ఇన్నొవేషన్ అసాధ్యం కాదు

26

గ్లోబలైజేషన్ యుగం మొదలయ్యాక అభివృద్ధికి రెండు వనరులు ప్రధానమని ప్రపంచమంతా గుర్తిస్తున్నారు. ఒకటి information, రెండోది, innovation. ఇన్నొవేషన్ అంటే కొత్త పుంతలు తొక్కడం. కానీ ఇన్నొవేషన్ ప్రైవేటు రంగంలోనూ, వాణిజ్యరంగంలోనూ తలెత్తినంతగా ప్రభుత్వరంగంలో ఇంకా ప్రస్ఫుటం కావడంలేదు. అందుకు చాలా కారణాలున్నాయి. ప్రభుత్వ వ్యవస్థలు సహజంగానే గతానుగతికంగానూ, కరడుగట్టిన ఆచారాలతోనూ కూడుకుని పనిచేయడం, ఇన్నొవేషన్ నువెన్నంటే రిస్క్ కూడా ఉన్నందువల్ల, ఆ రిస్క్ ని తలదాల్చడానికి ఎవరూ సిద్ధపడకపోవడం కొంత కారణం. అందువల్ల ప్రభుత్వ వ్యవస్థల్లో కూడా ఇన్నొవేషన్ ని గుర్తించడానికీ, ప్రచారం చెయ్యడానికీ, ప్రోత్సహించడానికీ ఒక సంస్థ ఉంటే మంచిదని అట్లాంటి సంస్థని ఏర్పాటు చెయ్యమని 13 వ ఆర్థిక సంఘం భారతప్రభుత్వానికి సూచించింది. ఆ సలహా ప్రకారం, సెంటర్ ఫర్ ఇన్నొవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్స్ హైదరాబాదులో ఏర్పాటై ఏడవ సంవత్సరంలో అడుగుపెడుతూ ఉంది. ఆ సందర్భంగా ముఖ్యప్రసంగం చెయ్యడానికి అచ్యుత సమంత ని ఆహ్వానించిన సంగతి మీకు తెలుసు.

నిన్న మధ్యాహ్నం అచ్యుత సమంత వ్యవస్థాపక ప్రసంగం చేసారు. రాత్రి ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన విందులో సంస్థ సిబ్బంది, యువతీ యువకులు ఆయనతో ఇష్టాగోష్టి చేసారు. ఆయన ప్రయత్నాల గురించీ, ప్రణాళికలగురించీ ప్రశ్నల పరంపర సంధించేరు. ప్రయాణం, ప్రసంగాల్తో అలసిపోయినప్పటికీ, బాగా పొద్దుపోయినా కూడా ఆయన వారి ప్రశ్నలకి ఎంతో ఓపిగ్గా చిరునవ్వుతో జవాబిస్తూనే ఉన్నాడు.

నిన్నటి సమావేశంలో సమంత తన ప్రసంగంతోనూ, తన జీవితకాల కృషితోనూ ఎంతగా ఆకట్టుకున్నాడో,తన వినయంతోనూ, నిష్కల్మషమైన చిరునవ్వుతోనూ కూడా అంతగా ఆకట్టుకున్నాడు ప్రతి ఒక్కరినీ.

సమంతని నేను పొద్దున్న ఏర్ పోర్ట్ లో స్వాగతించినప్పుడు ఆయన చాలా మొహమాటపడిపోయాడు. ఆ తర్వాత హోటల్ దగ్గర దింపినప్పుడు ‘మీరు నా కోసం వెయిట్ చెయ్యకండి, నేను చాలా మామూలు మనిషిని, నాకీ మర్యాదలు వద్దు, చాలా ఇబ్బందిగా ఉంటుంది’ అన్నారు. నాయకులు సరే, సామాజిక ఉద్యమకారులు కూడా ప్రభుత్వంలో ఏదైనా కమిటీల్లోనో, కమీషన్లలోనో పదవులు పొందినప్పుడు, ప్రభుత్వోద్యోగులనుంచి ఎటువంటి మర్యాదలు ఆశిస్తారో మూడు దశాబ్దాలుగా చూసినవాణ్ణి, అచ్యుత సమంత లాంటి వ్యక్తులు చాలా అరుదుగా కనిపించేరు నాకిన్నేళ్ళలో.

ఆయన విద్యావేత్త, అసాధ్యమైన ఒక బిజినెస్ మోడల్ ని రూపొందించి, ఒడిశాలాంటి పేదరాష్ట్రంలో, నిరుపేద గిరిజన విద్యార్థులకి ఒక ఆశావహమైన భవిష్యత్తుని సమకూర్చినవాడు, ప్రభుత్వాలకే దిశానిర్దేశం చెయ్యగల స్థాయికి చేరుకున్న దార్శనికుడు. కాని అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ఒక విశ్వాసి. పొద్దుణ్ణుంచీ, రాత్రిదాకా ఆయన్ని దగ్గరగా చూసినప్పుడూ,మాట్లాడినప్పుడూ ప్రస్ఫుటంగా కనిపించింది భగవంతుడిలో ఆయనకున్న అచంచల విశ్వాసమే.

ఆయన హోటల్ కౌంటర్ దగ్గర నిలబడి ఉండగా, సిబ్బంది హోటల్ రిజిస్ట్రేషన్ ఫారాలు నింపుతూండగా,

‘మీ పాఠశాల చూశేను. ప్రపంచానికొక ఉదాహరణ చూపించేరు’ అన్నాను.

ఆయన ఆకాశం వైపు చెయ్యి చూపించాడు.

‘అవును, మీకు భగవంతుడి అనుగ్రహం లభించింది’ అన్నాను.

‘పోయిన నెలలో హోం మంత్రి రాజనాథ సింగ్ కళింగ ఇన్ స్టిట్యూట్ కి వచ్చాడు. మీరన్న మాటనే ఆయన కూడా అన్నాడు’ అని, ‘కాకపోతే ఏమిటి, ఒకప్పుడు పట్టెడన్నం కోసం అల్లల్లాడిన నేనెక్కడ, ఈరోజు ప్రతి రోజూ లక్షనోళ్ళకి అన్నం అందించడం ఎక్కడ! భగవంతుడి అనుగ్రహం కాకపోతే ఇది మనుషులకి సాధ్యమయ్యే పనేనా!’ అన్నాడు.

రాత్రి ఇష్టాగోష్టి మొదలవుతూనే ఒక యువకుడు ఆయన్ని ‘మీకు పొలిటికల్ సపోర్ట్ దొరికిందా?’ అనడిగితే, మళ్ళా ఆ మాటే చెప్పాడాయన.’ అందరికన్నా బలవంతుడైనవాడి సపోర్ట్ ఉంది నాకు, సర్వశక్తిమంతుడి సపోర్ట్. దానిముందు రాజకీయ నాయకుల మద్దతు ఏపాటిది!’ అన్నాడు.

‘మీరు పాఠశాల ప్రారంభించడానికి ముందస్తుగా ఏవైనా గొప్ప పాఠశాలలు చూసేరా, ప్రణాళికలు ఎట్లా రూపొందించుకున్నారు?’ అనడిగితే కూడా అదే జవాబు:

‘నేనెట్లాంటి మోడల్స్ చూడలేదు. పాఠశాల స్థాపించడానికి ముందు మూడునాలుగేళ్ళు గిరిజన ప్రాంతాల్లో తిరిగేను. 1985 లో కలహండిలో ఒకామె ఒక చీర, నలభై రూపాయలకోసం తన ఆడపిల్లను అమ్మేసుకున్న సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. ఆ వార్త విని చలించిపోయి రాజీవ్ గాంధీ కలహండి జిల్లా పర్యటించి అక్కడి గిరిజనుల కోసం ప్రత్యేక పథకాలు ప్రకటించేరు. ఇప్పుడు, 31 ఏళ్ళ తర్వాత, ఆమె మనమరాలు కూడా తన అదే నికృష్టమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉంది. ఈ burning issues నాకు గొప్ప pain కలిగించాయి. ప్రభుత్వ పథకాలకీ, ప్రజల జీవనపరిస్థితులకీ పొంతన లేదు, దీన్ని మార్చాలన్న ఒక తపన నాలో మొదలయ్యింది. కాబట్టి, నా pain, నా passion ఇవే నాకు దారి చూపించేయి. ముందస్తు ప్రణాళిక అంటూ ఏమీ లేదు. కాని ఇప్పుడు మా సంస్థలని చూసినవాళ్ళకి, మేమిదంతా వందేళ్ళ ముందే ప్రణాళిక రాసుకున్నట్టుగా అనిపిస్తుంది’ అన్నాడు.

మరో ప్రశ్నకి జవాబిస్తూ ‘ఒక సంపన్నుడు తనని నాతో పోల్చుకుంటూ, నీపట్ల ఇంతమంది ఇంత ప్రేమ చూపిస్తున్నారు ఇదెట్లా సాధ్యమయింది అనడిగాడు. నాక్కూడా ఇట్లాంటి ప్రేమ దొరకాలంటే నేనేమి చెయ్యాలి అనడిగాడు. నీకు సాధ్యం కాదు, ఎందుకంటే నువ్వు సంపన్నుడివి కాబట్టి అన్నాను. మా కిట్ యూనివెర్శిటీ ఆస్తులు పదివేల కోట్లు విలువచేస్తాయి. ఏటా వంద కోట్ల ఆదాయం వస్తుంది. కాని నేను రెండు గదుల అద్దె ఇంట్లో ఉంటున్నాను. కిట్ లో గాని,కిస్ లో గాని మరెక్కడా గాని ఒక ఇటుక కూడా నా పేరు మీద లేదు, నా పేరు మీదనే కాదు, నా తోబుట్టువుల పేరు మీద కూడా లేదు. మేమంతా సాధారణమైన జీవితం జీవిస్తున్నాం. నువ్వటువంటి త్యాగం చెయ్యగలిగితే నీకట్లాంటి ప్రేమ లభిస్తుంది అన్నాను అతడితో’ అన్నాడాయన.

అలాగని సమంత కి సాధ్యపడింది మరొకరికి సాధ్యపడదని చెప్పడానికి లేదు. 21 వ శతాబ్దపు ప్రపంచంలో రాణించాలంటే ఏ గుణగణాలు, ఏ సూక్ష్మజ్ఞత, ఎటువంటి collaboration అవసరమో క్షుణ్ణంగా తెలిసినవాడు. మనిషిగా ఆయనలో రెండు పార్శ్వాలున్నాయి. ఒకవైపు ఆయన అపారమైన వినయంతో ఒక పల్లెటూరి మనిషిలాగా కనిపిస్తాడు, ముఖ్యంగా తన గురించి చెప్పుకోవలసి వచ్చినప్పుడు. కాని తన పాఠశాల గురించీ, ప్రయత్నాల గురించీ చెప్పుకునేటప్పుడు వజ్ర సంకల్పుడిగా, most authoritativeగా మాట్లాడుతున్నాడు. ఆయన అనుభవం నుంచి నేటి కాలపు యువతీ యువకులు, స్టార్ట్ అప్ లు ప్రారంభించాలనుకునే ఔత్సాహికులు నేర్చుకోవలసింది చాలానే ఉంది.ఆయన విజయంలో రహస్యం లేదు, అది ప్రతి ఒక్కరికీ ఆచరణ సాధ్యమే.

‘ఇప్పటి ఇన్నొవేటర్స్ కి మీరిచ్చే సందేశమేమిటి?’ అనడిగింది ఒక యువతి చివరి ప్రశ్నగా.

సమంత ఒక్క నిమిషం ఆలోచించాడు. అప్పుడిలా అన్నాడు:

‘ఇన్నొవేషన్ సులభం కాదు, అలాగని అసాధ్యమూ కాదు. నేను చెప్పగలిగేదొక్కటే, ఓపిక పట్టండి. మనం ఓపిక పడతాం కాని, సాచురేషన్ కి చేరుకునేదాకా వేచి ఉండలేం. వదిలిపెట్టేస్తాం. అట్లా వదిలిపెట్టకండి, చివరిదాకా ప్రయత్నిస్తూనే ఉండండి, పోరాడుతూనే ఉండండి.’

23-5-2017

ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading