21 వ శతాబ్దంలో విద్య

28

నేషనల్ కౌన్సిల్ ఫర్ రూరల్ ఇన్ స్టిట్యూట్స్ ఛైర్మనూ, మిత్రులు ప్రసన్నకుమార్ గారు, తమ సంస్థ వ్యవస్థాపకదినోత్సవంలో కీలక ప్రసంగం చెయ్యమని ఆహ్వానించేరు. నిన్న యూనివెర్సిటీ ఆఫ్ హైదరాబాదు లో జరిగిన ఆ సమావేశానికి ప్రసిద్ధ గాంధేయవాది, అసొసియేషన్ ఫర్ వాలంటరీ అసొసియేషన్స్ ఫర్ రూరల్ డవలప్ మెంట్ (అవర్డ్) అధ్యక్షుడు పి.ఎం.త్రిపాఠి ముఖ్య అతిథి. హైదరాబాదు యూనివెర్సిటీ వైస్ ఛాన్సలరు అప్పారావుగారూ, మహాత్మాగాంధి యూనివెర్సిటీ, నల్గొండ వైస్ ఛాన్సెలరు అల్తాఫ్ హుసేన్ గారూ కూడా మాట్లాడేరు. జమ్మూనుంచి కేరళదాకా దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలనుంచి వచ్చిన ప్రతినిధులూ, రెండురోజుల పాటు గ్రామసందర్శన చేసివచ్చిన యూనివెర్సిటీ విద్యార్థులూ సభలో ఉన్నారు.

గ్రామీణాభివృద్ధిలో విశ్వవిద్యాలయాలు నిర్వహించగల పాత్ర గురించీ, నిర్వహించవలసిన కర్తవ్యం గురించీ నన్ను మాట్లాడమన్నారు. విశ్వవిద్యాలయ విద్యకు నోచుకోని నావంటివాడు విశ్వవిద్యాలయాల పాత్ర గురించి మార్గనిర్దేశన చెయ్యడంలో నాకే కొరుకుడుపడనిది చాలా ఉంది. కానీ, ఒక గిరిజన గ్రామంలో పుట్టి, మూడు దశాబ్దాలకు పైగా గిరిజనుల గురించీ, వాళ్ళ సమస్యల గురించీ ఆలోచించడం అనే ఒకే ఒక్క అర్హత నన్నక్కడ నిలబెట్టిందని అనుకున్నాను.

ఆ మాటే చెప్పాను. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల గురించీ, గ్రామీణ ప్రాంతాల్లోనూ పనిచెయ్యడానికి చాలా ఓర్పు కావాలి, నిబద్ధత కావాలి. భారతదేశం తన గ్రామాల్లో నివసిస్తున్నదని గాంధీజీ అన్నప్పటికీ, బ్రిటిష్ కాలంలోనూ, ఆ తర్వాతా కూడా భారతదేశం దృష్టి ఎప్పుడూ పట్టణాలమీదనే ఉంటూ వచ్చింది. త్రిపాఠీగారు చక్కటి మాట చెప్పాడు. స్వతంత్రం వచ్చినప్పణ్ణుంచీ, దేశంలో పరాధీన మనస్తత్వం బలపడుతూ వచ్చిందని. అందుకు కారణం, ప్రజలు ప్రాచీన స్వయంపోషక, స్వయంసత్తాక గ్రామీణ జీవనశైల్ని ద్వేషిస్తూ, పట్టణజీవితంలోనూ, పాశ్చాత్య తరహా ఉత్పత్తి, ఆర్థికసంబంధాల్లోనూ తమ విముక్తి ఉందనుకుంటున్నారు. గ్రామాల పరిస్థితినే అలా ఉండగా, గిరిజన ప్రాంతాల పరిస్థితి మరింత ప్రత్యేకమైంది. గ్రామీణాభివృద్ధి కోసం రూపొందించిన ప్రతి కార్యక్రమం, పథకం, పథకాల నియమనిబంధనలూ గిరిజన ప్రాంతాల్ని విస్మరించి చేసేవిగానే ఉంటున్నందువల్ల, అవి స్వాభావికంగానే గిరిజనుల్ని exclude చేసుకుంటాయి. ఈ మెలకువ వచ్చినందువల్లనే ప్రణాళికావేత్తలు గిరిజనులకు ప్రత్యేక ప్రణాళిక ఉండాలని భావించేరు.

అందుకనే గ్రామీణ, గిరిజన భారతదేశం గురించి మాట్లాడేటప్పుడల్లా, నేను అనాకెరెనినా నవలలోని మొదటి వాక్యాన్ని గుర్తుచేసుకోకుండా ఉండలేను. All happy families are alike; each unhappy family is unhappy in its own way. అందుకని గ్రామీణ, గిరిజన ప్రాంతాల గురించి మాట్లాడేటప్పుడు ఏ నమూనా ప్రణాళికా, వాళ్ళందర్నీ ఏకశిలాసదృశంగా భావించి చేసే ఏ కార్యక్రమం కూడా సఫలం కాలేవు.

గ్రామీణ,గిరిజన ప్రాంతాల గురించి పనిచెయ్యడంలో ఉత్సాహం ఎంత ఉంటుందో నిరుత్సాహం, నిస్సత్తువా అంతే ప్రబలంగా ఉంటాయి. గ్రామ పునర్నిర్మాణానికి గాంధీజీ రూపొందించిన 19 అంశాల నిర్మాణాత్మక కార్యక్రమం ఉంది. ఇప్పటికీ, అంతకన్నా సమగ్రమైన దిశానిర్దేశం మరొకటి ఉందనుకోను. దాని వెలుగులో ఎందరో గాంధేయవాదులు ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు చేసారు,చేస్తూ వస్తున్నారు. కాని, మారుతున్న కాలంలో, మారుతున్న అవసరాలకు ఆ ప్రణాళికను అన్వయిస్తూ, విస్తృత భారతదేశాన్ని ప్రభావితం చెయ్యగల స్ఫూర్తి, నాయకత్వం ఇంకా కొరవడుతూనే ఉంది. కాని, అటువంటి నాయకత్వానికి పిలుపు మటుకు వినవస్తూనే ఉంది. ఎవరు ఆ బాధ్యతని స్వీకరించడానికి ముందుకొస్తే వారికోసం దేశమూ, ప్రజలూ సంసిద్ధులుగానే ఉన్నారు. ఆ అవకాశం విశ్వవిద్యాలయాలకు కూడా విస్తారంగా ఉందని చెప్పడమే నా కీలక ప్రసంగం సారాంశం.

నా ప్రసంగంలో నేను ప్రధానంగా నాలుగు పదాల మీద దృష్టి పెట్టాను. 21 వ శతాబ్దంలో విద్యని నిర్వచించగల నాలుగు పదాలని ప్రపంచ వ్యాప్తంగా నేడు ఘోషిస్తూ ఉన్న పదాలు. నాలుగు Cలు.

మొదటిది, collaboration. ఇప్పుడు ఏ వ్యక్తిగాని, సంస్థగానీ, ముఖ్యంగా విశ్వవిద్యాలయం లాంటి ఉన్నత విద్యాసంస్థ గాని తలుపులు మూసుకుని ఏకాంతంలో పనిచేయడం అసాధ్యమే కాదు, అవాంఛనీయం కూడా. గ్లోబలైజేషన్ యుగంలో కార్పొరేట్ రంగం పెద్ద పెద్ద అంగలు వేయడానికీ, ప్రభుత్వ శాఖలు కుంటినడక నడుస్తూ ఉండటానికీ మధ్య తేడా ఇక్కడే ఉంది. నేను భువనేశ్వర్ లో కళింగ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో చూసింది ఇదే. ఆ విద్యాసంస్థ జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ దాదాపు నలభై సంస్థలతో అవగాహన కుదుర్చుకుని పనిచేస్తూ ఉంది. ఒక విశ్వవిద్యాలయం కనీసం వందసంస్థలతోనైనా కొలాబరేట్ కావాలని అనుకుంటాను. అవి ఎక్కడో విదేశాల్లో ఉండే సంస్థలే కానక్కర్లేదు. ఉదాహరణకి, తన ప్రాంతంలో ఉండే టెర్షియరీ ఆసుపత్రులూ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో కూడా ఒక యూనివెర్సిటీ కలిసిపనిచెయ్యగల మార్గాలు అన్వేషించవలసి ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు ఏకాంతంలో పనిచేస్తున్నట్టు గమనించాక ఆ ఒంటరితనాన్ని బద్దలు కొట్టడానికి మార్గాలేమిటా అని వెతుకుతున్న నాకు, కొఠారి కమిషన్ నివేదిక (1964-66) లో వాడిన ‘స్కూల్ కాంప్లెక్స్’ అనే పదం కనిపించింది. దాన్ని గిరిజన ప్రాంతాల్లో ఒక వాస్తవంగా మార్చడానికి నేను ప్రయత్నించాను. తర్వాత రోజుల్లో పాఠశాల విద్యాశాఖ దాన్ని రాష్ట్రవ్యాప్తంగా కొనసాగించింది. ఆ నమూనాలోనే ఒక విశ్వవిద్యాలయం ఒక ప్రాంతానికి సంబంధించిన learning complex కావాలని చెప్పాను. ఆ ప్రాంతంలో ఉండే అన్ని విద్యాసంస్థలూ, తమకు కావలసిన వనరులకోసం, మార్గదర్శకత్వంకోసం ఆ ప్రాంతంలోని యూనివెర్సిటీ వైపు చూసే రోజు రావాలి.

రెండవది, creativity. గ్రామీణ, గిరిజన ప్రాంతాల సమస్యలకు పరిష్కారాలు వెతికేవాళ్ళకి అన్నిటికన్నా ముఖ్యమైన అవసరం సృజనాత్మకత. నిధులు ఉన్నా కూడా సృజనాత్మకత లేకపోతే ఆ కార్యక్రమాలు సఫలం చెందవు అనడానికి సర్వ శిక్షా అభియాన్ పథకమే పెద్ద ఉదాహరణ. ఇప్పుడు, మాసివ్ ఆన్ లైన్ ఓపెన్ కోర్సుల (మూక్స్) కింద యూనివెర్సిటీలు ‘స్వయం’ పోర్టల్లో అప్ లోడ్ చేస్తున్న పాఠాలు చూసినవాళ్ళకి సృజనాత్మకత లేకపోవడమంటే ఏమిటో తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో పెళ్ళివీడియోలు తీసే ఏ వీడియోగ్రాఫరున్నైనా చూడండి, సృజనాత్మకత అంటే ఏమిటో మనకి తెలుస్తుంది. అసలు గ్రామీణ ప్రాంతాల్లో సృజనాత్మకత వాళ్ళ జీవితాల్లో విడదీసిచూపలేనంతగా పెనవైచుకుపోయి ఉంటుంది. ఒక నిరక్షరాస్య దళిత స్త్రీ పొలంలో కలుపు తీసేటప్పుడు చూడండి, సృజనాత్మకత వాళ్ళకి ద్వితీయ ప్రకృతిగా ఎట్లా మారిపోయిందో బోధపడుతుంది.

మూడవది, critical thinking. అంటే ప్రజ్ఞానానికి సంబంధించిన అన్ని అంశాలూ. విశ్వవిద్యాలయాల USP ఇదే. మన దేశంలో ప్రభుత్వం శక్తిసామర్థ్యాలు సంస్థల్ని నెలకొల్పడంలోనే (institutionalization) వ్యయమయిపోతూ ఉంటాయి. అట్లా నెలకొల్పిన సంస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా, ఆ ఫలితాలు ప్రజలకి అందుతున్నాయా లేదా (internalization) అని చూసుకోవడం ప్రభుత్వానికి ఎప్పటికీ సాధ్యం కానిపని. కాని, విశ్వవిద్యాలయాల్లాంటి సాంకేతిక సంస్థలు ఆ పని మరింత బాగా చెయ్యగలవు. అవి ప్రభుత్వం అందించే సేవల్ని మరింత నాణ్యంగా అందించడానికి శాయశక్తులా తోడ్పడగలవు. కావలసిందల్లా, ఆ ఉత్సాహం, ఆ నిబద్ధతాను.

నాలుగవదీ, అన్నిటికన్నా ముఖ్యమైందీ, communication. ఇప్పటి ప్రపంచం communication technologies మీద ఏర్పడుతున్న ప్రపంచం. ఈ సూత్రాన్ని ప్రైవేటు టెలివిజన్ ఛానెళ్ళూ, సినిమానిర్మాతలూ, వార్తాత్రికల యాజమాన్యాలూ అర్థం చేసుకున్నట్టుగా ప్రభుత్వసంస్థలూ, యూనివెర్సిటీలూ ఇంకా అర్థం చేసుకోలేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో సాధారణంగా ప్రైవేటు సంస్థలు ఉత్పత్తి చేసే సమాచారం నాణ్యంగా, విశ్వసనీయంగా ఉంటుంది. కాని మన దేశంలో ఏదన్నా అంశం మీద టివిల్లో జరిగే చర్చలు చూడండి. ఆ చర్చల్లో సమాచారం లోపభూయుష్టంగా ఉండటమే కాకుండా, చాలావరకూ, ఆ ఛానెల్ యాజమాన్యం తాలూకు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చేదిగా మాత్రమే ఉంటుంది. విషయపరిజ్ఞానాన్ని ప్రజలకు విశ్వసనీయంగా చేరవెయ్యడంలో యూనివెర్సిటీలు అద్భుతమైన పాత్ర నిర్వహించగలవు. ఉదాహరణకి నా మొబైలు మీద blinkist అనే ఒక యాప్ ఉంది. Big ideas in small packages అనేది ఆ సంస్థ మోటో. ఆ యాప్ ప్రపంచంలో వెలువడుతున్న వైజ్ఞానిక గ్రంథాల్ని ఏ రోజైనా 2000 కు పైగా చదివి ఆ పుస్తకాల్లో ముఖ్యాంశాల్ని మనకి చెప్తుంది. ఏ ఒక్క పుస్తకం గురించి తెలుసుకోవడానికి కూడా 15 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. నేనా యాప్ గురించి చెప్పి, అటువంటి యాప్ లు గ్రామీణ నిరుద్యోగులకోసం, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయుల కోసం ఎందుకు రూపొందించగూడదు అని అడిగాను. ఏదైనా కొత్త విషయం తెలుసుకోడానికీ, నేర్చుకోడానికీ గ్రామీణ యువత ఎంతో ఆకలితోనూ, దాహంతోనూ తపించిపోతూండటం నేను కళ్ళారా చూసాను.

ఇవి కొన్ని ఆలోచనలు. ఇటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టినవాళ్ళు కూడా లేకపోలేదు. నల్గొండలో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఇప్పటికే తన పరిథిలోని 150 కళాశాలల్తో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టింది. నా దృష్టిలో ఇది పతాకశీర్షికలో రావలసిన వార్త. ప్రజలంతా మాట్లాడుకోవలసిన విషయం. కానీ, తెలంగాణాలో ఒక్క వార్తాపత్రిక సంపాదకుడికి కూడా ఈ సంగతి తెలిసిఉంటుందనుకోను. వాళ్ళు వాళ్ళ మానేజిమెంటు రాజకీయ ప్రయోజనాలు కాపాడటంలోనే కూరుకుపోయి ఉన్నారు.

16-10-2017

ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

%d bloggers like this: