నీగ్రో అమెరికా మెటఫర్

v1

ఫిబ్రవరి. ఈ నెలంతా అమెరికాలో, కెనడాలో ‘నల్లజాతి చరిత్ర మాసోత్సవం’ జరుపుతారు. ఫిబ్రవరి 12 న అబ్రహాం లింకన్ జయంతిని, 14 న నల్లజాతి స్వాతంత్ర్యనేత ఫ్రెడరిక్ డగ్లస్ జయంతిని, పురస్కరించుకుని 1926 లో నీగ్రో చరిత్ర వారోత్సవంగా మొదలైన ఈ వేడుక 1976 నుంచీ Black History Month గా జరుపుతున్నారు. ఈ నెల పొడుగునా సాహిత్యంలో, కళల్లో, విజ్ఞానశాస్త్రాల్లో, క్రీడల్లో, వినోదంలో నల్లజాతి వారి విజయాల్ని వేడుకజరుపుకుంటారు. అదంతా ఒక ఆత్మగౌరవ ప్రక్రియ, ఒక ఆచరణ, ఒక అధ్యయనం.

ఎక్కడో ప్రాచీన చీనా కవులమధ్యా, చిత్రకారులమధ్యా తిరుగాడుతున్న నన్ను ఆ మధ్య కన్నెగంటి రామారావు అడిగాడు. లాంగ్ స్టన్ హ్యూస్ కవిత I, too, Sing America ని అనువదించగలవా? అని. వెదురుపొదలమధ్యా, చెర్రీపూల మధ్యా, నెలవంకనీడనా, మైమరిచిన నన్ను మళ్ళీ ఆఫ్రికన్ అమెరికన్ వేదనామయ ప్రపంచంలోకి, ధిక్కారపూరిత వాజ్మయంలోకి మళ్ళించినందుకు రామారావుకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. అలాగని, అఫ్రికన్-అమెరికన్ కవుల గురించి నేను గతంలో రాయలేదని కాదు. మాయా ఏంజెలౌ, డెరెక్ వాల్కాట్ వంటివారి గురించి రాయకపోలేదు. కాని రాయవలసినంతగా రాయలేదని అర్థమయింది.

అందుకని, ఈ నెలంతా ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యానికి, ఆఫ్రికన్ డయాస్ఫోరాకి కేటాయించాలనుకుంటున్నాను. చదవడానికీ, వినడానికీ, రాయడానికీ.

రెండువందలేళ్ళకిందట అమెరికాలో బానిసలుగా అమ్ముడుపోయిన తొలితరం ఆఫ్రికన్ రచయితల స్వానుభవాలు, ఆధ్యాత్మిక నివేదనాలతో మొదలైన ఆఫ్రికన్ అమెరికన్ సాహిత్యం పందొమ్మిదో శతాబ్దిలో బానిసత్వ నిర్మూలనోద్యమం గానూ, 1920-30ల్లో హార్లెం పునరుజ్జీవనంగానూ, వర్ణవివక్ష ప్రతిఘటన వాజ్మయంగానూ వికసిస్తూనే వచ్చింది. మరీ ముఖ్యంగా గత ముప్పై ఏళ్ళుగా మూడు నోబెల్ పురస్కారాలు కూడా పొందగలిగే స్థాయికి చేరింది. కాని, ఇంకా ప్రధానస్రవంతి అమెరికన్ సాహిత్యానికీ, ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యానికీ మధ్య కనబడని సరిహద్దు ఒకటి గోడలాగా నిలబడి ఉన్నదనే ఇంతదూరంనుంచి మనకి కనిపిస్తున్నమాట మర్చిపోలేం.

చిన్నప్పుడు హైస్కూల్లో అమెరికన్ విప్లవం గురించి బోధించిన మా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ‘అమెరికా స్వాతంత్ర్య ప్రకటన’ గురించి ఎంతో ఉత్తేజపూరితంగా పాఠం చెప్పాడు. We hold these truths to be self-evident, that all men are created equal.. అనే మొదటి వాక్యం మాతో ఎన్నోసార్లు వల్లెవేయించాడు. కాని ఆ ప్రకటనరచయిత థామస్ జెఫర్సన్ తో సహా ఆ స్వాతంత్ర్య యోధుల ఇళ్ళల్లో బానిసలు పనిచేస్తూండేవారని మొదటిసారి తెలిసినప్పుడు నేను పొందిన ఆశాభంగం అంతా ఇంతా కాదు.

ఆ స్వాతంత్ర్య ప్రకటన మొదటివాక్యం We hold these truths to be self-evident, that all men are created equal, that they are endowed by their Creator with certain unalienable Rights, that among these are Life, Liberty and the pursuit of Happiness చదివినప్పుడల్లా, మాటలకీ, చేతలకీ, ఆదర్శానికీ, ఆచరణకీ మధ్య ఎంత అగాధం అనిపిస్తుంది.

అమెరికా తాను ప్రకటించుకున్న ఈ ఆదర్శానికి నిలబడమనే అమెరికాని గత రెండువందలేళ్ళుగా ఆఫ్రికన్-అమెరికన్ కవులూ, రచయితలూ నిలదీస్తున్నారు.

The Vintage Book of African American Poetry (2000) సంకలనకర్తలు, స్వయంగా కవులు, మైఖెల్ ఎస్.హార్పర్, అంథొని వాల్టన్ తమ సంకలనానికి రాసుకున్న ముందుమాటలో ఈ మాటే చెప్తున్నారు. వాళ్ళిట్లా రాస్తున్నారు:

‘మానవచరిత్రలోనే ప్రజాస్వామ్యాన్ని అనుసరించడంలో అమెరికాదే చెప్పుకోదగ్గ మొదటి ప్రయోగం. అమెరికా తన ఆఫ్రికన్ అమెరికన్ ప్రజలతో నడుచుకున్న తీరు అమెరికా తాలూకు అత్యంత ఘనవిజయం, ఘనవైఫల్యం కూడా. రిచర్డ్ రైట్ రాసాడు: నీగ్రో అమెరికా మెటఫర్ అని. తమ స్వదేశం నుంచి పెళ్ళగించబడి మరొక విదేశంలో, అపరిచిత, ప్రతికూల వాతావరణంలో బతకవలసి వచ్చిన జాతికి వాళ్ళొక రూపకాలంకారం. ఒక పరాయిప్రాంతంలొ తమ ఆత్మనీ, తమ స్వీయచైతన్యాన్నీ అన్వేషించుకోవలసి వచ్చిన మానవసమూహానికి వాళ్ళు ప్రతీక. అమెరికాలో నల్లజాతివాళ్ళది ఉపాంతానుభవం కాదు, అమెరికన్ జీవితపు సారాంశానుభవమే. దానిలోని అత్యంత ప్రకాశవంతమైన, అంధకారబంధురమైన పార్శ్వాలకీ, వాగ్దత్త సమానత్వానికీ, వాస్తవజీవితంలోని అణచివేతకీ, ఏ హింసమీద అమెరికా ప్రతిష్టించబడిందోదానికీ, అది ఏ ఆశావహగమ్యం వైపు సాగాలనుకుంటున్నదో ఆ భవిష్యత్తుకీ నల్లజాతి అనుభవం ప్రతినిధిగా నిలుస్తున్నది.’

నూతన సహస్రాబ్దం మొదలవుతున్నవేళ వెలువడిన ఆ సంకలనంలో కూడా ఆ సంకలనకర్తలింకా ఆఫ్రికన్ అమెరికన్ సాహిత్యాన్ని assert చేసుకోవలసి రావడం నాకు ఆశ్చర్యం కలిగించింది. వారింకా ఇట్లా రాస్తున్నారు:

‘తమని సర్వదా వ్యతిరేకిస్తున్న అమెరికన్ సంస్కృతి ప్రాబల్యాన్ని ఆఫ్రికన్-అమెరికన్ కళాకారులూ, కవులూ ధిక్కరిస్తూనే ఉన్నారు. మనుషులుగా ఉండటమంటే ఏమిటో, అమెరికన్లుగా ఉండటమంటే ఏమిటో, నల్లవాళ్ళుగా ఉండటమంటే ఏమిటో తరచి తరచి ప్రశ్నించడం ద్వారా వారు అమెరికన్ అస్తిత్వపు అన్వేషణనే తమ సాహిత్యకర్తవ్యంగా మార్చుకున్నారు.’

ఆఫ్రికన్ అమెరికన్ సాహిత్యం ఒక అప్రధాన శాఖ కాదనీ, వాస్తవానికీ అదే అమెరికన్ సాహిత్యమనీ, అమెరికాని అమెరికాగా మారమని నిలదియ్యగలిగే సత్తా ఉన్నదీ, అమెరికాను మానవీయ అమెరికాగా మార్చగలిగేదీ తాము మాత్రమేననీ ఆఫ్రికన్ అమెరికన్ కవులు ఎప్పటికన్నా మరింత బలంగా నేడు చాటిచెప్తున్నారని ఆ సంపాదకులు వివరిస్తున్నారు.

ఆ కవులకి ఇది కూడా తెలుసు, ముందు తాము తమ అనుభవాన్ని కవిత్వంగా మార్చకపోతే, ఆ వాక్యాలకు విలువ ఉండదని. ఆచరణలో తేలిపోయిన అమెరికా స్వాతంత్ర్య ప్రకటనలానే తమ కవిత్వం కూడా బోలుగా మారిపోయే ప్రమాదముందని. అందుకనే ఆఫ్రికన్ అమెరికన్ కవుల అన్వేషణ ముందు తమ అనుభవాన్ని అక్షరంగా రూపాంతరీకరించుకోవడం మీదనే. బహుశా, మాటల్ని కవిత్వంగా మార్చుకోడం కోసం ఆఫ్రికన్ అమెరికన్ కవులు చేపట్టిన, చేపడుతున్నన్ని ప్రయోగాలు ఇప్పటిదాకా మరేభాషలోనూ కవులెవరూ చేపట్టలేదని కూడా చెప్పవచ్చు.

మనుషులుగా బతకాలన్న ఆవేదన, తాము కూడా మనుషులమేనని చెప్పుకోవాలన్న ఆవేదన, తాము మనుషులుగా గుర్తించబడ్డప్పుడే మానవప్రపంచం నిజంగా మానవప్రపంచంగా మారుతుందన్న ఆవేదన-వీటిలోంచి వచ్చిన కవిత్వం ఎలా ఉంటుందో, ఒక ఉదాహరణ. ఫ్రెడరిక్ డగ్లస్ ని స్మరిస్తూ రాబెర్ట్ హేడేన్ (1913-80) రాసిన కవిత.

ఫ్రెడరిక్ డగ్లస్

ఈ స్వాతంత్ర్యం, ఈ స్వేచ్ఛ, ఈ భీకర సౌందర్యానుభవం, ప్రాణవాయువులాగా
మనిషికి అవసరమైనది, నేలలాగా ఉపయోగించుకోదగ్గది,
అంతిమంగా ప్రతి ఒక్కరికీ అందవలసింది,
ఇది నిజంగా ఒక సహజాతంగామారినప్పుడు, మేధగా, హృదయస్పందనంగా,
రక్తప్రసారంగా, అసంకల్పిత ప్రతీకారచర్యగా మారినప్పుడు,
చివరికి మనం నెగ్గినప్పుడు, విముక్తులమైనప్పుడు,
ఆ విముక్తి రాజకీయనాయకుల వాగాడంబరంకన్నా మించినదైనప్పుడు,
అప్పుడు, ఈ మనిషి, ఈ డగ్లస్, ఒకప్పటి బానిస,
కొరడాదెబ్బలకు వళ్ళంతా ఛిద్రమైన ఈ నీగ్రో, ఈ ప్రవాసి,
ఏ ఒక్క మనిషినీ వేటాడని, ఏ ఒక్కరూ ఒంటరిగా జీవించనక్కర్లేని,
పరాయితనానికి లోనుకాని ప్రపంచాన్ని కలగన్న ఈ మనిషి,
ప్రేమలో, తర్కంలో మహోన్నతుడు, ఈ మనిషి మన తలపుకొస్తాడు.
ఓ! అప్పుడతణ్ణి తలుచుకోవలసింది విగ్రహాల ముందు స్తోత్రాలు వల్లించినట్టు కాదు. పుక్కిటిపురాణాలతోనో, కవిత్వంతోనో, కాంస్యహారాలతోనో కానేకాదు.
మనమతణ్ణి స్మరించవలసింది
అతడి జీవితం మీంచి రూపుదిద్దుకునే అసంఖ్యాక జీవితాలతో.
అతడి స్వప్నంలోంచి రక్తమాంసాలు సంతరించుకునే జీవితాలతో.

2-2-2018

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading