నేనెంతో అదృష్టవంతురాల్ని

l1

చాలారోజులయ్యింది మిమ్మల్నిపలకరించి. కాలం కొత్త తలుపు తెరిచిన ఈ శుభవేళ నేనీ మధ్య చదివిన గొప్పపుస్తకమొకదాని గురించి మీతో ముచ్చటించాలనిపిస్తోంది.

ఆ మధ్య రావెల మనోహర్ అమెరికానుంచి వస్తూ నాకోసం బుట్టెడు పుస్తకాలు తెచ్చారు. అందులో మాయా ఏంజెలౌ రాసిన Letter to My Daughter (రాండం హౌస్, 2008) కూడా ఒకటి. ఏంజలౌ నాకు కవయిత్రిగా మాత్రమే తెలుసు. కాని ఆత్మకథనాత్మకంగా ఉన్న ఈ పుస్తకం తొలిపుటలు తెరుస్తూనే నన్నెంతో ఆకట్టుకుంది. నాలుగు పేజీలు చదివానో లేదో ఒక మిత్రురాలు ఆ పుస్తకం మీద మనసుపడటంతో ఇచ్చేసాను. మళ్ళా ప్రపంచమంతా శోధిస్తేగాని దొరకలేదు. గతవారమంతా ఆ పుస్తకం నన్ను వెలిగిస్తూనే ఉంది.

ఆత్మగౌరవంతో బతకడమెట్లానో, ఇతరుల అస్తిత్వాన్ని గౌరవిస్తూనే తన అస్తిత్వాన్ని కాపాడుకోవడమెట్లానో ఆ పుస్తకంలో ప్రతి ఒక్క పంక్తి వివరిస్తుంది. అందులోంచి ఒక భాగం అనువాదం మీకోసం :

నేనెంతో అదృష్టవంతురాల్ని

జార్జి, ఇరా గెర్ష్విన్ వారి ఒపెరా ‘పొర్గీ అండ్ బెస్’ యూరొప్ అంతా పర్యటిస్తూ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది. అందులో పాల్గొంటున్న తారాగణమంతా నన్ను కూడా సమ్మోహపరుస్తున్నారుగానీ, నేనా టూర్లో చేరకుండా, కాలిఫోర్నియాకి, శాన్ ఫ్రాన్సిస్కోకి ఎంతతొందరగా వెళ్ళిపోదామా అన్నంత ఆతృతగా ఉన్నాను. నేనా సంగీత బృందంలో చేరినప్పుడు నా ఎనిమిదేళ్ళ కొడుకుని మా అమ్మదగ్గర, అత్తదగ్గరా ఒదిలిపెట్టేసివచ్చేసానన్న అపరాధభావం నన్ను పీడిస్తూనే ఉంది.

నేను నా పిల్లవాణ్ణి నా దగ్గరకు తెచ్చేసుకుంటే కంపెనీ నా జీతం పెంచడానికి కూడా సిద్ధపడింది. కాని అప్పటికే నాట్యబృందంలో ఇద్దరు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ప్రయాణిస్తూనేవున్నారు. వాళ్ళ ప్రవర్తన నాకెంత నచ్చలేదు. నా పిల్లవాడు ఆ ప్రవర్తనని చూడటంగాని, అనుకరించడం కాని నాకు ఇష్టం లేదు. నేనా సంగీత రూపకంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాను. ఆ పాత్ర పేరు ‘రూబీ.’ నాకు చక్కటి జీతమే ముడుతుండేది. నేనా మొత్తం ఇంటికి పంపుతున్నప్పటికీ, ఆ సొమ్ము సరిపోదనే అపరాధభావం నా మనసుని తొలుస్తూనే ఉండేది. అందుకని నేను వృద్ధాశ్రమాల్లోనో, హాష్టళ్ళలోనో లేదా పేయింగ్ గెస్ట్ గానో గడుపుతూ డబ్బు ఆదాచేస్తూండేదాన్ని. థియేటర్ లో సంగీతరూపకప్రదర్శన ముగిసిపోగానే రాత్రిక్లబ్బులో పాటలు పాడేదాన్ని, పగటిపూట సంగీతపాఠాలు చెప్పేదాన్ని. అలా వచ్చిన డబ్బుకూడా మా అమ్మకు పంపించేదాన్ని.

అయినా కూడా నాకు నిద్రపట్టేదికాదు. అన్నం సయించేది కాదు. నేను చిక్కిపోవడం మొదలుపెట్టాను.నాకు నా పిల్లవాడిదగ్గరకు పోవాలనిపించేది.కాని నేను కంపెనీ మధ్యలో వదిలిపెట్టాలంటే నా బదులు ఆ పాత్ర పోషించే నటికి యూరోప్ పర్యటనకయ్యే ఖర్చుతో పాటు నా అమెరికా ప్రయాణం ఖర్చుకూడా నేనే భరించవలసిఉంటుంది. ఆ ఖర్చుకోసం నేను మరో రెండు నైట్లు క్లబ్బుల్లో కూడా పాటలు పాడాను. నాట్యం నేర్చుకునేవాళ్ళతొ పాటు నడకసరిగ్గా రాని పిల్లలకి కూడా నాట్యం నేర్పాను.

చివరికెట్లాగైతేనేం కావలసిన డబ్బు సమకూర్చుకుని న్యూయార్క్ వెళ్ళడానికి ఇటలీలో నేపుల్స్ లో ఓడ ఎక్కాను. నేను విమానంలో వెళ్ళకపోవడానికి కూడా కారణముంది. ఒకవేళ విమానం ఎక్కివుంటే,మార్గమధ్యంలో విమానం కూలిపోయి నేను మరణిస్తే నా పిల్లవాడు ‘నా ఎనిమిదేళ్ళప్పుడు మా అమ్మ విమానప్రమాదంలో మరణించింది. ఆమె నాటకాల్లో వేషాలేస్తూ గడిపేది’ అని మాత్రమే తలుచుకుంటాడు. నేను క్లబ్బుల్లో పాటలు పాడి పొట్టపోసుకునేది నిజమే అయినప్పటికీ, నేను అంతమాత్రమేకాదనీ, అంతకన్నా కూడా చాలా ఎక్కువనీ నా పిల్లవాడికి తెలియాలనే నేను శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళిపోవాలనుకున్నాను.

తొమ్మిదిరోజుల ప్రయాణం తరువాత న్యూయార్క్ లో దిగాను. అక్కణ్ణుంచి మూడు రాత్రులూ, పగళ్ళూ ప్రయాణించి శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్నాను. తల్లీబిడ్డలు తిరిగికలుసుకోవడం తీవ్రభావోద్వేగపూరితంగా ఉండింది. నాకది తట్టుకోవడం చాలా కష్టమనిపించింది. నా పిల్లవాణ్ణి నేను ప్రేమిస్తున్నానని నాకు అర్థమయ్యింది. నేనా పిల్లవాడిమీద మరీ మమకారం పెంచుకోకపోయినందుకూ, వాణ్ణి మరీ చేరువగా లాక్కుని ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరాడకుండాచెయ్యనందుకూ నేనెంతో అదృష్టవంతురాలననిపించింది. అదేసమయంలో నేను నా పిల్లవాణ్ణి ప్రేమించాలనీ, పెంచిపెద్దచెయ్యాలనీ, వాడికొక సంతోషభరితమైన, ప్రయోజనంవంతమైన జీవితాన్నందివ్వాలనీ కూడా అనిపించింది.

అక్కడ కొండమీద మా అమ్మ ఇంట్లో ఆ విశాలమైన మేడమీద వారం రోజులు గడిపాక నాలో మళ్ళా ఆతృత మొదలయ్యింది. జాత్యహంకారపూరితమైన ఈ సమాజంలో ఒక నల్లజాతిబాలుణ్ణి పెంచడం అనుకున్నంత సులువుకాదని తెలిసొచ్చింది.వాణ్ణి స్వతంత్రుడిగా, సంతోషభరితుడిగా, బాధ్యతాయుతమైన పౌరుడిగా పెంచలేనననిపించింది. మేడమీద గదిలో సోఫాలో పడుకుని ఆలోచిస్తూ ఉండగా గై ‘అమ్మా’ అంటూ పిలుస్తు       ఆ గదిలో అడుగుపెట్టాడు. నాకు వాణ్ణి చూస్తూనే వాణ్ణట్లా అమాంతం ఎత్తిపట్టుకుని ఆ గది కిటికీ తెరిచి కిందకు దూకేద్దామనిపించింది. నేను కష్టమ్మీద గొంతు పెగుల్చుకుని ‘పో, బయటికి పో, లోపలకి రాకు. తక్షణమే ఈ గదిలోంచి బయటకు పో. బయట వరండాలో నిలబడు, లోపలకి రాకు, నేను పిలిచినా సరే, లోపలకి రాకు’ అని అరిచాను.

వెంటనే టాక్స్సికి ఫోన్ చేసాను. గబగబా మెట్లు దిగుతూ గై కేసి చూసి ‘ఇప్పుడు లోపలకి వెళ్ళు, నేను తిరిగివచ్చేదాకా బయటకి రాకు’ అన్నాను. నన్ను లాంగ్లీ పోర్టర్ సైకియాట్రీ క్లినిక్ కి తీసుకువెళ్ళమని కాబ్ డ్రైవర్ కి చెప్పాను. లోపల అడుగుపెట్టగానే రిసెప్షనిస్టు నేను ముందే అపాయింట్ మెంట్ తీసుకున్నానా అని అడిగింది. లేదన్నాను. ఆమె విచారంగా ముఖం పెట్టి ‘మీరు ముందే అపాయింట్ మెంట్ తీసుకోకపోతే మేమేమి చెయ్యలేం’ అంది. ‘లేదు, నేను తక్షణమే ఎవరో ఒక డాక్టర్ని చూడాలి. లేకపోతే నేను నన్నో, ఎదటివాళ్ళనో హింసించి గాయపరుస్తానేమోనని భయంగా ఉంది’ అన్నాను.

రిసెప్షనిస్టు వెంటనే కంగారుగా ఎవరికో ఫోన్ చేసింది. ‘వెంటనే మీరు డా. సల్సే ని వెళ్ళి కలవండి. మీరు కిందకు దిగగానే కుడివైపు హాల్లో రూం- సి లో ఉంటారు’ అంది. నేను రూం- సి తలుపు తెరవగానే నా ఆశలు నీరుగారిపోయాయి. అక్కడ బల్ల వెనక ఒక తెల్లజాతి యువకుడు కూర్చుని ఉన్నాడు. బ్రూక్స్ బ్రదర్స్ సూట్ లో ఉన్నాడు. అతడి వదనం ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసభరితంగా ఉంది. అతడు నన్ను సాదరంగా ఆహ్వానించి ఎదురుగా ఉన్న కుర్చీలో కూచోమన్నాడు. నేనా కుర్చీలో కూచుని అతణ్ణి చూసి వెంటనే రోదించడం మొదలుపెట్టాను.

పుట్టినప్పణ్ణుంచీ ఎంతో సౌకర్యవంతంగా పెరిగిన ఈ శ్వేతజాతియువకుడికి ఒక నల్లజాతి స్త్రీ దు:ఖమెలా అర్థమవుతుంది? తన చిన్నారి బాలుణ్ణి పెంపకానికి మరెవరిచేతుల్లోనో వదిలిపెట్టివెళ్ళిపోయిన ఒక స్త్రీ హృదయంలోని వేదన, అపరాధ భావనలు ఇతడికెట్లా బోధపడతాయి? నేను కళ్ళెత్తి అతణ్ణి చూసిన ప్రతిసారీ నా నేత్రాల్లోంచి అశ్రువులు పొంగిపొర్లుతూనే ఉన్నాయి. ప్రతి సారి అతడు ‘ఏమిటి విషయం? నేనేమైనా మీకు సాయం చెయ్యగలనా?’ అని అడుగుతూనే ఉన్నాడు. నా నిస్సహాయ పరిస్థితి నన్ను పిచ్చిదాన్ని చేసింది. చివరికి నన్నునేనెట్లానో కూడదీసుకుని లేచినిలబడి అతడికి థాంక్స్ చెప్పి బయటకు నడిచాను. రిసెప్షనిస్టుకి కూడా థాంక్స్ చెప్పి లక్సర్ కాబ్ కోసం ఫోన్ చెయ్యమన్నాను.

నేనక్కణ్ణుంచి సరాసరి నాకు స్వరశిక్షణనిచ్చిన ఉపాధ్యాయుడి దగ్గరకు వెళ్ళాను, ఆయన నా గురువు. నేనేదైనా ఆయనతో మాత్రమే స్వేచ్ఛగా చెప్పుకోగలను. ఫ్రెడెరిక్ విల్కర్సన్ స్టూడియో మెట్లు ఎక్కుతూండగా లోపల స్వరశిక్షణ పాఠాలు వినిపిస్తున్నాయి. విల్కి, ఆయన్నందరూ అలానే పిలుస్తారు, నన్ను బెడ్ రూం లోకి వెళ్ళమన్నాడు. కొద్దిసేపట్లో వస్తాను, కొద్దిగా మద్యం సేవిద్దామన్నాడు. తన విద్యార్థిని పంపించేసాక, అతడు ఒక గ్లాసు స్కాచ్ తీసుకొచ్చాడు. నేనప్పటికే మద్యం మానేసి చాలాకాలమే అయినప్పటికీ, అతడు తెచ్చిన మద్యం సేవించకుండా ఉండలేకపోయాను. ఆ మత్తులో నాకు తెలియకుండానే నిద్రపట్టేసింది. నాకు మెలకువ వచ్చేటప్పటికి స్టూడియో నిశ్శబ్దంగా ఉంది. నేను లోపలకి అడుగుపెట్టాను.

‘ఏమయింది నీకు’ అనడిగాడు విల్కి. నాకు పిచ్చిపట్టబోతోందని చెప్పానతడితో. అదేమీ కాదంటూ ‘ఏం జరిగింది చెప్పు?’ అనడిగాడు. నేను చెప్తున్న మాటలు అతడు వినిపించుకోవడం లేదనిపించి ‘నాకీ రోజు నన్నూ, నా పిల్లవాణ్ణీ కూడా చంపేసుకోవాలనిపించింది. నాకు పిచ్చెక్కుతోందని చెప్పాను,మీరు వినట్లేదు’ అన్నాను.
‘ముందు నువ్విక్కడ ఈ బల్లదగ్గర కూచో, ఇదుగో ఈ పసుపుపచ్చ కాగితాల పుస్తకం, ఈ బాల్ పాయింట్ పెన్ తీసుకో. నువ్విప్పుడందరికీ ధన్యవాదాలు చెప్పాలి. రాయడం మొదలుపెట్టు’ అన్నాడు విల్కి.

‘విల్కి, నాకిప్పుడు ఆ మాటలేవీ మాట్లాడాలని లేదు. నాకు పిచ్చెక్కుతోందని చెప్తున్నాను, వింటున్నారా?’ అన్నాను మళ్ళా.

కాని విల్కి స్థిరంగా చెప్పడం మొదలుపెట్టాడు: ‘ముందు నేను చెప్పింది రాయి. తమ జీవితకాలంలో ఒక సంగీత కచేరీ, ఒక గానం వినలేకపోయినవాళ్ళెందరో లక్షలాదిమంది ఈ ప్రపంచంలో ఉన్నారు. కనీసం తమ సొంత బిడ్డల ఏడుపు కూడా వినలేకపోయినవాళ్ళున్నారు. కాని రాయి-భగవంతుడా, నేను వినగలుగుతున్నాను, నీకు నా స్తోత్రం, నా నమస్సుమాంజలి. నువ్వీ పచ్చకాగితాల పుస్తకాన్ని చూడగలుగుతున్నందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పు. ఈ ప్రపంచంలో ఒక జలపాతాన్ని గాని, పూలు వికసించే దృశ్యంగాని, లేదా తమ ఆత్మీయుల వదనాన్నిగాని చూడటానికి నోచుకోలేకపోయినవాళ్ళెందరో, కాని భగవంతుడా, నేను చూడగలుగుతున్నాను, అందుకు నీకు నా ధన్యవాదాలు అని రాయి. ఇంకా రాయి- నువ్వు చదవగలుగుతున్నావు, కాని ఈ ప్రపంచంలో ఒక వార్తాపత్రిక చదవలేనివాళ్ళు, ఇంటినుంచి వచ్చే ఉత్తరం చదువుకోలేనివాళ్ళు, రోడ్డుమీద ట్రాఫిక్ గుర్తులు పోల్చుకోలేనివాళ్ళు ఎందరో …’

విల్కి చెప్పింది చెప్పినట్టు రాస్తూపోయాను. ఆ పసుపుపచ్చనికాగితం మొదటిపేజీమీద చివరి పంక్తికి చేరుకునేటప్పటికి నా పిచ్చి పూర్తిగా దిగిపోయింది. ఆ సంఘటన జరిగి యాభయ్యేళ్ళు కావొస్తోంది. నేనిప్పటిదాకా సుమారు పాతిక పుస్తకాలు రాసాను. బహుశా యాభై వ్యాసాలు, కవితలు, నాటకాలు, ప్రసంగాలు, అన్నీ పసుపుపచ్చనికాగితాల పుస్తకాలమీద బాల్ పాయింట్ పెన్నులతోనే రాసాను.

నేనేదైనా రాద్దామని కూచున్నపుడల్లా నన్నో అభద్రత ఆవహిస్తుంది. నాకు గతంలో ప్రశంసలు లభించినా కూడా నాకు ధైర్యం సరిపోదు. ఉహు, ఉహు, ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది, నేనేమంత గొప్ప రచయితని కాననీ, మొదట్లో రాసినంత బాగా రాయడం లేదనీ వాళ్ళకి తెలిసిపోతుందని భయమేస్తుంది. ఇక నా పనైపోయిందనుకుంటానా, అప్పుడొక పచ్చకాగితాల పుస్తకం తీసి మొదటి పేజీ, పూర్తి ఖాళీ పేజి తెరవగానే, నా మనసంతా గొప్ప కృతజ్ఞతాభావనతో నిండిపోతుంది.

నా జీవితనౌక ఎల్లప్పుడూ ప్రశాంత, సంతోషసాగరాలమీదనే పయనించి ఉండకపోవచ్చు. నేను గడిపిన రోజులన్నీ ప్రకాశమానంగానూ, ప్రయోజనకరంగానూ ఉండిఉండకపోవచ్చు. నా రోజులు సూర్యకాంతివంతాలు కానీ, మబ్బుపట్టిఉండనీ, వైభవోపేతాలుగానీ, ఒంటరిరాత్రులుగానీ, సదా నేనొక కృతజ్ఞతాభావాన్ని నిలుపుకుంటూనే వస్తున్నాను. కాదు, కూడదు, ప్రపంచంలో కొంత నిరాశకూడా తప్పనిసరి అని ఎవరన్నా అంటే, నా నిరాశని రేపటికి వాయిదా వేస్తాను.

నేటికి మాత్రం నేనెంతో అదృష్టవంతురాల్ని.

1-1-2014

Leave a Reply

%d bloggers like this: