జాన్ ఏష్ బెరీ

Reading Time: 3 minutes

ay1

పది రోజులకిందట జాన్ ఏష్ బెరీ (1927-2017) మరణించినప్పుడు, అమెరికాలో చిట్టచివరి ప్రభావశీలమైన కవి నిష్క్రమించాడని పత్రికలన్నీ నివాళి అర్పించాయి. తొంభై ఏళ్ళ పాటు జీవించిన ఒక కవి లోకాన్ని వదిలివెళ్ళడంలో మనం తట్టుకోలేనిదేమీ ఉండకపోయినప్పటికీ, అతణ్ణి కోల్పోవడం మనల్ని బాధించకుండా ఉండదనీ, సుదీర్ఘకాలం పాటు అతడు మన భావనాప్రపంచంలో నిజంగా తనకంటూ ఒక ఉనికి ఏర్పరచుకున్నాడనీ ఒక పత్రిక రాసింది. ‘జాన్ ఏష్ బెరీ కోసంమనమెట్లా శోకించాలి’ అని రాసిన ఆ నివాళిలోఆ పత్రిక అతడు కనిసం వందేళ్ళయినా బతుకుతాడని తానాశించినట్టు రాసింది.

ఇరవయ్యవ శతాబ్దపు మొదటి భాగంలో ఏట్సు లాగా చివరి మూడో భాగంలో ఏష్ బెరీ కవిత్వప్రపంచాన్ని ఏలతాడని హెరాల్డ్ బ్లూమ్ లాంటి వాడు ప్రస్తుతించిన ఆ కవి గురించి నేను కూడా నాలుగు వాక్యాలు రాయాలనుకున్నాను. వారంరోజులుగా అవస్థ పడుతూనే ఉన్నాను. కానీ, ఎమ్మెస్ నాయుడు కవిత్వం మీద రాయడం ఎంత కష్టమో, ఏష్ బెరీ కవిత్వం గురించి రాయడం కూడా అంతే కష్టం.

మూడు కారణాలు: ఒకటి,మనం వివిధ భాషల ఇంగ్లీషు అనువాదాల్ని అర్థం చేసుకోగలిగినంత సులభంగా బ్రిటిష్, అమెరికన్ కవుల ఇంగ్లీషుని అర్థం చేసుకోలేం. ప్రాచీన తెలుగు కవిత్వంలాగా ఆ కవిత్వం కొద్దిగా కష్టపెడుతుంది. మరీ ముఖ్యంగా, భాషని వెన్నలాగా వంచగలిగిన ఏష్ బెరీ లాంటి వాడిని అర్థం చేసుకోవడం మరీ కష్టం. రెండోది, అతడి కవిత్వం మీద ఉన్న ప్రభావాలు. అతడు కవికన్నా కూడా చిత్రకారుడు. ఒక సర్రియలిస్టులాగా, ఆబ్ స్ట్రాక్ట్ ఎక్స్ ప్రెషనిస్టులాగా భాషతో చిత్రరచన చేస్తాడు. ఇంగ్లీషులో రాసిన ఫ్రెంచి కవిత్వంలాంటి ఆ కవితల్ని చాలా శ్రద్ధగా చదవాలి. పందొమ్మిదో శతాబ్ది సింబలిస్టులాగా అతడు ఒక కవిత రాసాక, ఆ కవితను మనం అర్థం చేసుకోగల సూచనలన్నీ చెరిపేస్తాడు. మనం ఆ కవితలోకి ఎక్కివెళ్తామో,దిగి వెళ్తామో గాని, చాలా కఠోర అధ్యయనం చేయవలసి ఉంటుంది.

(పబ్లిషర్స్ వీక్లీ అనే పత్రిక ఏష్ బెరీ కవితల్లో 10 మేలిమి కవితలు ఎంపిక చేసి ఆ కవితల్ని ఎట్లా అర్థం చేసుకోవాలో వివరించింది. www.publishersweekly.com/pw/by-topic/industry-news/tip-sheet/article/73994-the-10-best-john-ashbery-poems.html ఆసక్తి ఉన్నవాళ్ళకి ఈ రోజుకి అదొక చక్కని హోం వర్క్)

ఇక మూడవది, అన్నిటికన్నా ముఖ్యమైంది, ఏష్ బెరీ పూర్తి అమెరికన్ కవి. అమెరికన్ జీవితం,రోజువారీ జీవితం ఎలా ఉంటుందో తెలియని నాలాంటి వాడికి, ఆ కవితల్లోని స్వారస్యం అంత సులువుగా బోధపడదు. ఏష్ బెరీకి నివాళిగా వచ్చిన వ్యాసాలన్నిటిలోనూ ఎక్కువ సమగ్రంగా ఉందని చెప్పదగ్గది గార్డియన్ పత్రిక ఘటించిన నివాళి. అందులో మార్క్ ఫోర్డ్ అనే సమీక్షకుడు ఏష్ బెరీ పట్ల సమకాలిక విమర్శకుల తీర్పులో ఎంత వైవిధ్యముందో మనకి గుర్తు చేస్తాడు. నిష్టురమైన కాలం తీర్పుని తట్టుకు నిలబడతాడని హెరాల్డ్ బ్లూమ్ అంటే, అతడి కవిత్వమంతా చెత్త అని మరొక సమీక్షకుడు తేల్చిపారేసాడంటాడు. అతడి కవిత్వానికి ఎన్నో జాతీయస్థాయి పురస్కారాలు లభించాక కూడా అతణ్ణి కవి కాదని భావించేవాళ్ళేమీ తక్కువసంఖ్యలో లేరంటాడు.

అతడి కవిత్వం మీద సమకాలికులు నొక్కిన సన్నాయి నొక్కుల్ని కూడా ఆ సమీక్షకుడు గుర్తు చేస్తాడు, ఏష్ బెరీ సర్వనామాల్ని యథేచ్ఛగా ఎట్లా వాడతాడో కెన్నెత్ కోచ్ ఒక్క వాక్యంలో పేరడీ చేసాడట. It wants to go to bed with us అని! మీరిట్లా సర్వనామాల్ని ఎందుకు ఇష్టం వచ్చినట్టు వాడతారని అడిగితే, ఏష్ బెరీ ‘You’ can be myself or it can be another person, someone whom I’m addressing, and so can ‘he’ and ‘she’ and for that matter ‘we’ అన్నాడట!

ఎమ్మెస్ నాయుడు ‘ఒక వెళ్ళిపోతాను’ లాంటి వాక్యం లానే , ఏష్ బెరీ రాసే వాక్యం కూడా ప్రతిపదార్థానికి లొంగదు. The arctic honey blabbed over the report causing darkness లాంటి వాక్యం ఒక సాహిత్య కొలాజ్ లాంటిది. తరువాతి రోజుల్లో అతడు ఈ టెక్నిక్ నుంచి తప్పుకుని ఉండవచ్చుగాని, అప్పటికే అమెరికా అంతటా యువకవుల్ని ఈ వ్యాథి చుట్టుకుపోయింది.

‘ఏష్ బెరీ ఇంతకు ముందు రాసిన కవితలు చాలా బావుంటాయి అంటారంతా, కాని,ఆ ఇంతకు ముందు అంటే ఎప్పుడో ఎవరూ చెప్పరు ‘ అని కూడా ఆ విమర్శకుడు రాసాడు. 28 సంపుటాల సుదీర్ఘ కవితాప్రస్థానంలో ఏ కవితల్ని మనం సులభంగా సమీపించగలం? తర్వాత రోజుల్లో యాబ్ స్ట్రాక్ట్ ఎక్స్ ప్రెషనిస్టుగానో, మల్టీ మీడియా చిత్రకారుడిగానో మారిపోయిన ఒక చిత్రకారుడు తొలిరోజుల్లో చిత్రించిన నీటిరంగు లాండ్ స్కేప్ చిత్రాలు చూపరులకి హాయి కలిగించేటట్టు, బహుశా ఏష్ బెరీ తొలిరోజుల కవితలే నా ప్రాణానికి హాయిగా తోచాయి. జీవితం సంక్లిష్టంగా ఉన్నప్పుడు కవిత కూడా సంక్లిష్టంగా ఉండకతప్పదనీ, జీవితం అసందర్భంగా ఉన్నప్పుడు కవిత్వం కూడా అసందర్భంగా ఉంటుందనీ ఏష్ బెరీ అన్నాడట. కాని, మోహన ప్రసాద్ లాగా ఏష్ బెరీలో కూడా ఒక బాలుడు ఉన్నాడు. అతడితో ముప్పై ఐదేళ్ళుగా సహజీవనం చేసిన అతడి భర్త డేవిడ్ కెర్మానీ ‘ ఏష్ బెరీలో ఒక పసివాడు సదా ప్రత్యక్షంగా ఉంటాడు ‘ అని అన్నాడని చదివినప్పుడు నాకు ఆశ్చర్యమనిపించలేదు.

ఏష్ బెరీకి నా వంతు నివాళిగా, అతడి కవిత ఒకటి తెలుగులో మీకోసం:

ముఖచిత్రం (1956)

సముద్రానికీ భవనాలకీ మధ్య కూచుని
అతడు సముద్రం ముఖచిత్రం గియ్యాలనుకున్నాడు
సముద్రం ఇసుకతిన్నెలమీంచి తరలివచ్చి
కుంచె తీసుకుని కాన్వాసు మీద తన బొమ్మ
తనేగీసుకుంటుందనుకున్నాడు, పిల్లల దృష్టిలో
ప్రార్థించడమంటే పలక్కుండా కూచోడమన్నట్టు.

అట్లా ఆ కాన్వాసుమీద రంగు పుయ్యకుండానే
గడిచిపోయింది, చివరికి ఆ భవనాల్లో ఉంటున్నవాళ్ళు
చెప్పేదాకా. వాళ్ళన్నారు కదా ‘కుంచె ఒక సాధనం,
ఏదో ఒకటి గీసి చూడు, నువ్వు చిత్రించడానికి
మరీ అంత విస్తృత, కోపోద్రిక్త విషయాన్నెంచుకోకు
ఏదో నీ మనసుకి సరిపోయేది, ప్రార్థనలాంటిది చిత్రించు.’

అతడెట్లా చెప్పేది వాళ్ళకి, తన ప్రార్థన మొత్తం
కళ కోసం కాదనీ, ప్రకృతినే తన కాన్వాసుమీదకి
పొంగి ప్రవహించడం కోసమనీ. ఇక అతడు తన భార్యనే
చిత్రించబోయాడు. పాడుపడ్డ భవనాల్లాగా ఆమెను
మరీ గంభీరంగా చిత్రించబోయాడు,తనని తాను
మర్చిపోయి కుంచె లేకుండానే బొమ్మ పూర్తయింది.

ఒకింత ఉత్సాహంతో అతడు సముద్రంలో కుంచె ముంచి
హృదయపూర్వకంగా ప్రార్థించాడు: నా ఆత్మవదనమా,
నేను మరొక ముఖచిత్రం చిత్రించేటప్పుడు నా కాన్వాసు
చీల్చుకు బయటికిరమ్మంటూ గొణుక్కున్నాడు.
అతడు మళ్ళా సముద్రాన్ని చిత్రించబోతున్నాడన్న
వార్త దవానలంలాగా భవనాలన్నింటినీ చుట్టబెట్టింది.

ఊహించండి, ఒక చిత్రకారుడు అతడి చిత్రానికే సిలువ
కాబడ్డ దృశ్యం. కుంచె పైకెత్తడానికి కూడా ఓపికచాలక,
భవనాలమీంచి తొంగిచూస్తున్న కొందరు చిత్రకారుల్ని
అతడు కవ్వించాడు, కుటిలసంతోషంతో, ‘చూడండి,
మనకి ప్రార్థించడం తెలీదు, మనల్నీ చిత్రించుకోలేం
కాన్వాసుమీదకి సముద్రాన్నీ ఆహ్వానించలేం’ అని.

అతడు తన స్వీయముఖచిత్రాన్నే గీసాడని వాళ్ళు
ప్రకటించేసారు, కాని అక్కడ గీసిందేమిటో సూచనలేవీ
మిగలకుండా పోయాక, ఆ కాన్వాసు మళ్ళా
తెల్లగా మారిపోయింది. అతడు కుంచె పక్కన పెట్టేసాడు.
కిక్కిరిసిన ఆ భవనాల మధ్యనుంచి పెద్ద అరుపు
వినవచ్చింది, దానికదే ఒక ప్రార్థనలాగా ఉంది.

వాళ్ళతణ్ణి, ఆ ముఖచిత్రాన్ని అన్నిటికన్నా అతి పెద్ద
భవంతిమీంచి కిందకు నెట్టేసారు, చిత్రించాలనుకున్నది
ఒక ప్రార్థనగానే మిగిలిపోవాలనుకుందేమో,
ఆ కుంచెనీ, కాన్వాసునీ సముద్రం ముంచేసింది.

16-9-2017

Leave a Reply

%d bloggers like this: