అజేయులు

నేనెక్కడో చదివాను, గొప్ప గురువులు ఏదీ ప్రత్యేకంగా నేర్పరు, నేర్చుకోవడమెట్లానో మటుకే నేర్పుతారు అని. ఆ మాట మా తాడికొండ పాఠశాలకి అక్షరాలా అన్వయిస్తుంది. ఆ పాఠశాల మా ముందు ఎన్నో జీవితాశయాలు పెట్టింది కాని, అన్నిట్నీ మరిపింపచేసే ఒక జీవితాదర్శాన్ని కూడా మా ముందుంచింది, అదేమంటే, నేర్చుకోవడం, నేర్చుకుంటూ ఉండటం, తెలుసుకుంటూ ఉండటం, తెలిసినవాళ్ళని కలుసుకోవడం, వాళ్ళ మాటలు వినడం,వాళ్ళలాగా ఆలోచించడం, మాట్లాడటం అనుకరించడం, వారిని మనలోకి అనువదించడం.

మా స్కూల్లో చదువుకున్నవాళ్ళు ఎంతమంది ఈ ఆశయపాశానికి చిక్కుకున్నారో తెలియదుగాని, కన్నెగంటి రామారావు మాత్రం నా కళ్ళముందు కనిపిస్తున్నాడు. అతడూ నేనూ ఒకేసారి ఆ స్కూల్లో చదువుకోలేదు, కాని ఆ సంస్కారం విశేషం వల్ల, ఇప్పుడతణ్ణి ఎక్కడ చూసినా, అతడి మాటలు,వ్యాఖ్యలు, ఎక్కడ చదివినా, నాకు మేమిద్దరం ఒకే తరగతిగదిలో కలిసి చదువుకుంటున్నట్టే అనిపిస్తుంది.

నిన్న వేదవతి గారి ఇంట్లో జరిగిన సాహిత్య సభలో అతణ్ణి కూడా మాట్లాడమని అడిగినప్పుడు, విదురనీతిలోంచి ఒక భావాన్ని గుర్తుచేస్తూ, ఒక్కసారిగా నా దృక్పథాన్ని ఆకాశమంత విస్తరింపచేసాడు. కుటుంబం కోసం వ్యక్తినీ, గ్రామం కోసం కుటుంబాన్నీ, దేశం కోసం గ్రామాన్నీ త్యాగం చెయ్యాలనే సుభాషితంలో మనకి గుర్తుండని చివరి వాక్యం,ఆత్మకోసం ప్రపంచాన్నే త్యాగం చెయ్యాలనే వాక్యాన్ని ఉదాహరిస్తూ, ఆత్మ అంటే ఏమిటి, నీకోసం ప్రపంచాన్ని వదులుకోవడమంటే ఏమిటి అంటూ చెప్తూ, అది గాంధీ చేసిన పోరాటాల్నీ, పౌరహక్కుల ఉద్యమాల్నీ, మైనారిటీ హక్కుల్నీ బలపరిచే వాక్యం కాదా అన్నాడు. ఆ మాట వినగానే వేల ఏళ్ళ కిందటి ఆ సంస్కృత సుభాషితం ఒక్కసారిగా, ఊహించని, politico-legal significance తో ఆవిష్కృతమైంది.

ఆ క్షణాన, మెహిదిపట్నంలో ఆ గోకుల కృష్ణ అపార్ట్మెంట్స్ ప్రాంగణం నాకు నా తాడికొండ పాఠశాలగా మారిపోయింది. దీపం దీపాని వెలిగించాక, జరిగేదేమిటి, రెండు దీపాలూ వెలగడమే కదా.

రామారావు మాటలు వినగానే నాకు నారదుడికీ, సనత్కుమారుడికీ మధ్య జరిగిన సంభాషణ గుర్తొచ్చింది. ఆ సంవాదాన్ని ఎంతో సవివరంగా నమోదు చేసిన ఛాందోగ్య ఉపనిషత్తు ఇట్లా అంటున్నది:

యో వై భూమా తత్ సుఖం, నా అల్పే సుఖం అస్తి,భూమైవ సుఖం,
భూమాత్వేత విజిజ్ఞాసితవ్య, ఇతి భూమానం భగవో విజిజ్ఞాస (7:23.1)

(అన్నిటికన్నా విస్తరించిన ఆ మహావిషయమేదో,అందులోనే సుఖమున్నది, అల్పవిషయాల్లో సుఖం లేదు అని సనత్కుమారుడు చెప్పినప్పుడు ఆ మహావిషయాన్ని తెలుసుకోవాలనే కోరిక కలుగుతున్నదని నారదుడు అన్నాడు)

ఆ మహావిషయం, దాన్నే ఉపనిషత్తు భూమం అంది, దాన్ని తెలుసుకునే విద్యని భూమవిద్య అంది. భూమవిద్య అంటే, ఈ ప్రపంచం కన్నా కూడా మిన్నదైనదేదో దాన్ని తెలుసుకోవడం, తెలుసుకోగలగడం.

ఉపనిషద్వాక్యంతో పాటు నాకు ఆస్ట్రేలియా ఆదివాసులు వార్ల్ పిరి తెగవాళ్ళు గుర్తొచ్చారు. మధ్య ఆస్ట్రేలియా లో నివసించే వార్ల్ పిరి తెగ ఒక అతిప్రాచీనమైన తెగ. ఆ తెగవాళ్ళ నమ్మకం ప్రకారం వాళ్ళు జీవిస్తున్న చోటు నిజానికి వాళ్ళ పితృదేవతలు సంచరిస్తున్న చోటు. ఆ పితృదేవతలు ఏ అతీత కాలంనుంచో అక్కడ సంచరిస్తూ, స్వప్నిస్తూ ఉన్నారు. ఆ స్వప్నక్రియ, దాన్ని వాళ్ళు, ‘జుకుర్ప’ అంటారు, ఆ స్వప్నం ఇంకా కొనసాగుతూనే ఉంది. అందువల్ల ఆ తెగ వాళ్ళ కాలం మన ప్రాపంచిక కాలం కాదు, అది వాళ్ళ పితృదేవతల స్వప్నకాలం dream time. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషీ పాటలద్వారా, కథలద్వారా, క్రతువులద్వారా ఆ స్వప్నగాథని కొనసాగిస్తూనే ఉండాలి. ఉపనిషత్తులు ఏ పితౄణం గురించి మాట్లాడేయో, అట్లాంటి ఋణమే, అయితే ఉపనిషత్తులు ఆ ఋణాన్ని పంచయజ్ఞాల ద్వారా తీర్చాలన్నాయి. వార్ల్ పిరి తెగ వారు కథలు చెప్పడం ద్వారా, చెప్పుకోవడం ద్వారా ఆ ఋణాన్ని తీర్చుకోవాలనుకుంటారు.

దాదాపుగా వార్ల్ పిరి లాంటి నమ్మకాలే కలిగిన నర్రిన్యేరి తెగవాళ్ళలో స్త్రీల dream time వేరు. పురుషుల dream time వేరు. స్త్రీల కథారహస్యం ఎవరితోటీ పంచుకోకూడదని ఒక నియమం. కొన్నాళ్ళ కిందట, వాళ్ళ పవిత్ర స్వప్నభూమిలో గూల్వా, కుమారంక్ అనే రెండు గ్రామాల మధ్య ఒక వంతెన కట్టవలసివచ్చింది. కాని ఆ వంతెన తమ పూర్వీకుల స్వప్నాన్ని భంగపరుస్తుంది కాబట్టి ఆ వంతెన కట్టవద్దని నర్రిన్యేరి స్త్రీలు అడ్డుపడ్డారు. అదొక పెద్ద న్యాయపోరాటంగా మారిపోయింది. ఆస్ట్రేలియా మొత్తం రెండు శిబిరాలుగా విడిపోయింది. ఆ కట్టబోయే వంతెన ఆ స్వప్న భూమిని ఏ విధంగా భంగపరుస్తుందో చెప్పమని కోర్టు ఆ ఆదివాసి స్త్రీలని ప్రశ్నించింది. వాళ్ళొక ధర్మసంకటంలో పడ్డారు. వంతెన కడితే తమ పూర్వీకుల స్వప్నప్రక్రియ భంగపడుతుంది. కాని ఎందుకో చెప్తే, తమ కథారహస్యాల్ని తామే భంగపరుచుకున్నవాళ్ళవుతారు. ఏం చేయాలి? పితృదేవతలకోసం ప్రపంచాన్నే వదులుకున్నవాళ్ళు, ఇప్పుడు పితృదేవతలకోసం, పితృదేవతలు పెట్టిన నియమాల్ని వదులుకోవాలా? మరొక వైపు,ఆ కథలూ, రహస్యాలూ ఏమీ లేవనీ, అదంతా అభూతకల్పనలేననీ తెల్లవాడి లాయర్లు వాదించడం మొదలుపెట్టారు. ఆ జాతి ఆత్మగౌరవమే ప్రశ్నార్థకమైంది.

మనమైతే ఏమి చేసి ఉండేవాళ్ళం?

కాని ఆ ఆదివాసి స్త్రీలు తమ వ్రతాన్ని భంగపరుచుకోడానికి ఇష్టపడలేదు. ఆ రహస్యాన్ని కోర్టుకి చెప్పడానికి ఇష్టపడలేదు. వాళ్ళు వ్యాజ్యం నష్టపోయారు. ఆ నది మీద వంతెన కట్టారు. కొన్ని మహాయుగాలుగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తున్న వాళ్ళ పితృదేవతల స్వప్నం ముగిసిపోయింది.

కాని నేనేమనుకుంటానంటే, ఆ స్త్రీలు తమ అంతరాత్మ కోసం ప్రపంచాన్నే కాదు, తమ ఆకాశాన్నీ, భూమినీ కూడా వదులేసుకున్నారని. వారు చట్టం ముందు ఓడిపోయారు గానీ, అంతరాత్మ ఎదట అజేయంగా నిలబడ్డారని!

20-12-2015

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%