కృష్ణా పుష్కరాలు

58

పుష్కలావర్తాలు లేకపోయినా పుష్కరం పుష్కరమే కదా. నేనెప్పుడూ ఏ పుష్కరాలకీ ఏ నదీతీరంలోనూ ఉండలేదు.ఈ సారి అనుకోకుండా, కృష్ణవేణి ఒడ్డున నివసించడం మొదలుపెట్టగానే పుష్కరాలు రావడం చాలా సంతోషమనిపించింది.

పుష్కరాలు ఒట్టి స్నాన క్రతువు కాదు. ఆ అపూర్వ సందర్భాన్ని పాపపుణ్యాలతో ముడిపెట్టే ప్రవచనకారులు భారతీయ సాహిత్యం, తత్త్వశాస్త్రం తెలియని అజ్ఞానులు. అటువంటి మూఢవిశ్వాసాల వల్లే గోదావరి పుష్కరాల్లో అమాయికులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. పుష్కరాల్లో ఫలానా చోట, ఫలానా ముహూర్తాన స్నానం చెయ్యాలని నాకు తెలిసి ఎక్కడా ఏ ప్రాచీన గ్రంథంలోనూ రాసి లేదు. పైగా, మహాభారతం, అనుశాసనపర్వంలో, తీర్థమహిమ గురించి చెప్తూ, మనం పోలేని తీర్థాల విషయంలో మానసిక తీర్థయాత్ర, మానసిక స్నానం చేస్తే చాలంటుంది. పైగా, ఏ తీర్థంలో,ఎక్కడ స్నానం చేసినా ఫలితం సమానమేనంటుంది.

పుష్కరాల్ని ఇప్పుడు పర్యావరణవాదులు ఒక water resources conservation ఉద్యమంగా చూడటానికి చేస్తున్న ప్రయత్నం అభినందించదగ్గదేగాని, దానికి మాత్రమే పరిమితం కాదు.

ఈ దేశంలో, ఆ మాటకొస్తే, ప్రాచీన ఆసియాదేశాల సంస్కృతులన్నిటిలోనూ, రెండు రకాల భౌగోళిక దరర్శనాలున్నాయి. ఒకటి, political landscape, మరొకటి, cultural landscape. చైనా, భారతదేశం, ఇరాక్ వంటి దేశాల సాహిత్యం ఆదినుంచీ రాజకీయ భూగోళానికి సమాంతరంగా ఒక సాంస్కృతిక భూగోళాన్ని సందర్శించి, నిర్మించే ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఆ సాంస్కృతిక భూగోళం, బహుశా, ఒక narrative నే కావచ్చు గాక, కాని ఆ నెరేటివ్ కి ఒక రాజకీయ ప్రయోజనం కూడా ఉంటూ వచ్చింది.

దేశం రాజకీయంగా ముక్కలై ఉన్నప్పుడు, దేశ భూగోళమంతా, సాంస్కృతికంగా ఒకటి అని చెప్పడం ఆ రాజకీయ ప్రయోజనం. అది ఒక centri fugal ప్రక్రియ. కొన్నిసార్లు, దేశమంతా, ఒక ఏకైక రాజకీయ పాలనలో ఉన్నప్పుడు, ఒకే రాజకీయ సంస్కృతిని రుద్దాలని చూస్తున్నప్పుడు, దేశం సాంస్కృతికంగా ఎంతో వైవిధ్యవంతమైందని చెప్పడం కూడా అవసరమే. అదొక centri petal ప్రక్రియ. భారతదేశ చరిత్రని నిశితంగా అధ్యయనం చేసినవాళ్ళకి అది తొలినుంచీ ఒక centri-petal, centri-fugal పద్ధతిలో కొనసాగుతున్నదని తెలుస్తుంది. ఉదాహరణకి, పందొమ్మిదో శతాబ్దంలో, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా బలపడవలసి వచ్చినప్పుడు, మనమంతా సాంస్కృతికంగా ఒకటి అనే భావం ముందుకొచ్చింది. ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభానికి అది జాతీయతావాదంగానూ, జాతీయోద్యమంగానూ రూపుదిద్దుకుంది. అప్పుడు ప్రాంతాలు ప్రధానం కాదు, భారతదేశం, భారతజాతి ప్రధానం. ఇప్పుడు, భారతదేశం రాజకీయ సుస్థిరత పొందాక, దేశమంటే, కేవలం ఒక మతం, ఒక జాతి, ఒక భాష, ఒక వర్గం కాదనే స్పృహతో వివిధ అస్తిత్వాల ప్రకటన నేటి సాంస్కృతిక అవసరంగా, రాజకీయ అవసరంగా మారుతున్నది.

ఇటువంటి సాంస్కృతిక ఏకీకరణ- రాజకీయ వికేంద్రీకరణ, రాజకీయ ఏకీకరణ-సాంస్కృతిక వికేంద్రీకరణ ప్రక్రియలో సాహిత్యం, కళలు, తీర్థయాత్రలు ఎటువంటి పాత్ర పోషిస్తూ వచ్చాయో, అటువంటి పాత్రనే పుష్కరాలు కూడా పోషిస్తూ వచ్చాయి.

ఒక దేశంలో కొన్ని ప్రాంతాలు రాజకీయ హద్దుల్ని ఏర్పరచుకుంటున్నప్పుడు, అ హద్దుల్ని దాటి చూడాలంటే, మరొక ప్రాతిపదిక అవసరమవుతుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే రాజకీయ విభాగాలని దాటి 1300 కిలోమీటర్ల పొడుగునా విస్తరించిన ఒక నదీపరీవాహక ప్రాంతంగా ఆ నాలుగు రాష్ట్రాల్నీ చూడటం పుష్కరాలు ఇవ్వగల గొప్ప అవకాశం. మరాఠీ, కన్నడ, ఉర్దూ, తెలుగు అనే భాషాభేదాల్ని దాటి, ఆ ప్రజలందరినీ ఒకే నదినీళ్ళు తాగుతున్నవాళ్ళుగా చూడటం మరింత విశాల దర్శనం.

ఆ నదీ పరీవాహక ప్రాంతం పొడుగునా ఉన్న అడవులు, గ్రామాలు, మైదానాలు, పట్టణాలు, సస్యక్షేత్రాలు, పరిశ్రమలు, పథకాలు, అన్నీ ఒక ఉమ్మడి వ్యక్తిత్వాన్ని సంతరించుకుని, నదికి సామూహికంగా కృతజ్ఞత సమర్పించడం పుష్కరం. ఆ నది పొడుగునా ఆ నీళ్ళ వల్ల ప్రయోజనం పొందిన గ్రామాలు, సమాజాలు తాము పొందిన దాంట్లోంచి తమకు తోచినంత నలుగురితోనూ పంచుకోవడం పుష్కరాల్లో చేసే, చెయ్యవలసిన దానం. ఇట్లాంటి వితరణ ఏడాదికొకసారి కష్టం కావచ్చు, ఎందుకంటే, భారతదేశంలో ప్రతి అయిదు సంవత్సరాల్లో మూడేళ్ళు క్షామమే కాబట్టి. కాని, పన్నెండేళ్ళకొకసారి, కష్టం కాదు, ఎందుకంటే, పన్నెండేళ్ళల్లో కనీసం ఆరుసంవత్సరాలు పుష్కలమైన పంట దొరుకుతుంది కాబట్టి.

కృష్ణా పుష్కరాలు ఎలా ఉన్నాయో చూద్దామని విజయవాడనుంచి హంసలదీవి దాకా ప్రయాణించిన నాకు, ఈ అర్థంలో చాలావరకు ప్రజలు పుష్కరసందేశాన్ని అవగతం చేసుకున్నారనే అనిపించింది. బహుశా, పుష్కరాల్ని ఇంకా స్నానక్రతువుగా మాత్రమే చూస్తున్నవాళ్ళు ప్రకాశం బారేజి పరిసరాలకే పరిమితమైపోయారనిపించింది. విజయవాడ దాటి యనమలకుదురు, పెదపులిపాక మీంచి పాలకాయ తిప్పదాకా, ప్రజలకి అదొక పండగ, సామూహిక సంతోషం, నిత్యాన్న సంతర్పణ.

ఆ దారిపొడుగునా ఒక రోజంతా ప్రయాణించి రాగానే నా మనసుకి చాలా సంతోషమనిపించింది. శ్రీకాకుళం నుంచి హంసలదీవిదాకా, శ్రావణమాసంలోనే సంక్రాంతి పండగ వచ్చినట్టుంది. మధ్యలో మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో, దర్శనమయ్యాక, మంచినీళ్ళకోసం వెతుక్కుంటుంటే, అక్కడున్నవాళ్ళు భోజనం కూపన్లు ఇచ్చి అన్నం తిని వెళ్ళమని చెప్పారు. ఆ అన్నశాలలో నా కడుపు, మనసూ రెండూ నిండిపోయాయి.

మేం హంసల దీవికి చేరుకునేటప్పటికి ఎర్రటి ఎండ. ‘అసలు శ్రావణమాస మధ్యమ్మునందు కురిసి తీరాలు వర్షాలు కొంచేమేని’. కాని గ్రీష్మ ఋతువుని తలపిస్తున్న శ్రావణం.ఆ ఎర్రటి ఎండలో పోటెత్తుతున్న సముద్రాన్ని పోల్చుకోవడానికి మాటల కోసం వెతుక్కున్నాను. సముద్రం మీదనే కవిత్వం చెప్పిన స్పానిష్ కవులు, నెరూదా, జిమెనిజ్ వంటి వారు కూడా ఆ సముద్రాన్ని గుర్తుపట్టలేరు.బహుశా వాల్మీకి మాత్రమే ఆ సముద్రానికి తగిన రూపకాలంకారాలు పట్టుకోగలడేమో. అయినా నన్ను కూడా ఒక మెటఫర్ చెప్పమంటే, అదొక పెద్ద మరమీద గోధుమలు ఆడిస్తున్నట్టుందనాలి. గోధుమరంగు నీళ్ళూ, రాల్తున్న పిండిలాగా అలలూ.

పాలకాయతిప్ప దగ్గర కృష్ణ సముద్రంలో కలుస్తున్న చోటు. కన్నబెన్నా నది నలుపు, సముద్రం గోధుమరంగు, కృష్ణ, గౌరదేహాల స్త్రీపురుష పరిష్వంగంలాగా ఉంది. ఆ దృశ్యాన్ని సాఫ్ట్ పేష్టల్స్ లో చిత్రించాలని కూచున్నాను. దూరంగా ఇద్దరు పోలీసులు కుర్చీల మీద కూచుని కబుర్లు చెప్పుకుంటున్నారు. నన్ను చూసి, నేనెవరో తెలియకపోయినా, రమ్మని నాకో కుర్చీ, నా రంగులపెట్టెకొక కుర్చీ ఇచ్చేసి పక్కన నిలబడ్డారు.

‘నిండుగా పూసిన చెర్రీ తరువు కింద ఏ ఇద్దరూ అపరిచితులు కారు’ అన్నాడొక హైకూ కవి. బహుశా, పుష్కరాల్లో కూడా ఏ ఇద్దరూ అపరిచితులు కారేమో.

తిరిగి మళ్ళా ఆ కృష్ణాతీరం వెంబడి ఇంటికొస్తుంటే, దారికటూ ఇటూ ఎదుగుతున్న పచ్చని పైర్లు. వరి, చెరకు, అరటి, పసుపు, అల్లం, కంద, కూరగాయల పాదులు, తమలపాకు తోటలు, ఆ దారిపొడుగునా సాయం సంధ్య బంగారం చల్లుతుంటే, మల్లాదిరామకృష్ణశాస్త్రి ‘కృష్ణాతీరం’ మళ్ళీ చదువుతున్నట్టనపించింది.

ఆ మేరకు పుష్కరాలు సఫలమయ్యాయనే అనిపించింది. కాని, రాష్ట్రాలూ, ఆనకట్టలూ, బచావత్ ట్రిబ్యునల్ లను దాటి కృష్ణా పరీవాహక ప్రాంతమంతా ఒక ఉమ్మడికుటుంబంగా చేరువకావడానికి, ఈ పుష్కరాల్ని మనం వాడుకోగలిగామా? గోదావరి పుష్కరాలప్పుడు తాము ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో చెప్పమని నన్నొక సంస్థ వారడిగారు. నేను వారికి కొన్ని కార్యక్రమాలు సూచించాను. అందులో , తెలుగు, మరాఠీ, హిందీ, గిరిజన భాషల సాహిత్యవేత్తల సమ్మేళనమొకటి ఏర్పాటు చెయ్యడం కూడా. కృష్ణాపుష్కరాల్లో కూడా అటువంటి అంతర్ రాష్ట్ర సమావేశాలు, సమ్మేళనాలు, సాహిత్య పరిషత్తులు, ధార్మిక చర్చలు జరిగి ఉంటే ఎంత బాగుండేది!

పుష్కరాలంటే స్నానక్రతువుకాదు,

समानो मन्त्रः समितिः समानी समानं मनः सह चित्तमेषाम |
समानं मन्त्रमभि मण्त्रये वः समानेन वोहविषा जुहोमि ||
समानी व आकूतिः समाना हर्दयानि वः |
समानमस्तु वोमनो यथा वः सुसहासति ||

(మాటలు ఉమ్మడి కావాలి, కలయికలు ఉమ్మడి కావాలి, ఏకమనస్కులు కావాలి. చిత్తాలు ఒక్కటి కావాలి. సంకల్పాలు ఉమ్మడి కావాలి, హృదయాలు ఒక్కటి కావాలి. మనసులొక్కటికావాలి. సంపూర్ణంగా సంఘటితం కావాలి. (ఋగ్వేదం, 10.191)

అని ప్రభుత్వాలూ, ప్రవచనకారులూ ఎప్పుడు గ్రహిస్తారు!

18-8-2016

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading