పాల్ లారెన్స్ డన్ బార్

d1

19 వ శతాబ్ది చివరిలోనూ, ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభంలోనూ తెలుగు సాహిత్యంలో గురజాడ అప్పారావు (1862-1915) నిర్వహించిన పాత్ర వంటిది, ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యంలో ఎవరు నిర్వహించారని చూస్తే, ఇద్దరు రచయితలు కనిపిస్తారు. ఒకరు, పాల్ లారెన్స్ డన్ బార్ (1872-1906) మరొకరు, విలియం ఎడ్వర్డ్ డుబ్వా (1868-1963). డన్ బార్ గురజాడలాగా దేశీయ ఛందస్సుల్లోనూ, ప్రజలభాషలోనూ కవిత్వం చెప్తే, డుబ్వా చరిత్రరచయితగా, పరిశోధకుడిగా, సామాజిక భావవిప్లవకారుడిగా, విద్యావేత్తగా ప్రసిద్ధి చెందాడు.

అమెరికాలో నీగ్రో కవిత్వానికి ఆదికవి ఎవరు అన్నదానిమీద కూడా కొంత భేదాభిప్రాయం ఉంది. 18 వ శతాబ్దంలోనే అమెరికాలో బానిసలుగా జీవిస్తున్న నీగ్రోలు పాటలు పాడుకోవడం మొదలుపెట్టారు. అవి ప్రధానంగా ప్రార్థనలుగానూ, ఆధ్యాత్మిక నివేదనలుగానూ ఉండేవి. ఫిలిస్ వీట్లే (1753?-1784) తన కవితల సంపుటి వెలువరించిన మొదటి నీగ్రో కవిగా చరిత్రలో నిలబడిపోయింది. ఆమె పుట్టింది పశ్చిమ ఆఫ్రికాలో. ఏడేళ్ళ వయసులో ఆమెని కిడ్నాప్ చేసి అమెరికాలో బానిసగా అమ్మేసారు. ఆమె ప్రకాస్తి నేడు ఆధ్యాత్మిక రచయితగా ఎక్కువ వ్యాప్తిలో ఉంది. (ఆమె గురించి మరో సారి వివరంగా.)

కాని సాహిత్య విలువల దృష్ట్యా, తదనంతర కవిత్వం మీద చూపించిన శాశ్వత ప్రభావం దృష్ట్యా డన్ బార్ ని మొదటి ఆఫ్రికన్-అమెరికన్ కవిగా ప్రస్తుతిస్తున్నారు. డన్ బార్ సమకాలికుడూ, సహకవీ, మిత్రుడూ అయిన జేమ్స్ వెల్డన్ జాన్సన్ తన The Book of American Negro Poetry (1921) లో ఇలా రాసాడు:

‘కవిత్వ సామగ్రి మీదా , కవిత్వ శిల్పం మీదా సమానాధికారం చూపించడంలోనూ, రాసినప్రతి ఒక్క రచనలోనూ సాహిత్య కౌశల్యం చూపించడంలో, అత్యున్నతస్థాయి ప్రతిభను కనపరచడంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన నీగ్రోజాతికి చెందిన మొదటి కవిగా పాల్ లారెన్స్ డన్ బార్ నిలబడతాడు. తన జాతిని సమగ్రంగా వీక్షించగలిగే ఎత్తులకి చేరుకోగలగిన మొదటికవి అతడు. తన జాతిజనుల ఉల్లాసాన్నీ, మూఢనమ్మకాల్నీ, లోపాల్నీ కూడా నిష్పక్షపాతంగా చూడగలిగినవాళ్ళల్లో అతడే మొదటివాడు. తన జాతి గుండెకోతనీ, దాని ఆరాటాన్నీ, ఆకాంక్షల్నీ, సానుభూతితో చూడటంలోనూ, వాటికొక అచ్చమైన సాహిత్యాభివ్యక్తినివ్వడంలోనూ కూడా అతడే మొదటివాడు.’

గురజాడలానే డన్ బార్ కూడా ఎక్కువకాలం జీవించలేదు,కాని ఆఫ్రికన్-అమెరికన్ కవిత్వాన్ని ఒక మలుపు తిప్పాడు. ముఖ్యంగా, ఆఫ్రికన్-అమెరికన్ నీగ్రోల యాసలో కవిత్వం చెప్పవచ్చునని ఋజువు చేసాడు. ప్రజల భాషలో కవిత్వం రాసినందువల్ల గురజాడలానే అతడిని కూడా సమకాలిక సాహిత్యలోకం గొప్ప కవిగా పరిగణించలేదు. కాని, తర్వాతి రోజుల్లో, 20-30ల్లో హార్లెం రినైజాన్సు రోజుల్లో లాంగ్ స్టన్ హ్యూస్ లాంటి కవులు తమ వ్యావహారిక భాషలోని సౌందర్యాన్ని కనుగొని, అందులో కవిత్వం చెప్పడానికి కారణం డన్ బార్ నే. అందువల్ల, కవిగా డన్ బార్ కి లభించిన తొలి ప్రశస్తి అతడు నీగ్రో వ్యావహారిక భాషలో చెప్పిన కవిత్వం మీదనే నూటికి నూరుశాతం ఆధారపడి ఉంది. కాని, అతడు సాహిత్య ఇంగ్లీషులో కూడా కవిత్వం చెప్పాడు. ఆ కవిత్వాన్ని అటు అమెరికన్ సాహిత్య పరీక్షకులూ, ఇటు అతడి నీగ్రో వారసులూ కూడా పెద్దగా పట్టించుకోలేదు. కాని, ఇప్పుడు, అంటే వందేళ్ళ తరువాత, డన్ బార్ చారిత్రిక ప్రాముఖ్యత అతడి నీగ్రో యాస కవిత్వం మీదా, అతడి సాహిత్య ప్రాముఖ్యత అతడి సాహిత్య ఇంగ్లీషు కవిత్వం మీదా ఆధారపడుతున్నదని గుర్తిస్తున్నారు.

డన్ బార్ నిరుపేద జీవితం జీవించాడు. మొదట్లో అతడి మిత్రులతడికి చెప్పుకోదగ్గ ఒక ఉద్యోగం చూపించారుగాని, అతడు అందులో ఇమడలేకపోయాడు. చివరికొక ఎలివేటర్ ఆపరేటర్ ఉద్యోగంలో కుదురుకున్నాడు. సాహిత్యం అతడికి డబ్బు సంపాదించిపెట్టలేదు. కాని అతడే లేకపోతే ఇరవయ్యవ శతాబ్ది ఆఫ్రికన్ అమెరికన్ కవిత్వం ఇప్పుడున్నట్లుగా ఉండిఉండేదే కాదు.

నీగ్రో యాసలో డన్ బార్ రాసిన కవితలు, ముఖ్యంగా, A Negro Love Song, When Malindy Sings, An Ante-Bellum Sermonవంటివి అనువాదానికి లొంగేవి కావు, వాటిని అనువదించడానికి నా శక్తి చాలదు కూడా. అందుకని అతడు ఇంగ్లీషు కావ్యభాషలో రాసిన కవిత్వం నుంచి మటుకే ఇక్కడ నాలుగు అనువాదాలు పొందుపరుస్తున్నాను. అవి ఏ రోజైనా, ఇంగ్లీషులో వచ్చిన, అత్యుత్తమ కవిత్వం సరసన నిలబడగలిగేవే. ముఖ్యంగా, డగ్లస్ మీద అతడు రాసిన కవితని వర్డ్స్ వర్త్ మిల్టన్ మీద రాసిన ‘లండన్ 1802’ కవితతో సమానమైనదిగా నేడు ఇంగ్లీషు విమర్శకులే అంగీకరిస్తున్నారు.

డగ్లస్

ఆహ్, డగ్లస్, ఎట్లాంటి కష్టకాలానికి వచ్చిపడ్డాం
ఎట్లాంటిరోజులు! నువ్వు ఊహించికూడా ఉండవు
ఒకప్పుడు నువ్వు, ముఖ్యం నీ నేత్రాలు, ఆ
చీలుదారులదగ్గర ఆ సుదూరకఠినకాలాన్ని చూసినప్పుడు
మొత్తం దేశం సంభ్రమంతో నిన్నాలించింది.
అటూ ఇటూ కొట్టుమిట్టాడిన ఆ ఉద్వేగతరంగాల
ఉత్థానపతనాలు అక్కడే ఆగిపోలేదు,
మేమిప్పుడొక ద్వేషపు తుపాను ఎదురీదుతున్నాం.

ఇప్పుడు విరోధం వేగాకులంగా చుట్టుముట్టినప్పుడు
దారిచూపవలసిన గౌరవం నిలువునా కూలిపోయినప్పుడు,
ఓహ్, తుపానుల్ని ధిక్కరించగల నీ గళం కావాలి మాకు
తల్లకిందులవుతున్న నావను నిలబెట్టగల హస్తం కావాలి
విస్ఫోటనాల్ని అదుపుచెయ్యగల సాన్నిధ్యం కావాలి
ఈ ఏకాంత ప్రళయధ్వాంతంలో నీ సాంత్వన కావాలి.

మేము ముసుగు తొడుక్కుంటాం

చిరునవ్వులు చిందించే అబద్ధాల ముసుగు తొడుక్కుంటాం
మా చెంపల్ని, నీడల్ని,నేత్రాల్ని మరుగుపరుస్తుందది.
మానవకాపట్యానికి మేమిట్లా ఋణం చెల్లించుకుంటాం
చీలినెత్తురోడుతున్న హృదయాల్తో చిరునవ్వులు చిందిస్తాం.
అసంఖ్యాక వ్యంగ్యాలకు అభివ్యక్తినిస్తాం.

మా కన్నీళ్ళనీ,నిట్టూర్పుల్నీ లెక్కించడానికి
ఈ ప్రపంచానికి అంత సూక్ష్మజ్ఞానం అవసరమా?
అక్కర్లేదు, వాళ్ళుమమ్మల్నిట్లానే చూస్తుంటే చాలు,
మేమిట్లా ముసుగు తొడుక్కుంటాం.

చిరునవ్వుతుంటాం, కాని మహాప్రభూ, మా ఆత్మల
చిత్రహింసల్లోంచి తలెత్తుతున్నాయి మా రోదనలు.
మేము పాడుతుంటాం, కాని మా పాదాలకింద మట్టిలోనే
ఏదో మోసముంది, సుదూరమింకా తరించవలసిఉంది.
ప్రపంచం మరోలాగ కలలుకననీ,
మేము ముసుగు తొడుక్కుంటాం!

సానుభూతి

కొండచరియలమీద భానుడు భాసమానుడిగా ఉన్నప్పుడు
అయ్యో! పంజరంలో ఆ పిట్ట చింత ఏమిటో నాకు తెలుసు.
వసంతశాద్వలాలమీంచి కమ్మతెమ్మరవీచినప్పుడు
పరిచిన అద్దంలాగా ప్రవాహం సాగిపోతున్నప్పుడు
మొదటి పక్షి గొంతెత్తినప్పుడు, మొదటి మొగ్గ విప్పారినప్పుడు
ఆ కుట్మలపాత్రికనుంచి పరిమళం మృదువుగా అల్లుకున్నప్పుడు
పంజరంలో ఆ పిట్ట కలవరమేమిటో నాకు తెలుస్తున్నది.

బోను ఊచలు ఎర్రబారేలా రెక్కలు బాదుకుంటూ
పంజరంలో పిట్ట ఎందుకు ఎర్రబడుతున్నదో నాకు తెలుసు.
తన కొమ్మని కరిచిపెట్టుకు ఉండవలసినప్పుడు
ఆ రెమ్మమీద సంతోషంతో ఊయలూగవలసినప్పుడు
ఆ పాత, పాతగాయాల్లో ఇంకా ఒక వేదన ఉబుకుతున్నది
ఆ గాయాల మచ్చలు మరింత పదునుగా గుచ్చుకుంటున్నవి-
అది రెక్కలెందుకు బాదుకుంటోందో నాకు అర్థమవుతున్నది.

ఆ పంజరంలో పిట్ట ఎందుకు పాడుతున్నదో నాకు తెలుసు, ఆహా
దాని రెక్కలు నలిగిపోయి, దాని వక్షం పుండయినప్పుడు
ఊచలకి రెక్కలు బాదుకుంటూ ఉరికిదూకాలనుకుంటున్నప్పుడు
ఆ పాట సంతోషంతో పాడేది కాదు, ఆహ్లాదానికి పాడేది కాదు.
హృదయాభ్యంతరంలోంచి దూసుకొచ్చే ప్రార్థన అది,
ఒక అభ్యర్థన, ఆకాశానికి రెక్కలు చాపాలన్న ఆవేదన
పంజరంలో పిట్ట ఎందుకు పాడుతున్నదో నాకు తెలుస్తున్నది.

ఉషస్సు

మచ్చలేని ధవళవస్త్రాలు ధరించిన ఒక దేవదూత
ముందుకు వంగి, నిద్రిస్తున్న రాత్రిని ముద్దాడింది.
రాత్రి నునుసిగ్గులోకి మేల్కొంది, దేవదూత తప్పుకుంది.
మొగ్గలు తొడిగిన ఆ సిగ్గు చూసి పొద్దుపొడిచిందన్నారు.

6-2-2018

Leave a Reply

%d bloggers like this: