స్వాగతం మేఘమా!

Reading Time: < 1 minute

63

ఎన్నేళ్ళయింది మృగశిర కార్తె అడుగుపెట్టిన రోజునే తొలకరి జల్లు పలకరించి! జల్లు కూడా కాదు, సముద్రమే ఆకాశం మీంచి ప్రయాణిస్తున్నట్టుంది!

ఋతుపవనమేఘమిట్లా అడుగుపెట్టవలసిననాడే అడుగుపెట్టడం కన్నా భారతీయ ఆకాశానికీ, భారతీయ సుక్షేత్రానికీ శుభవార్త మరేముంటుంది! అంతకన్నా సత్యం, శివం, సౌందర్యమేముంటుంది!

అందుకనే టాగోర్ ఇట్లా రాసాడు:

‘మహాకవి కాళిదాసు వసంతసమీరమును విరహియైన యక్షుని దౌత్యకార్యముననియుక్త మొనర్చగలిగి యుండెడివాడే. అందాతని హస్తనైపుణ్యముననేకులు కొనియాడెడివారు కూడ. విశేషించి దక్షిణసమీరము ఉత్తరమునకు అత్యంత సహజగతిని ఏగజాలెడిది. కాని కవికుల గురువు ప్రథమ ఆషాఢ నూత్నమేఘమునే ఇందులకు వరించినాడు-అది మరి జగత్తాపనివారకము కద! దాని కర్తవ్యము ప్రణయివార్తను ప్రణయిని చెవిలో ఊదుట మాత్రమేనా? అది మార్గము నంతటను, నదీ గిరికాననములై విచిత్రమైన పూర్ణతాసంచారమొనర్చుచు పయనించును, కదంబము వికసించును, జంబూకుంజము పరిఫ్లుతమగును, బలాక యెగిరిపోవును, కూలంకషయైన నదీ జలములు పలపల కొట్టుకొనుచు వేత్రవనమున ప్రవేశించి ప్రతారించును, జానపద వధువుల భ్రూవిలాసహీన ప్రీతి స్నిగ్ధ లోచనముల దృష్టిపాతమున ఆషాఢాకాశ మింకను ఘనీభూతమైపోవును, విరహియొక్క వార్తాప్రేరణమును సమస్త పృథ్వియందలి మంగళకరవ్యాపారముతో అల్లి అల్లి సౌందర్యపిపాసియైన కవి చిత్తము తృప్తి చెందినది.’

‘సాహిత్య జగత్తు’ (పే.64) లోని ఈ వాక్యాలు, ఈ సంగీతమయ వాక్యాలు ఎన్ని సార్లు చదువుకొని ఉంటానో. రేవాతీరంలోనో, శిప్రాతీరంలోనో ఉన్నాడు కాబట్టి కాళిదాసుకి మేఘం ఆషాఢ ప్రథమదివసాన కనబడింది. కాని అదే ఆయన దక్కన్ పీఠభూమిలో ఉండి ఉంటే మృగశిరకార్తె అడుగు పెట్టిన రోజునే కనబడి ఉండేది. తెలుగునేలకి సంబంధించినంతవరకూ మేఘసందేశం మొదట వినిపించేది ఈ రోజే.

వేసవి వేడేక్కి, వేడెక్కి, పధ్నాలుగురోజుల రోహిణికార్తెలో రాళ్ళూ, రోళ్ళూ కూడా పగిలేటంత తాపోద్రిక్తతతో లోకం రగిలిపోయేక, ఇంకా తెల్లవారకుండానే సముద్రం నీ ఇంటి తలుపు తట్టడం ఎంత మహామంగళమయసందేశం!

అందుకనే కవి మేఘాన్ని ‘సంతప్తానామ్ త్వమహి శరణమ్’ (దహించుకుపోతున్న వాళ్ళకి దిక్కు నువ్వే ) అన్నాడు. ఆ సంతోషం, ఆ శరణ్యం ఒక్క మనిషికి మాత్రమే కాదు, సమస్త సృష్టికి కూడా:

సంతప్తానామ్ త్వమహి శరణమ్ తత్పయోద ప్రియాయాః
సందేశమ్ మే హర ధనపతి క్రోధవిశ్లేషితస్య
గంతవ్యా తే వసతిరలకా నామ యక్షేశ్వరాణామ్
బాహ్యోద్యానస్థితహరశిరశ్చంద్రికాధౌతహర్మ్యా.

మందమ్‌మందమ్ నుదతి పవనశ్చానుకూలో యథా త్వమ్
వామశ్చాయమ్ నదతి మధురమ్ చాతకస్తే సగంధః
గర్భాధానక్షణపరిచయాన్నూనమాబద్ధమాలాః
సేవిష్యంతే నయనసుభగమ్ స్వే భవంతః బలాకాః

స్వాగతం మేఘమా! స్వాగతం!

7-6-2017

Leave a Reply

%d bloggers like this: