నా ప్రభువుని సిలువవేసినప్పుడు

Reading Time: 3 minutes

d1

మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ 1959 లో భారతదేశంలో పర్యటించినప్పుడు వినోబా భావేని కూడా కలుసుకున్నప్పటి ఒక అపురూపమైన సంఘటనని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ రాసిపెట్టుకున్నారు.

డా.కింగ్ తన సతీమణితో వినోబాని చూడటానికి వెళ్ళినప్పుడు కొంతసేపు సంభాషణ సాగాక వారితో పాటు ఉన్న ఒక మతాచార్యుడు కొన్ని ఆఫ్రికన్ అమెరికన్ ఆధ్యాత్మికగీతాలు ఆలపించవలసిందిగా డా.కింగ్ సతీమణిని కోరాడు. ‘వాటిని నీగ్రో స్పిరిట్యువల్స్ అంటారు’ అన్నాడు జయప్రకాశ్. వినోబా వాటిగురించి వినకపోయి ఉండవచ్చునని. కాని, అంతదాకా నేలచూపులు చూస్తున్న వినోబా నెమ్మదిగా కళ్ళెత్తి, మృదు దృక్కులతో డా.కింగ్ సతీమణిని చూస్తూ, Were you there, were you there, when they crucified my Lord అనే గీతాన్ని ఎత్తుకుంటూ తమని ఆశ్చర్యంలో ముంచెత్తాడని జయప్రకాశ్ రాసుకున్నాడు.

ఆ అపురూపమైన గీతాన్ని వినోబా మహాత్మాగాంధీ దగ్గర విన్నాడు. గాంధీజీ తన ఆశ్రమభజనావళిలో భారతీయ భక్తికవుల గీతాలతో పాటు వినడానికి ఇష్టపడే కొన్ని క్రైస్తవ ఆధ్యాత్మిక గీతాల్లో ఆ గీతం కూడా ఉంది. ఆయన దాన్ని బహుశా దక్షిణాఫ్రికానుంచి భారతదేశానికి తెచ్చుకుని ఉండవచ్చు.

ఇరవయ్యవ శతాబ్ది ఆఫ్రికన్-అమెరికన్ కవిత్వంలో అసమ్మతి, ఆగ్రహం, ధిక్కారాలతో పాటు, సారళ్యం, స్పష్టత, సూటిదనాలు కూడా కనిపిస్తాయి. ముఖ్యం, ఇరవయ్యవశతాబ్ది ఆఫ్రికన్-అమెరికన్ యుగకవి అని చెప్పదగ్గ లాంగ్ స్టన్ హ్యూస్ కావ్యశిల్పంలోని సౌందర్యం అధికభాగం ఆ సరళసుందరతమీదనే ఆధారపడి ఉంది. ఆ సారళ్యం,ఆ తేటదనం ఆ కవులు తమ పూర్వీకుల పాటలనుంచి తెచ్చుకున్నారు. డన్ బార్ మొదటిసారిగా తమ పూర్వీకుల బానిసగీతాల్ని ఆధునిక కవిత్వంగా మార్చవచ్చునని తన సమాజానికి చూపించాక హార్లెం రినైజాన్సు కాలంలో అదొక కొత్త కవిత్వానికి తలుపులు తెరిచింది.

కాని, ఆశ్చర్యంగా, ఆఫ్రికన్-అమెరికన్ కవులు 19 వ శతాబ్ది చివరలోనూ, 20 వ శతాబ్ది ప్రారంభంలోనూ బ్రిటిష్ కవుల్ని నమూనాగా పెట్టుకుని కవిత్వం చెప్పడం మొదలుపెట్టినప్పుడే, మరొకవైపు వారి పూర్వీకుల బానిసగీతాలు కూడా ఒక సమాంతర ప్రయాణం మొదలుపెట్టాయి. అవి ఒక వైపు ఆధునిక కవిత్వాన్ని ప్రభావితం చేస్తూ వచ్చినా, అంతకన్నా కూడా ముఖ్యంగా ఆఫ్రికన్-అమెరికన్ సంగీతాన్నీ, తద్వారా అమెరికన్ సంగితాన్నీ, యావత్ప్రపంచ సంగీతాన్నీ గాఢాతిగాఢంగా ప్రభావితం చేస్తూ వచ్చాయి.

ఆఫ్రికన్-అమెరికన్ బానిస గీతాల సేకరణ అంతర్యుద్ధకాలంలోనే (1861-65)మొదలయ్యింది. బానిసత్వం నుంచి విడుదలైన నీగ్రోలకోసం 1866 లో ఏర్పాటు చేసిన ఫిస్క్ యూనివెర్సిటీకి చెందిన కోశాధికారి జార్జి ఎల్. వైట్ అనే అతడు నీగ్రో గీతాల్ని సేకరించి వాటిల్లోంచి పన్నెండు గీతాలతో 1871 లో మొదటిసారిగా అమెరికాలో ఒక ప్రదర్శన ఇప్పించాడు. ఆ తర్వాత 1878 దాకా జూబిలీ సింగర్స్ గా ప్రసిద్ధి చెందిన ఆ బృందం అమెరికా, యూరోపుల్లో పర్యటించి ప్రదర్శనలు ఇచ్చింది. ప్రపంచ సంగీత చరిత్రలో కొత్త అధ్యాయం మొదలయ్యింది.

మరొకవైపు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన విలియం ప్రాన్సిస్ అలెన్ అనే ఒక అబాలిషనిస్టుమరొక ఇద్దరు మిత్రులతో కలిసి దక్షిణాది రాష్ట్రాల తోటల్లోనూ, నదీతీరాల్లోనూ, సముద్రద్వీపాల్లోనూ పాడుకుంటున్న పాటలు 136 దాకా సేకరించి Slave Songs of the United States (1867) పేరిట వెలువరించాడు. ఆ పుస్తకానికి అతడు రాసిన ఉపోద్ఘాతం వల్లా, అందులో ప్రతి ఒక్క గీతానికీ ఇచ్చిన నొటేషన్ వల్లా, అది అపురూపమైన జాతిసంపదగా మారిపోయింది.

ఆ తర్వాత నీగ్రో గీతాల, బానిసగీతాల సంకలనాలు ఒక వెల్లువలాగా వచ్చిపడ్డాయి. వాటిలో చెప్పుకోదగ్గవి ప్రసిద్ధ ఆఫ్రికన్-అమెరికన్ కవి జేమ్స్ వెల్డన్ జాన్సన్ సంకలనం చేసిన The Book of American Negro Spirituals(1927), జాన్ డబ్ల్యు. వర్క్ సంకలనం చేసిన American Negro Songs (1940). ఈ రెండు సంకలనాల్లోనూ కూడా ప్రశస్తమైన ఉపోద్ఘాతాలున్నాయి. ఇద్దరూ కూడా ఈ గీతాల్ని సాహిత్యపరంగా కన్నా కూడా సంగీతపరంగా మరింత విశేషమైనవిగా ప్రస్తుతించారు. జాన్సన్ అయితే వీటిలో సంగీతాన్ని noble music అన్నాడు.

నీగ్రో గీతాల్ని ప్రధానంగా నాలుగు రకాలుగా వర్గీకరిస్తున్నారు.

మొదటివి, ఆధ్యాత్మిక గీతాలు. వీటిలో మళ్ళా మూడు రకాలున్నాయి. మొదటి తరహా గీతాలు ‘పిలుపు-జవాబు ‘ రూపంలో ఉండే సంభాషణాత్మకాలు. ద్రుతగతిలో సాగే ఈ గీతాలకన్నా భిన్నంగా రెండవ తరహా గీతాలు మంద్రగతిలో సాగుతాయి, వాక్యాలు పూర్తిగా, దీర్ఘవాక్యాలతో కూడుకుని ఉంటాయి. మూడవ తరహా గీతాల్లో పదాలు కురచగా, కొన్ని అక్షరాలు మింగేస్తూ (syncopated) వడివడిగా, ఉత్సాహంగా నడిచే గీతాలు. ఇవి బహుళ జనాదరణ పొందిన గీతాలు.

రెండవ వర్గం blues గా ప్రసిద్ధి చెందిన విషాద గీతాలు. తర్వాత తర్వాత అమెరికానీ, ప్రపంచాన్నీ కూడా కారుమబ్బుల్లాగా కమ్ముకున్న బ్లూస్ సంగీతానికి మూలం ఈ గీతాలే. ఆధ్యాత్మికాలు బృందగానాలూ, సామూహికాలూ కాగా బ్లూస్ వ్యక్తి ప్రధానాలు, ఏకాంతగీతాలు. ఆధ్యాత్మికాలకి ఒక స్వర్గం పట్లా, విముక్తి పట్లా నమ్మకం ఉంది, బ్లూస్ కి అటువంటి స్వర్గం పట్లా నమ్మకం లేదు, ఈ భూమ్మీది జీవితం పట్లా ఆశ లేదు. ఒక విమర్శకుడు రాసినట్టుగా, ఆధ్యాత్మిక గీతకర్త మిసిసిపి వరదలో కూడా దైవసంకల్పాన్ని చూడగలడు. కాని బ్లూస్ గీతకారుడు ‘ఈ బీదపిల్ల ఎక్కడకు పోగలదు?’ అని చింతాక్రాంతుడవుతాడు.

బ్లూస్ ప్రధానంగా కోమల గాంధారం మీదా, కోమల నిషాదం మీదా ఆధారపడ్డ గీతాలు. కోమలగాంధారాన్ని blue note అని కూడా అంటారు. దైనందిన జీవితాన్నీ, అన్నిరకాలుగానూ ప్రపంచం పట్ల నమ్మకంకోల్పోయిన హృదయారాటాన్నీ వినిపించే ఏకైక స్వరమది.

మూడవ వర్గం గీతాలు పనిపాటలు. పనిలో అలసటని మర్చిపోడానికి నీగ్రో పాడుకునే పాటల్లో అత్యంత బలశాలురైన నీగ్రో వీరుల గురించిన కల్పనలూ, అతిశయోక్తులూ కొల్లలు. ముఖ్యంగా స్టీం డ్రిల్లరుతో పోటీ పడి గెలిచి, ఆ పోటీలో అసువులు బాసిన జాన్ స్మిత్ అనే ఒక కాల్పనికవీరుడు ఆ గీతాలకి ప్రధాన నాయకుడు.

నాల్గవ తరహా గీతాలు సామాజిక గీతాలు. నాట్యం కోసం ఉద్దేశించబడ్డ గీతాలు. మన గిరిజన జానపదగీతాల్లాంటివి. ఆఫ్రికాలోనూ, ఇక్కడా సంభవించినట్టే, గ్రామఫోనూ, రేడియో, సినిమా ఆ గీతాల్ని మింగేసాయి.

తక్కిన ఆఫ్రికన్ అమెరికన్ సాహిత్యమేమీ వికసించకపోయినా, ఈ గీతాలొక్కటే లభ్యమవుతున్నా కూడా, వీటిని కట్టుకుని పాటలు పాడుకున్న ఆ మానవసమూహం, మానవకోటిలో ఎంతో విలువైన భావోద్వేగసంపదను మూటకట్టుకున్న జాతి అని చెప్పుకోవచ్చు.

నువ్వక్కడున్నావా వాళ్ళు నా ప్రభువుని సిలువ వేసినప్పుడు

నువ్వక్కడున్నావా వాళ్ళు నా ప్రభువుని సిలువవేసినప్పుడు,
నువ్వక్కడున్నావా వాళ్ళు నా ప్రభువుని సిలువవేసినప్పుడు,
ఓహో! అది నన్నొక్కొక్కప్పుడు వణికిస్తున్నది, వణికిస్తున్నది, వణికిస్తున్నది,
నువ్వక్కడున్నావా వాళ్ళు నా ప్రభువుని సిలువవేసినప్పుడు.

నువ్వక్కడున్నావా నా ప్రభువుని సిలువకు మేకులు దిగ్గొట్టినప్పుడు,
నువ్వక్కడున్నావా నా ప్రభువుని సిలువకు మేకులు దిగ్గొట్టినప్పుడు,
ఓహో! అది నన్నొక్కొక్కప్పుడు వణికిస్తున్నది, వణికిస్తున్నది, వణికిస్తున్నది,
నువ్వక్కడున్నావా నా ప్రభువుని సిలువకు మేకులు దిగ్గొట్టినప్పుడు.

నువ్వక్కడున్నావా వాళ్ళు నా ప్రభువుని పక్కన పొడిచినప్పుడు,
నువ్వక్కడున్నావా వాళ్ళు నా ప్రభువుని పక్కన పొడిచినప్పుడు,
ఓహో! అది నన్నొక్కొక్కప్పుడు వణికిస్తున్నది, వణికిస్తున్నది, వణికిస్తున్నది,
నువ్వక్కడున్నావా వాళ్ళు నా ప్రభువుని పక్కన పొడిచినప్పుడు.

నువ్వక్కడున్నావా సూర్యుడు ప్రకాశించడానికి సిగ్గుపడ్డప్పుడు,
నువ్వక్కడున్నావా సూర్యుడు ప్రకాశించడానికి సిగ్గుపడ్డప్పుడు,
ఓహో! అది నన్నొక్కొక్కప్పుడు వణికిస్తున్నది, వణికిస్తున్నది, వణికిస్తున్నది,
నువ్వక్కడున్నావా, సూర్యుడు ప్రకాశించడానికి సిగ్గుపడ్డప్పుడు.

నువ్వక్కడున్నావా వాళ్ళాయన్ని సమాధిలో చేర్చినప్పుడు,
నువ్వక్కడున్నావా వాళ్ళాయన్ని సమాధిలో చేర్చినప్పుడు,
ఓహో! అది నన్నొక్కొక్కప్పుడు వణికిస్తున్నది, వణికిస్తున్నది, వణికిస్తున్నది,
నువ్వక్కడున్నావా, వాళ్ళాయన్ని సమాధిలో చేర్చినప్పుడు.

నువ్వక్కడున్నావా ఆయన మృతులమధ్య పైకి లేచినప్పుడు,
నువ్వక్కడున్నావా ఆయన మృతులమధ్య పైకి లేచినప్పుడు,
ఓహో! నాకొక్కొక్కసారి జయం జయం జయం అని అరవాలనిపిస్తున్నది,
నువ్వక్కడున్నావా ఆయన మృతులమధ్య పైకి లేచినప్పుడు.

12-2-2018

Leave a Reply

%d bloggers like this: