప్రదాయంలో కొంగొత్త కవితాభివ్యక్తిని సృష్టిస్తున్నందుకు’ అతడికి ఈ బహుమతి ప్రకటిస్తున్నామని స్వీడిష్ అకాడెమీ పేర్కొంది.

‘డిలనీయ పద్ధతిలో తేజోవంతమైన స్పష్టప్రతీకలతో పాటు, అస్పష్టతను కూడా మేళవించే రచనలు’ అతడివని మైక్ మర్కుసీ అన్నాడు. ‘త్వరితగతిన మారిపోతున్న వర్తమానపు సకల పార్శ్వాల్నీ సమగ్రంగా చూడగలిగే వీలు కల్పించాడు’ అని గార్డియన్ పత్రిక పేర్కొంది.

డిలాన్ గురించి నేను మొదటిసారి విన్నది ఓల్గా గారి దగ్గర. 88 లో ఆమె నాకు రాసిన ఒక ఉత్తరంలో డిలాన్ గానం వింటున్న ఉద్వేగాన్ని పంచుకున్నారు. బహుశా, అప్పటికి, డిలాన్ ని ఒక అగ్రశ్రేణి సాహిత్యకారుడిగా గుర్తించినవాళ్ళు చాలా తక్కువ మంది. వాళ్ళల్లో క్రిస్టఫర్ రిక్స్ ఒకడు. అతడిట్లా రాసాడు:

‘అన్నిటికన్నా ముందు డిలాన్ గాయకుడూ, గీతకారుడూను. అతడి కళలోని సమగ్రతలోనే అతడి కవిత్వం ఇమిడి ఉంది. రాగపరివర్తనలో, ఆ గీతపంక్తుల్లో, పదప్రయోగాల్లో, కాకువులో, ఉచ్ఛ్వాసనిశ్వాసాల్లో, అన్నిటికన్నా ముఖ్యం, ఆ గానం సృష్టించే విద్యుత్తులో అతడి కవిత్వం దాగి ఉంది’

డిలాన్ ప్రసిద్ధ గీతం Blowing in the Wind మీ కోసం:

గాల్లో నినదిస్తున్నది

నిజమే,మనిషిని నువ్వు మనిషిగా పిలవడానికి ముందు
మనిషి ఇంకెన్ని దారుల్లో నడయాడవలసి ఉన్నది?
నిజం, సైకతసీమలో విశ్రాంతిగా నిదురించే ముందు
ఆ శ్వేత కపోతమింకెన్ని సాగరాలు దాటవలసిఉన్నది?
అవును, వాటికి శాశ్వతంగా చెల్లుచీటీ రాసేముందు
ఫిరంగి గుండ్లు ఇంకెన్నిమార్లు పేలవలసి ఉన్నది?

సమాధానం, మిత్రమా, గాల్లో నినదిస్తూనే ఉన్నది
ఆ సమాధానం గాల్లో నినదిస్తూనే ఉన్నది.

అవును,సాగరం చెంత శిరసువాల్చడానికి ముందు
ఆ పర్వతమింకా ఎన్నాళ్ళట్లా పడిఉండవలసి ఉన్నది?
నిజమే, విముక్తమానవులై విలసిల్లడానికిముందు
కొందరు మనుషులింకా ఎన్నేళ్ళట్లా జీవించవలసి ఉన్నది?
అవును, తలతిప్పి చూస్తూ కూడా చూడనట్లు నటిస్తూ
మానవుడింకా ఎన్నియుగాలు కొనసాగించవలసి ఉన్నది?

సమాధానం, మిత్రమా, గాల్లో నినదిస్తూనే ఉన్నది
ఆ సమాధానం గాల్లో నినదిస్తూనే ఉన్నది.

అవును, ఆకాశాన్ని కళ్ళారా వీక్షించేముందు
మానవుడింకా ఎన్నిసార్లు తలెత్తి చూడవలసిఉన్నది?
నిజమే, ప్రజలరోదన చెవులపడటానికి ముందు
ఒక మనిషికి ఎన్నివేల చెవులు కావలసి ఉన్నది?
అవును, మనుషులెందరో మరణించారని గుర్తించే ముందు
మరణపరంపర ఎంత సంభవిస్తే అతడికి తెలియవలసి ఉన్నది?

సమాధానం, మిత్రమా, గాల్లో నినదిస్తూనే ఉన్నది
ఆ సమాధానం గాల్లో నినదిస్తూనే ఉన్నది.

13-10-2016

Leave a Reply

%d bloggers like this: