హైదరాబాదునుంచి విజయవాడకి

Reading Time: 4 minutes

చాలా ఏళ్ళ తరువాత మళ్ళా హైదరాబాద్ నుంచి స్థానచలనం. రేపే హైదరాబాద్ వదిలి విజయవాడ ప్రయాణం. సోమవారం నుంచీ గిరిజనసంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో విజయవాడలో పనిచేయబోతున్నాను.

2000 జూన్ లో వచ్చాను హైదరాబాద్ కి. వచ్చిన వెంటనే మరేదో ఒక జిల్లాలో పనిచేస్తానన్న ఊహతోటే శ్రీశైలం నుంచి నగరంలో అడుగుపెట్టాను. నాలుగురోజులకోసమే కదా అని నవోదయా కాలనీలో ఇల్లు తీసుకున్నాను. కాని నా నాలుగురోజులు పదహారేళ్ళయిపోయాయి. బహుశా ఇక్కడే రిటైర్ అవుతానేమోననుకున్నాను. కాని ఊహించని పరిస్థితులు, నాటకీయంగా నడిచిన సంఘటనలు, ఒక జీవితకాలంలో ఒక్కసారే మాత్రమే సంభవించే సన్నివేశాలు- రాష్ట్ర విభజనతో పాటే, శాఖా విభజన, ఆస్తుల అప్పుల పంపిణీ, ఉద్యోగుల విభజన-విభజనకి సంబంధించి మా శాఖకి నోడల్ ఆఫీసరుగా-రెండేళ్ళుగా లోనవుతున్న అనుభవపరంపరలో, మరొక కొత్త అధ్యాయం.

విజయవాడ. 1972 లో మొదటిసారిగా నా తండ్రి చేయిపట్టుకుని అడుగుపెట్టిన ఊరు. తాడికొండ గురుకుల పాఠశాలలో 5 వ తరగతిలో చేర్చడానికి నా తండ్రి నన్నా దారిన నడిపించాడు. ఇప్పుడు నా ఉద్యోగ జీవితపు చివరి అంకంలో మళ్ళా విజయవాడ, తాడికొండ, తుళ్ళూరు, అమరావతిదారుల్లో ప్రయాణం, నివాసం. జీవితం ఊహించని విధంగా ఒక పరిభ్రమణం పూర్తిచేసుకుంటోంది.

29 ఏళ్ళ పాటు గిరిజన సంక్షేమశాఖలో వివిధ స్థాయిల్లో చేసిన సేవలో 27 ఏళ్ళ పాటు తెలంగాణాతో, మరొక రెండేళ్ళుగా హైదరాబాదుతో పెనవైచుకుపోయిన జీవితం. ఇప్పుడు వదిలివెళ్ళాలంటే, ఇస్మాయిల్ గారు రాసిన కవిత గుర్తొస్తోంది:

బదిలీ అయితే
బరబర ఈడ్చిన ట్రంకుపెట్టెలా
క్షోభించింది మనస్సు:
ఇది జరిపేందుకు చేసింది కాదు.

నా మనస్సూ అట్లానే ఉంది. ఈ ముడి తెంచేందుకు అల్లింది కాదు.

92-94 మధ్యకాలంలో అదిలాబాద్ జిల్లా గిరిజన సంక్షేమాధికారిగా ఉట్నూరులో పనిచెయ్యడం నా జీవితంలో నేను నోచుకున్న గొప్ప భాగ్యాల్లో ఒకటి. ఏడాదిన్నర మాత్రమే ఆ అడవుల్లో తిరిగినా, హైమండార్ఫ్, సేతుమాధవరావు, ఎం.పి.వి.సి శాస్త్రి, పి.సుబ్రహ్మణ్యం, రెడ్డి సుబ్రహ్మణ్యం వంటి వారికి అక్కడి గిరిజనుల హృదయాల్లో ఎటువంటి చోటు దొరికిందో, నాకూ అటువంటి చోటే దొరికింది. 97-2000 మధ్యకాలంలో చెంచు గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిగా మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లొ చెంచువారికోసం పనిచేసే అదృష్టం కలిగింది. ముఖ్యంగా పాలమూరు చెంచులు. నేనెప్పుడైనా పాలమూరు చెంచుగూడేలకో, అదిలాబాద్ గోండుగూడేలకో వెళ్ళి నా పేరు చెప్పుకుంటే, నా జీవితకాలం పాటు నాకు అన్నం పెట్టే తల్లులున్నారక్కడ.

హైదరాబాదు వచ్చిన తరువాత కూడా, 2014 దాకా తెలంగాణా గిరిజనులతో, వరంగల్, నల్గొండ,ఖమ్మం, కరీం నగర్ మొదలైన జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలతో అంతే ఘనిష్టమైన అనుబంధం వికసిస్తూ వచ్చింది. ఒకప్పుడు సి.వి.కృష్ణారావుగారు రాసుకున్నప్రాంతాలు-మేడారం సమ్మక్క, మహదేవ్ పూర్ టస్సర్, కొయిడా, తుపాకుల గూడేలు మాత్రమే కాక, దేవరకొండ, చందంపెంట, భద్రాచలం, బాసర, గుండాల, కురవి, డోర్నకల్, ఇంద్రవెల్లి, జోడేఘాట్,మార్లవాయి, గిన్నెధరి, గాంధారి, వర్ని వంటి గిరిజన ప్రాంతాలతో నా అనుభవాలు నా రక్తంలో భాగమైపోయాయి. ఉద్యోగ పరంగా వారితో సంబంధం తెగిపోయి ఉండవచ్చుగాని, వారికీ, నాకూ మధ్య బలపడ్డ ఆత్మీయత మాత్రం ఎన్నటికీ తెగేదికాదు.

ఈ పదహారేళ్ళ కాలం ఉద్యోగపరంగానే కాదు, సాహిత్యసాధన కి కూడా నాకు గొప్ప అవకాశమిచ్చింది. ఇక్కడికి వచ్చాక, 26 పుస్తకాలు వెలువరించగలిగాను. మూడు కవితాసంపుటులు, ‘పునర్యానం ‘ (2004), ‘కోకిల ప్రవేశించే కాలం’ (2009), ‘నీటిరంగుల చిత్రం’ (2014), రెండు సాహిత్యవిమర్శ సంపుటులు, ‘సహృదయునికి ప్రేమలేఖ’ (2001), ‘సాహిత్యమంటే ఏమిటి’ (2010), ఒక యాత్రాచరిత్రసంపుటి, ‘నేను తిరిగిన దారులు’ (2011) తీసుకురాగలిగాను. ఆ రచనల వల్ల తెలుగువిశ్వవిద్యాలయం కీర్తిపురస్కారం, ఉత్తమ వచనకవితా పురస్కారం కూడా లభించేయి. విశ్వవిద్యాలయం ఇండియాటుడేలో ‘సాలోచన’ (2001-2003) పేరిట రాసిన వ్యాసాలు, ‘నవ్య’లో రాసిన కాలం ‘పూలు పూసిన దారుల్లో ‘ ఇంకా అనేకప్రసంగాలు, ముందుమాటలు మొదలైనవన్నీ ‘సోమయ్యకు నచ్చిన వ్యాసాలు’ (2012) పేరిట తీసుకురాగలడం కూడా నా భాగ్యంగా భావిస్తాను. సార్వత్రిక విద్యతో నా అనుభవాలు ‘కొన్ని కలలు, కొన్ని మెలకువలు’ (2005) పేరిట తీసుకురాగలడం నేను ఊహించని అదృష్టం. అంతకు ముందు ‘మీరు బడినుంచి ఏమి నేర్చుకోవాలి’, ‘ఇంటినుంచి ఏమి నేర్చుకోవాలి’ , ‘మీరు సమాజం నుంచి ఏమి నేర్చుకోవాలి’ పేరిట రాసిన మూడు పుస్తకాలకి డా.నన్నపనేని మంగాదేవి బాలసాహిత్య పురస్కారం రావడం కూడా నేనూహించనిదే.

ఈ కాలమంతటా నేను ప్రధానంగా అనువాదసాధనమీద కూడా దృష్టి పెట్టాను. ఎ.పి.జె అబ్దుల్ కలాం రచనలు అయిదింటిని తెలుగుచెయ్యగలిగాను. అందులో ఒక పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాదెమీ అనువాద పురస్కారం లభించడం కూడా నేను మరవలేనిది. గాంధీజికి సంబంధించిన రచనలు మూడు, బషో ‘హైకూ యాత్ర’ లతో పాటు కొత్తసచ్చిదానందమూర్తిగారి వేదార్థమీమాంస కూడా ఈ కాలంలో అనువదించినవే. 2500 ఏళ్ళ పాశ్చాత్య తత్త్వశాస్త్రం నుంచి ఎంపికచేసిన కొన్ని భాగాలు, పరిచయంతో సహా ‘సత్యాన్వేషణ’ (2003) పేరిట 20 రోజుల్లో అనువాదం చెయ్యడం ఒక విశేషమైతే, ఇమ్మాన్యువల్ కాంట్ రచనలనుంచి 120 పేజీల అనువాదానికి మూడేళ్ళకాలం (2006-2008) పట్టడం కూడా నాకు సరికొత్త అనుభవాలే.

‘వందేళ్ళ తెలుగుకథ’ నుంచి ఏరికూర్చిన సంకలనం (2001) తో పాటు, భారతీయ కవిత్వం నుంచి ఏరి కూర్చిన ‘మనసున మనసై’ (2014) కూడా అనుకోకుండా చేసిన ప్రయత్నాలే.

మృణాళినిగారు ఇచ్చిన అవకాశం వల్ల వరల్డ్ స్ఫేస్ రేడియో లో ‘మోహన రాగం’ పేరిట సుమారు నలభై గంటల నిడివి గల సాహిత్యప్రసంగాలు చెయ్యగలిగాను.

అనేకపాఠశాలల్లో, కళాశాలల్లో, విద్యాసంస్థల్లో రాష్ట్రమంతటా పర్యటించి ఎన్నో ప్రసంగాలు చెయ్యగలిగాను, విద్యార్థుల్ని కలుసుకుని మాట్లాడగలిగేను.

ఎ.పి.జె.అబ్దుల్ కలాం వంటి దార్శనికుడు, పి.వి.నరసింహారావు వంటి విద్వాంసుడితో పాటు, సి.వి.కృష్ణారావుగారు, మునిపల్లె రాజుగారు, రావెల సోమయ్యగారు, దాశరథి రంగాచార్యగారు, సూరపరాజు రాధాకృష్ణమూర్తిగారు, సి.నారాయణరెడ్డిగారు, జోళదరాశి చంద్రశేఖరరెడ్డిగారు, డి.చంద్రశేఖరరెడ్డిగారు, కప్పగంతుల కమలగారు, వాసిరెడ్డి సీతాదేవిగారు, అనుమాండ్ల భూమయ్యగారు, చేకూరిరామారావుగారు, అబ్బూరి ఛాయాదేవిగారు, ఎన్.వి.రమణయ్యగారు, బి.వి.పట్టాభి రాం గారు వంటి పెద్దల సాంగత్యసంపదకి నోచుకున్నాను.

నా ఈడువారైన ఎమెస్కో విజయకుమార్, సుధీర్ కుమార్ , కల్లూరి భాస్కరం, రాళ్ళబండి కవితాప్రసాద్, అడ్లూరి రఘురామరాజు, మృణాళిని, చోరగుడి ఉపేంద్రనాథ్ గారు, వారి శ్రీమతి పీయుష్ వంటివారి స్నేహానికి, ఆదరణకి కూడా నోచుకున్నాను. నా తర్వాతి తరం వారూ, తెలుగుసాహిత్యానికి ఆశాకిరణాలుగా కనిపిస్తున్న గంగారెడ్డి, ఆదిత్యవంటి వారి అభిమానాన్ని కూడా మూటగట్టుకున్నాను.

ముఖ్యంగా నా పుస్తకాలు డి.టి.పి చేసిన మార్కండేయస్వామి, వాటిని ఎంతో అందంగా ప్రచురించిన సమంతగ్రాఫిక్స్ కృష్ణగారు, పవన్ గార్లకు నేనెప్పటికీ ఋణపడి ఉంటాను.

సాహిత్యసాధనే కాక, హైదరాబాదు నివాసం నాకు అనుగ్రహించిన మరొక వరం చిత్రకళా సాధన కూడా. ఎప్పుడో చిన్నప్పుడు వారణాసి రామ్మూర్తిగారి ప్రేమ నాలో బీజరూపంగా నిక్షిప్తం చేసిన చిత్రకళాభిలాష ఇక్కడ నాకొక తపస్సుగా మారింది.

ఇప్పుడు ఈ నగరాన్ని వదిలి వెళ్ళిపోతున్నానంటే ఇవన్నీ నా మనసులో ఒక్కసారి మెదిలాయి.

కాని ఈ పదహారేళ్ళ కాలంలో నేను సద్వినియోగపర్చుకోలేకపోయిన కాలమే చాలా ఎక్కువ. ఎన్నో ప్రాజెక్టులు ప్రణాళికలుగానే మిగిలిపోయాయి. ‘ఆత్మాన్వేషణ’ పేరిట భారతీయ తత్త్వశాస్త్ర పరిచయం 20 సంపుటాలకు ప్రణాళిక వేసుకున్నాను. భారతీయ విద్యావేత్తలు పేరిట 10 పుస్తకాలు రాస్తానంటే విజయకుమార్ కాటలాగ్ లో ఆ పేర్లు ప్రచురించుకున్నాడు కూడా. ‘విద్యాన్వేషణ’ పేరిట అయిదు సంపుటాలకి కావలసిన నోట్సంతా సిద్ధం చేసుకుని కూడా రాయలేకపోయాను. కథ, పుట్టుక, పరిణామం, కథాశిల్పం మీద ఒక బృహద్గ్రంథం రాయడానికి పూనుకుని 700 పేజీలదాకా అనువాదాలు పూర్తిచేసి, పరిచయవ్యాసాలదగ్గరే ఆగిపోయాను.

అదిలాబాదు జిల్లా, సిర్పూర్( యు) మండలం బుర్నూరు గోండు గ్రామం కేంద్రంగా గోండులమీద ఒక నవల, శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం ముత్యాలు గ్రామం కేంద్రంగా సవరల మీద ఒక నవల ఊహగానే మిగిలిపోయాయి. ఇక రాజమండ్రి కేంద్రంగా నేను రాయాలనుకుంటున్న నవల ఇంకా కలగానే ఉండిపోయింది. గ్లోబలైజేషన్ మీదా, ప్రపంచభాషగా తెలుగు అన్న అంశం మీదా రెండు పుస్తకాలు విజయకుమార్ కి వాగ్దానం చేసి కూడా రాయలేకపోయాను. బహుశా, నేను మరింత క్రమశిక్షణతోనూ, మరింత నిబద్ధతతోనూ జీవించిఉంటే, ఈ ప్రయత్నాల్లో కొన్నైనా వెలుగు చూసేవేమో.

కానీ, చెయ్యగలిగిన ఈ కొద్ది కృషికీ నేను హైదరాబాదుకి ఎప్పటికీ ఋణపడి ఉంటాను. ఈ నగరం నన్ను అక్కున చేర్చుకుంది. ఇన్నేళ్ళపాటు నా జీవితంలో నేనెక్కడా నివసించలేదు. ఏళ్ళ తరబడి నివసించినందువల్ల నెమ్మదిగా ఈ దక్కన్ పీఠభూమిలోనే నా తూర్పుకనుమల్ని గుర్తుపట్టడం అలవాటు చేసుకున్నాను. నాకు నిండుగా జీవించిన స్ఫూర్తిని కలిగించిన ఈ నగరదేవతకు సాష్టాంగ ప్రణామం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.

25-6-2016

Leave a Reply Cancel reply

Exit mobile version
%%footer%%