స్త్రీమూర్తుల వదనాలు

59

సత్య శ్రీనివాస్ చాలా సున్నితమైన భావుకుడు, కవి, చిత్రకారుడు, ప్రకృతి ఉపాసకుడు, క్రియాశీల కార్యకర్త- ఒక్కమాటలో చెప్పాలంటే, తపస్వి.

అట్లాంటివాళ్ళు ఎక్కడ సంచరిస్తుంటే అక్కడ దీపం కాంతి ప్రసరిస్తూ ఉంటుంది. ఈ సారి అట్లాంటి కాంతి కొందరు తల్లులమీద పడింది, మహనీయులైన స్త్రీమూర్తులు, తల్లులు, అత్తలు, అమ్మమ్మలు, నాయనమ్మలు.

వాళ్ళల్లో ఏ ఒక్కరిని కదిపినా ఒక ఇతిహాసమవుతుంది. అట్లాంటి ఒక స్త్రీమూర్తిని చూసిన ఏ కువెంపు వంటివాడో ఒక నవల రాస్తే అది ‘కానూరి సుబ్బమ్మ హెగ్గెడితి’ వంటి కావ్యమవుతుంది. అట్లాంటి రచయితలు తెలుగులో ఎక్కడ? అందుకని, ఏ కొండపల్లి కోటేశ్వరమ్మ వంటివారో తమ కథ తామే రాసుకుంటే, అది ‘నిర్జన వారధి’ లాంటి రచన అవుతుంది.

వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు లేకపోయినా, వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. నిజానికి వాళ్ళు మన చుట్టూ ఉన్నవాళ్ళే. మన తల్లులు, మేనత్తలు, దొడ్డలు, బామ్మలు-

కాని, వాళ్ళ గురించి రాయడం చాలా కష్టం.

ఎందుకంటే, అన్నిటికన్నా ముందు మనం వాళ్ళతో మాట్లాడాలి. మనకి చాతకానిదదే. వాళ్ళని పలకరించడానికే మనకు సమయం లేదు, ఇక వాళ్ళ సుదీర్ఘ జీవనయాత్ర గురించి తెలుసుకునే తీరిక ఎక్కడ?

కాని ఒకరుంటారు, సత్య శ్రీనివాస్ లాంటి వారు, వాళ్ళ జీవనయానమంతటినీ వాళ్ళ వదనాల్లో, ప్రకాశవంతమైన ఆ నేత్రాల్లో, వారి ముఖం మీద పూల రేకుల బొత్తిలా ముడుచుకున్న ముడతల్లో దర్శించగలిగినవారు, మనతోనూ దర్శింపచేసేవారు.

అట్లా తాను చూసిన 25 మంది స్త్రీమూర్తుల వదనాలను నీటిరంగుల్లో చిత్రించి ప్రదర్శించాడు శ్రీనివాస్.

గుండి సులోచన, దొంతినేని సంపతమ్మ, మారీన్, తాడేపల్లి మైసమ్మ, లింగారెడ్డి సుబ్బమ్మ, చింతా సుబ్బలక్ష్మి, ముప్పనేని సరోజిని, ముప్పనేని నాగరత్నమ్మ, తోడేటి కోటమ్మ, రాజమన్నెమ్మ, జిహారా, బరకం పాపమ్మ, గూడవల్లి వెంకటరత్నం, గుడ్లవల్లేటి కమలమ్మ, సీతారత్నమ్మ నాయుడు, ఆదిలక్ష్మి, శాంత, కొండపల్లి కోటేశ్వరమ్మ, మధు, మామిడి అనంతలక్ష్మి, సుశీల, పామర్తి రాజ్యం, హురాంబీ, జెరోసా- 25 మంది స్త్రీలు. కరీం నగర్, వరంగల్, ఖమ్మం, కడప,అనంతపురం, ప్రకాశం, కృష్ణా ప్రాంతాలకు చెందిన మాతృమూర్తుల ముఖచిత్రాలు.

గొథె-జెంట్రం లో #20 MEMOIRS పేరిట 5వ తేదీన ప్రారంభమైన చిత్రకళా ప్రదర్శన నిన్న చూసాను. ఇటువంటి ఇతివృత్తం మీద ఇప్పటిదాకా ఎక్కడా ఇటువంటి ప్రదర్శన ఏర్పాటయినట్టు నాకు తెలియదు. సాహిత్యంలో కూడా అమ్మ మీద కవితాసంకలనాలు వచ్చాయి కానీ, అమ్మమ్మమీదా, నాయనమ్మ మీదా, వృధ్హురాళ్ళయిన స్త్రీమూర్తుల మీదా కథలుగానీ, కవితలు గానీ ఎవరు సంకలనం చేసినట్టు లేదు. అసలు ageing అనే ఇతివృత్తం మీదనే ఎక్కువ రచనలు వచ్చినట్టు లేదు.

ఒకవేళ వచ్చినా (సుబ్బరామయ్య ఒకటి రెండు కథలు రాసినట్టు గుర్తొస్తున్నది) అందులో దుఃఖమూ, ఒంటరి తనమూ, దిగులూ గూడు కట్టుకుని ఉంటాయి.

కాని శ్రీనివాస్ చిత్రించిన చిత్రాల్లో లేనివవే. అతడు చూసిన వదనాల్లో గొప్ప పరితుష్టీ, దయా, ప్రేమాన్విత దృక్కులూ కనిపిస్తున్నాయి. ఒక కవితలో లారెన్సు అన్నట్టుగా

It ought to be lovely to be old
to be full of the peace that comes of experience
and wrinkled ripe fulfillment.

కొన్ని పూర్తి నీటిరంగుల్లోనూ, కొన్ని నీటిరంగులూ, రంగుపెన్సిళ్ళూ కలిపి చిత్రించిన చిత్రాలు. రంగు పెన్సిళ్ళతో దిద్దినందువల్ల కొన్ని చిత్రాలకు గాఢత వచ్చినప్పటికీ, పారదర్శకమైన నీటిరంగుల పూతల వల్ల, ఆ వదనాల్లో ఒక అద్వితీయ ప్రశాంతి, కంటికొసల్లో తళుకు, తేమతో కూడిన మెరుపు కనిపిస్తున్నాయి.

చిరుమందహాసాలు, బహుశా చిత్రకారుడితో మాట్లాడుతున్నప్పుడు తమ బాల్య, యవ్వనాల జ్ఞాపకాల్ని తలచుకున్నందువల్ల చిందిన నునుసిగ్గు కూడా చాలా చిత్రాల్లో కనిపించకపోదు. ఒకటి రెండు చిత్రాల్లో, కొండపల్లి కోటేశ్వరమ్మ వదనంలో కనిపించే గాఢచింతనలాంటిది లేకపోలేదుగానీ, అవి ఒకటి రెండు చిత్రాల్లో మాత్రమే. ఒక్కసారిగా ఆ హాలంతా చుట్టి వచ్చేటప్పటికి పూర్వకాలపు గ్రామాల్లో నాలుగువీథులూ తిరిగి నాలుగు సమష్టికుటుంబాల్ని పలకరించినట్టు అనిపిస్తుంది.

అన్నిటికన్నా ముఖ్యం, అక్కడ వేదన లేదు, శోకం లేదు, శాపనార్థాలు లేవు. పూర్తిగా పండిన హేమంతకాల వనాల్ని చూస్తే మరొక వసంతాన్ని చూసినట్లు ఎట్లా అనిపిస్తుందో, అట్లానే అనిపిస్తుంది. ప్రశాంతి, నిండుదనం, మట్టీ అరుగుల ఇళ్ళల్లో సాయంకాల సంధ్యాకాంతి పరుచుకుంటూ ఉంటే, దీపం చిమ్నీల్ని ముగ్గుపొడితో తుడిచి, వత్తి సరిదిద్ది, దీపం వెలిగించే బామ్మనో, అమ్మమ్మనో చూసిన స్ఫురణ.

శ్రీనివాస్, నీకు మా ప్రశంసలకన్నా ముందు వాళ్ళ అశీస్సులు మెండుగా ఉన్నాయి, అంతకన్నా ఏం కావాలి?

2-8-2016

ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

%d bloggers like this: