‘ఆమె కన్నులలోన అనంతాంబరపు నీలినీడలు కలవు’ అనే వాక్యాన్ని కవి ఎట్లా ఊహించగలిగాడు? అట్లాంటి మాటలు ఇంతదాకా మరొక కవి గాని లేదా మరో మనిషిగాని ఎందుకు పలకలేకపోయాడు? ఆ మాటలు మామూలు మాటలు కావు, కవిత్వమని మనకు తెలుసు. కాని అట్లాంటి కవితా వాక్యాలు మరొకరెవ్వరూ చెప్పలేరా? మనం పాఠశాలల్లో పిల్లలకి నేర్పలేమా? లేదా ఇప్పటి పద్ధతి ప్రకారం చెప్పాలంటే, ఒక ఇంటరాక్టివ్ యాప్ రూపొందిస్తే, ప్రతి ఒక్కరూ ఆ యాప్ వాడుకుని అట్లాంటి కవితావాక్యాలు సృష్టించలేరా?
సృష్టించడం, అది సరైనమాట. సృజన అని కూడా అంటాం. ఆ సృజనాత్మకత, creativity మూలాలు ఏమిటి? ఒక మనిషి షేక్ స్పియర్ గా, బితోవెన్ గా, వాన్ గో గా ఎట్లా మారుతున్నాడు? వాళ్ళ సృజనశీలత్వానికి కారణం చాలాకాలం పాటు పాశ్చాత్యులు నమ్మినట్టు వాళ్ళు genius లు అయినందువల్లనేనా? లేదా ఇప్పటికీమనవాళ్ళు నమ్మేటట్టు పూర్వజన్మ సుకృతమా?
ఇప్పుడు శాస్త్రవేత్తల్ని వేధిస్తున్న అతి పెద్ద ప్రశ్న ఇది. ఇంతదాకా మనస్తత్వశాస్త్రవేత్తలు దీనికి సమాధానం వెతుకుతూ వచ్చారు. కాని మనస్తత్వశాస్త్రం ఒక్కటే ఈ ప్రశ్నకి జవాబు చెప్పలేదని గ్రహించారు. ఆ చర్చలో భాగంగా 2012 లో కెనడాలో ఒక సదస్సు జరిగింది. ఈ ప్రపంచంలోకి నవ్యత ఎలా ప్రవేశిస్తుందనేది ఆ సమావేశంలో చర్చించిన అంశం. ఆ గోష్ఠిలో చర్చించిన విషయాల్ని ‘On Creativity: Morphomata, Wasan Conversation’ (పెంగ్విన్, 2015) పుస్తకరూపంగా తీసుకొచ్చారు. ప్రసిద్ధ మనోవైజ్ఞానికవేత్త, రచయిత సుధీర్ కాకర్, ప్రసిద్ధ విద్వాంసుడు గుంటర్ బ్లామ్ బెర్గర్ ఈ పుస్తకానికి సంపాదకులుగా వ్యవహరించారు.
ఈ సంపుటిలో ఆరువ్యాసాలున్నాయి. సుధీర కాకర్, బ్లాం బెర్గర్ లతో పాటు వెయిహువా నియు అనే చీనా పండితుడు ఈ ప్రశ్నను అంతర్ సాంస్కృతిక కోణం నుంచి చర్చించారు. మరొక ముగ్గురు శాస్తవేత్తలు పాట్రిక్ మహోనీ, మార్గరెట్ బోడెన్, జేమ్స్ కాఫ్ మన్ అనే వారు వివిధ శాస్త్రాల సమన్వయంతో చర్చించారు. ఆ ఆరువ్యాసాల సంకలనానికీ సంపాదకులిద్దరూ ఒక ముందుమాట కూడా రాసారు.
పుస్తకంలో రచయితలు ఎవరి దృక్కోణం నుంచి, ఎవరి పరిశీలనల ప్రాతిపాదికగా వారి అభిప్రాయాలు ప్రకటించినప్పటికీ, సూత్రప్రాయంగా అందరూ మొగ్గు చూపింది సృజనాత్మకతని మనస్తత్వశాస్త్ర దృష్ట్యా వివరించలేమనీ, అందుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో cognitive biology నే దారి చూపించగలదనీ.
జీనియస్ అనే మాటకి వ్యుత్పత్తి అర్థం పుట్టుకతోనే ప్రతిభాపాటవాలు సంక్రమించినవాడని.అంటే సృజనశీలి ఒక ప్రత్యేకమైన వ్యక్తి అనీ, అతడి మనసు లేదా బుద్ధి ప్రత్యేకమైనవి అయినందువల్లనే అతడు కళారూపాల్నో, కవిత్వాన్నో సృజించగలుగుతున్నాడనీ భావం. అందువల్ల చాలాకాలం పాటు అతడి మనసుని లేదా అతడి పుట్టుక, పెంపకం, వ్యక్తిగత జీవితాలూ ఎంతవరకూ కారణమని చూసేవారు. కాని ఈ చర్చ ఇటీవలి కాలంలో cognitive biology వైపు మళ్ళింది. అంటే సృజనశీలి ప్రపంచాన్ని ఏ సంజ్ఞానంతో, ఏ సంవేదనలతో పరికిస్తున్నాడో చూడటమన్నమాట. కాకర్ తన వ్యాసంలో ఈ కొత్త వైజ్ఞానిక ధోరణిని, భారతీయ అలంకార శాస్త్రాలతో పోల్చి చూసే ప్రయత్నం చేసాడు.
అతడు చెప్పేదేమంటే, మనస్తత్వ శాస్త్ర రీత్యా చూసినా, జీవశాస్త్ర రీత్యా పరిశీలించినా సృజనాత్మకత రహస్యం పాశ్చాత్యపరిశోధన కళాకారుడి మనసులోనో, దేహసంవేదనల్లోనో ఉందని భావిస్తోందనీ, కాని భారతీయ దృక్పథం అందుకు భిన్నంగా ఉందనీ. ప్రాచీన అలంకారికుల ప్రకారం కవిగాని, కళాకారుడు గాని తన వ్యక్తిత్వ పరిమితులనుంచి విడివడి ఒక ఆధ్యాత్మిక, అవ్యక్త భూమికలోకి చేరుకోవడంద్వారానే సృజనశీలిగా మారతాడని భావించారంటాడు. అతడు తన వ్యాసంలో టాగోర్ సృజనాత్మకతని ప్రత్యేకంగా పరిశీలిస్తూ, ఆ వికాసాన్ని సూర్యుడు-పద్మమూ అనే పోలికతో వివరించడానికి ప్రయత్నించాడు. సృజనాత్మకత ని పరిశీలించే biological-life historical దృక్పథాన్ని అతడు పంకంగానూ, transcendent-spiritual దృక్పథాన్ని సూర్యకాంతిగానూ ఉపమిస్తూ, పద్మం వికసించడానికి, పంకమూ, సూర్యకాంతీ రెండూ అవసరమైనట్లే, సృజనాత్మకతని అర్థం చేసుకోవడానికి కూడా ఈ రెండు దృక్పథాల సమన్వయం అవసరమంటాడు.
బ్లాం బెర్గర్ తన వ్యాసంలో ఐరోపీయ ప్రతిభావంతుల సృజనాత్మకతని వివరిస్తూ దానికి మూలాల్ని వ్యక్తుల్లో వెతకడం నిష్ఫలమంటాడు.ఆయన చెప్పినదాని ప్రకారం సృజనాత్మకత ఒక అనుభవం, ఆ అనుభవాన్ని అందుబాటులో ఉన్న సాధనాల ద్వారా వెల్లడించే ప్రయత్నం చెయ్యడం. ఇది సాధన (practice) ద్వారా సమకూడేదే. అంతేకాదు, ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ లో, కంప్యూటర్ ప్రోగ్రాం లు రూపొందించడంలో ఒక వ్యక్తి కాకుండా, అనేక వ్యక్తుల బృందాలు పనిచేస్తున్నాయి. ఆ బృందాలు గొప్ప సృజనాత్మకత చూపిస్తున్నాయి. ఆ సృజనశీలత్వం ఎట్లా రూపొందుతున్నదో తెలుసుకోవాలంటే, workplace studies, theories of practice అవసరమంటాడు.
వెయిహువా నియు అనే చైనా పండితుడు చైనావాళ్ళ సృజనాత్మకత మీద రాసిన వ్యాసం చాలా విలువైనది. చైనా కవిత్వానికీ, చిత్రలేఖనానికీ పూర్తిస్థాయి ఆరాధకుడిగా మారిపోయిన నాకు, ఈ వ్యాసం చాలా కొత్తదీ, నేను ఊహించనిదీ. నియు వ్యాసం చాలా వివరంగా ఉంది. అతడు చైనీయ సృజనాత్మకతకి మూడు లక్షణాలున్నాయని చెప్తాడు. పాశ్చాత్యుల్లాగా కాకుండా చైనీయులు ప్రతి ఒక్క మనిషీ సృజనశీలుడు కాగలడనే భావిస్తారంటాడు. రెండవది తావోయిస్టు దృక్పథం ప్రకారం, మనిషి తానంతదాకా నేర్చుకున్న పాండిత్యం నుంచి ఎంత బయటపడితే,అంత సృజనశీలి కాగలడనేది. ఇక మూడవది, కన్ ఫ్యూషియస్ చెప్పినట్టుగా, జీవితానికొక ధ్యేయాన్ని ఏర్పరచుకోవడం వల్ల , ఆత్మక్రమశిక్షణ వల్ల సృజనసాధ్యపడుతుందనేది.
ప్రసిద్ధ చైనా కవి దు-ఫు అన్నాడట: ‘నా ప్రత్యేకత మాటలు పదునుపెట్టడం/ ఆ రాగమతిశయించేదాకా నేను పాడుకుంటూనే ఉంటాను’ అని. అందుకని ఇప్పుడు సృజనాత్మకతని ఒక పాఠ్యాంశంగా బోధించాలని చైనా ఆలోచిస్తున్నదని నియు రాసాడు.
పాట్రిక్ మొహానీ వ్యాసం ఫ్రాయిడ్ సృజనాత్మకని ఎంతో జాగ్రత్తగా వివేచించించింది. అందులో ఫ్రాయిడ్ సమాజానికి అందించిన ఉపాదానాన్ని వివరిస్తూనే, అతడి వ్యక్తిత్వంలోని చీకటికోణాల్ని కూడా వెల్లడి చేసింది. ముఖ్యంగా స్త్రీలపట్ల ఫ్రాయిడ్ కుండే తక్కువచూపుని ఉదాహరణలతో వివరించిన వ్యాసం.
మార్గరెట్ బోడెన్ మానవమనోవ్యాపకాన్ని కంప్యూటర్ మోడల్స్ ద్వారా వివరించడంలో దిట్ట. కాని సృజనాత్మకత రాబోయే చాలాకాలందాకా కూడా ఒక neuro scientific mystery గానే ఉండిపోతుందని ఆమె వాదిస్తుంది. సృజనాత్మకత మూడు రకాలు-combinational, exploratory, transformational అని చెప్తూ, ఇందులో మొదటితరహా సృజనాత్మకతను అంటే, combinational తరహా దాన్ని కంప్యూటర్ ద్వారా విశ్లేషించగలమనీ, తద్వారా న్యూరోసైన్సు దాన్ని వివరించగలుగుతున్నదనీ చెప్తుందామె. ఉదాహరణకి కవిత్వం. సాధారణంగా కవులు కొన్ని రకాల పదాల్నీ, పోలికల్నీ వివిధ రకాల అమరికల్తో ప్రయోగించడం ద్వారా మామూలు మాటల్ని కవిత్వంగా మారుస్తారు. ఒక కవి అట్లా ఏ పదాల్ని ప్రయోగిస్తున్నాడనేది కంప్యూటర్ ద్వారా లెక్కించవచ్చు, అతడు ఆ పదాలే ఎందుకు ప్రయోగిస్తున్నాడనేది అతడి జీవితవిశేషాల్నీ, అతడు చదువుతున్న పుస్తకాల్నీ పరిశీలించడం ద్వారా చెప్పవచ్చు. ఆ మాటకొస్తే కంప్యూటర్ల సహాయం లేకుండా కూడా పరిశీలించవచ్చు. జాన్ లివింగ్ స్టన్ లోవే అనే ఆయన కాలరిడ్జి కవిత్వాన్ని అట్లా పరిశీలించాడట! కాని తక్కిన రెండు రకాల సృజనాత్మకతను, అంటే exploratory, transformational తరహాలని వివరించడానికి మన సైన్సు ఇంకా సరిపోదంటుందామె.
జేమ్స్ కాఫ్ మన్ ఇప్పుడు సృజనాత్మకతను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తల్లో సుప్రసిద్ధుడు. ఆయన Amusement Park Theoretical (APT) నమూనా ద్వారా సృజనాత్మకతని వివరించాడు. అందులో అతడు సృజనాత్మకతను నాలుగు స్థాయిల్లో వర్గీకరించాడు. మొదటిది, little-C. అంటే దైనందిన జీవితంలో మనం చూపించే సృజనాత్మకత. వంటిట్లో కూరగాయలు లేకపోయినప్పుడు ప్రతి గృహిణీ చూపించే చాకచక్యం. ఆ తరువాత స్థాయి mini-C. మనం మన రోజువారీ జీవితంలో, ఏదో క్షణంలో మనలో హటాత్తుగా మెరుపులాగా మెరిసిపోయే సృజనాత్మకత. నా కొలీగ్ ఒకాయన, సాహిత్యం, కవిత్వం తెలియనివాడు, ఒక ఆదివారం మేం ఆఫీసులో కూచుని ఉండగా, ఎదురుగా కనిపిస్తున్న నగరాన్ని చూపిస్తూ, ‘ఆదివారం పొల్యూషన్ లేకపోతే నగరం ఎంత శుభ్రంగా ఉందో, ఎవరో గుడ్డపెట్టి తుడిచినట్టుంది’ అన్నాడు. అట్లాంటి సృజనాత్మకత అన్నమాట. మూడవస్థాయి, Pro-C. అంటే ప్రొఫెషనల్ సృజనాత్మకత. సినిమాల్లో నేపథ్యగాయకులు చూపించేలాంటిది. సాధనవల్ల సమకూరేది. ఇక నాలుగవది Big-C. ఒక సంగీతకారుణ్ణి మొజార్ట్ గా, ఒక చిత్రకారుణ్ణి షెజానె గా, ఒక కవిని కీట్స్ గా మార్చేది. కాఫ్ మన్ ప్రస్తుతం ఆ Big-C రహస్యాన్ని శోధిస్తూ ఉన్నాడు.
విలువైన వ్యాససంపుటి. చదవవలసిందీ, చర్చించవలసిందీను.
6-7-2017