ఒక బానిస ఆత్మకథ

b11

 

 

 

 

 

 

ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యంతో పరిచయం కావాలనుకున్నవాళ్ళు తెరవవలసిన మొదటి పుస్తకం ఫ్రెడరిక్ డగ్లస్ (1817?-1895) రాసిన Narrative of the Life of Frederick Douglass, an American slave (1845) అని అనడంలో సందేహం లేదు. ఆ పుస్తకం చదివినవాళ్ళకి అతడి పుట్టినరోజు నేడు నల్లజాతి చరిత్ర మాసోత్సవానికి ప్రాతిపదికగా ఎందుకు మారిందో అర్థమవుతుంది.

మన భాగ్యవశాత్తూ ఆ పుస్తకాన్ని పీకాక్ క్లాసిక్స్ గాంధీగారి ప్రోద్బలంతోముక్తవరం పార్థసారథి గారు ‘ఒక బానిస ఆత్మకథ’ (2011) పేరిట తెలుగు చేసారు.(తెలుగువాళ్ళు ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేని మన సమకాలిక సాహిత్యవేత్తల్లో ముక్తవరం పార్థసారధి కూడా ఒకరు.)

హారియట్ బీచర్ స్టోవ్ రాసిన ‘అంకుల్ టామ్స్ కేబిన్’ (1852), ఎలెక్స్ హేలీ ‘రూట్స్’ (1976) ల అనువాదాలు తెలుగులో బాగా ప్రసిద్ధి పొందాయి. కాని హేరియట్ బీచర్ స్టోవ్ నల్లజాతి స్త్రీ కాదనే వాస్తవాన్ని పక్కనపెట్టినా, ఆ పుస్తకం వెలువడటానికి కనీసం ఏడేళ్ళ ముందే డగ్లస్ ఆత్మకథ వెలువడిందనీ, అంకుల్ టామ్స్ కేబిన్ ప్రసిద్ధి పొందడానికి డగ్లస్ తన వార్తాపత్రికలో పెద్ద ఎత్తున ప్రచారం చేసాడనీ మనం గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. ఇక హేలీ రచన మరీ ఇటీవలిది. తన పూర్వీకులు అనుభవించిన విషాదమయ జీవితం గురించిన అన్వేషణ అది. కాని డగ్లస్ ఆత్మకథ బానిసగా పుట్టిన ఒక నల్లజాతిమానవుడు తన స్వేచ్ఛకోసం సాగించిన స్వానుభవ కథనం. ఆ అనుభవాల్ని చదువుతుంటే ఒకసారి రక్తం గడ్డకట్టిపోతుంది, మరొకసారి సలసలా మరుగుతుంది. మానవుడు ఒక యజమానిగా ఎంత హీనుడిగా, నీచుడిగా, క్రూరుడిగా ఉండగలడో వింటుంటే వళ్ళు గగుర్పొడుస్తుంది, ఒక బానిస మానవుడిగా మారడానికి ఎంత ఆరాటపడ్డాడో చదువుతుంటే, వళ్ళు పులకిస్తుంది. గొప్ప స్వాతంత్ర్యపోరాటగాథ చదువుతున్న స్ఫూర్తి మనల్ని ఆవహించి, మనం మన జీవితాన్ని మరింత సార్థకంగా, మరింత తేజోవంతంగా జీవించాలన్న సంకల్పం కలుగుతుంది.

డగ్లస్ ఆత్మకథ వెలువరించేటప్పటికి, మార్క్స్, ఎంగెల్సులు ఇంకా కమ్యునిస్టు మానిఫెస్టో (1848) మొదలుపెట్టలేదు. జాన్ స్టువర్ట్ మిల్ On Liberty (1859) ఇంకా పదేళ్ళ తర్వాతి మాట. మానవస్వేచ్ఛా ప్రవృత్తిని, స్వాతంత్రకాంక్షని వర్డ్స్ వర్త్ The Prelude (1850) కావ్యంగా ఇంకా మలుచుకోనే లేదు. ఆ మాటకొస్తే అమెరికా ఆత్మకొక అభివ్యక్తిని సమకూర్చిన వాల్ట్ విట్మన్ Leaves of Grass (1855) కూడా అప్పటికింకా పుస్తకరూపంగా వెలువడనే లేదు. ఏ విధంగా చూసినా కేవలం నల్లజాతికే కాదు, అసలు ఆధునిక ప్రపంచానికే స్వేచ్ఛాసందేశాన్ని అందించిన మొదటి రచన డగ్లస్ ఆత్మ కథ అనే చెప్పవలసి ఉంటుంది.

వేరే భాషలో వచ్చిన ఒక రచన ఆ భాషలో నిర్వహించిన పాత్రను అంచనా వేసుకోడానికి మన భాషలో అటువంటి రచన ఏదన్నా ఉందా అనే ఆలోచన రావడం సహజం. జీవితానుభవాలు ఒక్కలాంటివి కాకపోయినా, ఆధునిక తెలుగుసాహిత్యంలో సామాజిక చైతన్య స్ఫూర్తి కలిగించడం విషయంలో, డగ్లస్ ఆత్మకథని వీరేశలింగం ‘స్వీయచరిత్ర’ (1903-1910) తో పోల్చవచ్చు.

పుస్తకం తెలుగులో లభ్యమవుతున్నది కాబట్టి నేనా కథని సంగ్రహంగా కూడా చెప్పే ప్రయత్నం చేయను. అలా చెయ్యడం కూడా కష్టం. స్ఫూర్తిదాయకమైన వాక్యాల్ని ఎత్తి రాద్దామంటే మొత్తం పుస్తకాన్నే మళ్ళా ఇక్కడ రాయవలసి ఉంటుంది. కాని, ఆ రచన ఎలా ఉంటుందో సూచించడంకోసమే ఈ కొన్ని వాక్యాలూ పార్థసారథిగారి అనువాదం నుంచి.

1
నా తండ్రి తెల్లవాడు. నా యజమానే నా తండ్రి అన్నారు కొందరు. ఇప్పటికి నాలుగైదు సార్లకన్నా ఎక్కువ నేను నా కన్నతల్లిని చూడలేదు. అది కూడా చీకట్లో క్షణకాలం పాటు జరిగేది. నేనుంటున్న చోటుకి పన్నెండుమైళ్ళ దూరంలో మిస్టర్ స్టువార్ట్ ఆమెను పనిలో పెట్టుకున్నాడు, రోజు చాకిరీ ముగించుకుని, రాత్రివేళ, అంతదూరమూ నడిచి, ఆమె నన్ను చూడటానికి వచ్చేది. ఆమె పొలంలో పనిచేసేది. సూర్యోదయానికి ముందే,పొలంలో కనిపించకపోతే, కొరడాదెబ్బలే శిక్ష. ..అమెను పగటిపూట సూర్యుడున్నప్పుడు ఒక్కసారి కూడా చూసిన జ్ఞాపకం లేదు. వచ్చినప్పుడు, ఆమె నన్ను గుండెలకు హత్తుకుని, నా పక్కన పడుకుని నిద్రపుచ్చేది. నేను మళ్ళీ లేచేసరికి కనిపించేది కాదు…నా యజమాని నా తండ్రా,కాదా అన్నది అప్రస్తుతం. ఎందుకంటే, చట్టప్రకారం బానిసల పిల్లలు కూడా బానిసలే..

2
అనేక సార్లు మా మేనత్త ఒకావిడ దెబ్బలకు భరించలేక కేకలు వెయ్యడంతో నాకు మెలకువ వచ్చేది. స్తంభానికి కట్టేసి ఆమె నగ్నశరీరం మీద కొట్టినప్పుడు చర్మం కమిలి, చిట్లి నెత్తురు ధారగా కారేది, ఎన్ని ఆర్తనాదాలు, ప్రార్థనలు, వేడుకోళ్ళకు కూడా ఆమె యజమాని కర్కశహృదయం కరిగేది కాదు. పైగా, ఆమె ఎంత బిగ్గరగా కేకలేస్తే, అంత గట్టిగా కొరడా దెబ్బలు పడేవి.

3
యజమానుల గొప్పదనం, సంపద తమదే అన్నట్టుగా మురిసిపోతారు బానిసలు. బానిసగా పుట్టడం దురదృష్టమే. కాని పేదయజమాని దగ్గర బానిసగా ఉండటం మరీ దురదృష్టమనుకుంటారు.

4
ఆమె అంటే మా యజమానురాలు నాకు అక్షరాలు నేర్పించకూడదని మా యజమాని శాసించాడు. బానిసలకు చదవటం, రాయటం నేర్పించడం ప్రమాదకరమే కాదు, చట్టవిరుద్ధం కూడా అన్నాడు..ఎవరికి ప్రమాదకరం?నల్లవాళ్ళు చదువుకుంటే తెల్లవాళ్ళకు బానిసలు తగ్గిపోతారు. చదువు బానిసకు కళ్ళు తెరిపిస్తుంది. యజమానులను ప్రశ్నించే, ధిక్కరించే శక్తినిస్తుంది. విముక్తిపోరాటాలకు ప్రేరణనిస్తుంది…బానిసత్వమంటే అతడికి ఎనలేని ప్రేమ. నాకు ఎనలేని ద్వేషం. ఇవి పరస్పర విరుద్ధ ప్రయోజనాలు.

5
బానిసత్వం, బానిసలతో పాటు యజమానులకూ హానికరం. మొదట మా యజమానురాలు నన్ను ఎంత కనికరంతో, ఎంత ప్రేమతో చూసిందో…కాని, క్రమంగా, ‘బానిసత్వ’ భూతం ఆమెనూ ఆవహించక వదల్లేదు. అద్భుతమైన, దైవికమైన, మానవీయ లక్షణాలన్నీ యింకిపోయాయి. ఎదుటి మనిషి బాధకు స్పందించే ఆ హృదయం బండరాయిగా మారింది.

6
ఆ తర్వాత, ఒక తుమ్మచెట్టు కొమ్మలు తెంపి.. నన్ను షర్టు విప్పమన్నాడు. నేను జవాబు చెప్పలేదు. షర్టు కూడా విప్పలేదు. ఆయన మరోసారి ఆజ్ఞా జారీచేసాడు. అయినా నేను చలించలేదు. అంతే, కోపంతో వూగిపోతూ, పులిలా నా పైకి లంఘించి, షర్టు చించివేసి ఆ తుమ్మకొమ్మతో అలసిపోయినదాకా కొట్టాడు. ఆ తర్వాత నేను అనుభవించిన అనేక శిక్షలలో అది మొదటిది, కోవీ వద్ద సుమారు ఏడాదిపాటు ఉన్నాను, మొదటి ఆర్నెల్లలో, దెబ్బలు తినకుండా ఏ ఒక్క వారమూ గడవలేదు. నా వీపుమీది గాయాలెప్పుడూ మానలేదు..

7
…నేను అదును చూసి అతడి డొక్కలో గట్టిగా తన్నాను. ‘ఆర్నెల్లు గా నీ దగ్గర జంతువులాగా పడున్నాను, ఇక నా వల్ల కాదు’ అన్నాను..పరిణామం ఎలా వుంటుందో తెలియదుదాని ఆ సంఘటనే బానిసగా నా జీవితాన్ని మలుపు తిప్పింది. ‘స్వేచ్ఛ’ అనే నిప్పుకణం ఇంకా ఆరిపోలేదని నమ్మకం కుదిరింది. ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ సంఘటన నన్నెంత ఉత్తేజపరిచిందో, వుల్లాసపరిచిందో మీకెలా చెప్పను?బానిసత్వంలో పుట్టి పెరిగి, జంతువుగా సాటి మనిషి చేతిలో కొరడా దెబ్బలు తింటే తప్ప అర్థం కాదు..ఒక్క విషయం మాత్రం బాగా అర్థమయింది. నేనింకా ‘బానిస’ గా బతికినా, యిక బానిసను కాను.

8
మత విశ్వాసం అధికంగా వున్న యజమాని వద్ద పనిచెయ్యడం కన్నా దౌర్భాగ్యం బానిసకు మరొకటి వుండదు. నేను చూసిన యజమానులందరిలోకీ, మతవిశ్వాసులే అత్యంత నీచులు, క్రూరులు.

9
1838, సెప్టెంబరు 3 వ తేదీనాడు సంకెళ్ళు తెంచుకుని ఏ ఆటంకమూ లేకుండా న్యూయార్క్ చేరుకున్నాను.. ‘బానిసత్వం లేని ఒక స్వేచ్ఛా రాష్ట్రంలొ ప్రవేశించినప్పుడు నీకేమనిపించింది?’ అనిఎన్నోసార్లు నన్నడిగారు, దానికి నేను పూర్తిసమాధానం ఎప్పుడూ యివ్వలేను. అంత ఉద్వేగం జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదు. సముద్రపు దొంగల చెరనుండి విడివడిన అమాయకుడు ఎంత సంతోషం, హాయి అనుభవిస్తాడో-అలా వుంది నా పరిస్థితి..

10
1841 లో, ఆగస్టు 11 నాడు, మొదటిసారి నాంటకెట్ సదస్సులో మాట్లాడాను. నన్ను నేనింకా బానిసగానే భావించాను. ఒక నల్లబానిస, తెల్లవాళ్ళ సమక్షంలో వేదికమీద మాట్లాడటం ఎంత అగ్నిపరీక్షో!..స్వేచ్ఛగా, చెప్పదలుచుకున్నదంతా చెప్పేసాను. ఆ రోజునుండి ఇప్పటిదాకా నా సోదరీసోదరుల స్వేచ్ఛకోసమే వుద్యమించాను. నా శ్రమ ఎంత ఫలించిందో, ఎంతవరకూ విజయం సాధించానో కాలమే నిర్ణయిస్తుంది, లేదా, నా సహవుద్యమకారులు నిర్ణయిస్తారు.

4-2-2018

Leave a Reply

%d bloggers like this: