21 వ శతాబ్దానికి అవసరమైన నైపుణ్యాలు

31

విద్య గురించిన ఆలోచనలు నన్ను గాఢంగా ఉత్తేజితుణ్ణి చేస్తుంటాయి, సాహిత్యంలానే. కానీ, ఒక తేడా ఉంది. సాహిత్యం చదవడం, చదివినపుస్తకాల గురించి మాట్లాడుకోవడం, ఒక కవితనో కథనో రాయడం ఎప్పటికీ ఉత్తేజకారకాలేగాని, విద్య అట్లా కాదు. విద్యామీమాంస నన్ను ఎంత ఉత్తేజితుణ్ణి చేస్తుందో, అంత చింతాక్రాంతుణ్ణి కూడా చేస్తుంది.

ఈ మాటలతోటే మొదలుపెట్టాను నిన్న నా ప్రసంగం. తెలంగాణా గెజెటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం వారు ఏర్పాటు చేసుకున్న రాష్ట్రస్థాయి విద్యాసదస్సులో నన్ను కూడా మాట్లాడమని పిలిచారు. అందరు ప్రధానోపాధ్యాయుల్ని ఒక్కచోట కలుసుకునే అవకాశం, వారితో నా భావాలు పంచుకునే విలువైన సమయం దొరికాయి నాకు. అందుకు సంఘం కార్యదర్శి రాజా భాను చంద్రప్రకాశ్ కి ధన్యవాదాలు చెప్పుకోవాలి.

ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులంటే కేవలం ప్రభుత్వోద్యోగులని అనుకోలేను. వారివెనక వేలాదిమంది బాలబాలికలు, అది కూడా అణగారిన వర్గాలకు చెందిన పిల్లలున్నారన్న ఊహనే నన్ను ఎంతో ప్రకంపనకు గురిచేస్తూంటుంది. దళితులు, గిరిజనులు, వెనకబడిన వర్గాల వాళ్ళు, వలసకుటుంబాలు, అల్పసంఖ్యాకవర్గాలకు చెందిన వాళ్ళు ఆ పిల్లల్లో దాదాపు తొంభై శాతం ఉంది ఉంటారు. వారికి ఎట్లాంటి విద్యని అందిస్తున్నాం అన్నదాన్నిబట్టే 21 వ శతాబ్దపు భారతదేశ భవిష్యత్తు ఆధారపడిఉంది.

గతంతో పోలిస్తే, ముఖ్యంగా, 1986 లో నూతన విద్యావిధానం ప్రకటించినప్పటినుంచీ, భారతదేశంలోనూ, మన రాష్ట్రాల్లోనూ కూడా ప్రభుత్వ విద్యాకార్యక్రమాల్లో ఊహించనంత మార్పు వచ్చింది. మూడు దశాబ్దాల కింద నేను చూసిన ప్రభుత్వ పాఠశాలలకీ, ఇప్పటి ప్రభుత్వ పాఠశాలలకీ పోలికలేనేలేదు. కాని, ఈ మూడు దశాబ్దాలుగా ప్రభుత్వం దృష్టి స్కూలింగ్ మీదనే ఉంటూ వచ్చింది. బడి బయట ఉన్న పిల్లల్ని బడికి ఎట్లా తీసుకురావాలి,అట్లా తీసుకొచ్చినవాళ్ళని బళ్ళో ఎట్లా కూచోబెట్టాలి అన్న ప్రశ్నల్నే ప్రభుత్వం పట్టించుకుంటూ వచ్చింది. పిల్లల్ని బడిలో ఉంచడమంటే వాళ్ళకి కావలసిన కనీస సదుపాయాలు కలిగిస్తే చాలని ప్రభుత్వం, ఒక అమాయకమైన పేరెంట్ లాగా నమ్ముతూ వచ్చింది. కాబట్టే,ప్రభుత్వమూ, ఉపాధ్యాయులూ ఎంత కష్టపడుతున్నా, పిల్లలు పాఠశాలనుంచి disengage అవుతూనే ఉన్నారు. పాఠశాల పిల్లవాణ్ణి ఆకర్షించలేకపోతున్నది, పట్టి ఉంచలేకపోతున్నది. ఎన్ని ప్రయోగాలు, ఎన్ని చర్చలు, ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, మన ప్రభుత్వపాఠశాలల్లో నిజమైన learning ఇంకా మొదలుకాలేదనే అనిపిస్తున్నది.

ఇదిలా ఉండగా, 21 వ శతాబ్దానికి అవసరమైన నైపుణ్యాలు వేరేలా ఉన్నాయి. లోతుగా ఆలోచించగలడం, ఆలోచించినదాన్ని సమర్థవంతంగా వ్యక్తీకరించగలగడం, వ్యక్తీకరణలో సృజనాత్మకతను సాధించడం, నలుగుర్నీ కలుపుకుంటూ ముందుకు పోగలగడం. వీటినే మనం నాలుగు “C” లుగా వ్యవహరిస్తున్నాం. వీటికి అదనంగా మరొక రెండు నైపుణ్యాలు, ఒకటి హక్కుల గురించిన జాగృతి, రెండవది బాధ్యతల గురించిన మెలకువ, కూడా చేరినట్టయితే, ఆ విద్య సంపూర్ణమవుతుంది. ఇటువంటి విద్యను ఎట్లా అందించాలన్నదే నేడు ప్రపంచమంతా విద్యావేత్తల్ని వేధిస్తున్న చింతన.

అన్ని తాపత్రయాలూ కలిపి ఒకటే ప్రశ్న: పిల్లవాణ్ణి engage చెయ్యడం ఎలా? మనం పాఠశాలలు నడుపుతున్నాం, తరగతిగదుల్లో బోధిస్తున్నాం. కాని, ఆ సుజలస్రవంతి పాదుపాదునా ప్రతి మొక్క కుదుళ్ళలోకీ చేరటమెట్లా?

ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కుంటో నేను ప్రపంచమంతా గాలిస్తోనే ఉంటాను. ఎక్కడైనా, ఏవైనా కొత్త ఆలోచనలు కనబడితే వాటిని మన దగ్గర ఆచరణలోకి తేవడమెట్లా అని చింతిస్తుంటాను. ఈ విషయంలో ఈ మధ్య నా దృష్టిని ఆకర్షించింది, ఇంగ్లాండ్ కి చెందిన www.innovationunit.org వాళ్ళు ప్రపంచమంతా గాలించి, కొత్త శతాబ్దానికి పది సూత్రాలు రూపొందించారు. ఆ సూత్రాలు కొత్తవి కావు, కాని వాటికోసం సర్వశక్తులూ ఒడ్డి పనిచేస్తున్న గొప్ప విద్యాప్రయోగాల్ని కూడా ఆ యూనిట్ డాక్యుమెంట్ చేసింది. నాకున్న కొద్దిసమయంలోనూ, ఆ పదిసూత్రాల్నీ స్థూలంగా ఆ ప్రధానోపాధ్యాయుల ముందు నివేదించాను.

అత్యంత ప్రయోగాత్మకమైన, ప్రభావశీలమైన ఆ 10 భావనలిట్లా ఉన్నాయి:

• తరగతిగదికోసం పాఠ్యప్రణాళికలు రూపొందించకండి, ఏ విద్యార్థికి ఆ విద్యార్థి, ఏ బృందానికి ఆ బృందం అభ్యసన అవసరాల్ని గుర్తుపట్టి వాటిని తీర్చేలాగా ప్రయత్నించండి. స్వీడన్ లోని Kunskpsskolan పాఠశాలలు, బ్రెజిల్ లో లూమియర్ పాఠశాలలు చేస్తున్న ప్రయోగాల గురించి తెలుసుకోండి.

• తరగతి గది నమూనానుంచి బయటికి వచ్చి చూడండి. సాంప్రదాయికంగా పిల్లలు ఉపాధ్యాయుణ్ణి చూస్తూ నాలుగుగోడల మధ్యా వరసల్లో కూచోవలసిన పనిలేదు. 8వ తరగతి, 9వ తరగతి అంటో గదులు కేటాయించే బదులు, భాషా సాహిత్యాల జోన్, సైన్సు జోన్, మాథ్స్ జోన్ అంటో అభివృద్ధి పరచండి. ఒక్క తరగతి గది కాదు, మొత్తం పాఠశాల ఆవరణ అంతా కూడా ఒక లెర్నింగ్ జోన్ నే. అసలు అట్లాంటి physical space కూడా అవసరం లేదు. www.khanacademy.org వారి flipped classroom లాగా అది సైబర్ స్పేస్ కూడా కావొచ్చు. లేదా కోయంబత్తూరులో “ఇరుల” గిరిజనుల కోసం ప్రేమా రంగాచారి నడుపుతున్న విద్యావనం ప్రయోగం గురించి తెలుసుకోండి.

• పిల్లవాడి వైయక్తిక ప్రపంచాని తట్టండి. ఆమె అభ్యసన అవసరాలకు తగ్గట్టుగా మీ బోధన సవరించండి. ఇది సాధ్యమేనా అంటే న్యూయార్క్ లో School of One దీన్ని సాధించి చూపించింది. బోధన, అభ్యసనం డిజిటలైజ్ కావడం ద్వారా దీన్ని సుసాధ్యం చేసుకోవచ్చు.

• పిల్లల్లోని డిజిటల్ సామర్థ్యాల్ని ప్రోత్సహించండి. ఇదెట్లా సాధ్యమో డెన్మార్క్ లో ని ఓరెస్టాడ్ జిమ్నాసియం ప్రపంచానికి చూపిస్తూ ఉంది.

• పాఠాలు చెప్పుకుంటూ పోవడం కాదు, ప్రాజెక్టులు అప్పగించండి. నైపుణ్యమంటే విషయపరిజ్ఞానం మాత్రమే కాదు, వృత్తి నైపుణ్యాలు కూడా.

• విద్యార్థులు ఉపాధ్యాయులు కావడానికి అవకాశాలు వెతకండి. పెద్దపిల్లల్నీ, చిన్నపిల్లనీ కలిపి బృందాలు రూపొందించండి.

• అలాగే ఉపాధ్యాయులు విద్యార్థులుగా మారగలిగేలా ప్రోత్సహించండి. ఏ ఉపాధ్యాయుడు నేర్చుకోడానికి నిరంతరం తపిస్తూ ఉంటాడో అతడే అత్యంత ప్రభావశీలమైన ఉపాధ్యాయుడు కాగలుగుతాడు.

• ఏది అవసరమో దాన్నే పరీక్షించండి.

• పిల్లల్తో మటుకే కాదు, వాళ్ళ తల్లిదండ్రుల్తో కూడా కలిసి పనిచేయండి.

• నేర్చుకోడానికి సంబంధించిన కార్యకలాపాలన్నిటిలోనూ అధికారాన్ని పిల్లల చేతుల్లోకి బదలాయించండి.

ఈ భావాలు కొన్ని ఆ ప్రధానోపాధ్యాయులతో పంచుకున్నాను. ఇప్పటికిప్పుడు నేను పథకాల్ని మార్చమనిగానీ, పాఠశాల వ్యవస్థని సమూలంగా సంస్కరించమని గానీ చెప్పలేను. కాని, అటువంటి అవసరముందని వాళ్ళకి చెప్పి, వాళ్ళలో ఏ కొద్దిపాటి ఆలోచనను రేకెత్తించగలిగినా, నా గంటసేపూ సద్వినియోగపడినట్టే అని భావించాను.

10-3-2018

ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

%d